12


అహంకారము – ఆత్మ


       వేదాంతము ఏ సంప్రదాయకమునకును, ఏ తెగకును, ఏ జాతికిని, ఏ లింగమునకును చెందినది కాదు. అందుకే అక్కడ పురుషుడు అనే శబ్దాన్ని వాడారు, వివేక చూడామణిలో కాని, ఉపనిషత్తులలో కాని, ఎక్కడికక్కడ కులం అనే పదము లేదు, వర్ణము అన్నారు. వర్ణము అంటే మనం కులం క్రింద పెట్టాము. కొన్ని వృత్తుల వల్ల కులవృత్తులు అంటారు వాటిని. నేత పని చేసేవారిది ఒక కులం, కుండలు చేసేవారిది ఒక కులం, క్షవరం చేసేవారిది ఒక కులం, బట్టలు ఉతికేవారిది ఒక కులం. ఇలా వృత్తుల చేత వచ్చాయి కానీ, భగవంతుని చేత నాలుగే నాలుగు వర్ణాలు సృజించబడ్డాయి. అవి కులాలు కాదు, వర్ణములు. మరలా ఆ వర్ణములు నా చేత కల్పించబడ్డాయి అని శ్రీకృష్ణ పరమాత్మ చెబుతూ, ఎలా కల్పించబడ్డాయో కూడా చెప్పాడు. గుణ, కర్మ, స్వభావాన్ని బట్టి అన్నాడు. దీన్ని బట్టి ఏమైంది? ఎప్పుడూ దుఃఖపడుతూ, ఎప్పుడూ అజ్ఞానంలో ఉండి, ఎప్పుడూ వేదన పడుతూ, ఏ సాధన చేయకుండా, ఎవరు చెప్పిన మాటలు వినకుండా ఉండేవానిని శూద్రః అన్నారు. వాళ్ళకు ఒక్కళ్ళకే బ్రహ్మవిద్యాధికారం లేదు.

       పుట్టుకతో శూద్రులు కాదు. ఎప్పుడూ నిత్య దుఃఖితుడై, ఆ దుఃఖ నివారణార్థం, ఎవరు ఏం చెప్పినా వినకుండా, తమో గుణంతో తన కష్టాలను తానే తెచ్చుకునేటటువంటి స్వభావము, ఎవరికైతే ఉందో వారు శూద్రులు. ఆ స్వభావాన్ని అతను మార్చుకుని, శమదమాదులు పాటిస్తే ఆధ్మాత్మిక దృష్టి, శ్రద్ధ, భక్తి ఉంటే అతడు శూద్రుడు కాడు యోగ్యుడే.

       అందువలన ఈ వేదాంతము, ఈ బ్రహ్మజ్ఞానము, ఈ సాధన ప్రతీ మానవుడికి, చేసుకోగలిగితే ప్రతీ జంతువుకీ లభిస్తుంది. గజేంద్ర మోక్షంలో లాగా ఏనుగుకు కూడా మోక్షం వస్తుంది చేసుకోగలిగితే. మానవ జన్మకు వచ్చి, మరలా వెనక్కు వెళ్ళిన జంతువుకి మోక్షం వస్తుంది. పరిణామంలో ఇంకా మానవుడు కాని జంతువుకు మోక్షం రాదు. ఎందుకంటే విచక్షణ, విచారణ, వివేకము, సాధన, అష్టాంగయోగము, సమాధి, సమాధిలో ఉన్నటువంటి తన చైతన్యాన్ని గ్రహించగలిగినటువంటి ఈ పరిణామ సిద్ధాంతం ద్వారా వచ్చిన చైతన్య వికాసము ఆ జంతువు స్థాయికి పూర్తికాలేదు. అది సరిపోదు. మానవ దేహం వచ్చాకే, ఆ చైతన్యవికాసం పూర్తి అయ్యింది. బుద్ధి జీవి అయ్యాడు. ఆ బుద్ధిలో వివేకము, విచారణ, విచక్షణ అన్నీ ఉన్నాయి. దాన్ని వినియోగించుకోకుండా మూర్ఖంగా ఉండే మానవులున్నారు. కేవలము ఆహారము, నిద్ర, భయ, మైథునములతోనే వెళ్ళబుచ్చుకుని పుడుతూ, చస్తూ ఉండే మానవులున్నారు. భోగిస్తూ వ్యసనపరులైనవారున్నారు. కష్టపడి సంపాదించి, తాను అనుభవించక, దాన ధర్మాలు చేయక కూడబెట్టి, వారసులనేవారికి వదిలిపోయేటటువంటి లోభులు ఉన్నారు. చివరకు అవి ఎవరికి చెందుతాయో, ఏమైపోయాయో కూడా ఎవరికీ తెలియని స్థితిలో కష్టపడుతున్నారు. ఇలాగే జరిగిపోతూ ఉంది.

       మానవుడు బుద్ధి జీవిగా ఎప్పుడైతే ఏర్పడ్డాడో, అది ఈ రకంగా చక్రభ్రమణంగా చస్తూ పుట్టడానికి కాదు. దీని యొక్క ఉద్దేశ్యము వేరే ఉన్నది. ఈ చైతన్య వికాసాన్ని పరమశాంతిగా, పరమ ఆనందముగా, నిత్యానందముగా, సహజానందముగా మార్చుకునే అవసరానికి వినియోగించాలి. అది బాహ్య ప్రపంచంలో లేదని తెలిసిపోయింది. అంతర్ముఖంలో నీ స్వరూప జ్ఞానం ద్వారా వస్తుందని తెలిసింది. ఇలా అటునుండి ఇటు త్రిప్పుకోవడమే ఆధ్మాత్మిక దృష్టి. ఆ దృష్టితో శ్రద్ధ కలిగి, భక్తితో సాధన చేయాలి. ఇది అందరికీ సమానము.

       నవద్వార పురమైనటువంటి ఈ శరీరమునకే లింగ భేదము కానీ, ఈ పురమందు నివశించే పురుషుడు అని పిలువబడేటటువంటి వానికి, జాతి కులము, మతము, స్త్రీ పురుష భేదము ఏవీ లేవు. అందరూ యోగ్యులే. చేసుకోవటం చేతైతే, అందరికీ ఆ సాధన చేసి, గమ్యం చేరడానికి ఏ అభ్యంతరమూ లేదు. అభ్యంతరం చెప్పారు అనేది పాత రోజుల్లో. మళయాళ స్వామిగాని, ఇంకొకరు గానీ, అన్నీ ఖండిస్తూనే ఉన్నారు. వివక్ష లేదని, ప్రమాణం కూడా చూపిస్తున్నారు.

       వేదాంతమనగా జ్ఞానము, ఆత్మజ్ఞానము, తనను తాను తెలుసుకొనుట అనెడి తత్త్వజ్ఞానము. ప్రపంచ జ్ఞానము కాదు. శాస్త్రజ్ఞులు చాలా వస్తువులు కనిపెట్టినట్టి జ్ఞానము కాదు. చాలా లోతైనటువంటి పదార్థ తత్త్వమును తెలుసుకున్నట్టి వారు కూడా, బాహ్యప్రపంచంలో జ్ఞానులు అనబడుతున్నారు. కాని ఏది తెలుసుకున్నవాడు, అతడు దానియొక్క వేత్త. శాస్త్రము తెలుసుకున్నవాడు శాస్త్రవేత్త. బ్రహ్మమును తెలుసుకున్నవాడు బ్రహ్మవేత్త. కనుక జ్ఞానం అనేది బహిర్ముఖ జ్ఞానం కాకుండా, నేనెవరు అనే దానియొక్క జవాబుద్వారా, ఆ జవాబుకు తగినటువంటిదిగా వచ్చినదే జ్ఞానం. ఊరికే తెలిస్తే పాండిత్యము. అనుభవంగా వస్తే జ్ఞానము. తనను తాను తెలుసుకొనుటలో ఫలించేదే జ్ఞానము. ఇది మానవునికి తప్పని సరి.

       ప్రతి మానవుడు చెప్పినమాట వింటాడో, వినడో, శిష్యరికం చేస్తాడో, చేయడో, భక్తి మార్గంలో ఇంకా ఉండి, జ్ఞానమార్గానికి తిరగలేదో, ఎవర్నీ ఏమీ అనదు శాస్త్రము. గురువులు అవతార పురుషుల కూడా అనరు. ఊరికే నిజాన్ని, సత్యాన్ని లాలింపుగా, బుజ్జగింపుగా చెప్పి, అవసరమైతే హెచ్చరిస్తూ, స్వర్గ నరకాలున్నాయని చెబుతూ, పునర్జన్మ సిద్ధాంతాన్ని చెబతూ, ఒక్కొక్కప్పుడు భయపెడుతూ, నిన్ను దారికి తీసకు వచ్చే ప్రయత్నం చేస్తారు తప్ప, బలవంతంగా ఎవరూ సాధన చేయించరు నీ చేత. చేసే వాళ్ళకు మాత్రము సహాయం చేస్తారు. బాహ్యంగా చేస్తారు, ఆంతరంగికంగా చేస్తారు. కారణం ఏమిటంటే, ఈ బుద్ధిని ప్రాపంచిక విషయాలనుండి మరల్చి, ద్వంద్వాతీత స్థితిలో, చంచల బుద్ధిని స్థిరబుద్ధిగా మార్చినప్పుడు ఆ స్థిరబుద్ధి రూపమే ప్రజ్ఞ. విషయములను నిర్ణయించకుండా స్థిరమై, స్థిర రూపంలో ఉండిపోవడమే, అటువంటి బుద్ధిరూపమే ప్రజ్ఞ. ఆ ప్రజ్ఞానమే బ్రహ్మ. ఇది వైరాగ్యం చేత, వివేకం చేత, సాధన చేత, శ్రద్ధ చేత, భక్తి చేత, ఎవరైతే గురువుకి నాలుగు విధముల శుశ్రూషలు చేస్తారో, వీటన్నింటికి వారికి స్వాతంత్య్రం ఉంది. ఆ స్వాతంత్య్రాన్ని ఈ రకంగా ఉపయోగించుకుంటే తప్ప, అతనికి ఆత్మజ్ఞానం రాదు. ఒకరు చెబితే రాదు, బలవంతం చేస్తే రాదు. ఈ వివేకాన్ని స్వతంత్రంగా ఆధ్యాత్మిక మార్గంలో ఉపయోగించుకున్నవాడికి తప్పక వస్తుంది.

       ఎంత తెలివి ఉన్నా, ఎంత వివేకం ఉన్నా ఆధ్యాత్మిక దృష్టి లేకుండా, ప్రాపంచిక దృష్టితో చూస్తే, ఆ ప్రకృతే అతనికి గుణపాఠం చెబితే, కొట్టబడ్డటువంటి వాడు, ఆత్మహత్యా సదృశమైనటువంటి, నిరాశా నైరాశ్యములతో ఉన్నటువంటి వాడు, అప్పుడు ఎవరో పెద్దలు ఇచ్చిన సలహాను అనుసరించి, ఈ మార్గాన్ని తెలుసుకుందాము అనేదానికి ఉపక్రమిస్తాడు. ఈ ప్రకృతే గుణపాఠం చెప్పి, తన వైపుకు లాక్కుంటుంది ఏమీ ఫర్వాలేదని, అలా సహజంగానే పరిణామం చెంది, సాధన చేసుకోవాలి అని ఉపేక్షించరాదు. ఇవాళ ముస్లింస్‌లో నమాజు చేయాలి ఐదు సార్లు, రంజాను ఉపవాసం చేయాలి, అందర్నీ ప్రేమగా చూడాలి, రంజాను రోజున అందరిని కౌగిలించుకుని, అందరికీ మేలుకలగాలని, అల్లాను ప్రార్థించేవారు, తీవ్రవాదంతో ఎందుకు బలవంతం చేస్తారు? వాళ్ళ ఖురాన్‌లో బ్రహ్మజ్ఞానం లేదు. సూఫీ మతంలో ఉంది కానీ, ఖురాన్‌లో బ్రహ్మజ్ఞానం లేదు. దేవుడున్నాడు, దేవుడు ఒక్కడే సర్వోన్నతుడు. వాడిని నమ్మండి, విశ్వసించండి, భక్తితో నమాజు చేయండి, ప్రార్థనలు చేయండి, ధ్యానం చేయండి, మనం కూడా ధ్యానం ఎందుకు చేస్తున్నాము? మనము ప్రార్థనలు చేస్తున్నాము, వాళ్ళు కూడా చేస్తున్నారు. అక్కడికి అది అంతే ఉంది కాని, వస్తు నిర్ణయంగా, మోక్షంగా నీకు అది లభించే అవకాశం ఉందని, ఖురాన్‌ ఎక్కడా చెప్పలేదు. బైబిల్‌ మాత్రం చెప్పింది. అందుకే బైబిలుకు వ్యాఖ్యానం వ్రాసాం. బైబిల్‌ను క్రీస్తు ఏసుగా ప్రకటితంఅనే గ్రంథ రూపంలో అందించడం జరిగింది. ఖురాన్‌లో ఆ ప్రయత్నం చేద్దామని చూశాం. అదేమీ లేనందున వదిలేశాం. అలా బలవంతంగా వచ్చేది బ్రహ్మజ్ఞానం కాదు. స్వతంత్రంగా తెచ్చుకునేదే బ్రహ్మజ్ఞానం. ఎందుకంటే చివరకు నీవు సర్వ స్వతంత్రమైన బ్రహ్మ స్వరూపమును అందిపుచ్చుకోవాలి.

       ఆత్మయే సర్వ స్వతంత్రం. మనస్సే బంధము. మనస్సును అధిగమించాలి అంటే ముందు మనస్సే ఒప్పుకోవాలి. మనస్సు ఒప్పుకోవాలి అంటే, దానికి అనేక తర్కవితర్కాలతోటి, మంచి చెడులతోటి, దీర్ఘకాలికమైన ఆనందం కోసం, తాత్కలికమైన ఆనందాన్ని వదులుకోవాలి అని చెప్పినప్పుడు మనస్సు వింటుంది. దీర్ఘకాలిక అనందం లేనే లేదు. మోక్షం లేనే లేదు. కేవలం భగవంతుని కృపే ఉంది. ఆయన కాళ్ళు పట్టుకోండి, ధ్యానం చేయండి, నమాజు చేయండి అని, అక్కడితో ఆపితే, మనం అక్కడి వరకే వెళ్ళేది. ప్రాపంచిక సుఖాలనుంచి బయటపడలేనట్లుగా, ప్రాపంచిక సుఖాలకు మరిగినటువంటి మనస్సు, ఒక ప్రక్కనుండి ప్రార్థన చేస్తుంది, ఒక ప్రక్క భక్తి ఉంటుంది. ఒక ప్రక్క దేవుణ్ణి కూడా కోరికలు తీరడానికి అడుగుతుంది. ప్రాపంచికంగానే, లౌకికంగానే, అజ్ఞానంలోనే ఉంటూ జనన మరణ చక్రంలోనే తిరుతుంది అది. బలవంతం చేసినా, ఏమైనా మోక్షం వచ్చిందా? అందుకని ఆ స్వేచ్ఛ మనకు ఉంది. అయితే దానిని బ్రహ్మ జ్ఞాన సముపార్జనకు ఉపయోగించాలి.

       కర్మసిద్ధాంతంతో ఆ చక్రభ్రమణంలో ఇరుక్కు పోయినప్పుడు, నీకు ఎక్కడిదీ స్వేచ్ఛ? పసువులకైతే ఆ స్వేచ్ఛ లేదు. కర్మ-వాసన ప్రకారంగా, కర్మ-పునర్జన్మ సిద్ధాంతంగా, పాతకర్మే ప్రారబ్ధంగా వచ్చినప్పుడు, ప్రారబ్ద కర్మలోనే అజ్ఞానం చేత మళ్ళీ ఆగామి సృష్టించుకుంటూ ఉన్నప్పడు, ఎందుకు తిరుగుతున్నాను అనే ఒక ఆలోచన లేనప్పుడు వానికి స్వాతంత్య్రము లేనట్లే. వానిని కర్మే నడుపుతోంది. కానీ, వారి బుద్ధికి స్వాతంత్య్రం ఉంది. వాసనా క్షయం చేసుకోవచ్చు, వైరాగ్యాన్ని పెంపొందింప జేసుకోవచ్చు. సాధన చేసుకోవచ్చు. వివేకాన్ని ఉపయోగించి, పరమాత్మ తత్త్వాన్ని తెలుసుకోవచ్చు. ఇన్ని అవకాశాలు మానవుడికి ఉన్నాయి.

       కర్మచేత కట్టబడిన వాడైనప్పటికి, కొంత స్వేచ్ఛ ఉంది. ఈ స్వేచ్ఛను మరింత పెంచుకోవాలి. ఏ కర్మ అయితే తనను బంధిస్తుందో, ఆ కర్మనుండి విముక్తికి ప్రయత్నం చేయాలి. ఒక పశువును ఒక కట్టుకొయ్యకు వేసి కడితే, యాభై అడుగుల తాడేసి కట్టామనుకో, యాభై అడుగుల వ్యాసార్థంలో ఉన్నటువంటి ఏరియాలో, అంటే వంద అడుగులు వ్యాసం ఉన్న ఏరియాలో వృత్తాకారంలో అది స్వేచ్ఛగా తిరుగగలుగుతుంది. అక్కడున్న పచ్చగడ్డి మేయగలదు. దాని అవతలకు అది పోలేదు. పూర్తిగా కట్టుకొయ్యను మెడకేసి, తాడుతో కడితే, దానికి స్వేచ్ఛ లేదు.

       ఇక్కడ ఆధ్మాత్మిక స్వేచ్ఛ అన్నప్పుడు, పశువుకు లేదు. ఈ పశువుకు కట్టే తాడునే పాశము అంటాము. కట్టబడడము ఈ తాడుచేత కాబట్టి బంధము అంటాము. ఈ బంధాన్ని విడిపించేవాడు, ఆ పశువును ఆడించేవాడు పశుపతి. పశుత్వం ఉన్నవాళ్ళను ఆడిస్తాడు. పశుత్వం నుండి బయటపడే ప్రయత్నం చేస్తే, సహాయం చేస్తాడు పశుపతి. ఆ పశుపతే శివుడు. శివుడే మనకు లక్ష్యము, గమ్యము.   

