25


కైవల్య దేహ నిర్ణయము
(మహాకాశము - భూతాకాశ భువనము)

       దేహం అంటే దహింపబడేది. కైవల్యం అనే పదం ఎలా వచ్చింది? కేవలము అనే దాన్నుండి వచ్చింది. కేవలత్వమే కైవల్యం. అంటే అన్నిటి నుంచి ఇది కాదు ఇది కాదు అని వేరుపరచినటువంటిది, చివరకు ఏది మిగిలి ఉంది అంటే కేవలమై ఉన్నది. అది మాత్రమే ఉన్నది. కేవలం అంటే మాత్రమే అని. ఏది అంటే పరబ్రహ్మ. పరబ్రహ్మ మాత్రమే. పరబ్రహ్మ తప్ప అన్యము లేదు అనే అర్థంతో కేవలాత్మ. కేవలాత్మత్వము అనే పదాలు వచ్చాయి.

       ఈ కైవల్య దేహం నిర్ణయం అంటే, అక్కడ దహించబడేది ఉండకూడదు కాని దేహం అంటే దహించబడేది. మరి కైవల్యదేహము అంటారేమిటి? ఆ కేవలాత్మజ్ఞానం కూడా అఖండ ఎరుకే కనుక లక్ష్యంలో అది కూడా పోవాలి. కైవల్య దేహం కూడా పోయేదే. మహా కారణం కూడా పరమపదం సిద్ధించినప్పుడు నశిస్తుంది. నశించే దానిలో భాగాలే ఇవన్నీ. ఇవి కూడా ఒక పంచీకరణలో భాగాలే. ఈ కైవల్య దేహ నిర్ణయం కూడా పంచీకరణ లోనిదే. ఈ కేవలాత్మకు పునరావృత్తి ఉన్నది. అందువలన దీనిలో ఏమేమి ఉన్నాయో తెలుసుకొని నిరశించాలి. అప్పుడే పునరావృత్తి లేని పరమపదము.

       ఈ పంచీకరణలో పంచభూత తత్వాలు ఉన్నాయి. ఆకాశ తత్వము అంటే, వ్యష్టి అంతఃకరణ యొక్క నిర్వికల్పమైనది. కాని తిరిగి వికల్పము చెందే అవకాశమున్నది. వాయుతత్వమంటే, వ్యష్టిలో సమానాది ప్రాణముల చలనములు లేనిది. కాని పునరావృతిలో పనిచేసే అవకాశము పోలేదు. అగ్నితత్వమంటే వ్యష్టిలో రూపాదులు తోచని స్థితి. కాని మళ్ళీ తోచే ఆస్కారమున్నది. జలతత్వమంటే జీవులలో ఉండే విషయాదులు నిర్విషయమైనట్టిది. అయినా విషయములు తోచే బీజమున్నది. పృథివీతత్వము అంటే కర్మేంద్రియాలు నిష్క్రియ అయినటువంటిది. అయినప్పటికీ వాటిని క్రియోన్ముఖము చేసేటటువంటి అవ్యక్త స్థితిలో ఉన్నది. ఈ విధముగా సర్వము జీవులలో పునరావృతి అయ్యే అవకాశాలు ఈ కైవల్య దేహములో ఉన్నాయి. కనుక ఈ కేవలాత్మ అనే అఖండ ఎరుక లేనిదేనని విచారణ చేసి, నిరశించాలి. అందుకే ఈ కేవలాత్మ యొక్క పరచీకరణము. ఈ కేవలాత్మలో నిర్విషయ అంతఃకరణము, నిశ్చల సమానాదులు, నిరూపాధులు, అరసాదులు, నిర్గంధాదులు ఉన్నవి.

       కాని అవి తిరిగి తన్మాత్రలు, విషయాలుగా వ్యక్తమయ్యే ప్రమాదము ఉన్నది. ఆకాశతత్వము మహాకాశమయ్యెను. ఆకాశతత్వము వాయుతత్వముతో కూడి ఆత్మారామత్వమయ్యెను. ఆకాశతత్వము అగ్నితత్వముతోకూడి స్వయంజ్యోతిత్వమయ్యెను. ఆకాశతత్వము జలతత్వముతో కూడి పరామృతత్వమయ్యెను. ఆకాశతత్వము పృథివీతత్వముతో కూడి భేదాభేదా తీతత్వమాయెను.

