26


శివ పంచాక్షరీ


       కం|| పంచాక్షరీ బోధించియు చాంచల్య మడంచివైచె సద్గురువర్యుల్‌ |
             అంచిత శ్రీకృష్ణునెంచగ వశమవునె ధరలో నెవ్వరికైనన్‌ ||


       పంచాక్షరి అంటే ''నమశ్శివాయ''. 'ఓం'  కలపకుండానే ఐదు. (అష్టాక్షరీ మంత్రము ఓం నమో నారాయణాయ, ఓం తో కలిపి 8.) పంచాక్షరీ ఎవరు బోధించారు?  అశరీరి గురువు పంచాక్షరీ మంత్రాన్ని సచ్ఛిష్యులకు బోధించారు. బోధించితే  ఏమైంది?-సచ్ఛిష్యుడు తన చంచలత్వాన్ని అణచివేసి అచల స్థితిని అందుకున్నాడు సద్గురు వర్యుని కృపచేత. దేశికేంద్రులైనట్టి, అశరీరి గురువులలో ఎవరైతే శ్రేష్ఠుడో, ఆయన ఎరుక విడిపిస్తే ఈ చంచలత్వం పోయి అచల పరిపూర్ణం సిద్ధించింది. కనుక ఈ పంచాక్షరీ పుణ్యం అంటే ఇక్కడ మోక్షప్రదము.

       చంచలత్వాన్ని గురువు అణగగొట్టాడు. చంచలత్వానికి ఆస్కారమున్నట్టి అవ్యక్త స్థితిగాని, అవ్యక్తంలో ఉన్నటువంటి  చంచలస్థితికి కారణమైన ఘనస్థితిలో ఉన్న తత్వాన్ని కూడా పోగొట్టాలి. కదిలే దాన్ని పోగొడితే సరిపోదు. భవిష్యత్తులో కదలకుండా చేయాలి దాన్ని. పిండాండంలో కదిలేది వుంటే బ్రహ్మాండంలో కదిలించే శక్తి, స్పందశక్తి ఉంది. ఆ స్పందన శక్తి కూడా విశ్వాండంలో అవ్యక్తంగా ఉంది. విశ్వాండంలో అవ్యక్తంగా ఉన్నది కూడా అంతకుముందు మాయే.

       విశ్వాండ బ్రహ్మాండ పిండాండములలో వరుస క్రమంలో కనిపించినటువంటిది పిండాండం ఏమో భూతాకాశ సంబంధము. బ్రహ్మాండం ఏమో సూర్యాకాశ సంబంధము, విశ్వాండం ఏమో నిరవయవాకాశ సంబంధము. అక్కడ అన్నీ  అవ్యక్త రూపంగా ఉన్నాయి. ఈ అవ్యక్త స్థితికూడా, విశ్వాండమునకు కారణము కూడా మాయ. దహరాకాశముగా నున్న మాయ కారణంగా నిరవయవాకాశము విశ్వాండ పద్ధతిలో వస్తే, దానినుండి సూర్యా కాశం బ్రహ్మాండ పద్ధతిలో వస్తే, భూతాకాశం పిండాండ పద్ధతిలో వచ్చింది.

    కనుక దహరాకాశం దాటితే, ఈ మహాకాశం. నేను బ్రహ్మము అనేటటువంటి ఆ  బ్రహ్మ జ్ఞానానికి అవకాశం ఇచ్చేదే మహాకాశం. ఈ మహాకాశం నిరాకాశం అయినప్పుడు బ్రహ్మజ్ఞానం అనేటటువంటి ఎరుక విడిపోతుంది.

       ఎవరు విడిపిస్తారూ అంటే 'అడంచి వైచె సద్గురువర్యుల్‌'  ఆ ఎరుకను సద్గురువులు అణిచారు, దేనితో? శివపంచాక్షరీ మంత్రాన్ని బోధించి, ఆ బోధించినటువంటి అశరీరి గురువు చంచలత్వానికి ఆస్కారంగా వున్న ఎరుకని మూలముతో సహా బోధవల్ల తొలగించి వేస్తాడు.

        ''అంచిత శ్రీకృష్ణునెంచగ వశమవునె ధరలో నెవరికైనన్‌'' అంచిత అంటే అంచితముగా అంటే పవిత్రముగా, పాప రహితముగా 'శ్రీకృష్ణునెంచగ వశమవునె, కైవల్య నిర్ణయంలో ''విష్ణుః ప్రీతికరం భవేత్‌'' అన్నారు. ఎరుక విడవటానికి అశరీరి గురువైన విష్ణువుకు సర్వ సమర్పణ చేసాం. ఎందుకని? ఈ విష్ణువు త్రిమూర్తులలో విష్ణువు కాదు. అంటే బ్రహ్మ విష్ణువుకు, విష్ణువు సూర్యునికి, సూర్యుడు  యాజ్ఞవల్క్యునికి బోధించారు అన్నాం కదా! ఈ విష్ణువు సర్వవ్యాపక చైతన్యంగా ఉన్న విష్ణువు అయినప్పటికీ, తొలిగా పరబ్రహ్మ వద్ద మౌన వ్యాఖ్యగా అందుకొన్న అచల పరిపూర్ణత్వమును పరిపూర్ణ బోధ ద్వారా ఎరిగి, అశరీరి గురువైనవాడే, ఆ విష్ణువు. ఆ విష్ణువే అవతరించినప్పుడు, శ్రీకృష్ణునిగా ఉద్ధవునికి, అర్జునునికి అచలబోధ చేసాడు. కృష్ణుడంటే అశరీరి గురువే. అటువంటి బయలు అనేటటువంటి కృష్ణుని ఎరుకతోనే గుర్తించుట ఎవరి తరము? అందువలన విఫలం అవుతున్నాము. అంటే గుర్తెరిగే ఎరుక లేదక్కడ. అంతా బట్టబయలే ఉంది.ఎటువంటిది? ఎరుకలేదు, బట్టబయలు ఇట్టిది, అట్టిది అనరానట్టిది.

       ధరలోన ఎవ్వరికైనను-ధరలోన అంటే భూమి మీద అని కాదు. మనం ఎక్కడున్నాం ఇపుడు ఈ పంచీకరణ పటంలో? - కైవల్య పంచీకరణ కంటే ఇంకా దిగి, మహాకారణ దేహ పంచీకరణ కన్నా ఇంకా దిగి, బ్రహ్మాండ పంచీకరణ లోకి దిగి, పిండాండ పంచీకరణ లోకి వచ్చి, అక్కడ కూడా పంచీకరణ తెలీనట్టి పరిస్థితిలో ఉన్న జీవులు ఈ బట్టబయలు ఎలా కనుక్కొంటారు?

      ముందు పిండాండ పంచీకరణ యెరిగి, తన స్వభావం బ్రహ్మాండమందు ఎలా వుందో గుర్తుపెట్టుకుని, ఆ గుర్తు పోగొట్టుకోవడానికి బ్రహ్మాండ పంచీకరణ ఎరిగి, ఆ గుర్తుపోయి, మరొక గుర్తును మహాకారణశరీరంలో అవ్యక్తంగా వాసనా రూపంలో ఉంటే, అక్కడ కొన్ని కష్టాలకు కారణం అయినా ఆనందపడుతూ ఉంటే ఆ ఆనందం అనే ఎరుక పోగొట్టుకోవడానికి, కైవల్య దేహ నిర్ణయంలో ఉన్న పంచీకరణలోకి వెళ్ళి, అన్నిరకాల అవకాశాలను నిర్బీజం చేసి నిరాకాశం చేసినపుడు తిరిగి వచ్చే అవకాశాలులేనివాడై పునరావృత్తి లేనటువంటి పరమపదాన్ని పొందగలుగుతున్నాడు. అందుకని ఇక్కడ కృష్ణుడు అంటే అశరీరి  గురువే. ధరలోనే అంటే ఇక మన స్థాయి ఎక్కడో చూసుకోవాలి.

       భూమిమీద పాకేది చీమ. మనిషి కంటే అల్పమైనది చీమ. అందుకే ఈ పరిపూర్ణ బోధ గురించి అయితే చిన కందార్థాలలో చివరకు ఇలా చెప్పారు. "ఈ భూమిమీద పాకేటటువంటి చీమ చంద్రుడి వద్దకెళ్లి చంద్రుడిని ముద్దాడిందట.'' ఇది సాధ్యమేనా? ఎంతటి అసాధ్యమైనా పరిపూర్ణ బోధను ఈ గురువు శిష్యునికి చెప్పారు. శిష్యుడు గ్రహించి ఉత్తీర్ణుడయ్యాడు. ఎంత గొప్ప విషయము!

         అటువంటి శిష్యుని గురువుకు గురుదక్షిణగా ఏమిస్తావు అని అడిగాడు. సచ్ఛిష్యుడు 'నన్నే'నని పలికె. అంతా ఉత్త బట్టబయలు ఏమీలేదు అన్నప్పుడు ఏమిస్తాడు? ఇవ్వడానికి ఏముంది అక్కడ? కానీ భ్రాంతిలో ఇంకా తానున్నాడు, ఉండి మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీలేదని తెలుసుకున్నాడు. బోధ పూర్తయ్యేసరికి తెలిసింది. అయితే తనంతట తానే లేనివాడు కాలేడు కాబట్టి, మూలం లేని గుర్తెరిగే శరీరం ఏమీ లేదు అనే నిర్ణయానికి సంబంధించి, తను ఉన్నాను అనేది లేనెరుక అని తెలిసినప్పటికీ ఆ లేనెరుక పోవటం లేదు. అందుకని అశరీరి గురువుకు ఆ లేనెరుకని దక్షిణగా ఇచ్చాడు. అట్లు గురువు యొక్క కృపతో లేనెరుక లేకుండాపోతే శిష్యుడు బయలయి ఉన్నాడు.

        మరి శరీర ప్రారబ్ధం ఉందిగా. అందుకని గురువు శిష్యుడికి ఏం చెప్పారు అంటే, ''నీ ఎరుక  నాకు ఇచ్చేసావు కదా! నీ పరంగా ఎరుక లేదు. కాబట్టి శరీర ప్రారబ్దం పూర్తయ్యేవరకూ, గురువు ఆజ్ఞచేత ఇతరులకు ఈ బోధ అందించడం కోసమైనా, నా ఎరుకను నీకిస్తున్నాను, నీపరమైన ఎరుక లేదు, నీవు బయలయి పోయావు. నీకు నా పరమైన ఎరుకను ఇస్తున్నాను, ఇక నీపరంగా అది లేని ఎరుక అవుతుంది. ఈ లేని ఎరుకలోనే నీ జీవితాన్ని వెళ్ళమార్చి నిజానికి రాయి మాదిరిగా జడునివలె నీవు పట్టించుకోకుండా ఉండు. ఇప్పటికే నీవు అశరీరివి. కనుక ఈ శరీరం ఉందో లేదో నీకు అనవసరము. ఎప్పుడు పోయేది, ఎంతవరకూ ఉండేది నీకు అనవసరం. అందువల్ల ఆ ఎరుక జోలికి వెళ్ళకు'' అని హెచ్చరించారు.

       శ్లో||  పంచాక్షర మిదం పుణ్యం పవిత్రం పాపనాశనమ్‌ |
               సర్వసిద్ధికరం శుభం, సాక్షాన్మోక్షైక సాధనం ||

            ఇక్కడ పుణ్యపాపాలు అంటే, ఇతరులకు శాంతి కలిగించేవి బాధ కలిగించేవి కాదు. ఈ పంచాక్షరీ మంత్రం ఏదైతే ఉన్నదో, ఆ మంత్రం గురువుద్వారా తెలుసుకొని మంత్రోపదేశం పొంది, మంత్రార్థాన్ని ఎరిగి, ఆ మంత్రార్థం ఏదైతే ఉందో దాని ప్రకారము ఎలా నీవు లేనివాడవని షోడశీ భావన ఇస్తోందో ఆ ప్రకారంగా నీవు లేనివాడవు లేకుండా పోవడమే పుణ్యం.
ఆ పంచాక్షరీ మంత్రం నిన్ను బయలుగా నిర్ణయించి ఎరుక పోగొట్టుతుంది. అదే పుణ్యం ఇక్కడ.

           అక్కడిదాక వస్తే ఎరుకతో ఉండటమే మహా పాపం. ఈ పంచాక్షరీ మంత్రం ఎరుకలో ఉన్న పాపాత్ముడికి మంత్రము ఇచ్చి, మంత్రార్థము తెలిపి, మంత్రాతీత స్థితి కలిగించి, పాపనాశనం చేస్తోంది. అంటే ఎరుక నాశనం చేస్తోంది. పవిత్రమైనటువంటి పంచాక్షరీ మంత్రము ద్వారా కలిగే పరిపూర్ణ బోధ అనే పుణ్యంచేత అపవిత్రంగా ఉన్న ఎరుక నాశనం అవుతుంది.

           సర్వసిద్ధికరం శుభం అంటే సర్వం శూన్యం అయింది. సాధనలో అనేక సోపానాలు దాటేటప్పుడు ఎక్కడికక్కడ క్రిందిస్థితి పోయి, పై స్థితికి వస్తున్నారు. ఇది కాదు ఇది కాదు అని నిరపేక్షంగా వెళ్ళిపోతూ ఉన్నావు. ఆధార ఆధేయ పద్ధతిలో పోవటం లేదు, అంటే  పైది, ఆ పైది సిద్ధిస్తూ ఉంటే ఒక్కొక్కటీ లేకుండా పోతున్నది. ఆ లేకపోవడమే శుభం. సర్వసిద్ధి కరం అంటే ఏమిటి? - మొదటి భూమిక నుండి రెండో భూమికలో చేరేసరికి, ఆ రెండో భూమికలో సిద్ధించింది. అలా ఆ చివరి వరకూ పోతే అన్ని సిద్ధించాయి. సిద్ధించితే ఏమైంది? పంచాక్షరీ మహామంత్రం మహిమచేత గురు కృపచేత సర్వము శూన్యమైతే  చివరిగా సిద్ధించింది. ఎక్కడికక్కడ నిరపేక్ష పద్ధతిలో సిద్ధి పొందుతున్నాము, అన్నింటినీ వదిలేస్తున్నాము. చివరి సిద్ధిలో ఇంతకుముందు సిద్ధించినవి కూడా వదిలేస్తున్నాము. ఇదీ సర్వసిద్ధికరము అంటే!

       ఆధార ఆధేయ పద్ధతిలో సిద్ధి అనరు. జీవేశ్వరైక్యం, జీవబ్రహ్మైక్య ఇలా అంటారు. జీవుడు ఈశ్వరుడిలో లయం అయ్యాడు. జీవుడు బ్రహ్మములో లయం అయ్యాడు అని అంటారు.

       నిరపేక్ష పద్ధతిలో ఈశ్వరుడే ఉన్నాడు జీవుడుగా లేడు అని. తరువాత బ్రహ్మమే ఉన్నాడు. ఈశ్వరుడు లేడని ఆ తరువాత బ్రహ్మ లేడని సత్యం జ్ఞానం అనతరం బ్రహ్మ కూడా లేడని, ఈ లేకపోవడంలో దానిపై స్థితి ఏది కలిగిందో అదే సిద్ధి. కనుక ఇన్నిరకాల సిద్ధులు ఉన్నాయి కాబట్టి సర్వసిద్ధికరం. ఎన్ని విభాగాలు చేస్తే అన్ని విధాలుగా ఉంటుంది కనుక సర్వసిద్ధికరం.

       కొందరు రెండు మూడు పద్ధతుల్లో చెబుతున్నారు, ఇక్కడ మనం 5 పద్ధతుల్లో చెబుతున్నాం. పిండాండ, బ్రహ్మాండ, ఈశ్వర పంచీకరణ, మహాకారణ దేహ పంచీకరణ, కైవల్య దేహ పంచీకరణ ఇలా 5 పద్ధతులలో చెబుతున్నాం. కనుక ఐదుసార్లు సిద్ధించాలి.

     కూటస్థ ఆత్మగా మొదటి సిద్ధి, కూటస్థ బ్రహ్మగా రెండవ సిద్ధి, పరబ్రహ్మగా మూడవ సిద్ధి, పూర్ణత్వముగా నాల్గవ సిద్ధి, పరిపూర్ణత్వముగా అయిదవ సిద్ధి. ఇలా 5 సిద్ధులు పొందుతున్నాం.

       సర్వసిద్ధికరంశుభం- శుభం అంటే ఏమిటి ?- శుభం అంటే ఆనందాన్ని వదలడము.

       ''శుచిః  సాక్షాన్మోక్షైక సాధనం''- శుచిః అంటే ఏమిటి? మాలిన్యాన్ని పోగొట్టుకోవడం. అంటే సాధనవల్ల శుచి అయింది. అంటే ఆ శరీరానికి ఉన్న మట్టి దుమ్ము మాలిన్యం పోయింది. ఇక్కడ మాలిన్యం అంటే ఎరుక. ఎరుక అనే మాలిన్యం పోయి ఉత్త బట్టబయలు సిద్ధించింది. అది శుచిః అంటే.