       కనుక ఒక్క మాట ఇక్కడ తెలుసుకోవాలి. నీకు స్వతంత్రం ఉంది కదా అని, పొద్దున ఏడుగంటలకు నిద్ర లేవచ్చు ఎవరొద్దన్నారు? ఐదు గంటలకు లేస్తే మంచిది, మూడున్నర గంటలకు లేచి ప్రార్థన చేసుకుంటే మరీ మంచిది. ఏమి చేసినా నీ మంచి కొరకే అని చెప్పాం. చెప్పడం నా ధర్మం, వినకపోతే నీ ఖర్మంఅని కృష్ణ పరమాత్మ చెప్పాడు ఏదో సినిమాలో.  చెప్పడం నా ధర్మం, వినకపోతే నీ ఖర్మం. ఇట్లా ఖర్మానికి ఎందుకు వదలాలండీ? ఖర్మానికి వదిలితే ఎట్లా?

       సాధనలో చాలామంది ఉన్నారు. చాలామంది సాధనలు చేయిస్తున్నారు. ఆ పరమాత్మ, ఆ గురుతత్వం చేయిస్తోంది. లేకపోతే ఇంతమంది మహాపురుషులు అనేక రకాలైన మార్గాలు, లక్ష్యం దగ్గరకు కొంత దూరము వరకు సాధన చేసేవారు, చేయించేవారు కోకొల్లలుగా ఉన్నారు. అలాగే కోరికలతో అయినప్పటికీ కూడా భగవంతుడి దగ్గరకి వెళ్ళేటటువంటి భక్తులు, దేవాలయాలకి, పుణ్యక్షేత్రాలకు అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్ళి, చనిపోయేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. వాళ్ళకు ఎంత భక్తో మెచ్చుకోవాల్సిందే. అమర్‌నాథ్‌ యాత్రలో చనిపోతున్నారు అని తెలిసికూడా మరలా కొత్తబృందం బయలుదేరుతోంది.

       ఆ కట్టుకొయ్యకున్న యాభై అడుగుల వ్యాసార్థం ఎలా వుందో, మానవుడు సాధనచేసి, విచారణ చేసి, తనను తాను ఎఱిగేటటువంటి పరమాత్మ తత్త్వాన్ని అనుసంధానం చేయడానికి, దానికి ఆటంకముగా ఉన్నటువంటి మిథ్యాజగత్తును విచారణ చేసి, వైరాగ్యంతో విడిచిపెట్టడానికి ఆ మాత్రం స్వాతంత్య్రం అతనికి ఉంది. అది సద్వినియోగం చేసుకునే స్వాతంత్య్రం ఉందని తెలిసి, వినియోగించుకోవాలి. ఎవరు వినియోగించుకుంటారు? గురువాక్యం మీద శ్రద్ధ, భక్తి ఉండి, సాధన చతుష్టయ సంపత్తి ఉండి, తీవ్ర మోక్షేచ్ఛ ఉండి, ఆధ్యాత్మిక దృష్టితో శ్రద్ధ కలిగి, ఈ ప్రపంచంలో అనేక యోగాభ్యాస పద్ధతులను, ఎవరికి ఎలా అనువుగా ఉంటుందో, పూర్వజన్మ సంస్కారం చేత, ఈ సాధనలకు అలవాటు పడి ఉంటారో, దాని ప్రకారం దానిచే ఆకర్షింపబడి, సులభంగా ఆ సాధనలు చేయగలుగుతారో, అటువంటి సాధనలు చేసుకుంటూ, చిట్టచివరికి స్వరూపాన్ని తెలుసుకుని, స్వరూప జ్ఞానంలో నిష్ఠ చెందడానికి, అన్ని రకాల ప్రయత్నాలు మనం చేయాలి. ఆ స్వేచ్ఛ మనకు తప్పకుండా ఉంది. భగవంతుడు మానవుని బుద్ధి జీవిగా పుట్టించి, ఒక పక్క బుద్ధి కర్మానుసారిణి అనేటటువంటి బంధము మనకు పెట్టినప్పటికీ, కొంత స్వేచ్ఛకూడా ఇచ్చాడు. దాన్ని వినియోగంచుకుంటే మనము ముక్తి పొందగలము.

       ఈ వేదాంతమనేటువంటిది సర్వ మానవులకు అవసరమే. మానవులకు అవసరమే కాదు తప్పనిసరి. ఇక్కడ ఆప్షన్‌ లేదు. మానవునకిది తప్పనిసరి. తానేదైయున్నాడో అది తెలుసుకోకుండా, తాను కానివన్నీ తానుగా ఉండటమనేటువంటిది, ఎప్పటికైనా సరే తాను కాని దాన్ని, కానిదిగా నిర్ణయించుకొని, తాను తానైనటువంటి తత్వము తెలుసుకొని, ఆ తత్వరూపుడవ్వాల్సినటువంటి అవసరము ప్రతి ఒక్కరికీ ఉంది. ప్రతి మానవుడికీ ఉంది. ప్రతి మానవునికీ ఉంది అనటంలో అర్థం ఏమిటంటే ఇది ఒక సంప్రదాయానికే ఉంది, ఒక కులానికే ఉంది, ఒక జాతికే ఉంది, స్త్రీలకు లేదు పురుషులకే ఉంది, అనేటటువంటిది ఎప్పుడుకూడా ఈ వేదాలలో గాని, వేద ప్రమాణాలలో గాని లేవు. అపార్థాలు, పెడర్థాలు తీసి చెప్తే అది వేరే సంగతి. బ్రాహ్మణుడు అంటే బ్రహ్మజ్ఞానము ఉన్నవాడని, శూద్రుడు అంటే సంసార దుఃఖానికి, వేదనకు గురవుతూ, దాంట్లోనే పడి కొట్టుకుంటూ ఉండేవాడని అర్థము. అటువంటివాడు కూడా రక్షింపబడాలి. కాని అతను సానుకూలంగా ఉండి, విని, నేర్చుకొనేటువంటి శ్రద్ధతో కూడినటువంటి బుద్ధి అతనికి ఉండకపోతే, గురువు దగ్గర శుశ్రూషలు చేసి నేర్చుకోవాలనేటువంటి వినయము లేకపోతే, అంత అవగాహన చేసుకునే తెలివి లేకపోయినా, గురుభక్తి లేకపోయినా చెప్పడానికి కుదరదు. ఇవన్నీ లేనివాడు ఏ మానవుడైనా సరే శూద్రుడి క్రింద లెక్కే. శ్రద్ధ, సబూరి అంటారు. శ్రద్ధావాన్‌ లభతే జ్ఞానంఅంటారు. ఇది ప్రతి మానవుడికీ కూడా అవసరమయి ఉన్నది. తప్పనిసరి అయి వున్నది. తదనుగుణంగా సాధనా ప్రయత్నము, ఆచరణ చెయ్యటమనేటువంటిది మానవుని యొక్క ఇష్టాఇష్టాలమీద ఆధారపడి ఉంది. ఆ మాత్రం స్వేచ్ఛ మానవునికి ఇవ్వబడింది.

       దీనిని అర్థం చేసుకోకుండా ముసలివారయ్యారనో, ఉద్యోగం నుండి విశ్రాంతి తీసుకున్నాకో, వ్యాపారము ఆపేసాకో దీంట్లో నేను దిగుతానండీ, ఇప్పుడు సమయం లేదు అంటారు. ఎన్నో జన్మలెత్తాము. అన్ని జన్మలలో సమయం కుదరలేదు. ఇంకెప్పుడు కుదురుతుంది? చేసుకున్నవారికి చేసుకున్నంత. ప్రారబ్ద కర్మ ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది. సముద్రంలో అలలు ఉన్నాయి కదా అని, సముద్ర స్నానము మానివేసినట్లుగా కష్టాలు, సమస్యలు ఉన్నాయని వేదాంత బోధ దగ్గరకు రాను అంటే అది మూర్ఖత్వం అవుతుంది.

       శృతులు అంటే శ్రోత్రేంద్రియము ద్వారా, శబ్ద ప్రమాణముగా వినబడిన వాటిని శృతులు అంటారు. ఆ వినబడినవన్నీ కూడా విద్‌ అంటారు. విద్‌నుండి వచ్చినది వేదము. కనుక తెలియబడేటువంటివన్నీ కూడా వేదాలు. ఏం తెలుసుకోవాలి? ఏది తెలుసుకుంటే సర్వమూ తెలుసుకున్నట్లవుతుందో, ఏ ఒక్కటి తెలుసుకుంటే మిగతావి తెలుసుకోనవసరము ఉండదో, దాన్ని విడమరచి చెప్పి సర్వమూ తెలుసుకున్నట్లయ్యేటటువంటి తెలివిని, జ్ఞానాన్ని తెలియజేసేది వేదము. వేదాంతమటే ఏమిటి? తెలుసుకుని ఉపయోగమేమిటి? ఈ చదువుకున్నది, ఈ తెలుసుకున్నది, విన్నది అంతా వస్తు నిర్ణయంగా అవ్వాలి. అన్యముతో కూడిన తాదాత్మ్యత నుండి విడివడాలి. దానికి కారణముగా ఉన్న అవిద్యనుండి విడివడాలి. నీవు నీవైన తత్వము తెలిసిన తరువాత ఆ తత్వంతో అనుసంధానం చేసి దానికి అడ్డుగా ఉన్నటువంటి త్రిగుణాలను రహితపరచుకోవాలి. బహిర్ముఖంలో ఉన్న విషయ వాసనలను క్షయం చేసుకోవాలి. రజోగుణముతో కూడిన అంతఃకరణ వృత్తులను నశింపచేసుకోవాలి. ఇవి చేస్తే, ఆ తత్వానుసంధానము పూర్తయితే బ్రహ్మము తప్ప అన్యము లేదు అనేటువంటిది అది నీవే అయి ఉంటావు. నీవు తప్ప అన్యము లేదు. నీవు నీవైనటువంటి తత్వంలో ఉంటే, అది నీ స్వరూపం, బ్రహ్మ తప్ప రెండవది లేదు అనేటువంటిది సిద్ధాంతం.

       అది బ్రహ్మ నిర్ణయమయినా, నీవే ఆ బ్రహ్మ కనుక అది నీ నిర్ణయము. అది నిర్ణయమే గానీ, స్వానుభవం కాలేదు కాబట్టి తత్వానుసంధానం చెయ్యాలి. అలా చెప్పేవన్నీ శృతులు. వేదములు, వేదాంతము, శృతులు అంటే ఏమిటి మళ్ళీ? ఋషివర్యులు వారి స్వానుభవముతో తపస్సులో వెల్లడించిన ఉపనిషత్తులు గాని, వేద వాణిద్వారా, శబ్ద ప్రమాణముతో అందించబడినటువంటి శృతులు ఎవరూ చెప్పినవి కాదు గాబట్టి అపౌరుషేయములు. ఒక పురుషుని యొక్క అభిప్రాయముగా పురుషుడు చెప్పబడినట్లుగా రాలేదు కనుక అది అపౌరుషేయము. అందుకే ఈ వేదాలు సనాతనము. పూర్వముకంటే పూర్వము కంటే పూర్వమే ఉన్నాయి అని, మధ్యలో మరుగునపడ్డా, తెలుసుకునేవాడు ఉండీ గురుశిష్య పరంపరగా దానిని అందించక పోయినప్పటికీ తపస్సు చేసుకున్న వాళ్ళకు నేరుగా వాళ్ళకే వినిపించబడేవి, అపౌరుషేయాలు శృతులు. అటువంటి వాళ్ళు ఆచరించి సమాజానికి బాగా అర్థమయ్యే రీతిగా, ఏ ఉపాయముతో, ఏ యుక్తితో చెపితే అర్థమవుతుందో, ఆ పద్ధతిగా చెప్పేటువంటి ఋషి సాంప్రదాయంలో ఋషులచేత చెప్పబడినవన్నీ కూడా స్మృతులు. అంటే శృతులని నీయందు చేర్చుకొని స్మృతి రూపంలో అట్టిపెట్టుకొని ఆ స్మృతి రూపం నుండీ గురు స్ఫూర్తితో, తిరిగి శిష్య పరంపరకి, ఆ వచ్చింది వచ్చినట్లుగా అందించటం అనేది స్మృతి. స్మృతి అంటే తెలుసుకున్నదంతా దాగి ఉండటము. ఆ గుర్తు మళ్ళీ జ్ఞాపకమయినప్పుడు, అది ప్రకటమవుతుంది.

       గురువుయందు స్మృతి రూపంలో వేదాలున్నాయి. తిరిగి శిష్య పరంపరకు అది వ్యక్తం చేస్తూ ఉంటారు. నీవు తెలుసుకున్న దానిని, జ్ఞాపకం పెట్టుకున్న దానిని తరువాత వ్యవహారములో దానిని మర్చిపోయినప్పటికీ అది స్మృతి రూపంలో ఉంటుంది. వ్యక్తియందు అది ప్రకటితమవుతూ ఉంటుంది. అలా వచ్చినదే కృష్ణపరమాత్మ రూపంనుండీ వచ్చినటువంటి భగవద్గీత స్మృతి. ఉపనిషత్తులేమో శృతులు. భగవద్గీతేమో స్మృతి. బ్రహ్మ సూత్రాలు అది కూడా స్మృతే. ఉపనిషత్తులను క్రోడీకరించి, అన్ని రకాలుగా తర్క వితర్కాలుగా సూత్రీకరించబడినాయి కాబట్టి అవి కూడా స్మృతుల క్రిందే వస్తాయి. కాబట్టి వేద ప్రమాణాలను, శృతులను ఉన్నదున్నట్లుగా సూత్రీకరించి చెప్పి, పూర్వ మీమాంస ఉత్తర మీమాంస, పూర్వపక్షము ఉత్తర పక్షము క్రింద సగుణంలో బ్రహ్మ సర్వాధారంగా, సర్వ కారణముగా ఉన్నదానిని, బ్రహ్మని సృష్టినుండీ వేరుపరచి, నిర్గుణ బ్రహ్మని శాశ్వత నిర్గుణ బ్రహ్మగా, నిర్ణయించేవన్నీ కూడా బ్రహ్మ సూత్రాలు. కనుక దీంట్లో కొంత ఎక్సర్‌సైజ్‌ ఉంది. స్మృతులు చాలా ఉన్నాయి. అనేక ఋషులు దాన్ని వేద ప్రమాణాన్ని  ఆ కాలంలో నాగరికతకు, వారి జీవన వ్యహారానికి తగ్గట్టుగా, కొన్ని మార్పు చేర్పులు చేసి చెప్పింది. కనుక ఋషి సంప్రదాయము ఋషి ద్వారా శృతుల ప్రమాణాన్ని దేశ కాల పరిస్థితులకు అనుగుణంగా కొద్ది మార్పులతో చెప్పి అందించేది స్మృతి. ఇవి పౌరుషేయాలే. ఋషిప్రోక్తం. ఋషి ప్రోక్తం అంటే ఋషుల  ద్వారా చెప్పబడినవి. ఋషుల ద్వారా చెప్పబడినవన్నీ స్మృతులు.

       ఈ శృతి, స్మృతులయందు ఎవరికైతే విశ్వాసముంటుందో వారికి ఆత్మజ్ఞానమే నూటికి నూరుపాళ్ళు ఫుల్‌టైం చేయవలసినది. ఆత్మజ్ఞానం కోసమే ఫుల్‌టైమ్‌ ప్రయత్నం చెయ్యాలి. తెలియనివాడు ఎటూ చేయట్లేదు. తెలిసినవాడు ఇక ఆలస్యం చేయకూడదు. భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు, ఈ మూడూ కలిసి ప్రస్థానత్రయం అంటారు. స్థానము అంటే మోక్షము. ప్రస్థానము అంటే తిరిగిరాని మోక్షధామము’. ఆ తిరిగిరాని మోక్షధామము ఏదయితే ఉన్నదో, అది ప్రస్థానము. ఆ ప్రస్థానమునకు తీసుకువెళ్ళేవి ఈ మూడు. ఈ మూడూ కూడా దానికే కేటాయించబడి ఉన్నాయి. పురాణాలు అంతవరకు కాదు. ధర్మార్థ, కామ మోక్షాలలో ధర్మార్థముల వరకు మోక్షాన్ని ప్రతిపాదించడము వరకే పురాణాలు, భారతము, ఇవన్నీ ఉన్నాయి. ఈ మూడు మాత్రం భగవద్గీత, ఉపనిషత్తులు, బ్రహ్మ సూత్రాలు, మోక్షాన్ని లక్ష్యంగా పెట్టి చెప్పబడినవి. అందుకని ఈ మూడింటిని ప్రస్థానత్రయం అంటారు. వీటిమీద విశ్వాసము ఉన్నవారికి మాత్రమే గురుశిష్య న్యాయంగా మాత్రమే అది అందించటానికి అవకాశం వుంది. అంతర్ముఖ ప్రయాణములో ఎవరికైనా అనుభవం వస్తే కాని తెలియదు. కాని తెలిస్తే కాని ప్రయాణము జరగదు.

