24


మహాకారణ దేహ నిర్ణయము


       జీవుడిలో తురీయముగా ఉండే ప్రత్యగాత్మయే మహాకారణము. ఈ మహాకారణము ఈశ్వరుని యొక్క అవ్యాకృతరూపము. ఈ విధముగా ఈశ్వరుడికీ, జీవుడికీ అవినాభావ సంబంధము కుదిరింది. ఈశ్వరుడు నిష్క్రియాపరుడు, మహాకారణ రూపుడు. జీవుడు క్రియారూపుడు, కారణ రూపుడు. ఈశ్వరునియొక్క మహాకారణమే జీవుడిలో ప్రత్యగాత్మగా ఉంటూ, ఆ జీవునియొక్క అవస్థాత్రయమును కార్యరూపముగా జరుపుతూ ఉంటుంది.

       అందుకే 'కారణోపాధి రయం ఈశ్వరః కార్యోపాధిరయం జీవః' అంటున్నాము. కనుక మహాకారణమే జీవుల ద్వారా,  కార్యమును జరుపుతున్నది. అందువలన జీవుల తురీయములలో మహాకారణము అవ్యక్తముగా నున్నది. ఆ అవ్యక్తములో కూడా 25 తత్త్వాలుగా ఉండి, జీవులలో అనుభవ రూపంగా వ్యక్తమగుచున్నాయి. అనగా వ్యక్త రూపముల లక్షణాలను అవ్యక్తంలో ఉంటే తత్త్వాలుగా ఉంటే ఏమో ఆ పదాలతో 25 తత్వాలతో కూడిన మహాకారణ దేహ నిర్ణయమును చెప్తున్నారు ఇక్కడ.

       సత్యము అన్నామనుకోండి. సత్యము యొక్క అవ్యక్తం ఎలా ఉంటుందంటే, సత్యత్వము. పూర్ణము అన్నాము. వ్యక్తమైనది ఆకాశము. అవ్యక్తములో అది కార్యరూపంలో ఏదైతే పూర్ణంగా నిండుగా ఉందో, కారణంలో పూర్ణత్వము అనాలి.

       ఆకాశతత్వము. అలాగే అన్నీ కూడా. ఇక పంచీకరణ చూద్దాము. కేవల ఆకాశతత్వము పూర్ణకత్వం అయినది. ఆకాశతత్వములో వాయువు తత్వము అసంగత్వం, ఆకాశతత్వములో అగ్నితత్వము వ్యాపకత్వం, ఆకాశ తత్వములో జల తత్వము, సర్వబీజకత్వం, ఆకాశ తత్వములో పృథ్వితత్వం అఖండత్వం.

       వాయువు తత్వములో ఆకాశ తత్వము, అఖండత్వం, కేవల వాయుతత్వము అభేదత్వం, వాయువు తత్వములో అగ్నితత్వము పరాత్పరత్వము, వాయువుతత్వములో జలతత్వము నిర్మలత్వం, వాయువుతత్వములో పృథ్వీతత్వము అజరత్వం. అజరత్వము అంటే ముసలితనము లేకపోవటము.

       అగ్నితత్వములో ఆకాశ తత్వము, అదాహ్యత్వం, అగ్నితత్వములో వాయుతత్వము ఊర్ధ్వపదత్వము. కేవల అగ్ని తత్వము ప్రకాశత్వం. అగ్నితత్వములో జలతత్వము చైతన్యత్వం, అగ్ని తత్వములో పృథివీతత్వము అనఘ్యత్వము. అనఘ అంటే ఏ పాపం చెయ్యకుండా పవిత్రంగా ఉండటము.

       జలతత్వములో ఆకాశ తత్వము అక్లేద్యత్వం, జలతత్వములో  వాయుతత్వము జగజ్జీవత్వం, జలములో అగ్నితత్వము పరంజ్యోతిత్వము, కేవల జలతత్త్వము అమృతత్వము, జలతత్వములో పృథ్వితత్వము కారుణ్యత్వం.

       పృథ్వీతత్వములో ఆకాశ తత్వము అశోష్యత్వం, పృథ్వీతత్వములో వాయుతత్వము కారణత్వం, పృథ్వీ తత్వములో అగ్నితత్వము పావకత్వం, పృథ్వీతత్వములో జలతత్త్వము సమృధ్యత్వం, పృథ్వీతత్వములో పృథీ్వతత్వము సర్వదాతృత్వం.