       'సాక్షాన్మోక్షైక సాధనం' - ఏది మోక్షైక  సాధనం? పంచాక్షరీ మంత్రమే  మోక్షైక సాధనం. ''ఓం నమశ్శివాయ''. ఇక్కడ ఓం నమశ్శిఆయ అన్నప్పుడు 6 అక్షరాలైనాయి. ముందు 'ఓం' చేర్చారు. ఈ 6లో ఐదు అక్షరాలు మాత్రమే ఉచ్ఛరించేది పంచాక్షరీ మంత్రము. వేద మంత్రాన్ని చదువుతూ, ఒక పదములోని అక్షరమును గాని, ఒక పద సమూహములోని ఒక పదమును గాని, ఎడమవైపు తొలగిస్తూ, కుడివైపు కలుపుతూ, అలా పునరుక్తము చేస్తూ ఉచ్ఛరించే పద్ధతిని ఘనాపాఠం అంటారు. ఇలా స్వరయుక్తముగా మంత్రాలను ఉచ్ఛరించే నైపుణ్యం ఉన్నవారిని ఘనాపాఠి అంటారు.

       ఓం నమశ్శివాయ అనే 6 అక్షరాలలో ఐదింటిని మాత్రమే ఉండేలా చూడాలి. కనుక వీటిలో మొదటి 5 అక్షరాలను ఉంచి, చివరి ఒక అక్షరము వదలాలి. అలా ఒక్కొక్క మొదటి అక్షరం తొలగించి, చివరి అక్షరమును కలుపుతూ, ఎప్పుడూ కూడా అయిదే అక్షరాలు ఉండేటట్లుగా చూచుకుంటూ ఉచ్ఛరించేదియే శివ పంచాక్షరీ. ఇప్పుడు చూడండి!

       మంత్రంఓం నమశ్శివాయ | నమశ్శివాయ ఓం
                     ఓం నమ శ్శివా | ఓం నమశ్శివా
                           నమశ్శివాయ | నమశ్శివాయ
                              మశ్శివాయ ఓం | మశ్శివాయ ఓం
                                శ్శివాయ ఓం న | శ్శివాయ ఓంన  
                                      వాయ ఓం నమ | వాయ ఓం నమ
                                     య ఓం నమశ్శి | య ఓం నమశ్శి
                                         ఓం నమశ్శివా | ఓం నమశ్శివా

                                              నమశ్శివాయ | నమశ్శివాయ

ఇదీ ఘనాపాఠముగా చదివే మంత్రము.

       అలా ఘనాపాఠం పద్ధతిలో శివ పంచాక్షరిని చెప్పారు ఇక్కడ. ఓం నమశ్శివాయ మంత్రమునకు అర్థం ఓంకారం పంచభూతాత్మకం. ఓం అనే ద్వారం నుండి పంచభూతాలు వచ్చినాయి. ప్రణవం పంచభూతాత్మకం. ఓం నందు 3 మాతృకలు న్నాయి. అమాతృక 3 మాతృకలలో వ్యాపకమైంది. వ్యాపకమై విస్తరించింది. విస్తరించిన దానిలో పంచభూతాలు వచ్చినాయి. పంచభూతాలలో ఓంకారం అనుస్యూతంగా ఉంది. దేని నుండి పంచ భూతాలు వచ్చాయో వాటియందు అది నిక్షిప్తమయ్యే ఉంటుంది. బంగారం నుండి ఆభరణాలు వస్తే, ఆభరణాలన్నింటిలో కూడా బంగారం అనుస్యూతంగా ఉంది. అలాగే పంచభూతాత్మకమైన యావత్‌ సృష్టిలో కూడా ''ఓం'' అనుస్యూతంగా ఉంది.

     పంచభూతాలు జడము 'ఓం' చైతన్యము, తాను అనేటటువంటి ఎరుక. ఈ ఎరుక జడమైన పంచభూతాలలో వ్యాపించడం వలన పంచభూతాలలో చలనాలు వచ్చాయి.

        నమశ్శివాయలో నకారము అనే బీజమువలన పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియములు వెరసి దశేంద్రియములు కలిగెను. మకారము అనే బీజము వలన మనస్సు పుట్టెను. శికారము అనే బీజమువలన బుద్ధి జనించెను. వాకారము అనే బీజము వలన ఉపవాయువులతో కూడి దశ వాయువులు పుట్టినవి. యకారము అనే బీజము వలన సత్వరజస్తమో గుణములు పుట్టినవి.

       ఓం అనే ఎరుకనుంచి పంచభూతాలు పుట్టాయి. ఓంకారం పంచభూతాత్మకం. మూడు గుణాలచే త్రిమూర్తులు పుట్టిరి.  ఇదియే త్రిగుణాత్మకమైన మాయా ప్రపంచము. త్రిగుణాత్మక స్వరూపుడగు పరమశివుడు ఈ పంచాక్షరీ మంత్ర రాజమును, సద్గురు దక్షిణామూర్తి స్వరూపమున చనుదెంచి, బ్రహ్మాది దేవతలకు (శబ్ద బ్రహ్మమును) ఉపదేశించిరి. మొదటి బ్రహ్మ ఎవరు? శబ్ద బ్రహ్మ. శబ్ద బ్రహ్మకి ''నిశ్శబ్ద బ్రహ్మముచ్యతే'' అని లక్ష్యములో ఆ నాలుగు మాత్రలకు అతీతమైన స్థితి అనే లక్ష్యాన్ని, నిశ్శబ్దాన్ని బోధించారు. నాలుగు మాత్రలంటే అకార, ఉకార, మకార, అర్ధమాతృకలు.

       యకారం అనే బీజం వలన మూడు గుణములు పుడితే ఆ త్రిగుణములచే త్రిమూర్తులు పుట్టారు. ఈ త్రిమూర్తులకు ఇప్పుడు బ్రహ్మజ్ఞానం ఉందంటారా, లేదంటారా? బ్రహ్మ జ్ఞానం ఉంది. ఎందుకంటే ఇదంతా ఓంకారం నుండి వచ్చింది. ఓం అనే ఎరుక మీ అందరిలో చైతన్య రూపంగా, పై స్థితికెళ్తే, బ్రహ్మ నిష్ఠలో అవ్యక్తంగా, ఘనంగా ఉంది. బ్రహ్మలోని ఎరుక ఘన రూపంలో ఉంది. తటస్థ లక్షణంలో ఆనందంగా ఉంది, సత్‌ చిత్‌ ఆనందముగా నున్నది.

       సృష్టిలోకి వచ్చింది త్రిమూర్తులైతే, ఇక్కడ విష్ణువు శ్రీమన్నారాయణుడు కాదు. ఈ త్రిమూర్తులలో విష్ణువు జీవుల పోషక కర్త మాత్రమే. ఈ త్రిమూర్తుల ద్వారా మిగతా ప్రపంచం అంతా వచ్చింది. ఇది ఎవరి ద్వారా వచ్చింది? ఓం నమశ్శివాయ మొత్తం కలిపితే, మూడు గుణాలతో ఈశ్వరుడు వచ్చాడు. ఇది ఈశ్వర పంచీకరణ.

       అటువంటి ఈశ్వరుడు త్రిగుణాత్మకమై, త్రిమూర్తులు అయ్యాడు. త్రిమూర్తుల వల్ల సృష్టి స్థితి లయలు అవుతున్నాయి. ఈ త్రిగుణాత్మక స్వరూపుడగు పరమశివుడు ఈ పంచాక్షరీ మంత్ర రాజమును బోధించారు.

       త్రిగుణాత్మక స్వరూపుడు అంటే ఏమిటి? మూడు గుణాలు స్వరూపంగా ఉన్నాయి. మూడు గుణాలు విజృంభించి లేవు. అయినా పరమేశ్వరుడు అంటే ఎవరు? మాయకి కూడా అధిష్ఠానమైనవాడు. అదేసమయంలో మాయను తన చేతిలో ఎలా వీలయితే అలా వాడుకోవడానికి వీలుగా ఆ మాయకు అధిష్టానమై ఉన్నాడు. తన స్వ ఇచ్ఛచేత మాయా విలాసం జరుపగలిగినటువంటివాడు, వాడిని పరమేశ్వరుడు అన్నాము. ఈశ్వరుడు అన్నా మాయకు లోబడ్డవాడే. వాడు త్రిమూర్తులయి పోయాడు సృష్టి స్థితి లయలు చేయడానికి. కాని పరమేశ్వరుడు అలా కాదు. మాయకు ప్రభువు.

       ఈశ్వరుడికి పరమైనవాడు పరమేశ్వరుడు. మాయని తన చేతిలోకి తీసుకుని మాయా కార్యం చేయగలిగినటువంటి సమర్ధుడు. అందుకే గురువు కూడా పరమేశ్వర స్వరూపమే.

       గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురు సాక్షాత్‌ పరబ్రహ్మ- అంటే అర్థం గురువు సాక్షాత్తు పరబ్రహ్మమే అయివుండి కూడా, త్రిమూర్తుల యొక్క కార్యక్రమాలు తాను కూడా చేయగల సమర్థుడు. అటువంటి సమర్ధుడే మాయనుండి నిన్ను విడిపించగలడు. అలాంటి సమర్థుడే నిన్నుఎరుకనుండి విడిపించగలడు.

       వారు మాయను అధిగమించి మాయను స్వాధీనంలోకి తీసుకుని ఆ మాయా విలాసం అనేటటువంటి దానికి సర్వాధిష్ఠానమై ఉన్నారు.

       ఇప్పుడు మనం చెప్పుకునే పద్ధతిలో ఉన్నటువంటి సృష్టి క్రమంగా కాకుండా, సచ్ఛిష్యుడి విషయంలో ఈ త్రిమూర్తిత్వము ఏమిచేయగలదో, సచ్చిష్యుడికి జ్ఞానోపదేశంచేసి ఎరుకను విడిపించడానికి, ఏమి కావాలో ఆ సచ్ఛిష్యుడిలో ఏది సృష్టించబడాలి? ఇవన్నీ ఆ సద్గురువుయందున్నాయి. మాయ నుండి తప్పుకొనుటకు పరిపూర్ణ బోధ జ్ఞానము సృష్టించబడాలి. అచల పరిపూర్ణ నిర్ణయము పోషింపబడాలి. ఎరుక సంపూర్తిగా లయం కావాలి.

       ఆ విధంగా త్రిమూర్తిత్వము పరమేశ్వరుని దగ్గర ఉన్నది. అయితే ఆ ఆ పరమేశ్వరుడు సృష్టికి అతీతమైన పరమేశ్వరుడే గదా! సృష్టికి అతీతుడైన పరమేశ్వరుడు అయితే, అశరీరి గురువే. గురుస్సాక్షాత్‌ పరబ్రహ్మ.

       ఆ పరమేశ్వరుడు ఏం చేసాడు? దక్షిణామూర్తి రూపంలోకి వచ్చి ఆ బ్రహ్మానిష్ఠలో ఉన్నటువంటి సనక సనందన సనత్కుమార సనత్సుజాతులకు చేరువై, బయలే ఉన్నదని ఆ బ్రహ్మ నిష్ఠ అనే అఖండ ఎరుకలో ఉన్నటువంటి లక్షణాలనుంచి, అవ్యక్తంగా ఉన్న తత్వాల నుంచి విడుదల చేసాడు. లయింప చేశాడు.

       ఆ సద్గురువే దక్షిణామూర్తి స్వరూపమున చనుదెంచి, బ్రహ్మాది దేవతలకు త్రిమూర్తులకు ఇతర అధిష్టాన దేవతలకు అందరికీ 'నిశ్శబ్దో బ్రహ్మముచ్యతే' వరకు బోధించారు.

       బ్రహ్మ నిష్ఠలో కూడా బ్రహ్మనిష్ఠ అనేటటువంటి ఘన రూప అఖండ ఎరుకను విడిపించాడు మౌనవ్యాఖ్య ద్వారా. వారిద్వారా సర్వ ఋషీశ్వరులు, వారిద్వారా పరంపరగా వచ్చిన పెద్దలు పూర్వమే గ్రహించి సులభముగా ఈ మాయను దాటి, ధన్యులైరి.

       మాయను దాటి వెళ్ళారంటే అర్థమేమిటి? ఎరుకన్నా, మాయన్నా, చైతన్యం అన్నా ఒకటే. మాయను దాటారంటే దక్షిణామూర్తి అనేటువంటి స్వరూపంలో పరమేశ్వరుడు వచ్చి బ్రహ్మాది దేవతలకు కూడా ఉపదేశించాడు.నరులకు నారాయణుడు బోధించారు. అయితే పరంపర ఎలా వచ్చింది? ఓం నమో బ్రహ్మాదిభ్యో. పరమేశ్వరుడే దక్షిణామూర్తి స్వరూపంలోకి వచ్చి మొట్టమొదట బ్రహ్మకు చెప్పాడు, ఆ బ్రహ్మ విష్ణువుకు చెప్పాడు, ఆ విష్ణువు సూర్యుడుకి చెప్పాడు. అ సూర్యుడు యాజ్ఞవల్క్యుడికి చెప్పాడు. అలా వరుసలో యాజ్ఞవల్క్యుడు, జనకుడు, సాందీపుడు, కృష్ణుడు వచ్చారు. కృష్ణుడు కూడా ఆ వరుసలో వచ్చాడు కాబట్టి ఆయన కూడా అశరీరి గురువే. ''అంచిత శ్రీకృష్ణుని ఎంచగా ధరలో ఎవరికైనన్‌'' అన్నాము, అక్కడ కృష్ణుని అందుకు పెట్టాము. అక్కడ గోపికా లోలుడైన కృష్ణుడు కాదు, వెన్నదొంగ కృష్డుడు కాదు, దేవకి వసుదేవులకు పుట్టిన వాసుదేవుడు కాదు. ఈ కృష్ణుడు అశరీరి గురువు. ఆ ఉద్దేశంతో ఇక్కడ కృష్ణుడు అని పెట్టాం.

        ప్రణవ పంచాక్షరీ ద్వారా ఈ మాయను సులభంగా దాటి, ఎరుక విడిచి, బయలై ఉన్నారు. అదీ ధన్యత్వం అంటే.        ఈ ప్రణవ పంచాక్షరీ మహామంత్రం సద్గురు స్వామిద్వారా ఉపదేశింపబడి, సర్వేంద్రియములకూ రాజయిన మనస్సును లయింపజేసి, దేహ త్రయంబు నేను కాదు, అవస్థాత్రయంబు నాది కాదు, రాగద్వేషాలు నాకు లేవు, ఈషణాత్రయములతో నాకు సంబంధములేదు, ''అది''యే నేను, నేను ''అది''యే అని నేను విలక్షణమైన సర్వసాక్షిని అని ఒక క్రమంలో చెప్తున్నారు.

       ఈ క్రమంలో చెప్తున్నది అప్పుడే బయలు కాదు. ప్రణవ పంచాక్షరీ మంత్రమును పైన చెప్పినట్లు ఓం నమశ్శివాయ, నమశ్శివాయ, మశ్శివాయన, శ్శివాయనమ, వాయనమశ్శి, యనమశ్శివా, నమశ్శివాయ అని చెప్పారుగా !

       ఈ ఐదు అక్షరాలు 5 పంచీకరణలు. 5 అక్షరాల ద్వారా 5 పంచీకరణలు తెలుసుకొని, ఎరుక నుంచి విడివడాలి. ఇదీ దీని సారం. ఇటువంటి ప్రణవ పంచాక్షరీ మంత్రం చెప్తున్నాము ఇక్కడ.

       మంత్రం వల్ల ఏమి ఒరిగింది? ''కారం అనే బీజం వల్ల పుట్టిన పంచజ్ఞానేంద్రియాలు పంచ కర్మేంద్రియాలతో వాటి వల్ల ఏర్పడినవన్నీ విడవాలి. '' కారం అనే బీజం వల్ల మనస్సు పుట్టింది, మనసును పోగొట్టుకోవాలి. 'శి' కారం అనే బీజం వలన బుద్ధి పుట్టింది, గనుక బుద్ధి అనే ఎరుక పోవాలి. 'వా' కారం అనే బీజం వలన ఉపవాయువులతో కూడి దశ వాయువులు పుట్టాయి, దశ వాయువులు వలన నేను రక్షింపబడుతున్నాను అనేటువంటి ఎరుక పోవాలి. '' కార బీజం వలన సత్వరజస్తమో గుణములు పుట్టాయి, కనుక '' కార బీజంతో పాటుగా మూడు గుణాలు పోయి త్రిగుణ రహితం కావాలి.

       త్రిగుణ రహితం అయితే ఏమయింది? మూడు గుణములతో వున్న త్రిమూర్తులు పోతారు. త్రిగుణాత్మకమైన మాయ పోతుంది. త్రిగుణాత్మక స్వరూపము అయిన శివుడు కూడా పోతాడు. అయితే ఆ త్రిగుణాలు తన  అదుపాజ్ఞలో పెట్టుకున్నట్టి వారు అంటే అశరీరి గురువులు ఉంటారు. బయలు అయినప్పటికీ కూడా, లేని ఎరుకని తన అధీనంలో పెట్టుకుని, ఆ లేని ఎరుకతోనే శిష్యుడికి కలలో ముచ్చట లాడినట్లుగా, ఈ పరిపూర్ణ బోధ బోధిస్తారు. కలలోనే గురువు కలలోనే శిష్యుడు కలలోనే బోధ. కలనుండి మేల్కొంటే, బోధ లేదు, శిష్యుడు లేడు, గురువు లేడు, ఏమీ లేదు, అంతా ఉత్త బట్టబయలు ఏమీలేదు. ఇక్కడ దానికి మొదలుపెట్టాము.