       ఒక తెలిసినవాడు మార్గదర్శిగా ఉండాలి అంటే అది గురువే. కనుక ముందేమో శృతి, స్మృతులమీద విశ్వాసముండాలి. తరువాత ఒక గురువు ద్వారా బోధ ప్రబోధ పద్ధతిలో తెలుసుకోవాలి. జ్ఞాతుం, ద్రష్ట్రుం ప్రవేష్టుం పద్ధతిలో తెలుసుకోవాలి. చివరికి గురువు యొక్క సహాయంతోటి, గురు కృపతోటి, అధిగచ్ఛతి. అన్నిటినీ కూడా అంది, పొంది, మీరి, చివరికి ఏదైతే పూర్తిగా మీరినటువంటి స్థితిలో సాక్షాత్కరము ఉన్నదో అదీ లక్ష్యము, గమ్యము. దీనికింత అవసరమున్నది. ఆషామాషీగా దారినపోయే వారందరికీ చెప్తే అది అబ్బదు. అందుకే దీనికేం చెప్పారు? ఈ బ్రహ్మ విద్యకు ఒక అధికారి కావాలి. సాధన చతుష్టయ సంపత్తి ఉండాలి. వివేక చూడామణిలో అయితే ఇంకా, ఊహా అపోహలతో చెప్పినదానిని పెంచుకోవాలని ఉంది. ఒక నూనె చుక్క ఒక పాత్రలోని నీళ్ళమీద వేస్తే ఆ చుక్క నూనె పాత్ర ఎంత విశాలంగా ఉందో, అంతటా ఎలా వ్యాపిస్తుందో, గురువు ద్వారా తాను విన్నదీ గ్రహించిందీ ఆ శిష్యుడు మనన నిది ధ్యాసతోటి విన్నది విన్నట్లుగా తిరిగి మళ్ళీ చెప్పగలిగే సామర్ధ్యం పొంది మరొక పదిమందికి కనుక అతను చెప్పగలిగితే, వాడు తైలపాక శిష్యుడు. ఆ రకంగా ఇంత కష్టసాధ్యంగా ఉన్నది కాబట్టి నీకు తప్పకుండా గురువు యొక్క సహాయం కావాలి. ఈ శృతి - స్మృతులయందు విశ్వాసముండి కృషి చేద్దామనేటువంటి తపన కలిగి దానిని ప్రారంభం చేస్తే అది శుభేచ్ఛ. గురువుయొక్క పర్యవేక్షణలో దానిని విచారణ చేస్తే అది రెండవ జ్ఞానభూమిక. తనుమానసి - ఇది మూడవ జ్ఞాన భూమిక. ఆత్మా-అనాత్మ వివేకముతోటి, శరీరములు అనేటువంటివి అనిత్యములని తెలిసి వాటిని నిలబెట్టే వాటికాధారమైనవి ఉన్నా లేకపోయినా నీయందే ఉండి శాశ్వతముగా ఏదైతే ఉన్నదో దానిని పట్టుకొన్నప్పుడు అట్టి జ్ఞానము మూడవ భూమిక. ఆ విధంగా జ్ఞాన భూమికలలో ప్రవేశించాలి అంటే శుభేచ్ఛ కావాలి ముందు. ఆ శుభేచ్ఛ కావాలంటే శృతి - స్మృతులయందు విశ్వాసము ఉండాలి. సత్యమే చెపుతున్నాము. ప్రతి మానవుడికీ ఇది అత్యవసరము. ఇది తప్పనిసరి అని. ఎందుకంటే నీవు, నీవైన సంగతి నీకు తెలియాలి. ఆత్మ జ్ఞానము అంటే సెల్ఫ్‌ జ్ఞానము. సెల్ఫ్‌ జ్ఞానమంటే తనను తాను తెలుసుకొనుట అనే తత్వ జ్ఞానము. నిన్ను నువ్వు తెలుసుకోకుండా, నీ పేరు, నీ ఊరు, నీ అడ్రసు, నీ స్వరూపము, నీ స్వభావము, నీయొక్క సుఖ స్వరూపాన్ని నువ్వు తెలుసుకోకుండా భ్రాంతిలో అన్య స్వరూపాలు నేననుకొని, జనన మరణ భ్రాంతిలో ఉండి సంసారంలో ఉంటూ అనేక దుఃఖాలు, బాధలు, ఎందుకనుభవించాలి? ఎంతకాలము అనుభవించాలి? నువ్వు కానిది నువ్వే అయినట్లున్నా అది సుఖంగా ఉంటే ఊహాలోకంలో, స్వప్న లోకంలో విహరించవచ్చు. ఆ కల పీడకల అయినపుడు భయం వచ్చినప్పుడు, ఆత్మలో మేల్కొని, భయాన్ని పోగొట్టుకోవాలి గదా! కలలో ఉన్న భయం మేలుకొంటే పోతుంది గదా! కలలో ఉన్నటువంటి బంధము, సంస్కారము, ఆత్మలో మేల్కొంటే పోతుంది కదా!

       సరే! ప్రారంబిద్దాము. ఎక్కడనుండి ప్రారంభించాలి? అందరూ నేను, నేను అంటున్నారు. ఆ నేను దగ్గర ప్రారంబిద్దాం. ఈ నేను లు ఎన్నున్నాయి? రెండు నేను లు అంటున్నారు. నిజానికి ఒక్క నేనేఉంది. దారి తప్పిన నేను ని రెండవ నేనుగా చెపుతున్నాము. దారిలో ఉన్న నేను యదార్థ నేను, అది ఎప్పుడూ ఉంటుంది. ఒక నేను అసత్య నేనుఒక నేను యథార్థ నేను’. శుద్ధోహం - మిథ్యాహం.

అహంకారము

       దీనినే దేహాత్మ అంటారు. కారం వచ్చి చేరితే దాన్ని అహంకారం అంటారు. అహం స్ఫురణకీ, అహం భావానికి, అహంకారానికి ఏమిటి తేడా? ‘కారముఅంటే వ్యవహారములో కర్త, కర్మ, క్రియలో కర్మగా చేస్తూ కర్మ ఫలితాన్ని అనుభవించేది అహంకారము. అహంభావన అంటే నేను అనేటువంటి ఒక భావన. అహంభావన అంటే గర్వం కాదు. వాడికి అహంభావన ఎక్కువండీ అంటారు. అంటే వారికి గర్వం ఎక్కువని. ఇక్కడ ఆ అర్థంలో చెప్పడము లేదు. వీడికి అహంకారము ఎక్కువ అన్నప్పుడు కూడా గర్వమనే మాటే వాడుతున్నాము. గర్వమనేది వేరే ఉంది. దంభము, దర్పము, గర్వము ఇట్లాంటివి వేరే పదాలున్నాయి. ఇక్కడ అహంకారము అంటే విషయాలతో వ్యవహరిస్తున్నటువంటి నేనుఅహంకారము. అహంభావము అంటే నేనుఅనేటువంటి ఒక భావన. అహం తత్వము అంటే అహానికి తత్వం లేదు. ఒకవేళ ఉంటే జీవుడు రాకముందు మహదహంకారములో ఉంది. అది అహంతత్వం. ఇప్పటి జీవుడియొక్క అహము మొదట తత్వ రూపంలో మహదహంకారంలో ఉన్నది. కనుక ఈ అహం అనేటువంటిది కేవలం ఉపాధిలో ఉన్న ఉనికి. అహంభావం అంటే ఆ ఉనికి తెలియబడినటువంటి బుద్ధి. అహం స్ఫురణఅంటే బుద్ధికతీతంగా ఉన్నటువంటి ఒక ఉనికి జ్ఞానము.

       అహంలో ఉన్న చైతన్యంతో ఆత్మ అనేది ఒకటి ఉన్నదనే ‘‘ఉనికి జ్ఞానము’’ ఆ చైతన్యంలో ఏదైతే కలిగిందో, అది సత్‌, చిత్‌ ఆనందం అని పేరుపెట్టాలి. దుఃఖమయముగా ఉన్నదాని నుండి విడుదలయినప్పుడు, కేవల నేనుగా ఉన్నప్పుడు దుఃఖానికి వ్యతిరేకంగా ఆనందమని పేరుపెట్టినపుడు అది సత్‌ చిత్‌ ఆనందము అయింది. అయితే ఇప్పుడు సచ్చిదానందమనేటువంటి నేనేది? దేహాత్మ బుద్ధితో ఉన్న నేనేది? అని రెండూ విచారించాలి. ప్రస్తుతం భ్రాంతిలో ఉన్నాము కాబట్టి రెండు నేనులు ఉన్నాయని ఒప్పుకుందాము. భ్రాంతి విడిచేసరికి ఒక నేను పోతుంది. ఇంకొంచెం భ్రాంతి విడిస్తే అసలు నేనేఉండదు, బ్రహ్మమే ఉంటుంది. ఈ లేని నేనునే బ్రహ్మ జ్ఞానంతో పోలిస్తే రెండు నేనులూ లేనివే. కాబట్టి ఒక నేను మరీ ప్రమాదము, దేహాత్మ బుద్ధిగా ఉన్నది. రెండో నేను అహం అహం అని స్ఫురించేటువంటి నేను. ఈ నేను  ఆ నేనంత ప్రమాదకారి కాదు. మొదటి నేనునే దేహాత్మ అంటారు. ఇది బహిర్ముఖంలో ఉన్న నేను - రెండవది అంతరాత్మ. అంతరాత్మ ఏమిటంటే ఆత్మయొక్క ప్రకాశముచేత అంతఃకరణ ప్రతిబింబముగా వచ్చినటువంటి నేను పేరు అంతరాత్మ. నిర్విషయాలుగా ఉన్నప్పుడు విషయాలపట్ల సంగత్వం లేకుండా విలక్షణంగా ఉన్న ‘‘నేను’’ పేరు అంతరాత్మ’. దీనినే ప్రత్యగాత్మ అని కూడా అంటారు. ఇది లోపలగల నేను. ఈ రెండింటికీ బేధము తెలియనివారు దేహాత్మే నేను అంటున్నారు. దేహమే నేను అనేది దేహాత్మ భావన. జీవుడే నేను అనేది జీవాత్మ భావన. వాటికి విలక్షణంగా, సాక్షీభూతంగా, అసంగంగా ఉన్న నేను ప్రత్యగాత్మ.

       అన్ని విషయాలలోనూ వ్యాపిస్తూ ప్రతి విషయాన్నీ గ్రహిస్తూ ఒక విషయము తరువాత ఒక విషయానికి అల్లుకుంటూ ఊహించుకుంటూ ఉండేది మనస్సు. అవ్యభిచారిగా ఉండేది ఆత్మ. ఈ ఆత్మని ఎలా పట్టుకున్నాము? పంచీకరణలోని 25 తత్వాలలో 25వ వాడైనటువంటి జ్ఞాత, 24 తత్వాలనుండే వేరైతేనేమో ప్రత్యగాత్మ. 24 తత్వాలతోటి తానెవరో తనకు తెలియకుండా ఆ తత్వాలతోటి తాదాత్మ్యత చెందుతూ వ్యవహరించేవాడు దేహాత్మ భావనతో ఉన్నటువంటి నేను. విడివడిన వాడేమో ప్రత్యగాత్మ. ప్రత్యేకించాము, వేరుచేసి ప్రత్యేకంగా ఉంచాము. కనుక ప్రత్యక్‌ ఆత్మ. ఇది లోపలగల నేను. అదేమో బయటగల నేను. లోపల బయట అన్నాము. ఎందుకంటే ధ్యానంలో అది లోపల అనుభవంలోకి వస్తుంది కదా! ఉపాధినిబట్టి లోపల బయట, బ్రహ్మను బట్టి అయితే లోపల బయటా అనేది లేదు.

       అంతర్‌ బహిశ్చ సర్వత్ర అచలోయం సనాతనః. ఏమీ లేదక్కడ. సనాతనమైనటువంటిది, అచలమైనటువంటిది, పరిపూర్ణమైనటువంటిది, అన్యము కానటువంటిది, అద్వయమైనది, నిర్గుణమైనది, ఉన్నది ఉన్నట్లున్నది. అది అద్వయం గనుక లోపల బయట లేదు. రెండుగా ఉంటే దానికి ఒక హద్దు, బయట ఉంటుంది. మూడు వస్తువులు ఉంటే ఒకదాని లోపల ఒక వస్తువు, బయట మరొక వస్తువు ఉంటుంది. లోపల, బయటా అనేటువంటి విభజన ఉంటే అది అవయవములతో కూడింది. ఈ బ్రహ్మ నిరవయవము; అఖండము, అవిభాజ్యము, నిరవయ పరమాత్మయందు లోపల, బయట అనేటువంటి రెండుగా విభజనగాని, భేదాలుగాని లేవు. ఈ దేహాత్మ నేనుఏదైతే అనుకుంటున్నామో, అది సత్యం కాదు. అది ఆత్మ కాదు. దేహము నేను కు పనిముట్టు. ఈ శరీరము నేనుయొక్క వ్యాపారానికి పనిముట్టు. అసలు నేనుకు వ్యాపారముందో లేదో తరువాత చూద్దాము. మనసుకే వ్యాపారము. నేను’-మనసులను విడగొడితే రెండు నేనులు లేవు. యదార్థ నేను ఒక్కటే మిగులుతుంది. రెండవ నేను మనసవుతుంది. ఈ మనసే అసత్య నేను. కాని నేను, మనసు విడగొట్టుకుంటే అసత్య నేనుండదు. మనసుంటుంది. తరువాత నేనే’మో యదార్థ నేనుగానే ఉంటుంది. ఈ నేననే చైతన్యము, మనస్సులోని సంస్కారముల చేత ఈ శరీరమనే పనిముట్టును వినియోగించుకుంటూ, తన కర్మ ఫలితాన్ని అనుభవిస్తూ ఉంటుంది. అప్పుడిది పనిముట్టు అన్నప్పుడు దేహము వేరు, నేను వేరు. దేహము ఈ నేనుకు పనిముట్టు.

       ప్రపంచంలోని నామరూపాలు, నీకంటే అన్యముగా ఎలా దృశ్యమవుతున్నాయో అప్పుడు దృక్కు వేరు. శరీరమనేటువంటిది దృక్కు కంటే వేరైనది. దృక్కు వేరుగా ఉన్నాడు. దృక్కు తెలుసుకుంటున్నాడు. అంటే ఇంద్రియ గోచరంగా ఊహగా ఒక భావనగా ఏదైనా తెలియబడుతుంది అంటే దృక్కుకంటే దృశ్యము వేరైనప్పుడు ఆ దృశ్యమే తెలియబడుతుంది. దృశ్యము తెలియబడుతున్నప్పుడు దృక్కు కంటే దృశ్యము అన్యము. మరి నీకాలు నీ చెయ్యి నీకు కనబడుతున్నప్పుడు నేనుఅనే దృక్కు కంటే నీ కాలు, చెయ్యి వేరు. వేరు కాబట్టే దృశ్యమానవుతుంది. శరీరం నీకెప్పుడయితే దృశ్యమయిందో, అది నీకంటే వేరు అనేటువంటిది నిర్ణయం. పదార్థము, నామరూపాలు నీకంటే అన్యముగా కనపడేవన్నీ కూడా దృశ్యాలయినప్పుడు అది ఎట్లా చూస్తున్నావో నీ దేహాన్ని కూడా అట్లాగే చూస్తున్నప్పుడు దేహమనే దృశ్యం కూడా తెలుసుకునే తెలివి రూపుడైనటువంటి నేనుకి ఇదంతా అన్యము. కావున దేహము నువ్వు కాదు. దేహాత్మ అయినటువంటి అహంకారము’, అనగా దేహమే నేను’, అనే అసత్య నేనుకూడా దృశ్యమే.

       ఈ అహంకారము నిద్రలో ఉండదు. స్వప్నంలో నామమాత్రంగానే ఉంటుంది. వ్యవహారములో పాల్గొనేటటువంటిది, క్రియలో పాల్గొనేటటువంటి అహంకారము స్వప్నంలో లేదు. తైజసుడు వేరు, విశ్వడు వేరు. అక్కడ కల ఏది వస్తే అది అనుభవిస్తావు. ఆ కలలో వచ్చినటువంటి అనుభవానికి నువ్వు స్పందిస్తావు. నీ ఇచ్ఛ వల్లనే, నీ పూర్వ వాసనవల్లనే, జాగ్రదవస్థలో ఉన్నటువంటి అనుభవం వాసనా రూపంలో ఉన్నదేదో స్వప్న దృశ్యమవుతుంది. నీ ఇచ్ఛయే దృశ్యమవుతోంది. కనుక అక్కడ ఇచ్ఛా శక్తి ఉంటే దృశ్యమవుతోంది నీ ఇచ్ఛ ఉంటేనే కల వస్తోంది గాని, గాఢ నిద్రలో ఇచ్ఛకూడా లేదు కాబట్టి ఏమీ తెలియని స్థితిలో ఉంది. స్వప్నంలో ఇచ్ఛ ఉంది కాబట్టి కేవలము స్వప్న పురుషుడు, నామమాత్రంగా ఉండి ఆ స్వప్నాన్ని అనుభవిస్తున్నాడు.

       జాగ్రదవస్థలో వచ్చేసరికి క్రియ కూడా పని చేస్తోంది కాబట్టి కర్మ చేస్తూ కర్మ ఫలితాన్ని కూడా అనుభవిస్తున్నాడు. స్వప్నంలో హత్య చేసినా క్రియ లేదు కనుక, ఆ హత్యా దోషము, కర్మ ఫలితంగా ఉండదు. స్వప్నంలో దానం చేసినా పుణ్యం రాదు. ఎందుకంటే అక్కడ అహంకారం లేదు. కార్య రూపంలో లేదు. కరణ రూపంలో లేదు. క్రియా రూపంలో లేదు. జాగ్రదవస్థలో క్రియా రూపంలో ఉంది కాబట్టి పాపపుణ్యాలు, క్రియగా జరిగినప్పుడు నేను అనేవాడికి ఆ క్రియ ద్వారా కర్మఫలితం వస్తుంది. ఆ నేనుఅనేవాడు దేహమే నేను అనే తాదాత్మతతో దేహాత్మభావనతో ఆ కర్మ ఫలితాన్ని అనుభవిస్తున్నాడు. దేహము పనిముట్టు అయింది. ఈ అహంకారము లేకపోతే ఏమవుతుందండి? పనిముట్టుతో తాదాత్మ్యత లేని నేనుఉంటే ఏమవుతుంది. కొట్టినా దెబ్బ బాధనిపించదు. సుఖం కూడా తెలియబడదు. దేహముతో ఉన్న తాదాత్మ్యత వల్లనే సుఖదుఃఖాలు తెలియబడుతున్నాయి. కనుక తాను చేసిన పాపుపుణ్య కర్మలయొక్క ఫలితము అనుభవించాలి అంటే ఈ నేనుకు దేహముతో తాదాత్మ్యత ఉండి తీరాలి. తాదాత్మ్యత లేనివాడికి దేహ సంబంధించిన ఈ కర్మ ఫలితం ఎలా వస్తుంది? ‘నేనుకు దేహ తాదాత్మ్యత ఉన్నప్పుడే దానికి సుఖము, దుఃఖము అనే ఫలితం ఉంటుంది.

       ఇప్పుడు విచారణ ఏమిటి? దేహము నువ్వు కాదు అన్నప్పుడు దేహముతో ఈ నేనుకు ఉన్న తాదాత్మ్యత వలన కలిగే కష్టసుఖాలు నీవి కాదు కనుక  ఈ తాదాత్మ్యత ఎలా విడగొట్టాలో విచారించాలి. దేహ తాదాత్మ్యత పోతే సుఖదుఃఖాలు ఎవరికి? పనిముట్టు వేరైపోయిందిగా. తాదాత్మ్యత లేనప్పుడే కాదు. తాదాత్మ్యత ఉన్నప్పుడు కూడా పనిముట్టువేరే. అనేక జన్మలలో దేహమే నేను, దేహమే నేను అనేటువంటి అభిప్రాయంతో, సంస్కారముతో, చచ్చిపుడుతున్నావు కనుక ఆ దేహమనే పనిముట్టు వచ్చి మళ్ళీ తాదాత్మ్యత ఉన్న దేహమే వచ్చింది.