       ఈ లక్షణాలన్నీ కూడా కలిగియున్నది మహా కారణం. మానవ దేహంలో మూర్ఖ్నిస్థానము, ప్రణవంలో అర్థమాత్ర ప్రమాణము. మహాకారణ శరీరంయొక్క వర్ణం నీలవర్ణం, ఆకాశం రంగు. మహాకారణంలో ఉన్న జీవుడి పేరు ప్రత్యగాత్మ అభిమాని. మహాకారణంలో ఉన్న జీవుడు సగుణంగా ఉంటాడు. అక్కడ వివేక జ్ఞానం ఉంటుంది. అక్కడ ద్రష్ట రూపం ఉంది. దృశ్య తాదాత్మ్యత లేదు.

       మహా కారణం అంటే అక్కడ కార్యం లేదు కనుక కేవల ద్రష్ట రూపం ఉంటుంది. కార్యరూపంలోకి వస్తే, ఉపాధి వస్తే, ఉపాధితో తాదాత్మ్యత వల్ల శరీరం నేను అనేటటువంటి జీవుడు అవుతాడు. శరీరమే నేను అనంగానే ద్రష్టరూపత్వం కాదది. దృశ్యరూపత్వం అయ్యింది. ఉపాధి రూపత్వం అయింది. అనగా శరీరానికి ద్రష్ట. మహా కారణంలో అది ద్రష్ట రూపత్వము.

       ఓంకారంలో అర్థ మాతృకలో ఏ భోగం ఉందో, అనగా వ్యష్టితురీయములో ఏ భోగముందో అది వైభోగిక భోగము అన్నారు. మహాకారణ శరీరంలో ఆనందము ఉంది. సమష్టి స్థూల సూక్ష్మ కారణములు విరాట్‌ హిరణ్యగర్భ అవ్యాకృతులు సంకేతముగా అకార ఉకార మకారములయితే అది మహా కారణం. ఇది వ్యష్టిలో అర్థమాతృక అనబడుతుంది.

       నాలుగు వేదాలలో మహా కారణం అధర్వణ వేదం. పరావాక్కు , పశ్యంతీ వాక్కు , మధ్యమా వాక్కు,  వైఖరి వాక్కు అని. నాలుగు వాక్కులున్నాయి. వాటిలో మహా కారణం పరావాక్కు. మహా కారణంలోని యొక్క ప్రేరణతోనే సర్వము పనిచేస్తున్నాయి. అంటే అది పరాశక్తి యొక్క ప్రభావము. ఈ మహా కారణశరీరం ఎక్కడ వుంది అంటే వాయు మండలంలో ఉంది. వాయు భువనంలో ఉంది. మహా కారణం వాయుతత్వంగా ఉంది.

       ఇది మన కంటికి కనపడేటటువంటి పంచభూతాలలోని వాయువు కాదు. వాయుతత్వం అక్కడ అది. వాయువు వేరు. వాయువు పుట్టకముందు వాయుతత్వం ఉన్నది. శబ్దము విషయము కాకముందు శబ్ద తన్మాత్ర పుట్టింది. జీవుడు రాకముందు మహత్తత్వం ఉంది. అలా ఇవన్నీ మహాకారణమందు తత్వాలుగా ఉన్నాయి.

       వాయువు యొక్క ప్రత్యేక కళలు తీసుకుంటే గాలియొక్క వేగాన్నిబట్టి, వేగంయొక్క మార్పు చేర్పులనుబట్టి వచ్చే కదలికలను కళలు అంటారు. కదలికలు అవ్యక్తంగా ఉంటే వాటిని కళలు అంటాము. కదలిక కనపడితేనేమో అది స్థూలంలో. సూక్ష్మంలో ప్రేరణగా ఉంది. ఇది కార్యరూపం లేనిది కాబట్టి, అక్కడ కదలికలూ లేవు. కదలికలు అయ్యేటటువంటి ఆస్కారమున్న ఒక అవ్యక్త స్థితి పేరు కళలు. దీనిని చలనాంశము అనవచ్చును.

       ఈ మహా కారణశరీరంలో, మిగతా శరీరాల నుండి విడివడి ఇక్కడ ఎవరైతే ఉంటారో, వారు వైరాగ్యం కలిగినవారుగా, తీవ్ర ముముక్షుత్వం ఉన్నవారుగా ఉంటారు. ఆత్మత్వపద దర్శనము ఉంటుంది. ముముక్షుత్వమే ఉంటుంది కానీ, మోక్షం కాదు. మహా కారణం నశిస్తేనే మోక్షం. అదికూడా త్వం పదంగానే ఉంటుంది. మహా కారణం కూడా పోయినపుడు, అది తత్‌ పదం అవుతుంది. తురీయావస్థ అనేది వాయువు తత్వములోని నాల్గవకళ. వాయువు తత్వముయొక్క ప్రత్యేక వైరాగ్యము, ముముక్షుత్వం, ఆత్మత్వపద దర్శనం, తురీయావస్థ. ఈ నాలుగు వ్యష్టికి సంబంధించినవి.