       '' కారంతో మూడు గుణాలు పోవాలి. సర్వేంద్రియాలకు కూడా రాజు అయిన మనసు పోతే ఇక ఇంద్రియాలతో పని ఏముంది? ముందు మనసు పోగొట్టుకొని ప్రజ్ఞ స్థితిలో ఉండాలి. ''ప్రజ్ఞానం బ్రహ్మ''. ప్రజ్ఞా స్థితిలో వుండి, దేహ త్రయం నేను కాదు, అవస్థ త్రయం నేను కాదు, రాగద్వేషాలు నాకు లేవు,ఈషణత్రయము నాకు లేవు, షడూర్ములు నాకు లేవు, ఇవన్నీలేవు. ఇవన్నీ పోతే చివరకు ఏం మిగిలింది? 'అది' అన్నాం. 'అది'  అని పేరెందుకు పెట్టాం. 'అది'  అనిర్వచనీయము. నామరూపాలు లేనిది. అందుకని 'అది'  అని పేరు పెట్టాం. ఇదీ అని ఎందుకు పెట్టకూడదు. దూరంగా ఉంది కాబట్టి 'అది' అంటున్నాం. లక్ష్యం సిద్ధిస్తే అప్పుడు కూడా ''ఇది అది'' అని అనము. ఏదో ఒకటి అనే భావన లేకుండా అయం - '' అంటాం. ''తత్త్వమసి'' అదే ఇది, ఇదే అది. ''అయమాత్మా బ్రహ్మ'' ఈ ఆత్మే బ్రహ్మ. 'అది' అనేది '' అయిపోయింది. తత్వమసిలో 'అది' అయమాత్మా బ్రహ్మ లో '' అయ్యింది. అంటే లక్ష్యం సిద్ధించిందన్నమాట.

         ''నేను అదియే'', ''అదియే నేను'' గా విలక్షణమైన సర్వసాక్షి అవ్వాలి. కాలత్రయాబాధ్యుడై భూత భవిష్యత్‌ వర్తమాన కాలములచేత బాధించబడనివాడు అయి ఉండాలి. అంటే భూతకాలం తలచుకొని దుఃఖించకూడదు, భవిష్యత్తు తలచుకుని ఆశ పడకూడదు, అవుతుందా లేదా? అనే ఆందోళన పడకూడదు, చివరికి వర్తమానంలో కూడా లేనివాడవు అవ్వాలి.

       భూతకాలం వద్దు ఆలోచనలు వద్దు, భవిష్యత్తు వద్దు ఊహలు వద్దు, నిత్య వర్తమానములో ఉండు అని ఒకసారి చెప్పాం.

       ఇప్పుడే మంటున్నారు? వర్తమానంలో కూడా ఉండకూడదు అంటే నీవు లేనివాడివి కావాలని అర్థం. త్రికాలాబాధ్యుడై, ఆ పరమ శివుడే, ఆ సద్గురువే, ఆ అశరీరి గురువే, ఆ దేశికేంద్రుడే, శివుడు అని ఎందుకంటున్నారు? ఆ శివుడే గురు రూపమై, చెప్పకున్న ఎవ్వడెరుగు ఈ బోధ? అన్నారు.

       అందుకని ఆ పరమ శివుడే 'నేను' అను భావము పొందెదనని సర్వదా మననము చేయవలెను. దీనివలన ఏమి అవుతావు అంటే, ఘన రూప అఖండ ఎరుక అవుతావు. మననం చేయడంవల్ల ఎరుకే ఉంటుంది. మననము, నిదిధ్యాస మానేస్తే, బయలు అవుతుంది. మననం చేస్తే ఏ వస్తువును నీవు మనం చేస్తావో ఆ వస్తు రూపం అవుతావు. అది ఎరుకేగా!

       'నమ శ్శివాయ' అంటే '' - ఆకాశబీజము, 'వా' - వాయు బీజము, 'శి' - అగ్నిబీజము, '' - జల బీజము, '' - పృథ్వీ బీజము. పిండాండములో చెప్పినప్పుడు 'నమశ్శివాయ'ను పంచభూతాలతో పోల్చి, పంచభూతముల యొక్క తత్వములలో నుండి క్రమక్రమముగా విడుదల చేసి, అది 'ఓం' గా చెప్పాము. 'ఓం నమః శివాయ' - ఈ సృష్టికి 'ఓం' - కారణం కనుక, ముందుగా ఆ 'ఓం' కారరూప బ్రహ్మ జ్ఞానము పొందాలి. ఇక్కడ 'ఓం' అనేది ప్రక్కన పెట్టి, ప్రారంభంలో చెప్పినా, 'నమఃశివాయ' లోని ఐదు అక్షరాలు, 'ఓం'తో కలిపి ఆరు అక్షరాలు అవుతాయి. ఐదు అక్షరాలతో పంచాక్షరి అన్నారు. ఈ పంచాక్షరిలో మంత్రము, మంత్రార్థము, మంత్రాతీతము ఉండాలి. మంత్రాతీతము అనేది ఎక్కడా అద్వైతంలో లేదు. 'మననాత్‌ త్రాయతే ఇతి మంత్రః' - గురువుగారు ఉపదేశించిన మంత్రమును మననము చేస్తే, రక్షింపబడుతాడు. అని ఈ లక్షణాలతో మోక్షం వస్తుందో లేదో తెలియదు. కాని ఇక్కడ మంత్రాతీతము అన్నాము గనుక మననము మానాలి.

       ఈ అచల సిద్ధాంతమునకు వచ్చేసరికి, ఇప్పుడు చెప్పే మంత్రము 'ఏ సాధన నీకెందుకు వీసానికి పనికి రాదు' - అనే విషయంతో చెబుతున్నారు. కనుక ఎఱుక నుంచి విడుదల పొందాలి. 'ఓం' లోకి వెళ్తే, 'ఓం' కూడా ఎఱుకే కదా! ప్రణవము, నాదము, ఓం బిందువు - ఈ నమఃశివాయ అనేటటువంటిది కళలు. నాద బిందు కళలు. ఇప్పుడు ఆ పద్ధతిలో చెప్పడం లేదు. ఇప్పుడు ఏం చెబుతున్నాము అంటే, '' కారము అనేటటువంటి బీజము వలన పంచ ప్రాణేంద్రియములు, పంచ కర్మేంద్రియములు పుట్టాయి. '' కారము నుండి పుట్టినవి అంటే వీటికి ''కారము సంకేతము. దీనికి రీసెర్చ్‌ అవసరం లేదు. అక్షరాలన్నీ కూడా మంత్రాలతో కూర్చినటువంటి సంకేతాలు. '' అనేటటువంటిది, జ్ఞానేంద్రియ కర్మేంద్రియములకు, దశేంద్రియములకు సంకేతముగా చెప్పారు. ''కారము అనే బీజము వలన మనస్సు, 'శి' కారము అనే బీజము వలన బుద్ధి, 'వా'కారము అనే బీజము వలన దశ ప్రాణములు అంటే పంచ ప్రాణములు, ఉపప్రాణములు కలిపి దశ ప్రాణములు. ''కార బీజము చేత సత్వ, రజస్తమోగుణములు వచ్చాయి. ఇప్పుడు ఇదికాదు, ఇది కాదు అనే నిరపేక్ష పద్ధతిగా మనం ప్రయాణం చేయాలి. కనుక ఇప్పుడు ఏమి చెయ్యాలి అంటే, పంచాక్షరి మంత్రం అనేటటువంటి 'నమఃశివాయ'లో '' అనేదానికి మంత్రార్థమేమంటే, దశేంద్రియములు. మంత్రాతీతము అంటే దశేంద్రియములను అధిగమించడము. దశేంద్రియముల యొక్క వ్యాపారమును, జ్ఞానమును, కర్తృత్వ భోక్తృత్వములను విడిచిపెట్టాలి. 

       మకారము మంత్రము. మనస్సు మంత్రార్థము. మనస్సనే ఎరుక లేకపోవడము మంత్రాతీతము. శికారము మంత్రము, బుద్ధి మంత్రార్థము. బుద్ధి అనే ఎరుక లేకుండా పోవడము మంత్రాతీతము. వాకారము మంత్రము, దశ వాయువులు. మంత్రార్థము. దశ వాయువు చలన పద్ధతి లేకుండా పోవడము మంత్రాతీతము. యకారము మంత్రము, త్రిగుణములు, త్రిపుటులు మంత్రార్థము. ఆ త్రిగుణములు, త్రిపుటులు లేకుండా పోవడము మంత్రాతీతము.

       ఈ విధముగా ఇదంతా అతీత పద్ధతి. ఓంకారము మంత్రము. నాద బ్రహ్మము మంత్రార్థము, నిశ్శబ్ద బ్రహ్మ మంత్రాతీతము. ఈ విధముగా సకల ఎరుకలనుండి విడుదలై, అతీత పద్ధతిలో బయలై యుండుటే పరమపదము.

       సోహం హంసః శివః సోహం సోహం హంస దేవాయ నమః ||

 సోహం, సోహం అనేటటువంటి హంస నీ అంతఃకరణ ప్రతిఫల ప్రకాశముగా ఏదైతే ఉందో, నేను అదై ఉన్నాను అనేటటువంటి ఉనికిని చాటుకుంటూ, తనకు తానైనటువంటి ఉనికి స్ఫురణమాత్రముగా ఉన్నదేదో, అదీ సోహం. అంతకు మించి ఇక దిగలేదు. దిగితే అసత్య నేను అయిపోతుంది. అలా శుద్ధ అంతఃకరణలో, ఒక ఐడియల్‌ కండిషన్‌లో, ఒక మానవదేహములోనికి వచ్చేసరికి, శుద్ధమైన చైతన్యము ఆ అంతఃకరణ ప్రతిబింబములో సోహం, సోహం, సోహం అని అజపా పూర్వకమైనటువంటి స్ఫురణ, తన ఉనికిగా తాను ఉన్నట్లుగా ఉండేటటువంటి స్ఫురణ. అదే సోహం జ్ఞానము.

       ఈ జ్ఞానము ఎవరిది అంటే హంసది. ఈ హంస నిజానికి శివ స్వరూపుడే. నిజానికి మహాకాశమే ఉంది. కుండలో చేరి ఘటాకాశమే తాను అనుకుంటున్నాడు. ఘటాకాశమే నేను అనుకునేవాడే, సోహం, సోహం అంటున్నాడు. మహాకాశంగా ఉన్నవాడు సోహం అని అనడం లేదు. వాడు శివుడే అయివున్నాడు. ఘట, మఠ, మహాకాశములను విచారిస్తే, ఘట, మఠాలు మిథ్యాసృష్టి వలన లోపల, వెలుపల అనేది కలిగింది కాని, నిజానికి మహాకాశమే స్వతఃసిద్ధమై, అన్ని కాలాలలోనూ ఉంది.  అనంతమై ఉన్నది. ఘటాకాశ, మఠాకాశము వలె, పరిమితమై అనేకముగా లేదు. ఘటముతో సాపేక్ష జ్ఞానము లేదు. మఠముతో సాపేక్ష జ్ఞానము కూడా లేదు. మఠము అంటే సత్రము. సత్రము అంటే అనేక గదులు. అనేక గదులు కట్టకముందు అంతా ఆకాశమే. అనేక గదులతో కట్టినటువంటి సత్రము, దాంట్లో నిండి ఉన్నటువంటి ఖాళీ, మహాకాశమే అయినప్పటికి, మఠాకాశముగా పిలువబడుతోంది. అలా మఠాకాశముగా ఉన్న గదులకు వంటగది అని, హాలు అని, పూజగది అని, పడక గది అని పేర్లు పెట్టాము. ఈ మహాకాశమే శివుడు. ఆ శివుడనే నేను. ఈ సోహం అనేది హంసే. ఆ హంస ఎప్పుడూ ఉంది.  అంతఃకరణ ఉన్నప్పుడు ఏది 'సోహం' అనే అజపముగా ఉన్నదో అదే అంతఃకరణ లేనప్పుడు అట్టి అజపము లేకుండా పోవును. సోహం అనే అజపము ఉండదు. అదే శివస్వరూపము.

       హంస అంటే ఏమిటంటే, '' అనే పురుషుడు, '' అనే ప్రకృతి, '0' అనే లేనిదానితో కలిసి, మాయకారణముగా చిత్‌ జడములుగా ఏవి ఉన్నాయో అవి కలిసిపోయాయి. ప్రకృతి పురుషులు కలిసిపోయారు. శివ, శక్తులు కలిసిపోయాయి. దానికి సంకేతముగా '', '' కలిసిపోయాయి, దేని చేత అంటే '0' చేత. '0' అంటే ఏమీ లేదు. ఏమీ లేదనే దృష్టితో చూస్తే, సోహం అనే జ్ఞానం వచ్చింది. అహం, అహం అనే స్ఫురణ వచ్చింది. అహం అనేటటువంటి స్ఫురణ సత్యమా? అసత్యమా? సున్నతో కలిస్తే వచ్చింది కాబట్టి అసత్యమే. లేనెఱుకే. అహం అనే స్ఫురణ లేనెఱుకగా వచ్చింది.

       నిజానికి మహాకాశము ఘటము చేత అవచ్ఛిన్నము కాలేదు. అలా ఉత్తబట్టబయలు ఏదైతే ఉన్నదో అదే పరమశివుడు. అది ఘటాకాశ, మఠాకాశాలుగా కాని, లోపల, వెలుపలగా కాని లేదు. క్రింద, పైన అని గాని, అష్ట దిక్కులుగా గాని, ఏ విధముగాను మారలేదు. కాని అసత్యమైనవి కల్పించబడితే ఆ విధముగా అనిపించేటటువంటివన్నీ వచ్చాయి సృష్టిలో. సృష్టి మిథ్య గనుక దానికి విభాగములు లేవు. ఎందుకంటే కుండ తయారు కాకముందు పూర్వ అభావము, కుండ పగిలి పోయాక ప్రధ్వంసాభావము, కుండ మిథ్య గనుక, కుండ ఏనాడూ లేదు అంటే అత్యంత అభావము. అత్యంతాభావము అన్నప్పుడు మహాకాశమే అన్ని కాలాల్లో ఉంది. అది తప్ప రెండవది లేదు. ఈ మహాకాశ దృష్టాంతము తోటి, బట్టబయలే ముల్లు గ్రుచ్చ సందులేక, అంతటా నిండి నిబిడీకృతమై ఉంది అనేది ద్రాష్టాంతము.

       బట్టబయలందు లేనెఱుక లేకుండా తోచింది. అది లేనిది కనుక, లేకుండా చేసుకుంటే బట్టబయలుకు ఏదోషమూ రాలేదు. లేనిదే ఉన్నట్లుగా తోచి, వాటి యొక్క కార్యక్రమాలు జరిగాయి. దాని వలన బంధము కలిగింది. దాని వలన సాధన చేశాము. దాని వలన బంధాన్ని తొలగించుకున్నాము. తరువాత ముక్తులయ్యాము. బట్టబయలుకు ఇవన్నీ తెలియవు. నిజానికి నీవే ఆ బట్టబయలై ఉన్నావు. ఈ సృష్టి స్థితి లయలు కాని, ఈ ఉపాధులతో ఉండడము కాని, ఈ ఉపాధులు లేకుండా ఉండడం కాని, ఇవన్నీ కూడా మాయాకల్పిత సృష్టిలో సాపేక్షంగా దానిని అనుసరించి చెప్పిన మాటలే ఇవన్నీ. సృష్టే లేదు అన్నప్పుడు ఏముంది? సంసారముందా? దుఃఖముందా? బాధ ఉందా? ఉపాధులున్నాయా? పంచభూతాలున్నాయా? తన్మాత్రలున్నాయా? అంటే కట్టకడపటికి ఇవన్నీ కూడా ఎఱుక సంబంధమే. ఎఱుకను పుట్టించే విషయమే. దీనిని హంస మంత్రము ద్వారా చెబుతున్నాము.

       దేవాయ నమః - దేవ శబ్దము చేత ప్రకాశము యొక్క వ్యాపకత్వమును చెబుతున్నాము. పరమాత్మ ప్రకాశమే వ్యాపిస్తే 'దేవా' అంటాము. ఏ ప్రకృతి శక్తిలో వ్యాపిస్తే ఆ ప్రకృతియొక్క చైతన్యం శక్తిగా రూపాంతరము చెందినప్పడు అది దేవత అయ్యింది. ఆ దేవ అనే శబ్దంతో, దేవుడు, దేవత రెండూ వచ్చాయి. దేవుడు యొక్క శక్తి దేవత. వినాయకుడి యొక్క శక్తి సిద్ధి బుద్ధి. సృష్టి కర్త బ్రహ్మయొక్క శక్తి సరస్వతి. పోషక కర్త విష్ణువుయొక్క శక్తి లక్ష్మి. లక్ష్మి ప్రక్కకు తప్పుకుంటే విష్ణువు పరమశివుడే. పార్వతి ప్రక్కకు తప్పుకుంటే శివుడు పరమశివుడే. బ్రహ్మ నుండి సరస్వతి ప్రక్కకు తప్పుకుంటే ఆ బ్రహ్మకూడా పరమశివుడే. ఎందుకంటే ఆ ప్రకృతి శక్తివల్ల వాళ్ళు సృష్టి స్థితి లయలకు కర్తలయ్యారు. ఆ ముగ్గురమ్మల మూలపుటమ్మ అయినటువంటి ఆది పరాశక్తి లేకపోతే, ఈ త్రిమూర్తులు ఆ పరమశివుడితో సమానము. పరమశివుడే వీరయ్యాడు. మీరు కూడా మాయను దాటే సరికి ప్రతి ఒక్కరూ కూడా, సాధకులు, సచ్ఛిష్యులు అందరూ కూడా మాయను అధిగమిస్తే అంతా పరమశివ స్వరూపులే. వీరంతా అచల పరిపూర్ణులే. ఈ దేవ అన్నప్పుడు అది మాయావరణలో ప్రకాశిస్తూ ఉంది. ప్రకృతిలో ప్రకాశిస్తుంది. అందుకు 'దేవా' అనే శబ్దము వచ్చిందపరి. 