       ఈ జన్మలో దేహము నేను కాదు అన్నప్పుడు దేహముకంటే వేరైనటువంటి ప్రత్యగాత్మ స్వానుభవానికి వస్తుంది. అది ముక్త స్థితి. దేహమే నేనుఅనేది బంధ స్థితి. దేహమే నేననేది బంధము. దేహము కంటే నేను వేరైనప్పుడు ప్రత్యగాత్మ అనేది మోక్షము. వివరాలన్నీ మహా వాక్యాల బోధ వచ్చాక తెలుస్తాయి. నిద్రలో అహంకారము లేదు. స్వప్నంలో అహంకారము లేదు. జాగ్రదవస్థలో మాత్రమే ఉంది. జాగ్రదవస్థలోనే పుణ్య పాపాలు కర్మ ఫలితాలు అనుభవిస్తున్నాడు. సుషుప్తిలో ఏ కర్మ చేయట్లేదు. స్వప్నంలో కర్మ చేస్తున్నప్పటికీ అహంకారము లేనందువల్ల కర్మతో సంగత్వం లేదు. అందుకని కర్మ ఫలితం లేదు. త్రికాలములలో ఉన్నదియే సత్యము. మూడవస్థలలో మారిపోతున్నది సత్యము కాదు. త్రికాలములు అంటే భూత భవిష్యత్‌ వర్తమాన కాలములు. అలా చూసుకున్నా కాల పరిచ్ఛేదముతో ఉండేది అసత్యము. కాల పరిచ్ఛేదము లేనిది సత్యము. ఆత్మ తన స్వానుభవముతో ఉన్నదున్నట్లుగా ఉన్నదేదో, అది కాల పరిచ్ఛేదము లేకుండా నిత్య వర్తమానమై నిత్య తృప్తమై ఉన్నది. దానినే మనము నిత్యమని, శాశ్వతమని అంటున్నాము. కాల పరిచ్ఛేదము ఉంటే అది అశాశ్వతము, తాత్కాలికము, అనిత్యము. కాని ఈ దేహము రెండు కాలములలో ఉండుటలేదు. కావున సత్యమెట్లగును? ఈ విధముగా విచారణ సలిపి స్వప్నంలోనూ, సుషుప్తిలోనూ ఈ దేహము ఉండటంలేదు. నేనుఅనేటువంటి ఒక భావన స్వప్నంలో కదలాడుతూ, చేస్తున్నట్లు, అనుభవిస్తున్నట్లు కనబడటం తప్ప. ఈ దేహం నీకెప్పుడయినా మళ్ళీ కనబడితే కనపడవచ్చు. ఈ దేహం నీకు కనపడకుండానే నేననే వ్యవహారం నీకు జరిగిపోతూ ఉంటుంది. క్రియా రూపంలో ఉంటేనే అహంకారముంటున్నది. మూడు అవస్థలలో అనుభవాలు మార్పు చెందుతూ ఉంటే ఏ అనుభవంలో నువ్వెక్కడున్నావో అప్పటికి ఆ అనుభవమే అనుభావ్యముగా ఉంటే నిజానికి అక్కడ ఏ అనుభవము సత్యము? కనుక నీ విచారణ జ్ఞానాన్ని ఆ రకంగా అభ్యాసానికి, ఆచరణకీ, సాధనకి వినియోగిచాలి. ఎలా వినియోగించాలి? ఎలా సాధన చేయాలి? ఇంద్రియాలంటే ఏమిటి? కర్మేంద్రియాలంటే ఏమిటి? జ్ఞానేంద్రియాలంటే ఏమిటి? అంతఃకరణ చతుష్టయం అంటే ఏమిటి? పంచప్రాణాలు ఎలా వచ్చాయి? అసలు సృష్టి ఎలా  వచ్చింది? ఇదంతా పాఠాలక్రింద ఉంది. ఆ పాఠాలు మీరు ఎంతకాలం నుంచో వినే ఉన్నారు. పాఠాలవల్ల జ్ఞానం రాదు. ఈ పాఠముయొక్క సారాన్ని విచారణలో చూసుకొని, వస్తు నిర్ణయంలో, బుద్ధిని ఆ నిర్ణయంపై పెట్టి గట్టిచేస్తే అది నిది ధ్యాసకెళితే అది ఆరూఢమైతే అప్పుడు స్వానుభవానికి అందుతుంది. ఇప్పుడు మనం చేసేపని డైరెక్టుగా, బోధతోపాటు అనుభవం కూడా రావాలనే చెబుతున్నాం. వినే వాళ్ళలో వివరంగా ఎరికైనా తెలియకపోతే విన్నది అట్టిపెట్టుకొని దీనిని మననం చేస్తూ, ఆ వివరాలకోసం దొరికిన పుస్తకాలలో అన్వేషణ చెయ్యండి. దానినిబట్టి మీకు స్పష్టత వస్తుంది. ఏ పుస్తకంలో దొరుకుతుందనేది గురువే స్ఫూర్తినిస్తాడు. ఏ పేజీలో దొరుకుతుందో నీకే అందుతుంది.

       అంకురార్పణ అంటే కేవలాత్మే లేనెరుక కనుక, దానిని తీసెయ్యాలి. లేనిది లేకుండా చెయ్యాలని. అలా దీక్ష పెట్టుకుని దిగాము.  ఆ దిగిన తరువాత యద్భావం తద్భవతిఅనే సూత్రాన్ని తెలుసుకున్నాం. సృష్టికి ప్రారంభానికి కూడా బ్రహ్మయొక్క భావన, సృష్టికి సంబంధించింది జ్ఞాపకంగా స్మృతిగా ఉంటే, ఆ స్మృతి మాయా సంకల్పము చేత లేనివి ఉన్నట్లుగా కల్పితముగా ఈ సృష్టంతా వచ్చింది. జీవుడు కూడా అంతే చేస్తున్నాడు. అవిద్యాదోషం చేత ఇవన్నీ నిజమనుకొని వాటివల్ల సంసార, దుఃఖ, బాధ, బంధ, వాసనలన్నీ కూడా దాచుకున్నాడు. ఇవే భావాలు. ఈ భావ రూపంలో ఉండేవే పునర్జన్మలో అనుభవానికి వచ్చాయి. ఇది జీవుడి దగ్గర భవతిఅనగా చిత్త వృత్తితో మొదలవుతోంది. బ్రహ్మ దగ్గర భవతిఅనగా సంకల్పంతో సృష్టి సంకల్పంతో మొదలవవుతోంది. నువ్వే ఆ బ్రహ్మవి. అప్పుడు అలా సంకల్పం చేశావు. తరువాత ఈశ్వరుడవయ్యావు. మళ్ళీ సంకల్పం చేశావు అనేక జీవులయ్యావు.

       ఒక సముద్రం నుంచీ వేరైనటువంటి బిందువు నేను ఈ బిందువు వరకే అనేటువంటి పరిమిత జ్ఞానం పొంది ప్రక్క బిందువు తనకంటే వేరు అనుకొని సముద్రము చాలా గొప్పదనుకొని సముద్రమే బిందువుల సముదాయమనేది తెలియక సముద్రమే మోక్షమని అనుకుంటోంది ఈ తుంపర. విచారణ చేస్తే అజ్ఞానమునకు ఈ పరిమితత్వమే కారణము.  తత్త్వంగా చూస్తే ఒక నీటి బిందువులో ఏదైతే ఉన్నదో వేరొక నీటి బిందువులో కూడా అదే ఉంది. మహాకారణంగా కూడా అదే ఉంది. తత్త్వముగా అది ఒక్కటే అయివుంది. అట్లాగే ఆత్మగా, పరమాత్మగా అది ఒక్కటే. అజ్ఞానంచేత అవిద్యాదోషం చేత, జీవభావమే గానీ, పరిమిత భావమే గాని, అభేదమే నిశ్చయము. కెరటాలుంటాయి. మాయా కార్యంగా, చలించనటువంటి గంభీరంగా ఉన్న సముద్రమువంటి నీకు దానిలో అలల రూపంలో కదులుతున్నాను అనే భావన నీకొచ్చింది మాయవల్ల. అలాగ అనేక అలలు గుద్దుకోవడం ద్వారా ఈ అలలే అనేక బుడగలయినప్పుడు బుడగ వరకు ఒక పరిమిత భావం, బుడగ పుట్టడం, బుడగ ఉండటము, బుడగ చితికిపోవటంతోటి బుడగతో తాదాత్మ్యత ఉన్నటువంటి జీవుడు చచ్చిపుట్టేవాణ్ణి అనుకుంటున్నాడు. బుడగలో ఉన్నదీ నీరే, అలలలో ఉన్నదీ నీరే. గంభీరమైన సముద్రంలో ఉన్నదీ నీరే, అసలు సముద్రము  అచలము, పరిపూర్ణము అని చూచినప్పుడు తత్త్వాన్ని పట్టుకున్నప్పుడు బిందు రూపంలో ఉన్న నీరు అచల పరిపూర్ణమే అలల రూపంలో ఉన్న నీరు, అచల పరిపూర్ణమే. మహాకారణంగా ఉన్నటువంటి గంభీర స్థితిలో ఉన్నటువంటి నీరు అచల పరిపూర్ణమే. మాయాదోషం వల్ల, అవిద్యా దోషంవల్లనే ఈ కదలికలు గాని, అనిత్యాలుగాని. ఈ రెండు దోషాలు పోతే అచలమే ఉన్నది. అది నిస్తరంగ సముద్రము.

       అవిద్యాదోషం వల్ల, అనిత్యత్వం వచ్చింది. అనేకత్వం వచ్చింది. బేధం వచ్చింది. మాయాదోషం వల్ల కదలికలు వచ్చినాయి. ఈ రెండు దోషాలు జీవుడిలో ఉన్నాయి. ఈశ్వరుడిలో అవిద్య లేదుగాని, మాయ వుంది. జీవుడికొచ్చేసరికి మాయ+అవిద్య రెండూ ఉన్నాయి. తత్త్వ విచారణ చేస్తే బుడగ నేను కాదు అంటే అలవల్ల బుడగ పుట్టింది అన్నావు. అలలు గుద్దుకోవడం వల్ల అంటే ఈశ్వరుడినుండీ జీవులొచ్చాయి అని. మళ్ళీ అక్కడ తత్త్వం చూస్తే జలతత్వంలో కదలిక లేదు. తత్త్వం వస్తువు కాదు కనుక అది అచలమే. మానవుడు కదులుతాడు. మానవత్వం అనేది తత్వం. అది కదలదు. క్రియా రూపంలో శరీరం ద్వారా, పనిముట్టు ద్వారా కదలికలుంటాయి తప్ప మామూలుగా కదలదు.

       ఈ విధముగా విచారణ ఎలా చేయాలో అందిస్తున్నాము. ఎవరికివారు చేస్తేనే వారికి అనుభవం. పుస్తకాలు, శాస్త్రాలు, రివిజన్‌ చేస్తే రాదు. ఇంద్రియములు, మనసు, బుద్ధి ప్రాణము, వాటియొక్క పుట్టుక, వాటియొక్క వ్యవహారము, వాటియొక్క లయము, ఇవన్నీ ఉన్నా లేకపోయినా ఏది శాశ్వతముగా ఉన్నదో, దాన్ని వేరుపరచటం అనేటువంటిది మనకు తెలియాలి. అలా వేరుపరచి ప్రత్యేకించినపుడు అది ప్రత్యగాత్మ అంటున్నాం. ఎవరికివారే వేరుపరచుకోవాలి. ముందు బుద్ధి పరిథిలో విషయంగా వేరుపరచాలి. తరువాత అవగాహన చేసుకుని తాదాత్మ్యతనుండీ విడిపడటం చెయ్యాలి.

       తాదాత్మ ్యత అంత తేలికగా పోదు కాబట్టి, ఎంత బాధపెట్టినా అది వేరు ఇది వేరనే నిర్ణయముగా ఉండాలి. బాధ పెట్టేది కాబట్టి, కలిసిపోయింది కాబట్టి శరీరం నేను అంటే కుదరదు. విచారణలో శరీరం నువ్వు కాదని తేలాక, శరీరం నిన్ను ఎంత బాధపెడుతున్నా సరే, శరీరం నువ్వు కాదు. అంతే! మనసుకి ఎంత నొప్పి తెలుస్తున్నాసరే ఆ నొప్పిని గ్రహించేటటువంటి మనసు నువ్వు కాదు.
       ఆత్మంటే ఒక ఉపనిషత్తులో చెప్పారు. వింటుంది, వినదు, ఆలోచిస్తుందీ. ఆలోచించదు. చూస్తుందీ చూడదు. అంటే ఏమిటి? ఆత్మ చైతన్యము ఆధారముగా ఆత్మలో ఉన్న ప్రజ్ఞానము ఆధారముగా వినుట, చూచుట, ఆలోచించుట, నిద్రపోవుట అన్నీ ఆత్మ చేస్తున్నట్లుగా ఉంది గాని ఆత్మ చేయదు. ఆత్మ ఆధారంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. ఆత్మ అన్నింటికి సాక్షి. మనసే చూస్తోంది, వింటోంది, చేస్తోంది. మనసుమీద విచారణ చేస్తే ఏమయింది? మనసు పట్టించుకున్నదీ, జ్ఞానేంద్రియాలు గ్రహించినవీ తెలియబడ్డాయి. జ్ఞానేంద్రియాలు గ్రహించినప్పటికీ కూడా మనసు అన్య మనస్కంగా ఉన్నప్పుడు,  తెలియలేదు. అంటే మనసే తెలుసుకుంటున్నది.ఇప్పుడు మనసు పెట్టినప్పుడు ఇంద్రియ జ్ఞానం మనసుదే అయింది.

       అలాగే ప్రజ్ఞని పెట్టినప్పుడు, తెలుసుకునే తెలివిని పెట్టినప్పుడు ఆ ప్రజ్ఞానం లేకపోతే మనసు ఎలా తెలుసుకుంటుంది? తెలుసుకునే తెలివనేది ఒకటుంటే అది అన్నీ తెలుసుకుంటుంది. తెలుసుకునే తెలివి మనసు కాదు. మనసు జడము. తెలుసుకునే తెలివి ప్రజ్ఞానం. అది ప్రత్యగాత్మలో ఉన్నది. ఆ ప్రత్యగాత్మలో ప్రజ్ఞగా, తెలుసుకునే తెలివిగా ఉన్నదేదో దానివల్లనే ఇవన్నీ తెలియబడుతున్నాయి. కాబట్టి ఒక రకంగా అవే తెలుసుకుంటున్నాయి. అయితే విషయాసక్తి మనసుకుంది గాని ఆత్మకు లేదు కనుక ఆత్మ సాక్షీభూతంగా తెలుసుకుంటున్నది. సాక్షీభూతంగా ఉంటూ, విలక్షణంగా ఉంటూ, అంటకుండా ఉంటూ, తెలుసుకుంటున్నది. మరి ఆత్మ తెలుసుకుంటుందా అని మళ్ళీ అడిగితే ఆత్మకు, నేనుకు మధ్యలో ఇంకొక అంతరాత్మ ఉంది. ఆ అంతరాత్మే సాక్షీభూతంగా ఉండి తెలుసుకుంటుంది. దాంట్లోనే స్మ ృతిరూపం ఉంది. నిజాత్మ తెలుసుకోడానికి హేతువుగా, ఆధారముగా, చిన్మాత్రముగా, సన్మాత్రముగా ఉన్నదే తప్ప, దానియొక్క ఉనికిచేత ఈ వ్యహారాలు జరుగుతున్నాయి గాని స్వయముగా అదేదీ చేయట్లేదు. ఏదీ గ్రహించట్లేదు. అందుకని ఉపనిషత్తు ఏం చెపుతోంది అంటే చూస్తోంది కాని చూడటం లేదు. వింటోంది కాని వినటం లేదు అంటుంది. అంటే ఇంద్రియ వ్యాపారానికి మనో వ్యాపారానికి ఆధారంగా ఉన్నది. ఈ అంతరాత్మ అనేటువంటిది యదార్థ నేనుగా ఉండేదే సాక్షిగా ఉంటుంది.

       నిజానికి ఆత్మ సాక్షి కాదు. మిమ్మల్ని క్రమక్రమంగా తీసుకువెళుతున్నాం. ప్రస్తుతం ఆత్మ సాక్షి అన్నప్పటికీ నిజమైన ఆత్మ సాక్షికూడా కాదు. అది తరువాత బోధలో వస్తుంది. ఇక్కడ నేనుఎవరు? అంతఃకరణ ప్రతిబింబముగా ఉన్న చిదాభాసాన్నే అంతరాత్మ అంటున్నాము. ఈ అంతరాత్మని నిర్విషయ స్థితిలో ఇంద్రియ జ్ఞానాన్నుంచి వేరుపరిస్తే ప్రత్యగాత్మ అంటున్నాము. అసలు నిజంగా ఇదేనా ప్రత్యగాత్మ అంటే ఇది కాదు. ఇది యదార్థ నేనుమాత్రమే. వేదాలు, ఉపనిషత్తులు తెగ కన్ఫ్యూజ్‌ చేసేస్తాయి. ఆత్మే తెలుసుకుంటుంది అంటే చూడండి. ఎంత కన్ఫ్యూజనో. ఆత్మ సాక్షి అన్నా కూడా కన్ఫ్యూజనే.

       ఆత్మ సాక్షి కూడా కాదు. ఆత్మనేది ఎరుక కూడా కాదు. ఆత్మ సర్వసాక్షికూడా కాదు. ఆత్మ బయలు’. కనుక సాక్షిత్వం కూడా ఎరుకే. ఆత్మంటే కేవలాత్మ అది కూడా లేనెరుకే. ఎరుకగా ఉంటే అది అబద్దమే, లేనిదే, అసత్యమే. అయితే ఈ నేనుని బయలుదాకా తీసుకువెళితే ప్రతిబింబ నేను పోతుంది. బింబ జ్ఞానంతో ఉన్న ఆత్మ-పరమాత్మ కూడా పోతుంది. ఈ పదాలనుబట్టి మీరు, గురువు గారు ప్రత్యగాత్మ అంటే వ్యష్టి అన్నారే అనుకుంటారు. పరమాత్మ కూడా బ్రహ్మజ్ఞానము పొందాలనుకున్నపుడు ఈశ్వరుడు కూడా బ్రహ్మజ్ఞానం పొందాలనుకున్నపుడు, ఈశ్వరుడు కూడా తన సరంజామానుంచి వేరుపరచుకొని ప్రత్యేకిస్తే అక్కడ కూడా ప్రత్యక్‌ ఆత్మ అంటారు. బ్రహ్మ దగ్గరకు వస్తే ప్రత్యక్‌ అభిన్న బ్రహ్మఅంటాము.

       ఈ పదాలను వాటియొక్క ఉత్పత్తి అర్థాలను బట్టి తీసుకోండి. ప్రత్యగాత్మని గురువుగారు చెప్పారు. ఇది వ్యష్టితోనే ఉంది. శరీరత్రయ విలక్షణము అవస్థాత్రయ సాక్షి, పంచకోశ లక్షణానికి వ్యతిరిక్త లక్షణంగా విలక్షణంగా ఏదైతే ఉన్నదో అదే ప్రత్యగాత్మ. అదే ఆత్మ. అనే పాఠం చెపుతున్నారని అనుకుంటాం. అసలు ప్రత్యగాత్మ అంటే అంతవరకేనా? అని అడుగుతాము. పాఠకులు ఎక్కడికక్కడ ఇది కాదు, ఇది కాదు అని తన్నుతాను వేరుపరచుకునేటువంటిది కూడా అక్కడక్కడ ప్రత్యగాత్మ అని అయిదారు దశలలో విడగొట్టినపుడు మళ్ళీ మళ్ళీ ప్రత్యగాత్ముడు వస్తూనే ఉంటాడు.