       కేవల వాయుతత్వము అనామృత చైతన్యత్వమయ్యెను. వాయుతత్వము ఆకాశతత్వముతో కూడి దహరాకాశమయ్యెను. వాయుతత్వము అగ్నితత్వముతో కూడి పరంజ్యోతిత్వమయ్యెను. ఆకాశతత్వము జలతత్వముతో కూడి సమరసత్వమాయెను. ఆకాశతత్వము పృథివీతత్వముతో కూడి అభేదాభేదత్వమాయెను.

       కేవల అగ్నితత్వము జ్యోతిర్మయత్వమాయెను. అగ్నితత్వము ఆకాశతత్వముతో కూడి నిరవయాకాశమయ్యెను. అగ్నితత్వము వాయుతత్వముతో చేరి చిదీశ్వర భావ మఖిల లీనత్వమాయెను. అగ్నితత్వము జలతత్వముతో కూడి తత్వామృతత్వమాయెను. అగ్నితత్వము పృథ్వితత్వముతో కూడి భేదాభేదత్వమాయెను.

       కేవల జలతత్వము అమృతత్వమయ్యెను. జలతత్వము ఆకాశతత్వముతో కూడి సూర్యాకాశమయ్యెను. జలతత్వము వాయుతత్వముతో కూడి సత్యం జ్ఞానమనంత లక్షణ పరత్వమయ్యెను. జలతత్వము అగ్నితత్వముతో కూడి ఆపోజ్యోతిత్వమయ్యెను. అగ్నితత్వము పృథివీతత్వముతో కూడి అఖండత్వమయ్యెను.

       కేవల పృథివీతత్వము ద్వయత్వమయ్యెను. పృథివీ తత్వము ఆకాశతత్వముతో కూడి భూతాకాశమయ్యెను. పథివీతత్వము వాయుతత్వముతో కూడి అంతర్బాహ్య స్ఫూర్తి రహితత్వమయ్యెను. పృథివీతత్వము అగ్నితత్వముతో కూడి జగజ్జ్యోతిత్వమయ్యెను. పృథివీతత్వము జలతత్వముతో కూడి బోధామృతత్వమయ్యెను.

       ఈ విధముగా కేవలాత్మయందు పునరావృతికి హేతువైన తత్వములున్నవి. ఈ తత్వములన్నీ నిరశించబడినప్పుడు కేవలాత్మ నశించును. అనగా అఖండ ఎరుక లేకపోవడమే! అపుడు సిద్ధించేది పరమపదము. కేవలాత్మ యొక్క అపంచీకృతమైనది నిరాకాశము మరియు అచల పరిపూర్ణము.

       ఈ కేవలాత్మ లక్షణములు ఏవి?      ఆకాశతత్వము, వాయుతత్వము, అగ్నితత్వము, జలతత్వము, పృథివీతత్వము అనేవి అస్పష్టము, లీలామాత్రము. అవ్యక్తములో ఉంటూనే, వ్యక్తము కాబోయే వాటికి సూచకములు. అవ్యక్తమును సున్నా చేస్తే ఇక వ్యక్తమయ్యేవేవీ ఉండవు. కనుక ఈ లక్షణాలను గ్రహించి, నిర్బీజము చేయవలసి యున్నది. కనుక కైవల్య దేహములోని సూచనలను విమర్శించుకొనుటకు గాను ఈ కైవల్య దేహమును ముందుగా స్వానుభవములోనికి తెచ్చుకొనవలెను. ఇవన్నీ విషయముగా చెప్పినప్పటికి బుద్ధికి గ్రాహ్యము కాదు. ఆ కైవల్య దేహమునందే దర్శించదగును. అక్కడనే ఇవి అనుభవనీయము.