       ఈ ప్రకృతి మూడు గుణాలే కదా! మూడు గుణాలతో ఉన్న ప్రకృతి లేనిది. మిథ్య కదా! అప్పుడు ఈ 'దేవా' అనే ప్రకాశము ఎక్కడుంది? నేను ప్రకాశిస్తున్నాను అనేది, 'దేవాయ' అంటే అర్థము. నమః - నేను లేనివాడిని. మః అంటే నేను. ఉనికి, ఎఱుక. న అంటే లేదు. ఎటువంటి ఎఱుక లేనివాడిని. వ్యాపకత్వంగా ఉన్నాను అనే ఎరుక లేదు. అంశగా లేనివాడిని. సోహంగా లేనివాడిని. శివుడుగా కూడా లేనివాడిని. ఎలా ఉన్నాడంటే, ఉన్నాను అనేటటువంటి ఎఱుక కూడా లేదు. అంటే బట్టబయలుగా ఉన్నాడు. ఈ ప్రణవాక్షరములలో నమఃశివాయ అనే ఐదు అక్షరములు ఉన్నవి. ఇవన్నీ కలసి శివశక్త్యాత్మకము అయినటువంటి పంచాక్షరి మంత్రము నమక మంత్రమని, శివగాయత్రి అని అంటారు. ఇది యజుర్వేదోక్తమైనది.

        పరమశివుని పంచముఖములనుండి పుట్టి, పంచభూతాలైన పంచకర్తలకు, పంచ కృత్యములకు, పంచశక్తులకు, ప్రపంచమునకు, పంచగోత్రములకు, పంచసూత్రములకు మూడు అవస్థలకు ఆదియై, పంచ ప్రాణాధారమై, మోక్షప్రదమై, ఈ పంచాక్షరి వెలయుచుండును. ఈ పంచాక్షరిని విశ్లేషణ చేస్తే, క్రిందనుంచి పైకి వెళ్తే, పంచావస్థలకు ఆది అయ్యింది. ఆది అయ్యాక, పంచప్రాణాల మీద ఆధారపడింది. అన్నీ ఐదు ఐదులుగా ఉన్నాయి. పంచముఖములనుండి పంచభూతాదులై, పంచకర్తలతో సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశన వీరు పంచకర్తలు. పంచకృత్యములు అంటే సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణలు. పంచశక్తులంటే పరాశక్తి, ఆదిశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి. ప్రపంచము అంటే ఐదు ఐదులతో కూడినటువంటి పంచీకరణతో వచ్చిన ప్రపంచము. దీంట్లో ఏమి వచ్చాయి అంటే, పంచభూతాలు, పంచసూత్రాలు వచ్చాయి. ఋషి పరంపరలో, వంశాలలో, గోత్రాలలో ఐదు ఐదులుగా వచ్చింది. ఆపస్తంభ సూత్రామని కొన్ని సూత్రాలున్నాయి. కొంతమంది ఋషుల పేరుతో సూత్రాలున్నాయి. పంచావస్థలు, జాగ్రత్‌ స్వప్న సుషుప్తి తురీయము తురీయాతీతము. తురీయాతీతము కూడా అవస్థక్రింద పెడితే పంచావస్థలు. నిజానికి పరిపూర్ణ బోధ వింటే తురీయాతీతమే బట్టబయలు. తురీయాతీతమే పరబ్రహ్మ. అది అచల పరిపూర్ణము అవునో కాదో తెలియదు కాబట్టి, దానిని కూడా అవస్థ అన్నారు. ఆదియై, పంచప్రాణాధారమై, మోక్షప్రదమై పంచాక్షరి వెలయుచున్నది. ఆది అంటే ప్రణవము. పంచ ప్రాణములు అంటే పంచ విశ్వప్రాణ శక్తి బీజములు అనగా మహత్తు. ఈ పంచాక్షరి నమఃశివాయ అనే ఐదు అక్షరములతోటి వెలయుచున్నది. పైన కొన్ని చెప్పాము. ఇంద్రియములని, మనస్సని, బుద్ధి అని, దశవాయువులని, మూడుగుణాలని చెప్పాము. ఈ నమఃశివాయను సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశాన అనే పంచకర్తలుగా చెప్పవచ్చు. ఈ ఐదు అక్షరాలనే సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణ అనే పద్ధతిగా చెప్పవచ్చు. ఈ ఐదింటినే పరాశక్తి, ఆదిశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తులుగా చెప్పవచ్చు.

       పంచప్రాణములు అంటే అం యం రం వం లం అనే ప్రాణ బీజములు. తురీయాతీతము ఎఱుక యొక్క అవ్యక్త స్థితి. తురీయము ఎఱుక యొక్క వ్యాపక స్థితి. ఈ అవస్థలు ఎఱుక యొక్క ఐదు విధాలైనటువంటి పరిమిత, అపరిమిత స్థితులు. పంచావస్థలు ఐదు కూడా ఎఱుకే. దానికి ఆధారము పంచసూత్రాలు. దానికి ఆధారము పంచభూతములు. దానికి ఆధారము ప్రపంచము. ఆ ప్రపంచము పంచభూతాలుగా, పంచ తన్మాత్రలుగా, పంచ స్థూల భూతాలుగా, చిత్‌ జడములుగా ఉన్నది. ఇవన్నీ ఎఱుకే. ఆ పంచశక్తుల వల్లనే కదా, ఈ సృష్టి అంతా జరిగింది. ఆ పంచశక్తులు మాయా శక్తులేగా! ఈ పంచశక్తులు బీజావస్థలో కలిసే వున్నాయిగా. ఈ పంచశక్తులు ఎలా వచ్చాయి? పంచకర్తల యొక్క పంచకృత్యముల ద్వారా, పంచశక్తులు ఆవిర్భవించాయి. ఆ పంచశక్తులు మాయా శక్తులు. దాని వలన కల్పించబడినది అంతాకూడా లేనెఱుకగా ఉంది. చైతన్యమన్నా ఎఱుకే, జడమన్నా ఎఱుకే. అందుకే పిండ బ్రహ్మాండములు రెండూ, రెండు అహములు. ఈ నాలుగు కలిసి అఖండ ఎఱుక కనరా మాతండ్రీ! అన్నారు. ఖండ ఖండాలుగా ఉన్నటువంటి అనేక జీవులు, జీవోపాధులు, జీవులలో ఉన్న అహంకారము, అలాగే సమష్టిగా ఉన్న బ్రహ్మాండమందు, సమష్టి అహంకారమైన ఈశ్వరుడు, అక్కడి అహము ఈశ్వర అహము. జీవోహములు, పిండాండములు, బ్రహ్మాండము. ఇవన్నీ కలిపి ఈ నాలుగు ఖండ ఎఱుకలు. ఒక్కొక్క ఖండ ఎఱుకలో, మళ్ళీ అనేకమైనటువంటి ఎఱుకలు ఉన్నాయి. ఆ విధముగా అఖండ ఎఱుకలో సృష్టి లేనప్పుడు, ఈ నాలుగు కలిసి, అవ్యక్తంలో మూల ప్రకృతిలో ఒకటిగానే ఉంది. ఒకటిగా ఉన్నా, అనేకముగా ఉన్నా, చైతన్యముగా ఉన్నా, జడముగా ఉన్నా, ఇవన్నీ కలిపి ఎఱుకే గనుక ఆ ఎఱుక లేనిది.

       లేనెఱుకగా ఉన్న ప్రపంచము, ఈ ఐదు అక్షరములలో ఉన్నట్లుగా తోచుచున్నది. దీనిలో ''కార, ''కారములలో సాకారము సగుణముగను, 'శి'కారము, 'వా'కారము అనునవి నిరాకారము, నిర్గుణము అయివున్నవి. మొత్తం ఐదు అక్షరాలలో రెండు అక్షరాలు తీసుకుని, ఆ రెండు సాకారము, సగుణమన్నారు. ఇంకోరెండు అక్షరాలు తీసుకుని, ఆ రెండు నిరాకారము, నిర్గుణము అన్నారు. సాకారము, సగుణము రెండు అక్షరాలు, నిరాకారము, నిర్గుణము రెండు అక్షరాలు. రెండు అక్షరములకు రూపము ఉండి, తక్కిన వాటికి రూపము లేకపోవుటకు కారణమేమనగా, ''కార, ''కారములు రెండునూ కళ రహితమైన శిష్యునిగా ఉన్నవి. నిర్గుణముగా ఉన్నటువంటి 'శి'కార, 'వా'కారములు గురువుగా ఉన్నాయి. ''కారము అసిపదముగా ఉన్నది. గురువు, శిష్యుడు ఒక్కటే. అజ్ఞాన దోషముచేత రెండుగా ఉన్నా, వేరుగా ఉన్నా వస్తు నిర్ణయముగా చూస్తే, గురువు శిష్యుడు వేరు కాదు. ''కారము అసిపదము. ఈ అసిపదముచే గురుశిష్యులిద్దరూ అభేదము.

       ''కారము అసిపదానికి సంకేతముగా తీసుకున్నప్పుడు, మూడుగుణాల భేదాలన్నీ సమసిపోతాయి. కనుక సగుణానికి, నిర్గుణానికి కూడా ఈ అసిపదము కనెక్షన్‌ పెడుతోంది. ఎలా?

       తత్త్వమసి వాక్యము ఎప్పుడూ కూడా వాచ్యార్థ, లక్ష్యార్థాలుగా ఉంటుంది. మాయావరణలో ఉన్నటువంటి ప్రకాశము ఏదో, లక్ష్యార్థముగా ప్రకాశము మాత్రమే తీసుకుని, మాయలో కల్పించబడినటువంటి ఇతర పదార్థాలను వాచ్యార్థముగా వదలివేస్తే, ఇతర అనుభవాలను విస్మరిస్తే, పంచావస్థలలో ఉన్నటువంటి ఎఱుకను నిరశిస్తే, నిరావరణ బ్రహ్మమందున్నటువంటి, స్వప్రకాశ స్వయంప్రభగా ఉన్నటువంటి ప్రకాశము తత్పదము. అదే ఇది. రెండూ ఒక్కటే. త్వం అన్నప్పుడు నీ మీద అప్లై చేసుకోవాలి. ఇదొకటి, అదొకటి కాదు. నీదేగా ఆ ప్రయాణం! నీవు మాయావరణలో ఉన్న ప్రకాశముగా ఉన్నావు. మాయావరణలో ప్రకాశముగా ఉన్న ప్రకాశ అనుభవము ఏదో, మాయావరణ దాటిన తరువాత కూడా, ఆ ప్రకాశము, ఈ ప్రకాశము ఒక్కటే. ఇక్కడ ప్రకాశమే లక్ష్యార్థము. ఆ ప్రకాశము స్వస్వరూప సాక్షాత్కార అపరోక్షానుభూతి. ఈ ప్రకాశమేమో తటస్థ లక్షణముగా ఉన్నటువంటి సత్‌చిత్‌ ఆనందమనే ఎఱుకను కలిగియున్నది. ఇది లేనెఱుక కనుక వాచ్యార్థములో లేనెఱుకను విడిచిపెడితే, లక్ష్యార్థములో స్వయం ప్రకాశకుడు ఒక్కడే సత్యము. ఆనందము వాచ్యార్థములో విడిచినప్పుడు, లక్ష్యార్థముగా ఆనంద ఘనమవుతామని ఎవరు చెబుతున్నారు? యకార సంకేతముగా ఉన్న అసిపదము చెబుతుంది. కనుక మళ్ళీ తత్త్వమసి వాక్యము వచ్చింది. ''కార, ''కారములు రెండూ నిష్కళ, జీవుడిలో ఉండేవి. నిష్కళవైపు ఉండే శిష్యుడు వాచ్యార్థమును విడిచిపెట్టినప్పుడు స్వయం ప్రభ అనే పూర్ణకళ అయ్యాడు.

       గురువేమో ఆ పరమశివుడు. ''కారమే అసిపదము. ''కార, ''కారములు జీవుడుగాను, 'శి'కార, 'వా'కారములు ఈశ్వరుడుగాను, ''కారము ఈ రెండింటి ఐక్యస్థానముగా, అసిపదముగా ఉన్నది. ''కార, ''కారములు జీవుడుగా, 'త్వం'గా, 'శి'కార, 'వా'కారములు ఈశ్వరుడుగా 'తత్‌'గా, ''కారము జీవేశ్వరుల యొక్క అభేదమును సూచిస్తోంది. జీవేశ్వరుల ఐక్యము ప్రణవముతో కూడినదే. ఐక్యత అనేమాట ఎప్పుడైతే చెప్పామో, అది ప్రణవానికే వాడబడింది. ఐక్యత అనేమాట ఎఱుకలోనే వాడబడింది. ఉత్తబట్టబయలులో ఏమీ లేదు. ఎఱుకలే అనేక రకాలున్నాయి కాని, బయలులో విభజన ఎక్కడుంది? అందుకని బయలులో ఐక్యత అనేమాట లేదు. అందుకే గురుతెఱుక బాయెన్‌ అన్నాము. గురుడు శిష్యుండేకమాయను అన్నప్పుడు లేనెఱుకలో ఏకమయ్యారు. లేనెఱుకలో ఏకమైనప్పుడు, శిష్యుడికేమో ఉన్న ఎఱుకే, గురువుకేమో లేని ఎఱుకే, అయినప్పటికి, శిష్యుడు గురువులో మమైకమయ్యాడు. ఎప్పుడైతే మమైకమయ్యాడో, గురువు బయలు కనుక శిష్యుడు కూడా బయలే అయ్యాడు. ఐక్యమయ్యేదాకా ఎఱుకలో ఉన్నాడు. ఐక్యమైన తరువాత బయలైయ్యాడు. బయలయిన తరువాత ఐక్యత అనేమాట వాడకూడదు. గురుడు శిష్యడు ఏకమాయెను, కుడి ఎడమలు సమము ఆయెను. గురువు శిష్యుడు అనేటటువంటిది లేదక్కడ. తరువాత కులము, గోత్రము లేకపాయెను. కుడి ఎడమలు సమమే ఆయెను, కులము గోత్రము అంటే, పైన చెప్పిన పంచసూత్రాలు, పంచగోత్రాలు. ఇవి లేకపోతే గురుతెఱుక బాయెన్‌. గుర్తుంటే ఎఱుకే. గుర్తులేక పోతే ఎఱుక లేదు. అంతా మర్చిపోతే, నిన్ను నువ్వే మర్చిపోతే ఎఱుకే లేదు. మరిచిపోతే మరలా జ్ఞాపకము వస్తుంది. మరచిపోతే చాలదు, నిరశించి, లేనిదని చెప్పి, దానిమీద రాగాన్ని, దానియొక్క అస్తిత్వమును వదులుకున్నప్పుడు ఏమీ లేనిదౌతుంది. అయినా జ్ఞాపకములో ఉన్నదానిని, జ్ఞాపకములోనుండి ఎలా తీసివేస్తారు? కష్టము కదా! ఎఱుకను మీ అంతట మీరు విడువలేరు. గురువు విడిపించాలి.

       ఇది లేనెఱుక అని, నేతి, నేతి అని, ఇది కాదు, ఇది కాదు అని నిరశన చేసి ఉండగలరు. లేనెఱుకగా, మిథ్యాభావనగా, ఉండగలరు తప్ప, లేనిది లేకుండా ఎలా పోతుంది? స్థూలంలో పోగొట్టాలి, సూక్ష్మంలో పోగొట్టాలి. కారణ మహాకారణాలలో వాసనారూపంలో ఉన్నది, ఎప్పటికో మరలా జ్ఞాపకము వచ్చే అవకాశము ఉన్నది, ఎలా పోగొట్టుకుంటావు? ఏమీ లేదనే మిథ్యాభావన ఉంటుంది. గుర్తు వచ్చినప్పటికీ ఇది నిజమనే గుర్తుగా రాదు. గుర్తుతో పాటు, ఇది లేనిది అనేదికూడా ఉంటుంది. లేనిది అనేటటువంటి భావము కూడా ఎఱుకే. అయితే శిష్యుడు ఇంతవరకు రావాలి. ఇది లేనిది, ఇది లేనిది, ఇది లేనిదని ఎరుకనెరిగి, ఇది ఉన్నది, ఇది ఉన్నది, ఇది ఉన్నదని బయలునెరిగి, ఆ ఎరిగిన రెండెరుకలను మానప్పా!  కాని ఎరుకను ఎవరూ మానివేయలేరు. కాబట్టి కనబడుతున్నప్పటికీ లేనిది అనే మిథ్యాభావము ఉంటే చాలు. ఆ కనబడేదానికి నీవు ఏ విధమైనటువంటి ప్రత్యేకత ఇవ్వకపోతే చాలు. నా భార్య, నా పిల్లలు, నావారు అనే ప్రత్యేకత పోతే చాలు. అసిపదము చేత, అన్నీ సమానముగా చేసుకుని, దేనికీ చర్చ లేకుండా చేసుకుంటే చాలు. ఆ ఎఱుక ఉన్నా నీకు ప్రమాదము కాదు. అంతవరకూ నీవు వస్తే, గురువు నీకు ఎఱుక విడిపిస్తాడు. గుర్తు అంటే అది. గురుతెరుక బాయెన్‌
       ఎరుకను విడిపించలేరెవ్వరు ధాత్రిన్‌, ఒక్కగురుండు తప్ప
       అట్టి గురువే అశరీరి గురువు, నిజ గురువు, దేశికేంద్రుడు.
       గుర్తుంటే అది ఎఱుకే. ఇట్లా శిష్యుడనే గుర్తు, గురువు అనే గుర్తు ఉన్నాయి. ఈ బోధ, ప్రబోధ సమయంలో గురువు, శిష్యుడు, ప్రబోధ మూడూ ఉన్నాయి. ప్రబోధ యొక్క సమాప్తములో గురువు, శిష్యుడు ఏకమై, బయలందు ఏకమై, బయలుగా ఉన్నారు. ఏకమయ్యేదాకా ఎఱుకగా ఉండి, ఎఱుకలో ఏకమయ్యారు. గురువు బయలై ఉండడంచేత, శిష్యుడు కూడా ఎఱుక విడిచి, బయలై ఉన్నాడు. ఆ ఏకత్వ స్థితిలో ఇది గురుశిష్య ఉభయ రహితము. బయలు సిద్ధించింది. బయలు అందుకోగలరా? బయలును ఎవరూ అందుకోలేరు. నిరపేక్ష పద్ధతిలో ఎఱుకను వదులుకుంటూ పోతే, చివరికి ఏమి మిగిలిందంటే, ఏమీ మిగలలేదు. అదే ఉత్తబట్టబయలు ఏమీ లేదు.