       మాయావరణములో ఉన్న పరమాత్మ జ్ఞానము బ్రహ్మజ్ఞానము. బ్రహ్మకు సంకల్పము వస్తే సృష్టిలోకి వస్తాడు కాబట్టి వాడు మాయాశబలిత బ్రహ్మ. ఆ బ్రహ్మకు కూడా అతీతముగా పరముగా ఇదికూడా కాదు అని అన్నపుడు, మాయాశబలిత బ్రహ్మకూడా కాదు అన్నప్పుడు అక్కడ పరమాత్మే పరబ్రహ్మమై యున్నాడు. ఇక్కడ ప్రత్యగాత్మయే బ్రహ్మమై ఉన్నాడు. ఆ పరములో పరబ్రహ్మమై ఉన్నాడు. అదేమిటి ఇంతమంది లేరా ? అవిద్యా, మాయ, మూడు గుణాల దోషముచేత తాదాత్మ్యత చేత ఒక్కొక్కసారి ఒక్కొక్కటిగా అనుకుంటున్నావు. అధిగమించిన స్థితిలో నీకే ఒక కొత్తపేరు వస్తోంది. అంతే తప్ప ఇవన్నీ మాయద్వారం దాటేలోగా మాయావరణలో ఉన్నటువంటి స్థితిగతులు. అది ఒక్కటే నిజానికి.

       ఈ మాయద్వారం దాటిన తరువాత అతీత పద్ధతిలో పూర్తిగా పరమైనటువంటిదేదో అది పరబ్రహ్మ అన్నప్పుడు ఈ ఆధ్యాత్మిక ప్రయాణమే జరగలేదు. ఎవరు ఎక్కడున్నారో అక్కడే భ్రాంతి రహితమై, భ్రాంతికి మూలమైన త్రిగుణాలు లేకుండా పోతే భ్రాంతిలో ఉన్న సంకల్పాదులు ఎరుకలు అన్నీ భ్రాంతి రహిత స్థితిలో లేనివై, ఎరుక లేనిదైపోతే, ఎరుక యొక్క లేమితనముతో ఏదైతే ఉన్నదున్నట్లుదో అదే బయలని, ఆ బయలే స్వతఃసిద్ధమైనదిగా ఆ లక్ష్యాలన్ని అందుకుంటాము. ఎప్పుడు కూడా ఈ వరుసలని గుర్తుపెట్టుకోవాలి గాని ప్రత్యగాత్మ అంటే వ్యష్ఠి అని పరమాత్మ అంటే సమిష్టి అని, ఒకసారి ఆ బోధ అట్లా చెప్పడం కూడా జరిగింది. గనుక అలాగే ఫిక్సు అయిపోకూడదు.

       మన విచారణా పద్ధతిలో ఈ సర్వవేదాంత శిరోభూషణంలో పూర్తిగా నిరపేక్ష పద్ధతిలో మార్చుకుంటూ పోతున్నాము. ఇక దేహము, మనస్సు, ప్రాణము నువ్వుకాకపోతే ఆత్మేది? రాకడ పోడక లేనటువంటిది. చేతులు, కాళ్ళు మాదిరి అవయవాలు లేనటువంటిది. శరీరము కానప్పుడు అవయవాలు కూడా కాదు. సూక్ష్మ శరీరం నీవు కాదనపుడు శబ్ద, స్పర్శ, రూప, రస, గంధ జ్ఞానం నీకు లేదు. శుద్ధ సత్వగుణమేమో మాయ. మలిన సత్వగుణమేమే అవిద్య. అవిద్యలో ఏమున్నాయి? ఆవరణ. మాయలోనే ఆవరణొచ్చింది. ఆధ్యాస వచ్చింది. ఆ విద్యలో ఎక్స్‌ట్రా ఏమొచ్చినాయి? ఆవరణ, అధ్యాసలతో పాటు ఏమొచ్చింది? ఆ తరువాత, సంసారం, సంసారంతో ఏమొచ్చింది? విడచి ఉండలేని తనము. విడిచి ఉండలేని తనముతో ఏమొచ్చింది బంధము. బంధముతో ఏమొచ్చింది? దుఃఖము.

        అణువున, అణువుగా, ఘనమున ఘనముగా ఆకాశమువలె అంతటా ఉన్ననూ ఆత్మ ఎట్లా ఉందండి? అణోరణియాన్‌గా మహతో మహియాన్‌గా ఉంది. అసలు చెప్పాలంటే అణువు కాదు, ఘనము కాదు. ఆకాశమువలె అంతవరకే. ఏమీలేనిది. విలక్షణమైన తరువాత ఏమీ లేవా?

       ఈ ప్రత్యగాత్మ ఎప్పుడయితే నిరాకాశంగా మారిందో, మళ్ళీ తిరిగి సృష్టికి గాని, జన్మలకు గాని, మూడు గుణములతో కూడినటువంటి ఎరుకకు గాని, అవకాశమివ్వదు. త్రిగుణ మాలిన్యము అంటే అది. గుణములు ఏ రూపంలో ఉన్నా, విడివిడిగా ఉన్నా, రెండేసి మూడేసి గుణాలు ఏదో ఒక నిష్పత్తిలో కలిసి ఉన్నా, గుణమనేటువంటిది ఏ కొంచెమైనా ఉన్నా అదంతా కల్పితమే. అదంతా భ్రాంతిని పుట్టించేదే. జీవుడిలో ఉన్న గుణాలు, జీవుణ్ణి భ్రాంతికిలోను తెస్తున్నాయి. జగత్తులో ఉన్న గుణాలు తాడుమీద పాము తోచినట్లుగా ఈ లేని ప్రపంచాన్ని నామరూపాలుగా ఉన్నట్లుగా చూపిస్తోంది. అక్కడా మాయ ఉంది. ఇక్కడా మాయ ఉంది. దృక్కులోనూ మాయ ఉంది. దృశ్యంలోనూ మాయ ఉంది. దృక్కులోనూ పరమాత్మ ఉన్నాడు. దృశ్యంలోనూ పరమాత్మ ఉన్నాడు. చైతన్య రూపంలో వ్యాపించి ఉన్నాడు. కనుక త్రిగుణ మాలిన్యము లేనిదే బయలు.

       అయితే క్రిందినుంచి ఒక ఆత్మ, ఒక బ్రహ్మ అని ఏదైతే అనుకుంటున్నామో ఆ పేరుతో బయలయితే మాత్రం అది సమన్వయం కాదు. విరోధమవుతుంది. కనుక ఎరుక అనే పదాన్ని తీసుకువచ్చి ఏ రూపంలో ఏ గుణమున్నా ఆ గుణ సంబంధంగా ఏ ఎరుక ఉన్నా, అన్ని రకాల ఎరుకలలో బంధించే ఎరుక, మోక్ష స్థితిని అనుభవానికి ఇచ్చేటువంటి ఎరుక, రెండూ కూడా ఎరుకే. మిమ్మల్ని బంధించి బంధము ద్వారా దుఃఖహేతువైన ఎరుక, బంధ రహితము చేసి, ఆనందమిచ్చేటువంటి ఎరుక. రెండూ ఎరుకలే. ఎరుకలోనే బంధమోక్షాలున్నాయి. అయితే ఎరుక పోతేనే నిజమైనటువంటి మోక్షము. ఎరుకలోనే ఉన్నటువంటి మోక్షము తిరిగి మళ్ళీ ఎరుకలోనికి తెచ్చేటువంటి మోక్షమే. ఎరుకలోనే తిరిగి తీసుకొచ్చినపుడు ఎప్పటికైనా మళ్ళీ బంధం కలుగుతుంది. ఈ మోక్షము శాశ్వతం కాదు. ఆత్మానుభవము, బ్రహ్మానుభవము అనేటువంటిది ఏదైతే అనుభవ రూపంలో ఉందో అదికూడా ఎరుకే కనుక అట్టి ఎరుక కూడా విడిచినప్పుడే తిరిగిరాని మోక్షము. దానిపేరే పరమపదము.

       త్రిగుణ మాలిన్యము దగ్గర ఇవన్నీ చెప్పుకోండి ఒకసారి. ఇది అణువున అణువుగా ఘనమున ఘనముగా ఉన్నప్పటికీ, అసలు పరమాత్మ అణురూపం కాదు. అణువుతో చెప్పేదంతా పదార్థ జ్ఞానం. పదార్థ జ్ఞానమంతా కూడా అణువు కణము అని వాడుతూ ఆ కణముయొక్క అణువులయొక్క సముదాయముతో నామరూప జగత్తు వచ్చేసింది. పంచ భూతాలు వచ్చేసినాయి. జీవులయొక్క ఉపాధులు వచ్చేసాయి అనేటువంటి సిద్ధాంతం కణాది మహర్షి ద్వారా వచ్చింది. పదార్థమే బ్రహ్మకాదు. పదార్థ వాదము కణాదుడిది. పరమాణు వాదము కణాదుడిది. కణములు ఏకకణము, ద్వికణము, త్రికణము అనేటువంటి సిద్ధాంతములో వచ్చింది. కణాదుడియొక్క మతం. కణాదుడి వైశేషిక మతం తత్వాలుగా విభజన చేసింది. సాంఖ్య మతం ప్రకృతినే 25తత్వాలుగాను, అనేక తత్వాలుగాను విభజన చేసింది. ప్రకృతి అయితే విభజన అవుతుంది గాని, పురుషుడు విభజన అవుతాడా? పురుషుడు ఇవన్నీ చేస్తున్నాడా. కరంటే అన్ని పనులూ చేస్తోందా?

       అన్ని పనులకూ కర్త వేరే ఉన్నాడు. కరంటు కేవలం ఉపాదాన కారణంగా ఉంది అంతే. కుండ తయారవటానికి ముందు మట్టిగా ఉంటుంది. మట్టి తానంతట అదే కుండయిందా? మట్టి కుండవడానికి ఇంకొక కారణం ఉంటుంది. ఒక్క కారణమేనా? తగినటువంటి నీళ్ళు పోయాలి. కుమ్మరివాడుండాలి. దాన్ని పిసకాలి. కుండ అవడానికి సరిపడేటువంటి నిష్పత్తులో బంకమట్టి, ఇసుక, నీరు, అంతేనా? ఒక బండి చక్రం ఉండాలి. ఒక కర్ర ఉండాలి. ఆ మధ్యలో ఆ కుండమట్టి పెట్టాలి. దాన్ని తిప్పాలి. దానికి చెయ్యి అడ్డం పెట్టాలి. ఏ ఆకారము చెయ్యాలనుకుంటే ఆ ఆకారం వచ్చేలా చేతులు మారుస్తూ ఉండాలి. ఇంత క్రియ చేస్తే మట్టి కుండయింది గాని మట్టి దానంతటదే కుండయిందా?

       మరి ప్రపంచం బ్రహ్మవల్ల వచ్చింది అన్నప్పుడు బ్రహ్మ కారణంగా వచ్చిందన్నప్పుడు బ్రహ్మకంటే రెండవ వస్తువు లేనప్పుడు నామరూప జగత్తు, కణములతో, అణువులతో కూడినటువంటి జగత్తు ఎక్కడినుండి వచ్చింది? పరికరాలు లేవే. బండి చక్రం లేదు. నీళ్ళు లేవు. చెయ్యి పెట్టలేదు. కుమ్మరివాడు లేడు. కుమ్మరివాడు బ్రహ్మమే. నీళ్ళు బ్రహ్మమే. మట్టి బ్రహ్మమే. కర్ర బ్రహ్మమే. పరికరాలు బ్రహ్మమే. బ్రహ్మమపుడు ఇన్ని రకాలుగా ఉన్న బ్రహ్మమా? బ్రహ్మ నిరవయవము. బ్రహ్మలో ఇన్ని రకాల భాగాలు లేవు. అఖండము, అవిభాజ్యము, నిరవయము. నువ్వు నీకు శరీరము, ప్రాణము ఆ శరీరంలో మళ్ళీ అనేక రకాల అవయవాలు. అవి చేసే క్రియలు కనపడకుండా ఉండే సూక్ష్మ శరీరం. దాంట్లో మళ్ళీ కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలు అన్నీ కలిపి నేనొక్కణ్ణే అంటారు మీరు. ఒక్కళ్ళే ఎలా అయ్యారు. మీతోపాటు మీ అవయవాలు, మీ దేహాలు, మీ ఎముకలు, మీ మాంసం, మీ చర్మము, మీ సప్త ధాతువులు, మీ ఇంద్రియాలు, మొత్తం ఈ సరంజామా అంతా కలిపి ఒక సంఘాతంగా ఉంటే అది నువ్వయ్యావు. అప్పుడు నువ్వు అవయవాలతోనే ఉన్నావు. అంటే ఖండత్వంతోటే విభజనతోటే కొన్నిటియొక్క సముదాయము తోటి ఉన్నావు. నువ్వు ఒక్కడివే ఎట్లా అవుతావు. ఇందులో నేను అనేది ఎక్కడుందో చూడండి. ఇప్పుడు వీటిలో ఒక కన్ను తీసినా, కాలు తీసినా నువ్వు ఉంటున్నావు. రక్తం కొంతపోయినా నువ్వు ఉంటున్నావు. ప్రాణం పోయినా కూడా నువ్వు పునర్జన్మలో ఉంటున్నావు. ప్రాణము దేహము పోయినాకూడా ఆత్మగా నువ్వు ఉంటున్నావు. ఇంక నేనెవరు అనేది చూడాలిప్పుడు. నేనుని అలా వేరుచేస్తేనే ప్రత్యేక్‌ ఆత్మ. కనుక సాంఖ్యమతము, మట్టి నేరుగా కుండ అయినట్లు చెప్తోంది. వీటికాధారమయిన చైతన్యం మాట ఎత్తటం లేదు. బ్రహ్మవల్ల వచ్చింది అన్నప్పుడు బ్రహ్మ జడపదార్ధమయ్యాడు. బ్రహ్మకు చైతన్యం ఉన్నట్లు చెప్పట్లేదు. జడము, చైతన్యము రెండూ వేరుచేసినట్లుగా సాంఖ్యమతము చెప్పట్లేదు, వైశేషిక మతము చెప్పట్లేదు.

       న్యాయంగా ఉన్నటువంటి గౌతమ ఋషియొక్క తర్కమువల్ల ఈ ప్రకృతిలో మనకు గోచరించే దానినే విచారణ చేశాడు. న్యాయ మతంలో బుద్ధికి అతీతమైనటువంటి స్థితిని తానందుకోలేకపోయాడు. దారి చెప్పలేకపోయాడు. ఇవన్నీకూడా కొన్ని పరిమితులతో ఆగిపోయాయి.

       నేను, నేను, అని మీరంటున్నారంటే ఒక్క చైతన్యమున్నటువంటిదే నేనంటుంది గాని, చైతన్యంలేని జడపదార్థం  నేనంటుందా? మన రోమాలు నేనంటాయా? గోళ్ళు నేనంటాయా? నేను అని అనవచ్చు, అనకపోవచ్చు. నేననే ఒక భావన, నేననే ఒక చైతన్యము, ఈ జడమైన మనసు, ఇంద్రియాలు పనిచేయటానికి ఆధారమైనటువంటి చైతన్యము ఈ నేను ఆ చైతన్యము ఒక్కటే. చైతన్యము అనే పదం ద్వారా నేను చైతన్యము ఒక్కటే. ప్రతిబింబ చైతన్యమో, బింబ చైతన్యమో తరువాత చూద్దాం. మొత్తంమీద అది చైతన్య వస్తువు కనుక ఈ నేనుని దాదాపు బ్రహ్మయొక్క లక్షణాలతో పోల్చి చెప్పారు. బింబ, ప్రతిబింబాలు తరువాత చూద్దాం. ఎందుకంటే అదీ ప్రకాశమే. ఇదీ ప్రకాశమే. విడమర్చితే తప్ప, బింబ ప్రకాశం వేరు, ప్రతిబింబ ప్రకాశం వేరు అని తెలియదు. ప్రతిబింబ ప్రకాశమంతా మాయావరణంలో ఉంది. బింబ ప్రకాశం స్వయం ప్రకాశంగా ఉంది.

       మాయకు అతీతముగా మాయకు పరముగా, నిరావరణలో ఉన్న ఆ ప్రకాశము. ఈ ప్రకాశము ఒక్కటే అని తత్వమసివాక్యం చెపుతుంది. మాయావరణమందున్న ప్రకాశము, నిరావరణలో ఉన్న స్వయం ప్రకాశము, ప్రకాశ రూపంలో లక్ష్యార్థంలో ఒక్కటే అన్నాం. వాచ్యార్థంలో ఉన్న మాయావరణని విడిచిపెట్టినప్పుడు అంతా నిరావరణమే. అంతా బ్రహ్మమే, బ్రహ్మము తప్ప అన్యము లేదు అనేటువంటి లక్ష్యాన్ని పెట్టకున్నప్పుడు ఆ ప్రతిబింబ ప్రకాశ జ్ఞానమే ప్రకాశము అనేటువంటి లక్ష్యార్థాన్ని ఒకటిగా పెట్టుకుంటే అసిపదంగా పెట్టుకుంటే అభేదముగా పెట్టుకుంటే స్వయం ప్రకాశ బ్రహ్మ తానే అయి ఉంటాడు.

       నేను, నాది అను భావము లేక అగ్నికి వేడిమివలె, సూర్యునికి ప్రకాశమువలె, ఎరుకయే సోహంగా కలది ఆత్మ. అగ్ని, వేడి రెండూ వేరా? చంద్రుడు వెన్నుల రెండూ వేరా? సూర్యుడు, ఎండా ఆ రెండూ వేరా? జ్యోతి, జ్యోతియొక్క ప్రకాశము రెండూ వేరా? వేరు కాదనుకుంటాము గాని వేరుచెయ్యాలి. అంతర్జ్యోతి బహిర్జ్యోతి ప్రత్యగ్జ్యోతిః పరాత్పరః వేరు చేసినప్పుడు లోపలి ప్రకాశము, బయటి ప్రకాశము అనే భేదము ప్రకాశము యొక్క వ్యాపకము వలన తోస్తున్నది. లక్ష్యార్థము జ్యోతి మాత్రమే స్వయంజ్యోతియై, ప్రత్యగ్జ్యోతియై ఉన్నదున్నట్లున్నది. దానియొక్క ప్రకాశము కానరాదు.

