21


పంచభూతోత్పత్తి

       వికాసము పొందినటువంటి రక్త బిందువు వలన, ఆ బ్రహ్మమే అంకురముగా గల శబ్ద బ్రహ్మముగా ఆవిర్భవించింది. రక్త బిందువనగా మాయాశబలిత బ్రహ్మము. ఆ బ్రహ్మమునుండి అనాహత శబ్దము పుట్టింది. అదియే నాదబ్రహ్మ. ఆ నాదము వలన ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథివి అనబడే పంచభూతాలతో కూడిన ప్రకృతి జనించినది. అకారాది హకారాంతము అంటే అ నుండి హ వరకు గల 56 అక్షరాలు ఉత్పన్నమైనాయి. పంచభూతాలేమో రూపాలైనాయి. అక్షరాలు నామాలైనాయి. ఈ విధముగా నామరూప జగత్తు ఏర్పడినది.

మహత్తత్వ స్వరూపము

       ఈశ్వరుడు అనేటటువంటి మాయా ప్రతిబింబ శక్తి కారణమై, రజోగుణముతో ఉద్రిక్తము అయ్యింది. అప్పుడు మహత్‌ అని ప్రసిద్ధమై, అందులో విక్షేపశక్తి విజృంభించినది. ఆ విక్షేప శక్తి యొక్క ప్రతిబింబ రూపమే హిరణ్యగర్భుడయినది. ఇతడే దృశ్య - అదృశ్యమైన రూపము కలిగి, మహతత్త్వమునకు అభిమానిగా ఉన్నాడు. అందువలన ఆ హిరణ్యగర్భునికి మహత్‌ అహంకారము అని పేరు కలిగినది.