       ప్రణవముతో కూడినది అంటే, ప్రణవమే అఖండ ఎఱుక. అఖండ ఎఱుకలో భాగముగానే ఇవన్నీ ఉన్నాయి. మరియు ఆదిశక్తికి అవయవములుగా ఉన్నవి. ఈ జీవేశ్వరుల ఐక్యము, ప్రణవముతో సంబంధపడినటువంటి పంచాక్షరి. అయితే ప్రణవములో ఉన్న పంచాక్షరిని ఎంచుకున్నాము. 'నమఃశివాయ' అని ఎఱుకలో ఉన్న దానిని ఎంచుకున్నాము. ఈ నమఃశివాయ కు సంకేతాలు ఇచ్చి, ఎఱుక ఏ రకముగా వచ్చిందో, దానికి ప్రతిక్షేపము చేశాము. లెక్కలలో ప్రతిక్షేపము అంటారు. అంటే కొన్ని సంకేతాలతో ఎక్స్‌, వై, జెడ్‌ లను పెడుతాము. చివరికి అసలు దానిని కనుగొని, మధ్యలో ప్రతి క్షేపించినవన్నీ తీసివేస్తాము. అలా పంచశక్తులు, పంచకృత్యాలు, పంచకర్తలను, పంచబ్రహ్మలను అన్నిటిని కూడా ప్రతిక్షేపించి, నిరశించాము. నిరశన పద్ధతిగా పోవాలంటే, '', '' అనే జీవస్వరూపము, 'శి', '' అనేటటువంటి ఈశ్వర స్వరూపము, ''కారము రెండింటికి అనుసంధానము అయ్యింది. ''కారమే హంసలోని పూర్ణము, సున్న. తత్త్వమసి వాక్యములోని అసిపదము. హ అంటే గురువు. స - అంటే శిష్యుడు అయినటువంటి జీవుడు ం సున్నా అంటే ఏమీ లేదు. హంస అనేసరికి గురు శిష్య ఉభయ రహితము. జీవుడిలోని ఎఱుకను నిరశించాలి, శివుడిలోని ఎఱుకను నిరశించాలి. అసి పదముతో గురుశిష్యులు ఒక్కటై, గురువనే గుర్తు, శిష్యుడనే గుర్తు లేకుండా గురుతెరుకబాయెన్‌ లాగా అవ్వాలి. ఇక్కడ వాచ్యార్థాలనే కాదు లక్ష్యార్థాలను కూడా గురుకృపతో వదిలించుకోవాలి.

       ఓంకారే వదనా దేవీ | వా,య కారౌ భుజద్వయే |
       శి కారో దేహ మధ్యేచ | ,మ కారౌ పదద్వయే |
       పంచాక్షరీ పరావిద్యా | సతారా లింగ రూపిణి |

       ఓంకారమే ఆ మాయాశక్తి యొక్క ముఖము. వా, య రెండు భుజాలు. రెండు చేతులు. శి కారో దేహ మధ్యేచ, పొట్ట అనేటటువంటిది వృక్షము యొక్క కాండముగా ఏదైతే ఉన్నదో, అది శికారము. న, మ కారౌ పద ద్వయే. న, మ అనే రెండూ కలిపి క్రింది పాదాలు. ఓం అనేది వదనంగా ఇచ్చాము. వా య అనేవి భుజములుగా, వాగ్భవ కూటమిగా వ్రాశాము. మధ్యలో శి అనేది హృదయస్థానము. న, మ కారములు ఎడమ, కుడి, క్రింది పాదములుగా శక్తి కూటమిగా ఉన్నాయి. పంచాక్షరములు సర్వ దేహములయందు సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములకు ఆధారమై ఒప్పుచున్నవి. ఈ పంచాక్షరములే ఐదురకములుగా ఉన్నటువంటి అఖండ ఎఱుకే, వాటియొక్క తత్వాలతో కూడి, సృష్టికి దిగేసరికి, సృష్టికర్త బ్రహ్మ దగ్గర నుంచి, క్రిందివరకూ, పిపీలకాది బ్రహ్మపర్యంతము అన్ని దేహములయందు, అన్ని జీవులయందు కూడా, ఈ ప్రణవము ఓంకార రూపముగా, ప్రణవ రూపముగా, ఓంకారమే ముఖ స్థానముగా, వా,య కారములు రెండూ భుజములుగా, ,మలు రెండూ పాదద్వయముగా, శి కారము హృదయముగా ప్రతి జీవియందూ కూడా ఆ ప్రణవము పనిచేస్తోంది. సర్వ దేహములయందు సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములకు ఆధారమై ఒప్పుచున్నది. ఈ ప్రణవ నాదమే. కనుక ఇటువంటి నాదాను సంధానము చేయాలి.

       ఈ విధముగా ఏకత్వము సిద్ధించినప్పుడు, ఈ ఐదు రకాలైన విభజన కలుగజేసిన దానిని వాచ్యార్థముగా వదలాలి. కాని పెట్టుకున్నంత వరకూ, ఆ ఏకత్వం పొందలేదు. వాచ్యార్థములో ఈ విభజనను సూచించేటటువంటి దానిని శి కారములోని హృదయస్థానానికి చేర్చి, వాచ్యార్థమును నిరశించినప్పుడు, శికారమే ఉత్తబట్టబయలు ఏమీ లేదు అవుతోంది. ఎఱుకే విభజన చేసింది. ఎఱుక లేకపోతే విభజన ఎక్కడుంది? ఎఱుకే ఐదు రకాలుగా విభజన చేసింది. హృదయస్థానమును, హృదయాకాశమును, ఉత్తబట్టబయలుగా తీసుకుని, ఆ ఉత్తబట్టబయలులోకి మిగితా నాలుగు అక్షరముల యొక్క సంకేతాలను విభజనను, ఎఱుకను నిరశిస్తే, వాచ్యార్థము పోయి, లక్ష్యార్థమైన ఉత్తబట్టబయలే మిగులుతుంది. అప్పుడు అక్కడ శికారము అనే గుర్తు కూడా ఉండదు. గురుతెరుక బాయెన్‌. హృదయస్థానముకు వెళ్ళాక శికారము అనే గుర్తు వుంటే అది అద్వైతము. శికారమనే గుర్తుకూడా తుడిచి వేస్తే, అది అచల సిద్ధాంతము. ఇదే అద్వైతానికి, అచలానికి ఉన్న భేదము. ఈ సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములన్నిటికి కూడా ఈ పంచాక్షరములే ఆధారముగా ఉన్నవి. లక్ష్యార్థము మిగిలితే అద్వైతము. లక్ష్యార్థము కూడా పోతే అచల సిద్ధాంతము.

       పైన చెప్పిన 16 కళలు ఊర్థ్వ అధోభాగములు. ఈ రెండు మార్గముల ద్వారా సంచారము చేయుచుండును. అంతా కూడా ఈ పదహారు కళలు గానే సంచారముంది. ఈ పదునైదు కళలు కూడా నిష్కళలో అవ్యక్తముగా ఉన్నాయి. నిష్కళారూపము శూన్యరూపముగా ఉన్నదాంట్లోనే, ఈ పదిహేను కళలు ఉన్నాయి. శూన్యరూపము, నిష్కళారూపముగా కనిపించిన దానినుండి ఈ సర్వమూ ఉత్పన్నమై ఉనికి కలిగియున్నవి. ఒక అల్మరాలో ఒక వస్తువో, ఒక పుస్తకమో పెట్టాలంటే, ఖాళీ ఉంటే పెడతావు. ఖాళీ లేకపోతే పెట్టలేవు. పుస్తకము పెట్టగానే ఖాళీ జరిగిందా? ఖాళీ యందు, ఖాళీలోనే పుస్తకము పెట్టావు. అలాగే శూన్యమందు, శూన్యములోనే సర్వమూ తోచింది. సర్వమూ, శూన్యములోనే ఉనికి కలిగివుంది. శూన్యముతోపాటు సర్వమూ ఉనికి కలిగివుంది. సర్వమూ ఉన్నా లేకపోయినా కూడా, శూన్యము ఎప్పుడూ ఉంది. అలాగే ఎఱుక ఉన్నా లేకపోయినా బట్టబయలు ఎప్పుడూ ఉంది.

       బట్టబయలందు ఎఱుక సర్వముగా తోచి, ఆ ఎఱుకే శూన్యమై, ఎఱుక పోతే సర్వమూ శూన్యమైతే, ఈ బట్టబయలే సర్వ కాలాలలో ఉంది. బయలు ఎప్పుడూ శూన్యము కాదు, ఎప్పుడూ సర్వము కాదు. బట్టబయలు అంటే దేనికీ అవకాశం ఇచ్చేది కాదు. బట్టబయలు నిరాకాశము. బట్టబయలే స్వతఃసిద్ధము. బట్టబయలే అంతటా నిండి నిబిడీకృతమై ఉంది. బట్టబయలందు మరొక వస్తువు ఉండడానికి అవకాశము లేక ములుగ్రుచ్చ సందులేక ఉన్నది. లేనెఱుకే భ్రాంతి రూపంలో ఉంది అని లెక్కవేశాము. లేనెఱుకే మనలను బాధించి, జనన మరణాలకు తెచ్చి, దుఃఖపెడుతోంది. కాబట్టి నిజానికి దుఃఖమునకు కారణము లేనెఱుక. కనుక లేనెఱుకను, లేనెఱుకగా గుర్తించి, ఈ లేనెఱుకను నిజమనే ఎఱుకగా భావించక, భ్రాంతి రహితమై, గురుకృపతో, ఆ ఎఱుకను ఎప్పుడైతే విడిచామో, ఈ ఉత్తబట్టబయలు ఏమీ లేదు అని గురువు చూపించినప్పుడు, అదే పరమపదము. ఉన్నదానిని ఏమీ తీసేయటము లేదు. ఎటు తిరిగి అది లేనిదే కాబట్టి, వదలమంటున్నారు.

        లేని దానిని వదలడమేమిటి? పట్టుకోవడం ఏమిటి? ఇది భ్రాంతిలోనే ఉంది, అది భ్రాంతిలోనే ఉంది. భ్రాంతిలో ఉండి చూస్తే, రెండూ నిజమే. కలలో ఉన్న కలపురుషునికి కల సత్యమే. కలలో జరిగిన కథ, కల ప్రపంచము అంతా నిజమే. కలలోని పురుషుడు మాత్రమే సత్యమై, కలలోని కథ, కల ప్రపంచము మిథ్య అంటే, మేల్కొంటే ఏమైంది? కలతోపాటు కలపురుషుడు కూడా లేడు. ఉదాహరణ: కలపురుషుడు గుర్రమెక్కి సముద్ర తీరానికి వెళ్ళాడు. కానీ జాగ్రదవస్థ పురుషుడు కాలు బెణికి, నడవలేని స్థితిలో ఉన్నాడు. జాగ్రదవస్థ పురుషుడు విశ్వుడితో పోల్చితే కలపురుషుడు మిథ్య. కల పురుషుడు లేనివాడు. కనుక శూన్యమే సర్వమునకు కల మాదిరి అవకాశము ఇచ్చింది. శూన్యము, సర్వమూ రెండూ కూడా కలవలె లేనివే. ఉత్త బట్టబయలు స్వతఃసిద్ధము.

       మరొక పద్ధతిలో నిష్కళ ఏదైతే ఉన్నదో, అది మిగితా 15 కళలకు ఆస్కారమిచ్చింది. కనుక 15 కళలతో పాటు, 16వ కళ ఎప్పుడూ ఉంటుంది. అటు ద్వంద్వాల రూపంలో కళలు నిష్కళ కాకుండా, కేవల నిష్కళ స్వతస్సిద్ధమైతే అది బట్టబయలే. ద్వంద్వాలు లేకుండా సర్వ శూన్యాలే కాకుండా, కేవలము ఏమీ లేనిది ఒకటుంది. అదే బట్టబయలు. కనుక బట్టబయలు శూన్యం కాదు. ఆకాశము కూడా కాదు. చిత్‌ కళలకు ఊర్థ్వముగా సంచరించినప్పుడు, విజ్ఞాన కళయని, అథోభాగమున సంచరించినప్పుడు, అజ్ఞాన కళయని, జ్ఞానాజ్ఞానములు మీరినప్పుడు నిష్కళయని అంటారు. ఈ షోడశ కళ అయినట్టి తురీయము ప్రత్యగాత్మకు స్థానము. అద్వైత సిద్ధాంతములో ప్రత్యగాత్మయే షోడశ కళ. ప్రత్యగాత్మయే షోడశ కళ కాదు. ప్రత్యగాత్మ షోడశ కళకు స్థానము.

       15వ కళ ఉండడానికి 16 వ కళ స్థానము కల్పించింది. సర్వం ఉండడానికి శూన్యం కల్పించినట్లుగా, ప్రత్యగాత్మ అనే పూర్ణకళ ఉండడానికి నిష్కళారూపముగా ఉన్న బయలు అవకాశమిస్తుంది. విచారిస్తే కళలన్నీ మిథ్య కాబట్టి, అవకాశమిచ్చేది ఏదీ లేదు. నిష్కళగా తోచినప్పుడు అది శూన్యము. శూన్యమే సర్వము యొక్క ఉనికికి అవకాశమిచ్చింది. శూన్యం లేకపోతే సర్వం ఎక్కడుంటుంది? సర్వం రాగానే శూన్యము పోలేదు. కాని, నీ భావనలో అల్మరా ఖాళీలో వస్తువులు పెట్టగానే, ఇక ఖాళీ లేదు అంటున్నావు. నీ భావన అది. ఖాళీలోనే వస్తువుంది. ఖాళీ, వస్తువు రెండూ కలిసే ఉన్నాయి. శూన్యములోనే సర్వమూ ఉంది. సర్వమూ, శూన్యము రెండూ కలసే ఉన్నాయి. శూన్యము అనే నిష్కళ సత్యము కాదు. బయలు అనేటటువంటిదే సత్యము. అందుకని 16 కళలు లేనివే, కానీ షోడశ కళకు తురీయము, ప్రత్యగాత్మకు స్థానముండదు. ప్రత్యగాత్మ యొక్క ఉనికి, ప్రత్యగాత్మ ఏ చైతన్యము యొక్క అనుభవము పొందుచున్నాడో, అట్టి ప్రత్యగాత్మ ఉనికికి అవకాశమిచ్చినటువంటిది, ప్రత్యగాత్మకు స్థానం ఏదైతే చెప్పబడిందో, ప్రత్యగాత్మకు సచ్చిదానందానుభవము పొందడానికి అవకాశమిచ్చిందేదో, అది చిదాకాశము అవుతుంది. కనుక ప్రత్యగాత్మ స్థానము చిదాకాశము. ఇప్పుడా చిదాకాశము లేనిది గనుక ప్రత్యగాత్మ నిలిచేందుకు స్థానము లేదు. మూలము లేని ప్రత్యగాత్మ ఏమీ లేదు.

       వాగ్భవ కూటమి అన్నారు. వాక్కు అంటే ఇక్కడ మాట్లాడడము కాదు. వాక్కు అంటే పరావాక్కు. పరావాక్కు, పశ్యంతీ వాక్కు, మధ్యమా వాక్కు, వైఖరీ వాక్కు అని ఉన్నాయి. సృష్టియొక్క నామరూప ప్రపంచమంతా కూడా వైఖరీ వాక్కు. పరావాక్కేమో అవ్యక్తాన్ని కదిలించి, వైఖరీ దాక క్రిందికి తీసుకువచ్చింది. వాగ్భవము అంటే, ఈ నాలుగు వాక్కులు పుట్టినవి. భవము అంటే రెండు అర్థాలున్నాయి. భవతి అంటే కలిగినవి, పుట్టినవి, అయినవి అని. జనన, మరణ చక్రాన్ని కూడా భవ అంటాము.