       జ్యోతియొక్క ప్రకాశం మాయావరణలోనే ఉంది. దేశ కాలాదులు, మాయావరణ లేనిచోట నిరావరణయందు, జ్యోతియొక్క ప్రకాశం వ్యాపించటానికి చోటే లేదు. అప్పుడు ప్రకాశమే నేనుఅనేటువంటి పరమాత్మ జ్ఞానం మాయావరణంలో ఏది ఉన్నదో మాయావరణ పోయేసరికి పరమాత్మ పోయాడు. అపుడు పరమాత్మకి ఆదీ అంతము ఉందిగా. ఇక పరమాత్మలో ఏ ప్రకాశముందో, జ్యోతి రూపంలో ఏది వెలుగొందుతుందో ఆ జ్యోతి కూడా వెలుగు ముద్దేగా. ఘనమైన ప్రకాశం. జ్యోతి అంటే ఘనమైన ప్రకాశము. ఘన రూపంలో ఉన్నటువంటి ప్రకాశము. స్వయం ప్రకాశమైతే, వ్యాపకమైనటువంటి ప్రకాశము, మాయావరణలో మాత్రమే వ్యాపించింది. కనుక లేనిది.

       మాయావరణములో వ్యాపించిన ప్రకాశమంతా ఎరుక. కనుక పరమాత్మ అంటే ఎరుక. స్వయంప్రకాశమన్నప్పుడు స్వస్వరూపము అన్నప్పుడు ఎరుక లేదు. ఎరుక త్రిపుటిగా, ద్విపుటిగా ఉన్నప్పుడే ఎరుక. కేవలం ఘనరూప ఎరుకగా ఉండిపోతే అది నిర్గుణం అన్నట్లుగా ఉంటుంది. వ్యాపకం లేనట్టుగా ఉంటుంది. కాని ఎరుకలోనే ఉంది. దీన్నే ఘనరూప అఖండ ఎరుక అంటాం. ఘనరూప, అఖండ ఎరుక’. అఖండ ఎరుక అని ఎందుకనాలి? నువ్వు కొన్నివేల విషయాలు తెలుసుకుంటున్నావు. వేల విషయములయొక్క ఎరుక ఉన్నది. కాబట్టి ఎరుక కొన్ని వేలుగా, కొన్ని లక్షలుగా విభాగం చెందుతుంది. అనేక ఖండ ఎరుకలయ్యింది. గుణాలబట్టి మూడు గుణాలవల్ల మూడు ఎరుకలుగా ఉంది. విషయాలను బట్టి లక్షలాది విషయాలుగా ఎరుక ఉన్నది. తెలుసుకునేవాడిని బట్టి మూడవస్థలలో మూడు రకాలుగా ఉంది. మళ్ళీ జాగ్రదవస్థలోనే కొన్నిటిని తెలుసుకుంటుంది. రాత్రికి తెలుసుకోవటం లేదు. కనుక ఏ వస్తువయితే తానెరిగి జ్ఞాపకం పెట్టుకుంటున్నాడో అవగాహన చేసుకుంటున్నాడో అర్థం చేసుకుంటున్నాడో అది కూడా ఉదయం నుండి సాయంత్రం దాకా కొన్నివేల సార్లు, లక్షలసార్లు మారిపోతుంది. ప్రొద్దుట ఉన్న ఎరుక మధ్యాహ్నం లేదు. మధ్యాహ్నం ఉన్న ఎరుక రాత్రికి లేదు. జాగ్రదవస్థలో ఉన్న ఎరుక స్వప్నంలో లేదు. స్వప్నంలో ఉన్న ఎరుక సుషుప్తిలో లేదు. సుషుప్తిలో ఉన్న ఎరుక సర్వ అజ్ఞానము సర్వ ఎరుకలకూ ఆధారమైనది. తురీయంలో ఉండేటువంటి ప్రత్యగాత్మ అనే ఎరుక. ప్రత్యగాత్మ ఎరుకనే ఇప్పుడు వ్యవహారంలో ఉన్నప్పుడు వ్యాపకమన్నాం. ఇంద్రియాలతో, మనసుతో కూడినపుడు ప్రజ్ఞానం బ్రహ్మఅన్నాం.

       ఏ ఎరిగే ఎరుకైతే శబ్దాది విషయములను, శ్రోత్రాది ఇంద్రియముల ద్వారా ఎరుగుచున్నదో, ఆ ఎరిగే ఎరుకే ప్రజ్ఞానము, ఆ ప్రజ్ఞానమే బ్రహ్మ. ఎరిగే ఎరుకను వేరుచేసి క్రియా రూపంలో అనుభవ రూపంలో విషయాలు లేకుండా చేసుకుని, నిర్విషయమైతే నిర్విషయ స్థితిలో ఎరిగే ఎరుక ఘనరూపం. ఆ ఘన రూపమే ప్రత్యగాత్మఆ ప్రత్యగాత్మయే బ్రహ్మ’. అయితే ఈ ప్రత్యగాత్మ ఎరుక కాదా! ఎరుక బయలవదు. బయలు ఎరుకవదు. ఎరుక పోతేనే బయలు. మరి సాక్షిరూప ఎరుక ఉందిగా ప్రత్యగాత్మలో. అవస్థాత్రయ సాక్షిఉన్నాడుగా! సర్వావస్థలకూ సర్వసాక్షిగా ఉన్నాడుగా! సాక్షి అనే ఎరుక ఉంది కాబట్టి ఎరుక ఎక్కడ ఉన్నా ఏ రకంగా ఉన్న అది లేనెరుకే. సర్వమూ మిథ్యా అనేటువంటి దృష్టితో చూచినపుడు ఆ సర్వసాక్షే కదలకుండా పూర్ణమైయుంటే అది అఖండ ఎరుక.

       అఖండ ఎరుక యొక్క ఊహలో, ఎరుక పుట్టి అనేకమైతే అది అనేక ఖండ ఎరుకలవుతుంది. జీవస్థాయిలో ఖండ ఎరుకలు, నానారకాలుగా ఉన్నాయి. ఈశ్వర స్థాయిలో ఖండ ఎరుకలు, తన విభూతిగా ఉన్నాయి. పరమాత్మయందు ఎరుక శుద్ధ చైతన్యంగా ఉంది. పరబ్రహ్మమందు ఆ ఎరుక అఖండ ఎరుకగా ఉంది. ఘనరూపంలో ఉంది. ఈ ఘనము మళ్ళీ ద్రవము, వ్యాపకము అవదనే గ్యారంటీ ఎక్కడుంది? కనుక ఈ ఘనరూప అఖండ ఎరుక కూడా లేనిదే అని నిర్ణయించుకోవాలి.

       మళ్ళీ ఎరుకను ఇంకొక విధంగా నాలుగు భాగాలు చేయవచ్చు. పిండ బ్రహ్మాండములు రెండు వాటికి సంబంధించిన అహములు రెండు. పిండాండము - పిండాండ అహము, బ్రహ్మాండము - బ్రహ్మండ అహము. వెరసి ఈ నాలుగు కూడా అఖండ ఎరుక కనరా మాతండ్రీ! కనుక అఖండ ఎరుకే ఈ నాలుగూ కలిసివుంది. అంటే అవ్యక్తంలో ఏకంగా ఘనంగా ఉన్నప్పటికీ, ఇప్పుడు ఈ కనపడే రూపంలో ఖండత్వం లేకపోయినప్పటికీ, ఈ నాలుగూ ఖండ ఎరుకలుగా మళ్ళీ వ్యక్తమయ్యేటువంటి ఆస్కారం, ఆ ఘనరూప అఖండ ఎరుకలో ఉన్నది. ఆ ఘనరూప అఖండ ఎరుకలో మళ్ళీ వ్యక్తమయ్యే ఆస్కారం లేకుండా చేసుకునేటువంటి విచారణ, బోధ, అది పరిపూర్ణ బోధ. ఆ పరిపూర్ణ బోధతో అఖండ ఎరుకని లేనెరుకగా చూచినప్పుడే లేనిది లేకపోగా ఇంతకాలము భ్రాంతిలో ఏదైతే ఆవరించి ఉన్నదో ఆ ఆవరణ నిరావరణమై నిరావరణమందు సర్వకాలమందు సర్వదేశములందు ఉన్నదున్నట్లుగా ఉన్నది, అద్వయమయినది, ములుగ్రుచ్చ సందులేక, రెండవది అందులో ఉండనీయక నిరంధ్రమైనది, నిరాకాశమైనది, మరొకదానికి అవకాశమీయక, తనకుతాను ఉండక, అచలమైనది, పరిపూర్ణమైనది, నిర్వికారమైనది, తిరిగి ఏనాడూ సంకల్పము చేయనిది బయలు. అంటే జ్యోతియొక్క ప్రకాశము వ్యాపకము అయినపుడు ఆ ఎరుకయొక్క వ్యాపకము అసత్యము. అది స్వయం జ్యోతై యుండాలి. అది నిరావరణమై యుండాలి. దానికే దృష్టాంతం చెపుతున్నాడు. అగ్నికి వేడి ఉన్నట్లుగా సూర్యుడు ఉంటే సూర్యుడి ఎండ వేరు, సూర్యుడు వేరు అన్నట్లుగా చంద్రుడు వేరు వెన్నెల వేరు అన్నట్లుగా ఎరుకయ్యే స్వభావము కలది ఆత్మ. ఆత్మ ప్రకాశము లేకపోతే బయలు. ఆత్మ ఉండి ఆత్మ ప్రకాశము లేకపోత ఆత్మే బయలు. బయలే బ్రహ్మము.

       ప్రత్యగాత్మను బయలాత్మ అని అనము. కేవలాత్మ, అఖండాత్మ, అయ్యాక ఇక బ్రహ్మనే పేరు మార్చుకోండి. అఖండాత్మ అఖండ ఎరుక, ఏదైనా గాని. ఖండాఖండములు లేనిది ఉత్త బట్టబయలు ఏమీ లేదు అనేదేదో ఆత్మపోతే ఉన్నదున్నట్లుంది. అంతకుముందు ఎన్ని రూపాలుగా ఉండి, చివరకు కేవలాత్మ అయ్యిందో, అవన్నీ లేనెరుకే. భ్రాంతిలోన అవన్నీ భ్రాంతి రహితమైతే బయలే ఉన్నదున్నట్లున్నది. ఆత్మ తన ప్రకాశమును విరమించుకుంటే అవ్యక్తంగా కూడా లేకుండా చేసుకుంటే ఆత్మ ఆవరణగా వ్యక్తం కాకుండా, నిరావరణగా ఉంటే అదే బయలు.

       వేదాంతం ఈ రెండింటినీ సమన్వయం ఎలా చేసిందంటే, మూడొంతుల బ్రహ్మ సృష్టికతీంగా ఉన్నదున్నట్లుగా అచలముగా, పరిపూర్ణముగా నిర్వికారముగా ఉన్నాడు. ఒక వంతు బ్రహ్మను మాయ ఆశ్రయించి ఆ బ్రహ్మము నిజానికి అచలము, పరిపూర్ణము, నిర్గుణము అయినప్పటికీ, ఈ మాయ ఏ బ్రహ్మమునైతే ఆశ్రయించిందో ఆ బ్రహ్మమును సగుణముగా చూపించి, ఆ బ్రహ్మవల్ల సర్వమూ కలిగినట్లుగా సర్వకారణముగా ఉన్నట్లుగా చూపిస్తోంది.

       పురుషుడు దేనితో కూడితే దానియొక్క గుణములబట్టి దానియొక్క నామముతో, రూపముతో, గుణముతో విశేషంగా చెప్పటం జరుగుతుంది. ఆ విశేషణంగా ఉన్నవన్నీ మాయా కల్పితములు. అవన్నీ తీసేసి చూస్తే, పురుషుడు మాత్రం ఎక్కడున్నాడు? పురుషుడు లేడు. ఆ పురుషుణ్ణి ఏమన్నారంటే ఉత్తమ పురుషుడని, పురుషోత్తముడని, దాన్నే ఘనరూప అఖండ ఎరుకని అంటాము. మరతను మళ్ళీ మాయావరణంలో ప్రకాశించాల్సిన పని లేకపోతే ఆ పురుషోత్తముడే అచల పరిపూర్ణము.

       ఒకవంతు బ్రహ్మను మాయ ఆశ్రయించి ఈ సృష్టికార్యం చేసి ఆ బ్రహ్మనే సర్వకారణంగా చూపించినపుడు ఆ బ్రహ్మనే పొందటం వరకు ఒక ప్రయాణం. మూడొంతుల బ్రహ్మ దగ్గరకెళ్ళటానికి ఈ బ్రహ్మ జ్ఞానాన్ని కూడా విచారణ చేసి ఈ బ్రహ్మ ఎరుక బ్రహ్మే గాని, నిజమైన బ్రహ్మ కాదు. నిర్గుణమైన త్రిగుణరహితమైన ఉన్నదున్నట్లున్న అచల పరిపూర్ణమైన మూడొంతుల బ్రహ్మమే పరమపదము, మోక్షము అనేది ఈ పరిపూర్ణ బోధ ద్వారా పరిపూర్ణ బ్రహ్మ నిర్ణయాన్ని మనకు అప్పచెప్పాలి. గురువుద్వారా మార్జాల కిశోర న్యాయంగా, ఏ సాధన నీకెందుకు వీసానికి పనికిరాదు అనే పద్ధతిలో ఆ మూడు వంతుల బ్రహ్మము అనేటటువంటి అచలము సిద్ధిస్తుంది. ఈ సగుణ బ్రహ్మజ్ఞానం దాకా ఈ మాయావరణలోనే, మాయలో వ్యాపించిన బ్రహ్మను పట్టుకోవడమనేటువంటిది ఒక ప్రమాణం. ఇది సాధనతో కూడినది. అనుష్ఠానముతో కూడినది. ఉపాసనతో కూడినది. బ్రహ్మవిద్‌ బ్రహ్మైవ భవతిగా వస్తుంది. ఇది బ్రహ్మ చింతనచేసి బ్రహ్మాకారం పొందినట్లుగా వస్తుంది. 

       ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? దృక్కుకు దృశ్యం అన్యమని చెప్పి దృశ్యములేని దర్శనానుభవము లేనటువంటి దృక్కుని వేరుపరుస్తున్నాము. ఆ దృక్కే ఆత్మ అంటున్నాం. దృశ్యమునందు దృక్కుగా చూడబడే వస్తుజాలమునందు చూచువాడుగా ఉన్నదే ఆత్మ. చూచువాడే గానీ చూచికూడా చూడనివాడే. చూడటానికి ఆధారమైనవాడు. చూచి చూడనివాడు. చూచేది మళ్ళీ మనస్సు, బుద్ధి, ఇంద్రియాలే. ఇంద్రియాలకు సత్తా అందితే అవి చూస్తున్నాయి. అవి చేసేది నువ్వు కాదు. నీవు సత్తా మాత్రంగా చైతన్యం మాత్రంగా శుద్ధ చైతన్యంగా ఉన్నావు. కనుక దృక్కు దృశ్య వివేకాన్ని పైకి నడిపితే దృగాత్మగా ఏది ఉన్నదో అది బయలే. దానికి దృశ్యము దర్శనము అనేటువంటి అనుభవాలు లేవు. ఈ అనుభవాలతో కూడినటువంటి ఎరుక కాదు. దృశ్య దర్శనానుభవాలమీద ఏ ఆధారమువల్ల తాను ఎరుకలోకి దిగుతున్నాడో ద్రష్టత్వం సంభవిస్తోందో, అటువంటి దృక్కులో  దృశ్యదర్శనాలు లేకపోతే ద్రష్టత్వంనుంచి విడుదలవుతాడు. ఎరుకనుంచి కూడా విడుదల అవుతున్నాడు. ద్రష్టత్వం పోయేసరికి తనలో ఉన్న ఎరుకనుంచి విడుదల అవుతున్నాడు. తనలో నుండి ఎరుక విడుదలవడానికే మూలం లేని గుర్తెరిగే శరీరం, గుర్తెరిగే దృక్కు ఏమీ లేదుఅని చెబుతున్నాము. దృక్కుకు చెబుతున్నాం ఆ మాట. ద్వాదశిలో ఏమి చెబుతున్నాము. ఈ ఉత్త బట్టబయలు ఏమీలేదు అని దృశ్య రహితం, దర్శన రహితం చేస్తున్నాము. దృశ్యము రహితమయినపుడు అంతా ఉత్తదే అయినపుడు ఈ ఉత్త బట్టబయలు ఎరిగేది కాదు కదా. మరి ఎరిగే ఎరుక ఇంకెక్కడున్నాడు? ఎరిగే దృక్కు కూడా బట్ట బయలయ్యేసరికి, దృక్కుకు తన ఉనికి కలిగి ఉన్నట్లు భ్రాంతి ఇంకా ఉన్నది. దృశ్య రహిత స్థితిలో ఉన్నాడు. దర్శనానుభవం రహిత స్థితిలో ఉన్నాడు. మూడు గుణాలే దృశ్యానికి, దర్శనానికి, అనుభవానికి హేతువు కనుక అవన్నీ ఎప్పుడైతే లేవో, త్రిగుణ రహితమవుతున్నాడు. త్రిగుణ రహిత స్థితిలో నిజానికి ఎరుక లేదు. మరి సచ్ఛిష్యుడు ఎరుకతో ఉన్నాడు కదా! త్రిగుణ రహితము ఇంకా కావలసి ఉన్నది. బయలు నిర్ణయంగా ఉన్నాడు. కనుక ఎరుక విడిపించేటువంటి గురువు కావాలి. ఆ శిష్యుని ఉనికే బ్రహ్మ నిష్ఠగా ఉంది. అటువంటి ఉనికియే నిష్ఠగా ఉన్నటువంటి దృక్కుకు మూలంలేని గుర్తెరిగ శరీరం ఏమీలేదనే షోడశీ మంత్రంతో ఎరుక లేకుండా చేస్తున్నాడు గురువు.

       ఇట్లా స్వయం ప్రకాశమైనటువంటిది, నిరావరణంగా ఉండి ఆవరణయందు ప్రకాశించకుండా ఉండేటువంటి కేవలాత్మ, ఆత్మ స్వరూపుడు కాడు. విషయ సమత్వం పొందిన సాధకుడు ఇట్టి ఆత్మ అల్పద్రష్ట కాదు, క్రమద్రష్టకాదు, అద్రష్టకాదు, అన్యథా ద్రష్ట కాదు. అంటే చూడండి. ఇందులోనే మొత్తం వేదాంతమంతా వచ్చింది.