       మహాకారణ దేహము ఉత్త బట్టబయలు ఏమీలేదు. కైవల్య దేహమునకు మూలము లేదు. మూలములేని గుర్తెరిగే కైవల్య దేహము ఏమీ లేదు. ఇంతవరకు విచారించినవి, అనుభవించినవన్నీ కూడా లేని ఎరుకే. అట్టి ఆధ్యాత్మిక స్థితిగతులన్నీ కలలో తోచినవేలాగో అలాగే ! స్వస్తిః

శ్రు ||  ఆచార్య స్వరూపో వేదా అహింసా ప్రథమం పుష్పం | పుష్పమింద్రియ నిగ్రహం | సర్వ భూత దయా పుష్పం | క్షమా పుష్పం విశేషతః |
శాంతి పుష్పం తపః పుష్పం | ధ్యాన పుష్పం తథైవచ |
సత్యమష్టవిధ పుష్పం | విష్ణోః ప్రీతికరం భవేత్‌ ||

       అష్ట పుష్పాలను ఇక్కడ పెట్టారు. ఆచార్య స్వరూపం వేదా అంటే  ఆచార్యుడు వేద స్వరూపుడు. ఆ వేద  స్వరూపునికి 8 పుష్పాలు సమర్పిస్తే, ఆ విష్ణువుకు ప్రీతికరమౌతుంది. కైవల్య పదాన్ని ఇస్తుంది. కైవల్యపదము వరకే ఏ ప్రార్థనలైనా. బట్టబయలవడానికి ఏ ప్రార్థన లేదు, ప్రార్థన స్వీకరించేవాడు లేడు, ప్రార్థన చేస్తే కూడా అది ఎరుకే. ఎరుక రూపంలో ఉన్న ప్రార్థన ఎరుకలేని బట్టబయలుకు చేర్చదు. అందుకనే ''విష్ణుః ప్రీతికరం భవేత్‌'' సర్వవ్యాపక చైతన్య రూపుడైనటువంటి, విష్ణువుగావున్న చైతన్యంలో కానీ హిరణ్యగర్భుడులో గాని మనం చేరుతాం ఎందుకని? ఇది సగుణ అనుష్టానం. ప్రార్థనలు అన్నీకూడా ఎక్కడవరకు ఎరుక ఉంటుందో, అక్కడివరకూ అది తీసుకువెళుతుంది. ఎరుక విడిచినవాడు, లేని ఎరుకగా ఉన్నవాడు, అటువంటి విష్ణు స్వరూపుడు అయినటువంటి, ఆచార్య దేవునికి ఈ పుష్పాలు సమర్పిస్తున్నారు.

       అహింస, ఇంద్రియనిగ్రహము, సర్వ భూత దయా, క్షమా, శాంతి, తపస్సు, ధ్యానం, సత్యం, అనే అష్టవిధ పుష్పాలను సమర్పిస్తున్నాడు అంటే అర్థం ఏమిటి? దేనినుండి విడుదల అవుతున్నారు? హింస వదలి అహింసకు వచ్చారు, ఇప్పుడు అహింసను కూడా వదిలేస్తున్నారు. తరువాత ఇంద్రియనిగ్రహము- శమదమాదులు కూడా వదిలేస్తున్నారు, వాటితో పని అయిపోయింది. సర్వ భూత దయా పుష్పం వదిలేశారు, క్షమా పుష్పం వదిలేశారు.

       నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను బ్రహ్మను అనేటటువంటి విశేషాన్ని వదిలేశారు. శాంతిని వదిలేశాడు, పరమ శాంతి మోక్షం  అన్నారు, కాబట్టి అటువంటి శాంతిని వదిలేశావు. తపస్సును వదిలేశావు. ధ్యానాన్ని వదిలేశావు. సత్యాన్ని వదిలేశావు. ఇలా అష్టవిధ పుష్పాలను నీవు వదిలేశావు అంటే, అష్టవిధ ఎరుకల నుండి బయట పడ్డావని. చివరికి నీవు బయలు అయ్యావని అర్థము. ఇవన్నీ ఎలా వదిలావు అంటే, ఆచార్య స్వామికి సర్వార్పణగా వదిలేశావు. ఇక అవన్నీ నీకు లేవు.

       మన గురుపరంపరలో ''ఓం నమో బ్రహ్మాదిభ్యో'' అన్నప్పుడు ఆ పరంపరలో ఏమి వచ్చింది? బ్రహ్మ విష్ణువుకు చెప్పాడు. విష్ణువు సూర్యుడికి చెప్పాడు. సూర్యుడు యాజ్ఞవల్క్యుడికి చెప్పాడు. యాజ్ఞవల్క్యుడు చెప్పిన బోధే అచల సిద్ధాంతము.