       కనుక సృష్టి అంతాకూడా పరా, పశ్యంతి, మధ్యమా, వైఖరిగా విశ్వమంతా కూడా బ్రహ్మాండ పిండాండాలుగా ఏర్పడ్డాయి. మానవులలో కూడా కారణములోనున్న వాసనలయందు పరాశక్తియొక్క ప్రేరణ ఫలితముగా చిత్తవృత్తి కలుగగానే పరావాక్కు పశ్యంతి వాక్కుగా మారింది. మనస్సు దగ్గర తన స్వభావమును, గుణమును, పూర్వ కర్మ నిర్ణయానుసారమైన దానికి ఒక ప్రక్రియ జరుగుతుంది. అది మధ్యమా. అంటే మధ్యమా వాక్కుగా మారింది. ఆ ప్రక్రియ చివరికి బుద్ధియొక్క నిర్ణయముగా ఎప్పుడైతే జరిగిందో, బుద్ధి నిర్ణయము దగ్గర వైఖరి. వైఖరి అంటే స్పష్టముగా తెలియబడుతుంది. బుద్ధి నిర్ణయించిన తరువాతే అది స్పష్టముగా తెలుస్తుంది. ఇక్కడ మధ్యమా వాక్కు వైఖరీ వాక్కుగా మారింది. మనసులో ఆలోచనలు కొంచెం తెలిసి, తెలియనట్లు ఉంటే అది మధ్యమా. పూర్వము తనకు తెలిసినదానితో క్రొత్తగా తెలిసినదానిని సాపేక్షంగా, విమర్శగా గ్రహించే ప్రయత్నం జరుగుతుంది. అదే మధ్యమా వాక్కు. అలా తెలిసిన దానిలో తనదైనటువంటి పూర్వజ్ఞానమునుబట్టి ఒక ఇంప్రెషన్‌, గుడ్‌ ఇంప్రషన్‌, బ్యాడ్‌ ఇంప్రషన్‌ ఎట్లానో, అట్లా ఒక ఇంప్రషన్‌తో ఆలోచిస్తుంది మనస్సు. నిష్పక్షపాతముగా మనస్సు ఎప్పుడూ ఆలోచించదు. తెలిసిన దానినిబట్టి, తన అనుభవమునుబట్టి, మూడుగుణములలో ఉన్న స్వభావాన్ని బట్టి, రాగద్వేషాలు, స్వార్థాన్నిబట్టి, మనకు జరుగబోయే మేలు, కీడు ఇన్ని రకాలుగా మనసు ఆలోచిస్తుంది. ఆలోచన చివరికి వచ్చేసరికి బుద్ధి నిర్ణయిస్తుంది. బుద్ధి నిర్ణయాన్ని అనుసరించియే ఏదైనా జరుగుతుంది. ఈ చివరిది వైఖరి, అంతకు ముందుది మధ్యమా. చిత్తవృత్తులు రావడమే పశ్యంతి. కారణ శరీరంలోని వాసనలను ప్రేరేపించడమే పరా!   

       అలాగే పరాశక్తి మూలప్రకృతిగా ఉన్న విశ్వాండాన్ని ప్రేరేపించడము పరావాక్కు. విశ్వాండము బ్రహ్మాండముగా రావడము సూక్ష్మము. ఆ సూక్ష్మముగా రావడము పశ్యంతి వాక్కు. పిండాండముగా మారడము మధ్యమా వాక్కు. పిండాండము నామ రూపాలుగా సకల జీవరాశుల యొక్క ఉపాధులతోటి, జీవులతోటి, వ్యాపారము, వ్యవహారము, స్థూలరూపములో నటనలతో జరిగేదంతా వైఖరీ వాక్కు. ఈ నాలుగు స్థితులు సృష్టిలో ఉన్నాయి. జీవులలో కూడా ఉన్నాయి. ప్రతిచోట ఈ నాలుగూ ఉంటాయి. కనుక వాగ్భవ కూటమి అంటే, ఈ సృష్టికి సంబంధించినది. మానవులలో కూడా, మానవుని యొక్క కారణ శరీరము ద్వారా జరిగేది. సృష్టేమో మూలాప్రకృతి, మూలావిద్య ద్వారా జరిగేది. ఇంతవరకు ఇది వాగ్భవ కూటమి.

       ఈ పాదద్వయము ఎప్పుడైతే వచ్చిందో, అది శక్తి కూటమి. శక్తి కూటమి అంటే పరాశక్తి, ఆదిశక్తి, జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి అనే పంచశక్తులు. ఆది శక్తి అనే రూపానికి, మిగిలిన నాలుగు శక్తుల ద్వారా నాలుగు అంచెల ఎరుక క్రమముగా వ్యాపకమవుతుంది. ఆదిశక్తి రూపుడైన బ్రహ్మయందు పరాశక్తి ప్రేరణ వలన ఇచ్ఛాశక్తి అనే సంకల్పము కలుగగా, జ్ఞానశక్తి వలన పంచతన్మాత్రలు పంచీకరణమై క్రియాశక్తి మూలమున నామరూప ప్రపంచము ఏర్పడెను.

       పరాశక్తి ప్రేరణయే ఆ బ్రహ్మమందు పరావాక్కు. బ్రహ్మ సంకల్పమే పశ్యంతీ వాక్కు. పంచీకరణమే మధ్యమా వాక్కు. నామరూప జగత్తే వైఖరీ వాక్కు. ఈ విధముగా వాగ్భవ కూటమికిని, శక్తి కూటమునకు అనుసంధానమైనది. ఈ అనుసంధానము 'శి'కారము వలన కలిగినది.

       పిపీలకాది బ్రహ్మ పర్యంతము కూడా, సర్వ దేహముల యందును, సృష్టి స్థితి లయ, అనుగ్రహ తిరోధాన పద్ధతిలో జరుగుతూ ఉంటుంది. ఏమి జరిగినా కాని, ఈ ప్రణవము, ఈ నమఃశివాయ అనేటటువంటిది ఆధారముగానే ఉంది. ఈ ఆధారాన్ని ముందుగా చెప్పుకుందాము. ''కార బీజము వలన పంచజ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియముల యొక్క సమష్టి ఈశ్వరుడి దగ్గర, వ్యష్టి జీవుడి దగ్గర ఉంది. సమష్టిలో ఈశ్వరుడి దగ్గర జ్ఞానేంద్రియులు అన్నీ కూడా జ్ఞానశక్తిగా ఉన్నాయి. కర్మేంద్రియములు అన్నీకూడా క్రియాశక్తిగా ఉన్నాయి. అక్కడ జ్ఞానశక్తి, పిండాండము దగ్గరకు వస్తే జ్ఞానేంద్రియములు, అంతఃకరణ చతుష్టయము, అలాగే అక్కడ క్రియాశక్తి అంటే పిండాండములో పంచ ప్రాణములు, పంచ కర్మేంద్రియములు. ఈ ''కారము అనే బీజము వలన మనసు పుట్టి, ఈ మనసు కర్మేంద్రియములచేత పనిచేయిస్తే, జ్ఞానేంద్రియములచేత, శబ్దస్పర్శరూప రసగంధాలను గ్రహిస్తూ, ఆ మనోవ్యాపారము అలా జరుగుతూ ఉంటుంది. కర్మేంద్రియముల వలన జరిగిన పనికి కర్మఫలితము, ఆ ఫలితములు సుఖదుఃఖములుగా అనుభవించడము, దాంట్లోనే ప్రతిష్ఠంభనగా రాగద్వేషాలు, కామక్రోధాలు, కర్మ చేయడానికి ఆధారముగాను, కర్మ అయిపోయాక కూడా కొన్ని స్పందనలు, ప్రతి స్పందనలు ఉంటాయి. ఆ స్పందన, ప్రతి స్పందనలతో కూడినటువంటి కర్మఫలితమే బంధము. కర్మకు స్పందిస్తే ఫలితము వస్తుంది. ఏ స్పందన లేకపోతే ఇంద్రియ స్పందన, మనఃస్పందన, లేకపోతే చేయబడిన కర్మ వలన బంధముండదు.

       'వా'కార బీజము, పంచప్రాణములు, ఉపవాయువులు. ''కార బీజము సత్వరజస్తమో గుణములతో కూడి, ఐదు బీజాలతో ఏర్పడి, సమస్త సృష్టి త్రిమూర్తులతో సహా ఒక పద్ధతిగా జరుగుతుంది అని చెప్పాము. ఇక్కడ ఇంకొక పద్ధతిలోనేమో, ఓంకారము వదనాదేవి అనే పద్ధతిలో చెప్పుకొచ్చాము. దీనిని మంత్రము, మంత్రార్థము, మంత్రాతీతము అనే పద్ధతిలో చెప్పినప్పుడు  మంత్రాతీతము అనేది మామూలుగా లేదు. అద్వైతములో స్వరూప సాక్షాత్కారానికి, మంత్రము, మంత్రార్థముతో అపరోక్షానుభూతి ఉంది. అచల సిద్ధాంతము వచ్చేసరికి, మంత్రాతీతమందు అపరోక్షానుభూతిని కూడా బయలుగా మార్చివేయడముగా ఉన్నది. ఈ తిరోధానము క్రిందకి వచ్చేసరికి ఏమౌతుంది? మళ్ళీ పైన చెప్పినటువంటి పదునారు కళలు, ఊర్థ్వ అథోభాగములు రెండూ రెండు మార్గములుగా వచ్చాయి.

       పదహారు కళలలో ఏడు కళలు ఊర్ధ్వభాగములు. ఏడు లోకములు అయినవి. అథోభాగములో ఏడు కళలు ఏడు లోకాలైనవి. అథోభాగములో మానవ దేహములో ఉన్నవన్నీ జ్ఞాన కళలు. మానవుని యొక్క దేహంలో, పాదాలు, పిక్కలు, తొడలు, తొంటి నుంచి క్రింద దాకా అథోలోకాలు, తుంటి దగ్గర మూలాధారముతో మొదలు పెట్టి, పైన ఉన్న ఏడు చక్రములు, ఏడు లోకములు. మూలాధారము - భూలోకము. స్వాధిష్ఠానము - భువర్లోకము, మణిపూరకము - సువర్లోకము, అనాహతము - జనలోకము, విశుద్ధము - మహాలోకము, ఆజ్ఞా చక్రము - తపోలోకము, సహస్రారము - సత్యలోకము. అలా మానవ దేహములోనే పద్నాలుగు లోకాలున్నాయి. ఈ పద్నాలుగు లోకాలకు పద్నాలుగు కళలు. పూర్ణ కళా అన్నప్పుడేమో, సహస్రారములో జ్ఞానము. జ్ఞానము పొందటము అంటే అది పూర్ణకళ. పదిహేను కళలు లోక కళలు.16వ కళ అలోక కళ. అలోక కళలో ప్రపంచము తోచినప్పటికి, దాని మీద మిథ్యాభావన కలగడము, లేకపోతే ప్రపంచమే తోచకుండా పోవడము జరుగుతుంది. ఈ అలోక కళద్వారా అన్యము తోచలేదో ఉన్నదున్నట్లున్నటువంటి బ్రహ్మసాక్షాత్కారము ఆవిర్భవిస్తుంది.

       ఇక్కడ కళలను, లోకములను సమన్వయము చేస్తున్నాము. వేరే వేరే పాఠాలు ఒక చోటకు తీసుకువచ్చి సమన్వయము చేస్తున్నాము. నిష్కళ అనేది ఏదైతే ఉందో అక్కడ వ్యవహారము లేదు. కారణము నశించింది. కాని మహాకారణము అక్కడ ఉంది. ఆ మహాకారణమే ప్రత్యగాత్మ - తురీయము. ఇది తురీయానికి స్థానము. ఈ ప్రత్యగాత్మ తురీయస్థానము మహాకారణము కూడా. స్థూల సూక్ష్మ కారణములు దాటిపోయిన తరువాత తురీయములోకి వెళ్ళినప్పుడు అక్కడ మహాకారణము ఉంటుంది. ఆత్మ పరముగానేమో తురీయమంటే ప్రత్యగాత్మ. సృష్టి పరముగా తరీయము మహాకారణము. మహాకారణమే ఈశ్వరుడు.

       ఈశ్వరుడికి మళ్ళీ స్థూలసూక్ష్మకారణాలున్నాయి. విరాట్‌ హిరణ్య గర్భ అవ్యాకృత అవస్థలు. ఆ అవస్థలు, ఆ శరీరాలు వాటికి అతీతమైనది, వాటికి సాక్షి రూపమైనది పరమాత్మ. ప్రత్యగాత్మ, మహాకారణము ఒక్కటే అయ్యింది. మహాకారణము ఈశ్వరుడు అన్నాము. ఈశ్వరుడులో మళ్ళీ మూడు అవస్థలు, మూడు శరీరాలు చెప్పాము. అక్కడ మరలా ఈశ్వరుని యొక్క తురీయస్థితి చెప్పాము. ఈశ్వరునియొక్క తురీయ స్థితే కేవలాత్మ. కనుక మహాకారణ శరీరానికి ఉన్నటువంటి లక్షణాలతో ఎవరైతే జీవుడిగా, అవస్థాత్రయ సాక్షిగా, తురీయంలోకి వెళ్ళాడో, వాడు అపుడు మహాకారణముగా ఉన్నాడు. వాడి పేరు ప్రత్యగాత్మ. రెండు పద్ధతులలో చెబుతున్నాము. ప్రత్యగాత్మ అంటున్నాము, మరలా మహాకారణము అంటున్నాము. ఈ మహాకారణము అనేది ఈశ్వరుని ఎఱుక. మహాకారణము ఈశ్వరుడు ఒక్కటయ్యారు. మరలా ఆ ప్రత్యగాత్మ, పరమాత్మ తురీయానుభవములో ఒక్కటే. అయితే ఈశ్వరుడు కూడా వ్యవహారము చేస్తున్నాడు కదా! సృష్టి, స్థితి, లయలు చేస్తున్నాడు, అనుగ్రహ తిరోధానాలు చేస్తున్నాడు. ఇవన్నీ మహాకారణములో జరుగుతున్నాయి. వ్యష్టి కారణములో జరగడం లేదు. అంటే, మహాకారణములో సమష్టిగా జరుగుతున్నాయి.

       ''కార రూపుడైన తాను, '' కారముతో కలియక, ''కారమను బిందువుతో చేరి, చలనము లేక, అచల హంసయై, ప్రజ్ఞాన స్వరూపుడై, ఆత్మానాత్మలను విచారించి, ఆత్మయేదో, అనాత్మయేదో తెలుసుకుని, మహాకారణమే ఉపాధియై ఉండి, ప్రత్యగాత్మనే (ప్రత్యగాత్మ యొక్క ఉపాధి మహాకారణము) లక్ష్యముగా ఎంచగా, ఆ ప్రత్యగాత్మయై యుండేటటువంటి స్థితినే తురీయము అని చెప్పాము. తురీయము, ప్రత్యగాత్మ, మహాకారణము ఒక్కటిగా చేసేశాము. ఆ ప్రణవ బ్రహ్మము కమల మధ్యమందు ఉండును. మళ్ళీ ఈ కమలమెక్కడ?

    సహస్రారములో వెయ్యి రేకులున్నాయి. వెయ్యి రేకులలో మళ్ళీ అక్కడ రెండవ దొంతరగా 8 రేకులున్నాయి. ఆ వెయ్యి రేకులను 8 భాగములు చేస్తే, అష్టదళ పద్మములో ఉన్న ఒక్కొక్క దళమునకు 125 దళాలున్నాయి. ఈ అవ్యక్తము ఎక్కడ ఉందీ అంటే, అష్టదళ కమల మధ్యమందు ఉంది. ఇదంతా షట్చక్రములు, హంస పద్ధతిలో ఉంటుంది. దీనిని అనుసరించేవారు తక్కువ. థియరీగా చెబుతున్నాము. యోగవాసిష్టలో భృశుండుడు అనే కాకి, యోగపద్ధతిలో చిరజీవి అయ్యింది అని చెప్పారు. భగవద్గీతలో కూడా 18 అధ్యాయాలలోను యోగము అనే మాట వాడారు. కాని, దానియొక్క వివరణ ఉత్తర గీతలో ఉంది. మరల యుద్ధము పూర్తైన తరువాత, అర్జునుడు ఆ బోధ నువ్వు చెప్పావు గాని, చెప్పినట్లు ఆచరించలేదు. ఇప్పుడు మోక్షం కోసము, ఆ భగవద్గీతను మరలా చెప్పమన్నాడు. యోగపద్ధతిలో చెప్పిందే ఉత్తర గీత. ఉత్తర అంటే తరువాత చెప్పింది అని అర్థము. పూర్వము అంటే ముందు చెప్పింది అని అర్థము. సాంఖ్య తారక అమనస్కాలలో, తారక పద్ధతిలో ఈ హంస యొక్క సంచారము కాని, కుండలనీలో మూలాధారము దగ్గరనుండి, సహస్రారము వరకూ, ఆ పైన ద్వాదశాంతము. సగుణ సాక్షాత్కారము ఇలాంటి పేర్లు ఎన్నో ఉన్నాయి. దాని తరువాత మండల త్రయము దాటటము, మండల త్రయమునకు అతీతముగా శింశుమారక చక్రము దగ్గర, ఈ మిథ్యా ప్రపంచము జీవేశ్వరులు అంతాకూడా ఏ మూలములో అయితే తోచిందో, ఆ మూలము దగ్గర చేరితే, ఈ తోచినది, తోచకుండా పోతుంది. లేనిదే ఉన్నట్లు తోచింది ఏదో, అది ఈ విధంగా లేనిది లేకుండా పోయేటట్లు చేసే స్థానము, శింశుమారక చక్రము. తోచుట అక్కడే. లేకపోవుట అక్కడే.