       అల్పద్రష్ట కాదు: అంటే కించిజ్ఞుడు కాదు. జీవుడు కాదు. క్రమద్రష్ట కాదు: క్రమ పరిణామము చెందుతున్నదని దర్శించేవాడు కాదు. అద్రష్ట కాదు: అద్రష్ట అంటే సుషుప్తి, మరణము, అజ్ఞానము లేనివాడు. అన్యథాద్రష్ట కాదు: తన్ను తానెరుగకుండా ఇతర విషయాలను ఎరిగే దాన్నుంచి విరమించుకున్నవాడు. ఇవన్నీ పోతే అంతఃకరణ సాక్షిగా ఉండి నిర్ణయించేవాడు. ఆ సాక్షికే ఈ పరిపూర్ణ బోధ. చివరికి ఆ సాక్షే లేనివాడైతే, వాడే బయలై సాక్షిరూప ఎరుక కూడా ఏమీలేక, అసలు ఎరుక రూపమే లేనివాడు.

       ఆత్మ సూర్య ప్రకాశమైతే, బుద్ధి చంద్రప్రకాశము. ఎట్లా అంటే, సూర్యప్రకాశమే చంద్రుడు అనే గ్రహం మీద, గోళంమీద పడి, చంద్ర ప్రకాశం వెన్నెలగా మనకు వస్తుంది. సూర్య ప్రకాశం లేకపోతే చంద్రుడికి వెన్నల లేదు. సూర్యప్రకాశం యొక్క ప్రతిబింబ ప్రకాశమే, ప్రతిఫలించిన ప్రకాశమే వెన్నెల. అలాగే సూర్య ప్రకాశంలాంటి ఆత్మ, నీ యందు ప్రకాశిస్తూ ఉంది. ఒక గోళంలాంటి బుద్ధి, ఆ బుద్ధిమీద ఆత్మ ప్రకాశం పడి ప్రతి ఫలించి, ఆ ప్రతిఫలించిన ప్రకాశం తోటి, అహం అహం అనే స్ఫురణ కలిగింది కనుక, బుద్ధిలో ప్రతిబింబించిన ప్రకాశమే చిదాభాసుడు. చిదాభాసుడు అంటే, చైతన్య ప్రకాశము యొక్క ప్రతి బింబ ప్రకాశము. భాసఅంటే ప్రకాశము. ఆభాసఅంటే ప్రతి ఫలించిన ప్రకాశము. చిత్‌ ఆభాస’ - చిత్‌ ప్రకాశము యొక్క ప్రతి బింబ ప్రకాశము. చిత్‌ప్రకాశము యొక్క ప్రతి బింబ ప్రకాశమే నేను, నేను అనే అహంస్ఫురణ, ‘నేనుఅనే ఉనికి. ఉనికే ఆ తరువాత నేనుఅయ్యింది.

       ఉండుటఅనే ఈ నేను అనే అహం మానవునిలో ఉంది. పశుపక్ష్యాదులలో లేదు కాని, ఉన్నాయని వాటికి తెలుసు. ఉన్నాయని తెలియడమే ఉనికి. ఆ ఉన్నాయని తెలియడము బుద్ధి యొక్క ప్రతిఫలించిన ప్రకాశము. అట్లాగే ఆత్మని సూర్యుడితో, బుద్ధి యొక్క ప్రకాశాన్ని, చిదాభాసుడిని వెన్నెలతో పోల్చారు. మనలో కూడా అంతఃకరణ ప్రతిబింబ ప్రకాశమే నేను. అంతఃకరణంలో ప్రముఖమైనది, ముఖ్యమైనది బుద్ధి. ఎందుకంటే, బుద్ధి నిర్ణయం ప్రకారమే అన్నీ జరగుచున్నవి కనుక. బుద్ధి నిర్ణయానుసారము అయినటువంటి జ్ఞానము, ప్రతిబింబ ప్రకాశ జ్ఞానము.

       ఆత్మ ప్రకాశంలో ఏముంది? చిత్‌ జ్ఞానం ఉంది. తాను తానైనటువంటి జ్ఞానము ఉంది. బుద్ధి విషయాలతో కూడితేనేమో, బుద్ధి ద్వారా ప్రతిబింబించిన ప్రకాశములో, ఈ నేను అసత్యనేను, విషయాలతో కూడిన నేను అవుతుంది. అదే బుద్ధి శుద్ధమై, చిత్త వృత్తి లేక అంతఃకరణము నిర్మలమై ఉంటే, ఆత్మ ప్రకాశము అటువంటి బుద్ధి మీద ప్రతిబింబిస్తే అది యదార్థ నేను. అహం అనే స్ఫురణ, సోహం అనే జ్ఞానము. అతి సమీపంగా ఉన్నందున ఆత్మ ప్రకాశానికి బుద్ధి అతి సమీపంగానే ఉండడము వల్లనే సూర్యరశ్మి ప్రతిఫలించిన ప్రకాశము, చంద్రుని యొక్క వెన్నెలలాగా ఎలా వుందో, బుద్ధి ప్రకాశము అలా ఉంది. బుద్ధి గతమైన జ్ఞానము ప్రతిబింబ జ్ఞానమే. అది నేను అనే దానితో కూడి ఉంటుంది. అప్పుడు నేను అసత్య నేను అవుతుంది. మిథ్యాహం. ఇక్కడ సమీప అనే పదం ఎందుకు వాడారు?

       వెలిగించి ఉన్న స్టవ్‌ మీద, మంటమీద గిన్నె పెట్టారు. మంట, గిన్నె కలిసిపోయినాయా? ఆ గిన్నెకు అతి సమీపంగా ఈ మంట ఉన్నది. ఆ మంట యొక్క అగ్ని తత్వము గిన్నెకు తాకి, గిన్నె వేడిక్కెంది. దూరంగా ఉంటే వేడెక్కలేదు. సమీపంగా ఉంటే వేడెక్కింది. గిన్నె మంట కలిసిపోయినాయా? అలాగే, బుద్ధి ఆత్మ కలిసిపోవు. ముఖ్యంగా ఆత్మ బుద్ధితో కలువదు.

    ఆత్మ ప్రకాశము వల్ల, బుద్ధి ప్రతిఫలించి, ప్రకాశించి బుద్ధి కర్మానుసారణి అనే పద్ధతిలో, బుద్ధి కర్మల విషయంలో చేయాల్సిన విధంలో కర్మ అనుభవం వచ్చిన తరువాత దానిని ప్రియంగానో, అప్రియంగానో ఎలా స్వీకరించాలనే విషయాన్ని బుద్ధి నిర్ణయిస్తుంది. బుద్ధి నిర్ణయం చేసే జ్ఞానం ఏదైతే ఉందో, అది ఆత్మ ఆత్మప్రకాశం యొక్క ప్రతిబింబించిన ప్రకాశం. ఇక్కడ ప్రకాశము అంటే జ్ఞానము. అంటే ఆత్మజ్ఞానము. ఆత్మజ్ఞానము యొక్క ప్రతిబింబ జ్ఞానమే బుద్ధి జ్ఞానము. శుద్ధ బుద్ధి అయితే రెండూ ఒక్కటే. ఆత్మప్రకాశము, బుద్ధి ప్రకాశము, బింబ, ప్రతిబింబ ప్రకాశములలో ఏ భేదము ఉండదు. కాని, బుద్ధి విషయాలతో కూడినప్పుడు. బుద్ధి ప్రకాశము విషయానుభవాన్ని ఇస్తుంది కానీ, ప్రకాశ అనుభవాన్ని ఇవ్వడం లేదు. ఈ రెండూ సూర్యరశ్మి ప్రకాశ మాత్రమున జరుగుచున్నాయి కాని, సూర్యరశ్మికి ఏ మాలిన్యము అంటటడం లేదు.

       ఇంకొక ఉదాహరణ. సూర్య ప్రకాశమువల్ల, సముద్రంలో నీళ్ళన్నీ ఆవిరై, మేఘమై, వర్షం పడుతోంది. సముద్రంలో ఉప్పునీరున్నా, ఉప్పునీటిలో కూడా మంచినీరే ఆవిరైనది. మురుగు గుంటలో నీరు కూడా ఎండ వేడికి ఆవిరైతే, మంచి నీరే లాక్కుంది. అది మేఘమై వర్షించింది. మంచి నీళ్ళు గాని, ఉప్పునీరు గాని, మురికి నీరు కాని, ఏ నీరైనా సరే, పేరుకు మలం ఉంది. మలము సూర్యప్రకాశముతో ఎండిపోయింది. ఆ మలంలో ఉన్నటువంటి ద్రవాన్ని కూడా ఆ సూర్యరశ్మి, ఆ సూర్య కిరణాలలో ఉన్నటువంటి వేడి, పీల్చి, ఆ శుద్ధ జలాన్ని మేఘరూపంలో పెట్టి, మళ్ళీ వర్షించింది. కనుక సూర్యరశ్మి ఉప్పునీళ్ళ మీద పడ్డా, మలినమైన నీళ్ళమీద పడ్డా, మలంమీద పడ్డా దేనిమీద పడ్డా వాటియొక్క మాలిన్యం సూర్యరశ్మికి ఎలా అంటలేదో, సూర్యుని యొక్క ఉష్ణత్వం వలన అన్ని పనులు ఎట్లా అవుతున్నాయో, అట్లా ఆత్మ వీటన్నింటికీ అసంగము. ఆత్మకు వీటన్నింటితో అంటు కానీ, సంగత్వం కానీ లేదు.

       అందుకే సమీపం అనే పదం వాడారు. ఉప - అని వాడుతూ ఉంటాము వేదాంతంలో. ఉప వాసము. సమీపంలో వశిస్తున్నాము. ఆత్మకు సమీపంగా వశిస్తున్నాము. ఆత్మే అయ్యావు అనేది కరెక్టు కాదు. అయితే సమీపంగా వశిస్తున్నాము అనే మాట భ్రాంతిలోనే. ఆత్మ వేరు, నేను వేరు అన్నప్పుడే కదా ఉపవాసము. కాని  నీవే ఆత్మవి అయినప్పుడు  భ్రాంతి పోయినప్పుడు నీవు ఆత్మవి. నీవే ఆత్మవి అయినప్పుడు ఆత్మకు సమీపంగా ఉండేది ఏముంది? అంటే, భ్రాంతిలో ఉన్నాం కాబట్టి, అజ్ఞానంలో ఉన్నాం కాబట్టి, అజ్ఞాన నివృత్తి చేసుకుంటూ, భ్రాంతి రహితం చేసుకుంటూ, భ్రాంతిలో చేసే ప్రయాణంలో సమీపానికి వెళ్తాం. భ్రాంతి రహితం అయిన తరువాత, ప్రయాణమే లేదు. ఒక్క ముసుగు తొలగింది అంతే! ఒక తెర చినిగింది అంతే!

       తెర ఉన్నంత వరకూ స్వప్రకాశము స్వానుభవానికి రాలేదు. స్వయం ప్రకాశము స్వానుభవానికి రాలేదు. అజ్ఞాన ఆవరణ అనే తెర తొలగేసరికి, స్వస్వరూపము ఉన్నది ఉన్నట్లుగానే సాక్షాత్కరించింది. ఎక్కడినుంచో వచ్చిందా? ఎక్కడి నుండి రాలేదు. అలాగే ప్రతిబింబ ప్రకాశము వల్ల, విషయాలు గ్రహించబడి, విషయ జ్ఞానంగా మారింది. ఈ ప్రతిబింబ ప్రకాశము, బుద్ధిమీద పడి ప్రతిఫలించిన ప్రకాశము. ఆ ప్రకాశంలో బుద్ధియొక్క దోషాలన్నీ ఉంటాయి. కర్మ దోషాలు, గుణ దోషాలు అన్నీ ఉంటాయి. బింబ ప్రతిబింబ ప్రకాశాలు ఎలా కలుస్తాయి?

       సూర్యుని యొక్క వెలుగులో, చంద్రుని యొక్క వెలుగు తేలిపోయి లేనిదౌతుంది. అంటే, ఉన్నదేదో ఉంటుంది. లేనిది లేకుండా పోతుంది. కలవడం అనేది ఏమీ లేదు. ఆ ఏకం అవ్వడం, జీవేశ్వర ఐక్యము, బ్రహ్మైక్యము, కల్సిపోయింది అనే మాటలు వాడుతూ ఉంటాము. అయితే ఒకటి ఉన్నది, ఒకటి లేనిది. రెండూ కలిస్తే ఏమౌతుంది? ఉన్నదే ఉంటుంది, లేనిది లేకుండా పోతుంది. ఉన్నదిఅనే సాక్షాత్కార జ్ఞానములో లేనిదిఏదైతే ఉన్నదనే భ్రాంతిలో ఉందో, ఆ భ్రాంతి రహితమయ్యే సరికి అన్యము లేదు. లేనిది లేకుండా పోయింది. లేనిదే లేకుండా పోయింది. లేనిదానికి, ఉన్నదానికి ఐక్యత ఎలా కుదురుతుంది? కాని, భ్రాంతిలో చేసే ప్రయాణంలో ఐక్యత అనే మాట వాడుతారు. కనుక ఈ ఐక్యత అనే మాట వాడినంత మాత్రాన, ఆ పరమాత్మ ఈ త్రిగుణాత్మకమైన సృష్టికి అంటిలేడు, సంగమించి లేడు. అసంగడు గానే ఉన్నాడు.

       అదే తానైన వాడికి, తాను తానైన జ్ఞానము ఉన్నవాడికి, తాను అద్వయము, అనన్యము కనుక, అన్యము లేదు కనుక, అతనికి ఈ ప్రపంచమే తోచదు. ప్రపంచమే లేనప్పుడు ఇంకా మాలిన్యం అంటుకునేది ఏమున్నది? ఇతర వస్తు సాన్నిధ్యమును బట్టే, సూర్యుడిని జగత్‌ చక్షువు అని చెప్పుచున్నారు. జగత్తు మొత్తానికి సూర్యుడు సాక్షిగా ఉన్నాడంటున్నారు. సూర్యుడు నిజంగా చూస్తున్నాడా? సూర్య ప్రకాశం యొక్క సత్తాచేత చూచుట అనేది జరుగుతోంది. అయినా సూర్యుడిని జగత్‌ చక్షువు అన్నాం.

       సూర్యచంద్రుల సాక్షిగా, పంచభూతాల సాక్షిగా అని ప్రమాణాలు, ప్రతిజ్ఞలు చేయించుతూ ఉంటారు. అంటే, సూర్యుడు సాక్షిగా ఒక కన్నుబెట్టి చూస్తున్నాడా? లేక సాక్షిగా ఏమన్నా సాక్ష్యం చెబుతాడా? అది కాదక్కడ. సూర్యప్రకాశము ఎల్లెడలా ఉండి, ఆ సత్తా అందుబాటు అయినప్పుడు, జీవ సృష్టి అంతా కూడా సూర్యప్రకాశంలో ఉండే శక్తి చేతనే, మనుగడ సాగిస్తోంది. అయిన సూర్యుడిని కర్మ సాక్షి అని, జగత్‌ చక్షువుగా ఉందని అంటున్నాము. ఆ ప్రకాశమే జ్ఞానము కాబట్టి అది జ్ఞాన చక్షువు. సూర్యుడు అనేది ఒక ఉదాహరణ, సూర్యుడికి కూడా ఆత్మస్వరూపుడు అయినవాడు సూర్యనారాయణుడున్నాడు. సూర్యుడు వేరు, సూర్య నారాయణుడు వేరు. సూర్యుడు బయటకు మండేటటువంటి గోళం. అందులో ఉన్నటువంటి అంతర్యామి నారాయణుడు. అందుకని సూర్యనారాయణఅంటూ ఉంటారు. ఆదిత్య హృదయం అంటారు. సూర్యుడిని కొలిచినా, సూర్యుడిలోపల ఉన్నటువంటి నారాయణుడిని కొలిచినా, బయటకి సూర్యుడే అయినప్పటికి అంతర్యామిని కొలుస్తున్నాము.

       అలాగే గురువుగారి యొక్క శరీరానికి నమస్కారం పెట్టినా, ఆ గురువులో ఉన్నటువంటి అంతర్యామి అయినటువంటి, జ్ఞానస్వరూపానికి నమస్కరిస్తున్నారు మీరు. గురువుగారి శరీరానికైతే నమస్కారం పెట్టాల్సిన అవసరం లేదు.

        సూర్యునకు నేను అని కాని, నాది అని కాని ఒక్క కోరిక గాని లేదు. అతని సాన్నిధ్యము మాత్రముననే చీకటి పోయి వెలుగు వచ్చి, సర్వము ప్రకాశించుట వలన, జీవజాలము మనుగడ సాగిస్తున్నాయి. ముందు సూర్యుడు లేకపోతే, అంతా చీకటిగా ఉన్నప్పుడు తరువాత ఆ సూర్యుని యొక్క ప్రకాశం చేత, చీకటి అనేది లేకపోయి, అంతా ప్రకాశముగానే ఉంటోంది. అలాగే సృష్టికి పూర్వము తమస్సుగా అజ్ఞానాంధకారముగా ఉండేటటువంటి గాడాంధకారమున్నది. అందులో పరమాత్మ ప్రకాశించే సరికి, ఈ జగత్తంతా కూడా ఆ గాడాంధకారము తొలగి, ప్రకాశవంతం అయ్యింది. ఈ ప్రకాశవంతమైన దానిలో, ప్రకాశము వరకే తీసుకుందాము. చైతన్యము కూడా ఉంది కాబట్టి, ఆ పరమాత్మలో సృష్టి అంతాకూడా చైతన్యవంతం అయ్యింది. ఆ పరమాత్మలో ప్రజ్ఞానం కూడా ఉంది కాబట్టి, ప్రజ్ఞానవంతం అయ్యింది. ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యము చేత, ప్రకాశవంతమైంది, చైతన్యవంతమైంది, ప్రజ్ఞానవంతమైంది.

       లక్క, చెక్క చక్కగా అంటుకొనును. బుద్ధి, ఆత్మ అట్లు కాదు. రెండు చెక్కలకు మధ్యలో లక్క వేస్తే, బిగిసి పోతుంది. (లక్క అంటే ఇప్పుడు ఫెవికాల్‌ అంటాం) ఇవాళ కుర్చీలు, బల్లలు చేయాలంటే, సన్‌గ్లాస్‌ తీసుకువచ్చి, ఫెవికాల్‌ పెట్టి అతికిస్తారుగా! అది గట్టిగా అంటుకుపోతుంది. అంటే, లక్కకి, చెక్కకి అంటుకునేటటువంటి తత్వం ఉంది. మరి ఆత్మకి, బుద్ధికి ఉందా? అందుకే సాన్నిధ్యం అంటున్నాడు. దాని ప్రభావం బుద్ధి మీద పడ్డప్పట్టికీ, ఏమీ కలవడం లేదు. ఆత్మ, బుద్ధి రెండూ కలవడం లేదు. లక్క, చెక్క అంటుకుంటుంది. కాని బుద్ధి, ఆత్మ అట్లా కాదు. అవి భ్రాంతిలో కలుస్తాయి అంటున్నాము. కలుస్తుందని అంటే సాధనచేత విడదీస్తే లేనిది లేకుండా పోతుంది. భ్రాంతి రహితం అవుతుంది. సత్యవస్తువు సాక్షాత్కారం అవుతుంది. అంతకు ముందు ఉన్నవాడు, దీనిలో ఐక్యమయ్యాడని, ఇలాంటి ఒకమాట వేదాల్లో ఉంది. విచారించితే ఐక్యత అనేది లేదు.