       అంటే ఆ యాజ్ఞవల్క్యుడు అనేటటువంటి అశరీర గురువు చెప్పినట్లుగా తను మనధనాలన్నీ  కూడా సమర్పించినప్పుడు మనం విడుదల అవుతున్నాము. ఇక్కడ విష్ణువు కూడా అశరీరి గురువే. యాజ్ఞవల్క్యుడు అశరీరిగా ఉన్నప్పుడు యాజ్ఞవల్క్యుని యొక్క గురువు సూర్యుడు. సూర్యునియొక్క గురువు విష్ణువు. అటువంటి విష్ణువుకి తను మన ధనాలు, 8 పుష్పాలు, తపస్సు ధ్యానం మొదలైనవన్నీ కూడా అర్పించేసావు. ఎందుకంటే బయలు తపస్సువల్ల అందదు, ధ్యానంవల్ల అందదు, అహింస అనే వ్రతంవల్ల అందదు. అవన్నీ కొన్నికొన్ని దాటటానికే పనికివస్తాయి. చివరకు ఎరుకను మిగిలిస్తాయి. కనుక సాధనలను, సాధ్యములను వదలివేయాలి. అష్టవిధ పుష్పలన్నీ అష్టవిధ ఎరుకలు. వీటిని అశరీరి గురువైనటువంటి విష్ణు స్వరూపునికి వారియొక్క ప్రీత్యర్థం వదిలేశాం.

       ఆయనకి ప్రీతి కలిగితే, కృప కలిగితే నీకు ఎరుక విడిపించితే, నీవు బయలు అవుతావు. ఇదీ ముగింపు. 

       మూడు గుణాలతో వచ్చినటువంటి సృష్టిని, మూడు గుణాలతో పంచీకరణ క్రిందిస్థాయిలో పిండాండ  బ్రహ్మాండ స్థాయిలో, మహా కారణం దగ్గర, కైవల్యదేహము దగ్గర కూడా అలాగే ఉంటుంది అని తెలుసుకున్నాము.

       ఎందుకంటే అనిర్వచనీయమైనటువంటి వస్తువుని ఊహలో కూడా మీరు అందుకోలేరు కనుక, పైపైకి తీసుకెళ్ళి ఒకానొక అవగాహనను పెంచడం కోసమే ఇదంతా. పంచీకృత భాగాలన్నీ కూడా ఏమీ లేదు. అపంచీకృత భాగానికి వెళ్తే  మరల అక్కడ కూడా ఒక పంచీకరణ తీసుకొస్తుంది, మహా కారణం దగ్గర. అదికూడా ఏమీ లేదు అని కేవలాత్మ దగ్గరకు వెళ్తే,  కైవల్యం దేహం దగ్గర పంచీకరణ పెట్టాము. ఇక్కడ కూడా ఏమీ లేదని తెలిసింది. అన్ని పంచీకరణలలో ఏమి లేదన్నప్పుడు పంచీకరణ కాకుండా ఉన్నదున్నట్లుగా ఉన్నది. కట్ట కడపటి అపంచీకృతమే బయలు. అది బట్టబయలు తప్ప ఇంకేదీ లేదు.

       ''పూర్వమేవా నిరాలంబం'' అని ప్రారంభంలో ఏదైతే సంకల్పం పెట్టామో అది కేవలాత్మగా మిగిలి ఉంటుంది. అంకురార్పణలో ఏదైతే మనం సమర్పించాలి అనుకున్నామో, ఆ కేవలాత్మ కూడా లేనిదని తెలిసి అశరీరులైనటువంటి, ఆ విష్ణు స్వరూపానికి ఆయన యొక్క ప్రీతి కొరకు ఆయన యొక్క కృపతో ఎరుక విడుచుటకు, ఈ ఎనిమిది రకాలైన ఎరుక పుష్పాలనికూడా ఆయనకు సమర్పించుకున్నాము. ఇంక ఏమీ మిగలలేదు. ఉత్త బట్టబయలే స్వతఃసిద్ధము !