       ఆ శింశుమారక చక్రమునుంచి కొంచెం దిగితే ప్రకాశబిందువు, విమర్శబిందువు వాటియొక్క కలయికలో మిశ్రమ బిందువు, ఈ మూడిటివలన మండల త్రయము. ఆ మూడు మండలాలు ఏ కోణములో, ఏ బిందువుగా వచ్చిందోమో ఆ త్రికోణాంతర్గత దీపికగా ఒక ప్రత్యగాత్మ, లేక సంవిత్‌ బిందువు ఈ నాల్గవ బిందువుతో కూడి బిందు చతుష్టయము నుంచి సృష్టి అవ్యక్తము అని చెప్పాము. ఈ బిందు చతుష్టయమునే ఆత్మ అనికూడా చెప్పాము. శింశుమారక చక్రమువద్ద సృష్టి మొదలయ్యింది. మహత్తులోని త్రిగుణాలు విజృంభించగానే సృష్టి మొదలయ్యింది. ఈ శింశుమారక చక్రమే మాయ ద్వారము. ఆత్మ అనేటటువంటి ఎఱుకతో సృష్టి మొదలైంది. ఎఱుక యొక్క అవ్యక్త స్థితియే ప్రణవము, ఆ ఎఱుకయొక్క వ్యక్త స్థితి ఓంకారము. అలాగే వ్యక్త స్థితి మహత్తు, మహత్తును అభిమానించేవాడు తోచాడు. ఆ తోచినవాడే మహదభిమాని లేక మహదహంకారము.

       ఆ ప్రణవ బ్రహ్మము కమల మధ్యమందు ఉంటాడు. అష్టదళ పద్మము మధ్యలో ఉంటాడు. మధ్యలో అంటే రేకుల మధ్యలో ఉంటాడు. ఏ దుద్దుని ఆశ్రయించి, ఈ ఎనిమిది రేకులు ఉన్నాయో, ఆ దుద్దులో ఉంటాడు. ఆ పదహారు కళలు ఏవైతే ఉన్నాయో, అవి నాడుల ద్వారా దేహమంతా వ్యాపించి వున్నాయి. ఆ ప్రణవము చైతన్య స్థాయిలో ఘంటిక యందు చిన్నాద, చిద్బిందు, చిత్కళలుగా ఉంది. ఘంటిక అంటే, వెన్నుపూస ఏదైతే ఉన్నదో, క్రింది నుంచి పైకి, భూమా దగ్గర వెన్నుపూస యొక్క చివర ఉంటుంది. ఆ వెన్నుపూస యొక్క చివర నుండి అన్ని నాడులు కూడా ప్రారంభమౌతాయి. ప్రారంభమై, పైనుంచి క్రిందిదాకా వెన్నుపూస చుట్టూ జడలాగా అల్లుకుంటాయి. అల్లుకుని ఒక్కొక్క చక్రము దగ్గర, ఆ నాడి యొక్క మూలము అంటుకుని ఉంటుంది. అతుకు ద్వారా ఈ చక్ర ప్రభావముతోటి, అన్ని నాడులు పని చేస్తాయి. ఈ ఎఱుకనే హంస అంటున్నాము.

       పదహారు కళలు ఉన్నాయి కదా! ఇవన్నీ హంస కళలు. హంసయొక్క పదహారు కళలు మానవుని యొక్క దేహములో, సకలనాడులలో నిండి వుంటాయి. అవి సుషుమ్నలో నెలవైయుండి, సుషుమ్న యందు వెన్నుపాములో సూక్ష్మ సుషుమ్న అంటాము. సుషిరము అంటే సూక్ష్మ రంధ్రము. సూక్ష్మ రంధ్రమునందు ఏమీ ఉండదు. శక్తి ఉంటుంది అంతే! కుండలినీ శక్తి, మాయాశక్తి ఉంటుంది. ఆ సుషుమ్నలో నెలవైయుండి, అదే శక్తి 72 వేల నాడులలోకి, ఉపనాడులలోనికి కూడా ఆ నాడులద్వారా దేహమంతటా కూడా హంస అనేటటువంటి ఎఱుక వ్యాపిస్తుంది. ఈ నాడుల పుట్టుక స్థానము ఘంటిక. నాడుల పుట్టు స్థానము, సుషుమ్న యొక్క పై భాగములో, ఆఖరున అంటే  సుషుమ్న ఎక్కడినుంచి వెన్నుపాములో ప్రారంభమయ్యిందో, ఆ పుట్టినటువంటి చోటు పేరు ఘంటిక. ఘంటిక అనగా నాడుల ముడి.

        హంస సహస్రారమందున్న అష్టదళ పద్మములో కదలక నిశ్చలమై యున్నది. దానిపేరు అచల హంస. అష్టదళ పద్మములో తూర్పు దళము, ఈశాన్య దళము,  ఆ రెంటికి మధ్యలో, అనగా ఎనిమిది దళాలలను 360 డిగ్రీలుగా విభాగము చేస్తే, దళానికి ఎన్ని డిగ్రీలుంటాయి? 45 డిగ్రీలు. తూర్పు దళానికి, ఈశాన్య దళానికి మధ్యలో 45 డిగ్రీలున్నాయి. ఆ నలభై అయిదు డిగ్రీలను 22.5 డిగ్రీలుగా విభజన చేస్తే, తూర్పు ఈశాన్య దళములకు మధ్య, 22.5 డిగ్రీలతో ఒక స్థానము వస్తుంది. ఆ స్థానము నుంచే ఈ సహస్రారములో ఉండేటటువంటి అష్టదళ కమల మధ్యమున, ఉన్నటువంటి హంస, ఈశాన్యమునకు తూర్పునకు మధ్యలో 22.5 డిగ్రీల తేడాతో మొదలై, ఆజ్ఞాచక్రము దగ్గరకు వచ్చి కలుస్తుంది. ఆజ్ఞాచక్రమునకు ఆజ్ఞలు అందించబడుతూ ఉంటాయి. అందువలన దానికి ఆజ్ఞా చక్రమని పేరు.

    ఆ ఆజ్ఞలను పంచకర్తలు పంచశక్తులతో కూడి అందుకుంటూ ఉంటారు. ఇక్కడ ఘంటిక అనేమాట మళ్ళీ వేరే ఎందుకు తీసుకువచ్చారు అంటే, ఇడనాడి, పింగళనాడి, సుషుమ్న నాడులు ఘంటిక స్థానము దగ్గర ప్రారంభమైనాయి. అచట నుంచి అంతర ఇడ, పింగళ, సుషుమ్న నాడులు అనేటటువంటివి కొంతదూరము వచ్చాయి. ఘంటిక అనేటటువంటిది ఏమంటే, మన కొండనాలుకకు పై స్థానము. కొండ నాలుక ఎక్కడైతే మన గొంతులో కనబడుతూ ఉందో, దాని వెనుక కొండనాలుకకు మూలస్థానం ఘంటిక. ఈ షట్చక్రముల సాధనలో, అమృతబిందువు ఆ కొండనాలుక స్థానం నుంచి ఘంటికల ద్వారా వస్తుంది అని అంటారు. ఆ అమృత బిందువును యోగి అయినటువంటివాడు పానము చేస్తాడు. దానివలన ఆయన ఆయుష్షు పెరుగుతుంది, ఆరోగ్యము పెరుగుతుంది. ఈ ఘంటిక ఎక్కడైతే మొదలయ్యిందో, అక్కడ అంతర ఇడ, పింగళ నాడులు వచ్చాయి. బాహ్య ఇడ, పింగళ నాడుల వలన శ్వాస ఆడుతుంది. అంతర ఇడ, పింగళ నాడులలో శ్వాస ఆడదు. కాని, శక్తి ఉంటుంది.

       అంతర ఇడ నాడిలో చంద్రమండల ప్రభావము ఉంటుంది, అంతర పింగళ నాడిలోనేమో సూర్యమండల ప్రభావము ఉంటుంది. అందువల్లనే వీటిని చంద్రనాడి, సూర్యనాడి అంటారు. సుషుమ్న నాడిని అగ్నినాడి అంటారు. ఈ సుషుమ్న నాడిలో అగ్నిమండలము యొక్క ప్రభావము ఉంటుంది. మండల త్రయం దాటేటప్పుడు, ఆ మూడు మండలాల ప్రకాశముల యొక్క ప్రభావాన్ని ఈ మూడు నాడులు పంచుకున్నాయి. సహస్రారము దగ్గర అష్టదళ పద్మము యొక్క మధ్యమందు శ్వాస లేనందువలన అక్కడ కదలికలు లేవు. అందుకనే అది అచల హంస.

       ఈ కదలికలు లేనందువలన, ఈ ప్రణవనాదము చైతన్యముతో కూడి ఉంది కనుక శ్వాసతో కలిసిన చైతన్యము, ప్రాణము అని పేరుమార్చుకుంటుంది. శ్వాసతో కలియక మునుపు అది చైతన్యము. శ్వాసతో కలిసిపోయాక అది ప్రాణము. చైతన్యమే స్థాన భేదాన్ని బట్టి, ప్రాణమయ్యింది. సహస్రారములో ప్రాణవాయువు యొక్క చలనము లేనందువలన అక్కడ అచలము ఉన్నది. కాని అక్కడినుంచి అంతర ఇడ పింగళ నాడులలో గాలి లేదు, ప్రాణవాయువు లేదు, అక్కడ నాదము వినబడదు, చైతన్యముతో కూడి ఉండుట వలన చిన్నాద, చిద్బిందు, చిత్కళలు అంటారు. ఈ త్రివిధములు విని, కనేవాడు మరియు ఈ వివరములు ఎవడైతే తెలుసుకుంటున్నాడో, వాడు సాంఖ్యుడు. సాంఖ్యుడు అంటే హంసే.

       ఇది ఆగ్నేయమందు చేరి, ఆగ్నేయము అంటే ఘంటికాస్థానము, ఆజ్ఞాచక్రము దగ్గరకు వచ్చేసరికి స్థానభేదముచే ప్రణవము శరీరమంతా వ్యాపించుట వలన అన్ని స్థానములు ప్రణవాత్మకమే. స్థానభేదము చేత ప్రణవమునకు ఇన్ని పేర్లు. ఆ ఘంటిక స్థానము దగ్గర దానిపైన అష్టదళ పద్మ మధ్యమున, చిన్నాద, చిద్బిందు, చిత్కళలు ఉంటే, ఆజ్ఞాచక్రము దగ్గరకు వచ్చేసరికి, భ్రూమధ్య స్థానమునకు ఒక అంగుళము పైన ఫాలభాగమువద్ద అక్కడ ఉంటుంది ఆజ్ఞాచక్రము. అక్కడికి వచ్చేసరికి చైతన్యము ప్రాణముగా మారింది. ప్రాణము జడమే. చైతన్యముతో కూడే ప్రాణము చలిస్తోంది. హంస ఆగ్నేయమందు చేరి, నాద బిందు కళలుగా ఉన్నది. నాదబిందు కళలు అనేది ఆజ్ఞాచక్రము దగ్గర. సహస్రారములో అష్టదళ కమలము మధ్యమున ఉండునదేమో చిన్నాద, చిద్బిందు, చిత్కళలు. సహస్రార మధ్యమున చేరి, మరలా పైకి వెళితే, ఉకార, మకారములుగా ఉన్నది. అకారము లేదక్కడ. ఉకార, మకారములగా ఉన్నది.

       ప్రణవస్థాన భేదముచే ఇది త్రివిధములుగా ఉన్నది. సహస్రారమందున్న ప్రణవము, ఘంటికయందు చేరగా, ప్రాణవాయువుతో కలియుటచేత, శబ్దము కలుగగా అది నాదబ్రహ్మము అయ్యింది. అంతర ఇడ, పింగళ నాడులు బ్రహ్మ దండికి (బ్రహ్మదండి అన్నా, వెన్ను పూస అన్నా ఒక్కటే) కుడి, ఎడమ పార్శ్వములనుండి హృదయము వరకూ వచ్చి, ప్రాణవాయువును తీసుకుని, ఊపిరితిత్తుల యొక్క కదలికచేత, వ్యాకోచము, సంకోచములచేత, ఆ బాహ్య ఇడ, పింగళ నాడిలో, ప్రాణచలనము కలిగింది. ఈ ప్రాణవాయువును కుడి, ఎడమ పార్శ్వములనుండి హృదయము అంటే ఊపిరితిత్తుల వరకూ వచ్చి, ప్రాణవాయువును తీసుకుని ఘంటికయందు ప్రణవ బ్రహ్మమును కలిసింది. మరలా వెనక్కు వెళ్ళింది. ఆజ్ఞా చక్రమునుంచి క్రిందకు దిగి, హృదయ స్థానమునకు వచ్చి, హృదయస్థానము నుంచి మళ్ళీ పైకి వెళ్ళింది. పైకి వెళ్ళి, అక్కడ ఘంటిక దగ్గరకు వెళ్ళి, ఘంటిక యందలి ప్రణవ బ్రహ్మమును కలువగా, హృదయమునందలి ప్రాణవాయువునకును, ఘంటిక యందలి ప్రణవమునకును, సంబంధము కలిగినది. ఘంటిక సూక్ష్మశరీర సంబంధము. అచ్చటి మార్గము సూక్ష్మము. ప్రాణవాయువు అచ్చట విజృంభించుటకు వీలులేక, అష్టదళ పద్మ మధ్యస్థానమునందు ప్రాణవాయవు సంచారము లేకపోవుటచేత, అక్కడ ప్రణవము సూక్ష్మబ్రహ్మ నాదము అయ్యింది. అందుకే అది చిన్నాదము అన్నాము. ఆగ్నేయము దగ్గరకు వచ్చేసరికి, ఆజ్ఞాచక్రము దగ్గర నాడులు స్థూల దేహ సంబంధము అగుటచే విశాలముగా ఉన్నవి. విశాలముగా ఉండుట చేత ప్రాణవాయువు విజృంభించింది. అందువలన స్థూల నాద, బిందు, కళలు అయినాయి. కమల మధ్యమున ప్రాణవాయు సంచారము లేకపోవుట వలన,  అది అనాహత శబ్దముగా నున్నది. అచటనుండి రావమును వినవలయును.

       ప్రాణవాయువు మలిన ప్రకృతితో కలవటము చేత, కమల మధ్యమందున్న బ్రహ్మమందు యుండుట చేత, బ్రహ్మయుండే స్థానమునుకు మలిన ప్రకృతికి చేరదు. అక్కడికి వెళ్ళడానికి మలిన ప్రకృతికి సత్తాలేదు. అందువలన ప్రాణవాయువుకు అక్కడ సంచారము లేదు. అందువలన అది చిన్నాద, చిద్బిందు, చిత్కళలుగానే ఉంది. అక్కడ శుద్ధ వాయువు ఉంది. ఈ శుద్ధ వాయువు పేరే చైతన్యము. బాహ్య ఇడ, పింగళ నాడులలో ఉన్నటువంటి, వాయువులు స్థూల వాయువులు. ఇవి పరమాణు సముదాయముతో ఏర్పడినవి. దీనికి చలన గుణము ఉంది. పరమాత్మ ప్రకాశము, చైతన్యము, శుద్ధవాయువు అనేవి పర్యాయ పదాలు. ఆజ్ఞాచక్రమునకు, సహస్రారమునకు ఉన్న భేదమును చెబుతున్నారు. అక్కడైతే ఎలా ఉంది, ఇక్కడైతే ఎలా ఉంది అని.

       ఆజ్ఞాచక్రం దగ్గర స్థూలదేహంతో సంబంధించిన నాడులతో, సంబంధము ఉండడం చేత, నాడులు వెడల్పుగా ఉండడం చేత, ప్రాణవాయువు అక్కడ విజృంబించుచున్నది. శుద్ధ వాయువు ఉన్నచోట, కేవల చైతన్యము ఉన్నచోట, ప్రాణవాయువు సంచారము లేకపోవటం చేత, అక్కడ వేయి హంసలు అజపముగా జరుగుచున్నది. ప్రణవము అనే సగుణ బ్రహ్మకు, వేణునాద వినోదుడు అనేపేరు కలదు. ఆ ప్రణవ స్థానములో, ఏ జీవుడైతే హంస రూపముగా అక్కడకు చేరాడో, అచల హంసగా ఉన్నాడో, వాడు స్థూల శరీరంలో ఉంటూ, సాధనచేత అక్కడకు వెళ్ళాడో, వాడు ఆ ఘంటికా స్థానములలో ఉన్నటువంటి, ఈ ఓంకారము నాద, బిందు, కళా రూపములో వ్యాపించి ఉండడంచేత, ఈ వెన్నుపూస ఒక మురళిలాగా, ఒక వేణువులాగా, డొల్లగా ఉండి, చక్రములలో ఆయా శక్తి కేంద్రముల దగ్గర, పైకి, క్రిందకి వెళ్ళే మార్గము ఉండడంచేత, ఆ వేణువును, ఆ మురళిని, ఎలాగైతే ఊదుతారో, దానిద్వారా ఎలాగైతే రకరకాల స్వరాలు బయటకు వస్తాయో, ఆ రకముగా సహస్రారమందున్నటువంటివాడు, వేణునాద వినోదుడిగా ఉండి, ఈ షట్చక్రాలు, ఈ ఆరు రంధ్రాలద్వారా, ఆరు శక్తి కేంద్రాలలో, ఈ జీవుడిలో జరిగేటటువంటి, వ్యక్తరూప నాద బిందు, కళలయొక్క శబ్దమును చక్కగా వింటాడు. వాడు శబ్దాలు చేయడు. కాని, శబ్దములను వింటాడు. అందుకే ప్రణవం అనే సగుణ బ్రహ్మకు వేణుగాన వినోదుడు అనే పేరు ఉంది. ఈ సగుణ బ్రహ్మను తెలిసి, ఆ నాద బ్రహ్మలో ఐక్యం అయిన వారే ముక్తులు. ఇదీ నాదానుసంధానము.

       శంకారభరణములో ''ఓంకార నాదానుసంధానమౌ గానమే, శంకరాభరణము'' అని ఉంది. ఈ నాదమే శంకరుని యొక్క ఆభరణము. ఈ వెన్నుపాము అనేటటువంటి పిల్లన గ్రోవిలో, ప్రాణవాయువు సంచారము వలన, ఈ స్వరాలన్నీ వినబడుతూ ఉంటాయి. లాహిరీ మహాశయులు కూడా, క్రియా యోగములో నాదానుసంధానము గురించి ఆ నాదం అంటే ఏమిటో, దానియొక్క పరిచయం ఎలా ఉంటుందో, ముందు ఆ శక్తిని తనయొక్క శిష్యులలో ప్రవేశపెట్టి, ఎలా చేయాలో నేర్పుతారు. కొన్నాళ్ళు అభ్యాసము చేస్తే, ఆ నాదానుసంధానము జరిగి, షట్చక్రాలను ఒక్కొక్కటీ దాటకుండా, నేరుగా, ఈ అష్ట కమల మధ్యమందున్నటువంటి, అచల స్థానాన్ని చేరుతారు. అది లాహిరీ మహాశయులు, నాదానుసంధానము ద్వారా నాదవిద్య మనకు అందిస్తున్నారు. ఆ నాదబ్రహ్మములో ఐక్యము అయినవారే ముక్తులు.

       సగుణ బ్రహ్మ, సురంధ్ర, సుషుమ్న అనే పిల్లన గ్రోవిలో, నాదమును పూరించగా, ఈ నాదము పిల్లనగ్రోవి గుండా బహిర్గతము కాగా, దానిని ఆనందించుటచే, ఆ సహస్రారములో ఉండే అచల హంసకు, వేణునాద వినోదుడు అనే పేరు కలిగింది. తాను కొండమీద వెళ్ళుదారిలో అంతర్వేదియందు ఆ వేణునాద వినోదుడు ఉన్నాడు. ఈ వేణునాద వినోదుడు పూర్తిగా అష్టదళ పద్మంలో లేడు. కొంచెం క్రిందికి వస్తే, సూర్యనాడి, అగ్నినాడి, చంద్రనాడి మూడూ ఎక్కడైతే కలుస్తాయో, ఆ త్రివేణీ సంగమము ఎక్కడైతే ఉన్నదో, అక్కడ అంతర్వేది అని ఒక చోటు ఉంది. ఈ అంతర్వేది బయట ప్రపంచంలో నరసాపురం దగ్గర ఉంది. అక్కడ కృష్ణానది సముద్రంలో సంగమించే ముఖద్వారము. ఆ వేణుగానాన్ని పూర్తిగా సహస్రారములో ఉండే వినడు. కొంచెం క్రిందకు దిగితే అక్కడ ఆ స్థానమును అంతర్వేది అంటారు. కొండ అంటే ఏమిటి? ఆ సహస్రారమే కొండ. ఆ కొండమీదికి వెళ్ళే దారిలో అంతర్వేది ఉంది. ఆజ్ఞాచక్రానికి సహస్రారానికి మధ్యలో అంతర్వేది ఉంది. ఈ అంతర్వేది యందు ఆ వేణునాద వినోదుడు ఉన్నాడు. త్రివేణీ సంగమము బయట అలహాబాదువద్ద ఉన్నది. మనలో ఇడా పింగళ సుషుమ్ననాడులు కలిసేచోటు భ్రూమధ్య స్థానములో ఉన్నది.

       అచల హంసను కారణహంస అనికూడా అంటారు. ఘంటిక యందు సూక్ష్మప్రణవముగాను, అక్కడ కారణ ప్రణవముగాను ఉంది. ఎక్కడైతే సూక్ష్మ ప్రణవము ఉందో, ఆ ఘంటిక చిన్నాద, చిద్బిందు, చిత్కళలు అన్నాము. ఎందుకని అన్నాము అక్కడ శుద్ధవాయువు నందు, ప్రకృతి యొక్క మాలిన్యము లేదు కనుక, అది శుద్ధ చైతన్యము అనబడుతుంది. అందుకని ఈ చైతన్యము వలన కలిగిన ఈ నాద బిందు కళలు, చిన్నాద, చిద్బిందు, చిత్కళలు అయినాయి. ఆగ్నేయమున స్థూల ప్రణవముగా నుండును. ఆజ్ఞేయమునకు ద్విదళ స్థానము అని పేరు.

       ఆజ్ఞా చక్రము దగ్గర రెండు దళముల పద్మము, విశుద్ధ చక్రము దగ్గర 16 దళముల పద్మము. అనాహత చక్రము దగ్గర 12 దళముల పద్మము, మణిపూరక చక్రము దగ్గర 8 దళముల పద్మము. స్వాధిష్ఠానము దగ్గర 6 దళముల పద్మము, మూలాధారము దగ్గర 4 దళముల పద్మము ఉన్నాయి.

       ఆజ్ఞాచక్రము దగ్గర ఉన్న ద్విదళ స్థానములో, ఒక దళము మీద 'హం' అని, రెండవ దళము మీద 'క్షం' అనీ ఉంటుంది. సహస్రారము నుంచి, శివశక్త్యాత్మకముగా ఉన్నటువంటి ఆ ప్రణవ స్వరూపుడి నుండి ఇతనికి ఆజ్ఞలు అందుతున్నాయి కాబట్టి, ఈ ఆజ్ఞలు అందుకునే స్థానాన్ని ఆగ్నేయమని, ఆజ్ఞా చక్రమని అంటారు. ఈ ఆగ్నేయమే ద్విదళ స్థానమని, వ్యవహార స్థానమని, ఇంద్ర యోనియని, ఓంకార గృహమని, శుద్ధ యోనియని, అనేక పేర్లతో ఉంది. ఒకే స్థలమునకు ఇన్ని పేర్లు ఎట్లా వచ్చాయి అనంటే, వాటియొక్క వ్యవహారమునుబట్టి, వృత్తి భేదమునుబట్టి, ఇన్ని పేర్లు చెప్పవలసి వచ్చింది. సంకల్ప, వికల్పములనెడివే, 'హం', 'క్షం' అనే ద్విదళములు. హం దగ్గర సంకల్పము, క్షం దగ్గర వికల్పము ఉంటుంది. సంకల్ప వికల్పాలు అనేవి రెండు ఉన్నాయి కాబట్టి, రెండు దళములు ఉండడంచేత, ఈ రెండు దళములు ఆజ్ఞేయమందుండి, ప్రపంచమును సృష్టించుటచే తన కర్మానుభవానికి, తనే ప్రపంచాన్ని సృష్టించుకుంటున్నాడు.

       ఈ పంచకర్తలు ఆజ్ఞేయమందుండి, అచల హంస దగ్గరనుంచి, సహస్రారము దగ్గరనుంచి వచ్చే ఆజ్ఞలను, ఈ పంచకర్తలు స్వీకరించి, పంచకృత్యములు చేయుచున్నారు. ఆ ఆజ్ఞలను అందుకుని ఈ ఐదుగురు పంచకర్తలు  ఆ ఆజ్ఞానుసారము, సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణ అనేటటువంటి పంచకృత్యములు చేయుచున్నారు. ఈ ఆజ్ఞేయమందుండి సర్వేంద్రియములతో, సకల పనులను చేయుటచేత, ఈ పనులు జరిగేదానికి, వ్యవహారమనే పేరు గనుక వ్యవహార స్థానము అనిరి. బ్రహ్మాది పంచకర్తలు, ఆజ్ఞేయమందు ఎల్లప్పుడు ఉండుటచేత, బ్రహ్మాదులు అన్నారు కాబట్టి వారి పేర్లు, సద్యోజాత, వామదేవ, అఘోర, తత్పురుష, ఈశానులు. వేరే సందర్భములో వారే సదాశివ, ఈశ్వర, బ్రహ్మ, విష్ణు, రుద్రులు పంచకర్తలు. వీరు చేసే పంచకృత్యములు ఏమిటంటే, సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణలు. ఈ సర్వేంద్రియములతో సకల పనులు చేయించుచున్నారు. మూలములో ఐదులుగా చెప్పినా కానీ, ఇది స్థానభేదము చేత, షట్చక్రాలలో ఉన్నటువంటి, ప్రారబ్ద సంస్కారముల యొక్క కదలికచేత, దళముల కదలికచేత, ప్రారబ్ద కర్మ అనుభవించబడుతుంది. కదలికలు, ప్రేరణలు, ఇవన్నీ ఒకే ఒక్క అంతర్యామియొక్క సత్తాచే జరుగుచున్నవి.

       బ్రహ్మాది పంచకర్తలు, ఆజ్ఞేయమందు ఎల్లప్పుడు ఉండుట చేత, ఇంద్ర యోని అనిరి. ఈ పంచకర్తలు మొట్టమొదట వచ్చినటువంటి అధిష్ఠాన దేవతలు. సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణలకు అధిష్ఠాన దేవతలు. కనుక వీరి తరువాత అనేకమంది ముక్కోటి దేవతలు వచ్చారు. ఈ దేవతలకు రాజు ఇంద్రుడు. వీరి పంచకృత్యముల చేత ఈ సృష్టి జరుగుతోంది కాబట్టి, సృష్టికి మూలము మూలావిద్య కనుక ఆ మూలావిద్యకు యోని అని పేరు. అధిష్ఠాన దేవతలు సృష్టికి మూలమైతే, ఆ అధిష్ఠాన దేవతలలో శ్రేష్ఠుడు ఇంద్రుడు. ఆ ఇంద్రుడు అనేటటువంటి సృష్టి, స్థితి, లయ, విస్తీర్ణ, ఆకర్షణలుగా జరిగే సృష్టి అక్కడినుంచీ మొదలైంది కాబట్టి అది యోని స్థానము. అక్కడ ఇంద్రుడు అనే దేవత ఉండటము వలన ఇంద్రాణి సృష్టికి మూలము అవ్వడము వలన ఈ ఆగ్నేయానికే ఇంద్ర యోని అని పేరు వచ్చింది.

       ప్రణవము ఆగ్నేయమందుండి, ఈ నాదబిందు కళలతో కూడి, ఆగ్నేయము దగ్గరకి వచ్చేసరికి, చిన్నాద చిద్బిందు, చిత్కళలుగా కాకుండా, కేవలము నాద బిందు కళలుగా స్థూలరూపములో ఉంది. ఈ నాదబిందు కళలతో కూడి దివారాత్రములు ప్రణవ ధ్వని ఘోషిస్తోంది. రేయింబవళ్ళు ఈ నాదబిందు కళలతో కూడి ఒక ప్రణవ ధ్వని ఘోషిస్తోంది. ప్రణవము నాదరూపముగా ఉండి, ఇక్కడికి వచ్చేసరికి ధ్వని రూపముగా మారింది. ఈ ధ్వని ఎట్లా ఉంది? అకార, ఉకార, మకార రూపముతో కూడి ఉంది. అ, , మ. అనేటటువంటి ధ్వని ఇది. దీనిని ఓంకార ధ్వని అంటాము. సూక్ష్మముగా ఉన్నప్పుడు నాదము, స్థూలముగా ఉన్నప్పుడు ధ్వని అన్నాము. సూక్ష్మముగా ఉన్నప్పుడు ప్రణవనాదము అని, స్థూలముగా ఉన్నప్పుడు ఓంకార ధ్వని అని అంటాము. సూక్ష్మముగా ఉన్నప్పుడు అచల స్థానము అన్నాము. ఘంటికా స్థానము అన్నాము. పూర్తిగా అచల స్థానము కాకుండా కొంచెము దిగువకు వచ్చి, అంతర్వేది అనే స్థానము దగ్గర, చిన్నాద, చిద్బిందు, చిత్కళలు అన్నాము. అక్కడ మలిన ప్రకృతి యొక్క ప్రవేశము లేదు. శుద్ధ వాయువే చైతన్య రూపంలో ఉంది కాబట్టి, చిన్నాద, చిద్బిందు, చిత్కళలు అన్నాము. ఆ అంతర్వేది అనే స్థానమువద్ద దగ్గరికి వస్తే, ఇది బాహ్య ఇడ, పింగళ నాడుల ద్వారా ప్రాణ వాయువు యొక్క సంచారాన్ని కలిగివుంది కనుక స్థూలదేహమంతా వ్యాపించి ఉన్నటువంటి, స్థూల నాడులతోటి సంబంధము పెట్టుకుంది కాబట్టి, స్థూల నాద బిందు కళలుగా తోస్తున్నాయి. ఆజ్ఞేయము నుంచి, ఈ స్థూలనాద బిందు కళలతో కూడి, రేయింబవళ్ళు ఆ ప్రణవము ధ్వనిరూపముగా మారింది. ఈ ప్రణవ ధ్వని పేరే ఓంకారము. ఈ ధ్వని అక్కడ ఘోషించుచున్నది కనుక ఓంకార గృహము అనిరి. కనుక ఈ ఆజ్ఞాచక్రమునకు ఓంకార గృహము అని పేరు.

       సిద్ధ దేవతలంతా ఇక్కడ రమించుట వలన సిద్ధిపొందినటువంటి దేవతల స్థానమది. వాళ్ళు మనని ప్రేరేపిస్తూ, మన అజ్ఞానంలో మన కర్మలను అనుభవించేటట్లు చేస్తున్నారే కాని, వారు ఆ కర్మ పద్ధతికి, కర్మ ప్రపంచానికి, కర్మ వివరాలకు ఎటువంటి సంబంధము లేకుండా, మంచికి, చెడుకి, జ్ఞానానికి అజ్ఞానానికి ఇంద్రియములకు, మనోబుద్ధులకు సంబంధించి కేవల ప్రేరణాశక్తులుగా ఉన్నారు. కాబట్టి వారు సిద్ధులు.

       స్పందింపజేసేటటువంటి లక్షణము కలిగియున్నప్పటికీ, వారిలోని అంతరాత్మ తనలో తాను రమించేటటువంటి బ్రహ్మానందములో ఉంటుంది. సిద్ధుల స్పందన ఎక్కడనుండి అందుతుందో ఆ స్థానము పేరు సిద్ధయోని అనిరి.

       సహస్రార కమలమందుండి, సహస్రార కమలమందున్నటువంటి చిత్‌ శక్తి, చైతన్యంలో ఉన్నటువంటి శక్తి దిగి వచ్చి, సర్వక్రియలు చేయించుటకు, పంచకర్తలను ఆజ్ఞాపించు స్థలమగుట చేత, దీనిని ఆజ్ఞేయ మనిరి. ఆజ్ఞలు ఇక్కడ లేవు, అంతర్వేది నుండి వస్తున్నాయి. ఇక్కడ ఆజ్ఞలన్నీ కూడా అందుకుంటున్నారు. పంచకర్తల స్థానమే, వారు పై నుంచి ఆజ్ఞలు అందుకుని, ఆ ఆజ్ఞల ప్రకారముగా ప్రవర్తిస్తున్నారు. పంచకృత్యములు చేస్తున్నారు కనుక దానిని ఆజ్ఞేయము అన్నారు. ఆజ్ఞలు అందుకుని సగౌరవముగా, పంచకృత్యములు. సృష్టి స్థితి లయ విస్తీర్ణ ఆకర్షణలు చేస్తున్నారు. కాబట్టి దానికి ఆజ్ఞేయమని, ఆజ్ఞాచక్రమని పేరు.

       ఒక ప్రారబ్ద కర్మ అనుభవిస్తూ కూడా ఆగామి కర్మ చేయనివాడు ఎవరైతే ఉన్నారో, వారి విషయంలో ఇవి షట్చక్రములు కాదు. షట్కమలములు. అంటే, అక్కడ గిరగిరా తిరుగుతూ ఉండేచక్రము ఎప్పుడైతే ఆగిపోయిందో, అది కమలమయ్యింది.  ఆత్మజ్ఞానములో ఉన్నవాడికి, జీవన్ముక్తులకు శరీర ప్రారబ్దము ఉంటుంది కదా! ఈ దళముల యొక్క కదలికచేత శరీర ప్రారబ్దము తనచేత అనుభవింపబడుతుంది. కాని జీవన్ముక్తుడు అసంగుడు. అజ్ఞానికి ఇవి విసిరి, విసిరి కొడుతున్నట్లుగా, అతన్ని చలింపచేస్తూ ఉంటే, కొన్ని పనులు చేయకుండా ఉండలేను, ఆపుకోలేను, నిగ్రహించుకోలేను, అనే పద్ధతిలో ప్రేరేపిస్తుంది కాబట్టి దానిని చక్రము అని అన్నారు. చక్రములకు, కమలములకు ఉన్న తేడా అది.