        నీళ్ళు నిప్పులో ఐక్యం అయినప్పుడు, నీరు ఆవిరియై నిప్పే ఉంటుంది. నిప్పు నీళ్ళలో ఐక్యం అయినప్పుడు, నీళ్ళల్లోని నిప్పు ఆరిపోయి, నీరే ఉంటుంది. అట్లా రెండవది లేనిది లేకుండా పోతుంది. ఉన్నది ప్రముఖంగా, ఘనంగా, గొప్పగా ఏదైతే ఉందో అది బ్రహ్మ అనేటటువంటిది అన్నిటికంటే, అన్నిటికంటే గొప్పదై, దానికంటే గొప్పది లేనిది. కోటానుకోట్ల రెట్లు, ఈ ప్రాపంచిక వస్తువుల కంటే ఎక్కువైనది. కనుక దానియందు ఏదైనా సరే, విలీనమైపోతుంది.

       సూర్యగోళంలో ఉన్నటువంటి, లక్షల డిగ్రీల సెంటీగ్రేడ్‌లో లేక ఫారిన్‌ హీట్‌లో, ఉన్నటువంటి ఉష్ణములో ఎటువంటి వస్తువులైనా సరే, తమ అస్తిత్వాన్ని కోల్పోతాయి. ఆ నామరూపాల్ని కోల్పోతాయి. అదే విధంగా దానిని ఐక్యతగా తీసుకోకూడదు. మనస్సు వెళ్ళి ఆత్మలో కలిస్తే, మనోలయం అవుతుంది. ఆత్మే మిగులుతుంది. మనస్సే భ్రాంతికి మూలం. మనస్సే మాయ. మాయే లేని మాయ. లేని మాయ అంటే, లేని మనస్సే. లేని మనస్సే ఆత్మలో కలిసిపోయింది. ఆత్మలో మనస్సు విలయమైంది అన్నప్పుడు, మనస్సు యొక్క అస్తిత్వము లయం అయ్యింది అంటున్నాము. అసలు ఆ మనస్సే లేనిది అన్నప్పుడు, లయం అనే మాట ఎక్కడ ఉంటుంది అసలు? ఐక్యతా ఉండదు, లయము ఉండదు. లేనిది లేకుండా పోవడమే. ఉన్నది ఏదో దాని యొక్క సాక్షాత్కార జ్ఞానం. నీకు లభించిన తరువాత, ఆ జ్ఞానం ఎటువంటిది అంటే, ‘ఏకమేవాద్వితీయం బ్రహ్మ’ - అనేటటువంటి జ్ఞానం. కనుక అటువంటి జ్ఞానంలో బ్రహ్మతప్ప రెండవది ఉండదు.

       కనుక రెండవది ఉంది, ఉంది అనేటటువంటి భ్రాంతి ఏదైతే ఉందో, ఆ భ్రాంతి రహితమైతే ఇది సాక్షాత్కారమౌతుంది. లేక సాక్షాత్కారమైతే భ్రాంతి రహితమౌతుంది. తాడు మీద పాము తోచినప్పుడు, తాడు యొక్క సాక్షాత్కారము అయితే, తాడే అనేటటువంటి అనుభవం కలిగినప్పుడు, అది తప్ప రెండవది లేనప్పుడు, పాము అనే భ్రాంతి ఎక్కడ ఉంటుంది? పైగా పాము, తాడు. రెండూ ఎక్కడ ఉన్నాయి? భ్రాంతిలో తాడే. పాముగా కనబడింది. భ్రాంతి రహితం అయితే, పాము కనబడనే కనపడలేదు. ఆ స్థానంలో సత్యవస్తువు అయినటువంటి తాడు కనబడింది. ఇప్పుడు పాము, తాడులో లయం అయ్యింది అంటామా? అలాగే మనస్సు, బుద్ధి ఆత్మలో లయం అయ్యింది అంటామా? కానీ, ప్రతీతి. ఇలా అంటున్నారు. కాని మనం అవగాహన చేసుకోవాలి. అటువంటి ఐక్యత, నిజమైన ఐక్యత కాదని, మనోలయం అంటే, భ్రాంతి పోయిందని అర్థం చేసుకోవాలి. భ్రాంతి పోతే సత్యవస్తువు ఉన్నది ఉన్నట్లుగానే గోచరమౌతుందా? నీవే అది అయినప్పుడు గోచరం కూడా కాదు. సాక్షాత్కారం అవుతుంది. నీవే ఆ బ్రహ్మము అయినప్పుడు బ్రహ్మ కనపడేదేమిటి? తాడు, పాము రెండూ కనబడడం కాదు. అందులో తాడు నీవే అయివున్నావు. తాడు నీవైనప్పుడు, తాడు నీవనే అనుభవం నీకు ఉంటుంది కానీ, తాడు అన్యముగా ఉండదు కదా! తాడు పరోక్షము కాదు. అది అపరోక్షము. అలాగే బ్రహ్మ అపరోక్షము.

       బాల్యంలో ఉన్నప్పుడు బాల్యానుభవం ఉంది. యవ్వనానుభవం లేదు. యవ్వనంలో యవ్వనానుభవం ఉంది. బాల్యానుభవం పోయింది. యెక్కడికి పోయింది. బాల్యానుభవం? యవ్వనానుభవంలో లయం అయ్యిందా? అట్లా అంటే అనవచ్చు కానీ, అది కరెక్టు కాదు. అదే మనోలయం అన్నా, జీవేశ్వర ఐక్యం అన్నా, జీవ బ్రహ్మ ఐక్యం అన్నా. జీవ భావము, అజ్ఞానము చేత ఒక భ్రాంతిలో పుట్టింది. అజ్ఞానం చేత అవిద్యచేత భ్రాంతిలో పుట్టింది. అజ్ఞానం తొలగగానే, భ్రాంతి రహితం కాగానే, పుట్టిందనే మాటే అబద్ధం. పుట్టిందే అబద్ధమైతే, మళ్ళీ లయమా ? పుట్టినదానికి లయం ఉంటుంది కానీ, పుట్టని దానికి లయమేమిటి? పుట్టటం అబద్ధమైనప్పుడు, లయం కూడా అబద్ధమే. ఐక్యత అనేమాట వాడినప్పటికిని, దానిని ఆ రకంగా తీసుకోకూడదు.

       సూర్యునికి, ‘నేనుఅని కాని, ‘నాదిఅని కాని, ఒక్క కోరిక గాని లేదు. కాని సూర్యరశ్మివల్ల మొక్కలు పెరుగుతున్నాయి. పత్రహరితం అవుతోంది. పళ్ళు, కాయలు అన్నీ వస్తున్నాయి. చీకటి తొలుగుతోంది, ప్రకాశం ఉంటోంది. సూర్యుని యొక్క శక్తి చేత, జీవచైతన్యం అంతా కూడా, ఈ భూమి మీద ఉంటోంది. ఆ సూర్యుని యొక్క ఆకర్షణ, వికర్షణ చేత, మనకు అర్థం కాని శక్తి ఏదైతే ఉందో, దాని వల్ల భూమి సూర్యుని చుట్టూ తిరుగుతోంది. సూర్యునికి ఢీకొట్టకుండా, సూర్యునికి దూరంగా వెళ్ళకుండా, ఒక కక్ష్యలో భూమి తిరుగుతోంది. భూమిని తన చుట్టూ అలా తిప్పించుకునే శక్తి సూర్యుడిలో ఉంది. ఆ శక్తిగా అక్కడ ఉన్నాడు, అంతే! శక్తిని వినియోగించే కర్తగా లేడు. సూర్యుడు సహజంగా ప్రకాశిస్తున్నాడు. ఆ సహజ ప్రకాశంలో కొన్ని శక్తులు ఉన్నాయి. దానికి ఒక స్వభావం ఉంది. దానితో పాటు దానికి ఆ లక్షణం ఉంది. అది తీసేసేది కాదు. అది ఉన్నంత సేపూ దాని లక్షణం అలానే ఉంటుంది. ఆ లక్షణాన్నిబట్టి ప్రకృతిలో ఏమేమీ జరగాలో అవి జరుగుతున్నాయి. ఇవన్నీ ఆయన జరుపుతున్నాడా? ఆయనకు ఇచ్ఛా ప్రయత్నాలు లేవు.

        కరెంటు ఏమైనా ఫ్యాన్‌ని త్రిప్పుతోందా? కరెంటు ఫ్యాను యొక్క నిర్మాణంలో, గోళకములో ఉనికి కలిగియున్నది. లైట్‌లో కూడా ఉనికి కలిగియున్నది. ఏసీలో ఉనికి కలిగియున్నది. ఏసీని చల్లబరిచేటటువంటి పని కరెంటుది కాదు. వేడి చేసే పనీ కాదు. ఫ్రిజ్‌లో చల్లగా ఉంచే పనీ కాదు, ఫ్యానుని త్రిప్పే పనీ కరెంటుది కాదు. అయితే కరెంటు లేకుండా అవుతుందా? అంటే, సాన్నిధ్యంచేత అవుతోంది. అది కర్త, భోక్త కాదు. అక్కడ నేను, నాది అనేది లేదు. దాని యొక్క సాన్నిధ్యంచేత, దానికి ఏ లక్షణాలు అయితే ఉన్నాయో, ఆ లక్షణాలు ఈ ప్రకృతికి సంబంధించిన వస్తువుల మీద పడి ప్రభావం చూపించినప్పుడు, ఆ ప్రభావానికి ఈ వస్తువులలో పరిణామం జరుగుతోంది. చూసేది ఉంటే కన్ను చూస్తోంది, వినేది ఉంటే శ్రోత్రేంద్రియము వింటోంది, ఆలోచించేది ఉంటే మనస్సు ఆలోచిస్తోంది. ఆత్మ ఆలోచించడం లేదు. ఆత్మ కేవలం సత్తా మాత్రంగా ఉండి, మనస్సుకు, బుద్ధికి ఇంద్రియాలకు సన్నిహితంగా, సాన్నిధ్యంగా ఉంది. అంటకుండా అసంగంగా విలక్షణంగానే ఉంది.

       కాని, దాని చైతన్యంచేత, దాంట్లో ఉన్న ప్రజ్ఞానం చేత, దాంట్లో ఉన్న ప్రకాశం చేత, ఈ ప్రకృతిలో వ్యాపకత్వము, జడత్వానికి చేతనత్వాన్ని ఇవ్వడం, ఏ జ్ఞానము లేనటువంటి జడవస్తువులో జ్ఞానము కలిగించడము. మనసుకి శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలు ఎక్కడి నుంచి వచ్చినవి? జడమైన మనస్సు అది. కనుక ప్రజ్ఞమనస్సులోకి వచ్చేసరికి, ఈ రకంగా ఈ పనులన్నీ శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాదులన్నీ గ్రహించగలుగుతోంది. ఆత్మకు కర్తృత్వము లేదు, భోక్తృత్వము లేదు. ఆత్మ సహజంగా ప్రకాశిస్తుంది. ఆ ప్రకాశ లక్షణంలో ఒక సత్తా ఉంది. ఆ సత్తా వలన ఈ ప్రకృతి యొక్క పదార్థాలు, పరమాత్మ యొక్క ప్రకాశానికి, అతి సన్నిహితంగా ఉండడంచేత, ఆ ప్రభావానికి లోనై, ఈ జడమైన ప్రకృతి చైతన్యవంతమై, నానా రకాలుగా పరివర్తనం చెందుతూ, పరిణామం చెందుతూ, వికారం చెందుతూ ఉన్నది.

       అతని యొక్క ప్రకాశత్వములో కర్తృత్వము లేదు. సూర్యుడికి తాను ప్రకాశించాలి, ప్రకాశించకూడదు అని, రెండు రకాల ఆలోచనా కర్తృత్వము ఉంటే, ఇక్కడ ఈ దేశంలోనే ప్రకాశిస్తాను, నేను ఆ దేశంలో ప్రకాశించను అనవచ్చును. వర్షం ఉంది. అది నేను పొలాల్లోనే పడుతాను, సిమెంట్‌ రోడ్‌పైన పడితే లాభం ఏమిటి? ‘నేను పడనుఅంటోందా? ఆ వర్షం పడేదానికి కర్తృత్వం లేదు. ఆ విధంగా కొన్ని పరిస్థితులలో వర్షిస్తోంది. ఆ వర్షించేది రాళ్ళమీద పడుతోందో, పంట పొలాలకు అవసరంగా పడుతుందో తెలియదు దానికి. సూర్యుడు కూడా అంతే! ఎక్కడ ప్రకాశించాలి, ఎక్కడ ప్రకాశించకూడదు అనేటటువంటి ఇష్టాయిష్టాలు, ఇచ్ఛా ప్రయత్నాలు ఉన్నాయా? సూర్య ప్రకాశానికి ఒకచోట తక్కవ ప్రకాశించాలి, ఒకచోట ఎక్కువ ప్రకాశించాలి, ఒకచోట ప్రకాశించను, ఒకచోటనే ప్రకాశిస్తాను అనే ఇచ్ఛా ప్రయత్నంగాని, కర్తృత్వం గాని, సూర్యుడికి లేదు. అలాగే ఆత్మప్రకాశానికి, ఆత్మకి, పరమాత్మకి కూడా ఇవి లేవు. మరి జరుగుచున్నదానికి పరమాత్మదే బాధ్యత అంటారేమిటి? పరమాత్మ రక్షించాలని, పరమాత్మ అనుగ్రహించాలని అంటారేమిటి? పరమాత్మ కేవలం ప్రకాశ లక్షణంచేత ప్రకాశిస్తే, ఆ లక్షణంలో ఏవైతే ఉన్నాయో, అవి ఈ జడమైనటువంటి ప్రకృతిలో, దాని ప్రభావం వాటిమీద పడి, ఈ పరమాత్మ యొక్క ప్రకాశం, సాన్నిధ్యంచేత, అతి సాన్నిధ్యంచేత, వాటి ప్రభావాలకు లోనై ఇవి ప్రవర్తిస్తున్నాయి. అన్నీ ఒక్కతీరుగా ప్రవర్తిస్తున్నాయా? ప్రకృతిలో ఉన్న ప్రతీ వస్తువుకూ వేర్వేరు ధర్మాలు ఉన్నాయి. కంటికి చూసే ధర్మం, మనస్సుకు ఆలోచించే ధర్మం, ఇట్లా వేర్వేరుగా ఉన్నట్లుగానే, ప్రకృతిలో అనేక వస్తువులకి, అనేక రకాల ధర్మాలు ఉన్నాయి.

       పరమాత్మ యొక్క సాన్నిధ్యము చేత, దేని ధర్మం ఎట్లా ఉంటుందో, ఆ ధర్మమే, ఆ వస్తువు ధర్మంగా, ప్రకటించబడుతుంది. అంతేగాని, చెవి చూడడం కానీ, కన్ను వినడం గానీ జరుగదు. అలాగే పంచభూతాలకి, వాటి యొక్క ధర్మాలు ఉన్నాయి. ఆకాశము బయలుగా ఉంటుంది. ఇతర పదార్థాలు ఉండడానికి అవకాశం ఇస్తుంది. వాయువు అట్లా అవకాశం ఇవ్వదు. వాయువుచే చలనాలు తెలుస్తూ ఉంటుంది అంతే! చలించటంవల్ల అది వ్యాపిస్తుంది. సంకోచిస్తుంది. అగ్ని ఎక్కువైనప్పుడు వ్యాపిస్తుంది, ఉష్ణోగ్రత తగ్గినప్పుడు కుంచించుకు పోతుంది. ఆ విధంగా ఋతుపవనాలు వస్తూ, పోతూ ఉంటాయి. జలం ఉంది. అది ద్రవత్వంగా ఉంటుంది. తక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఒక్కోసారి గడ్డ కడుతుంది. ఎక్కువ ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఆవిరి అవుతుంది. ఆ జలము యొక్క ధర్మాలు అవి.

       ఇవన్నీ పరమాత్మ చైతన్యము, పరమాత్మ ప్రకాశము ఉంటేనే ఆ సత్తాతోనే ఇవన్నీ జరుగుతున్నాయి. ఆ పరమాత్మ లేకుండా కేవలం ప్రకృతే ఉంటే, ఆ ప్రకృతి జడం కనుక దాంట్లో వికారాలు కాని, పరిణామాలు కాని, చేతనత్వం కాని, కదలికలు కాని ఏవీ ఉండవు.

       అటులనే ఆత్మ కర్తృత్వ భోక్తృత్వ రహిత స్వయం ప్రకాశము. ఆత్మ స్వయం ప్రకాశము అంటే అర్థం ఏమిటి? ఆత్మని మరొకటి ప్రకాశింప చేస్తుందా? ఒక దీపం మరొక దీపాన్ని వెలిగిస్తుంది. ఆ మొదటి దీపం, రెండవ దీపాన్ని, రెండవ దీపం మూడవ దీపాన్ని వెలిగిస్తుంది. అసలు మొదటి దీపాన్ని ఎవరు వెలిగించారు? దానికి ఇంకో దీపం ఉందన్నామనుకో. మళ్ళీ దాన్ని ఎవరు వెలిగించారు అంటే, ఇంకో దీపం ఉంది అన్నాము. దీన్నే చక్రదోషం అని, అనవస్థాదోషం అని అంటుంది వేదాంతము. కనుక దీనికి ఎక్కడో అక్కడ ముగింపు ఉండాలి. కనుక ఆత్మ స్వయం ప్రకాశము. ఆ దీపమును వెలిగించే దీపం మరొకటి లేదు. స్వయంగానే వెలుగుతూనే ఉన్నటువంటి దీపము. ఆ ఆత్మకు ఆ ప్రకాశించుట అనే లక్షణము సహజముగానే ఉన్నది. దీపోదీపాంతరస్తథాఅంటే ఒక దీపము ఇంకొక దీపమును, ఈ దీపము ఇంకొక దీపాన్ని వెలిగిస్తుంది అని. ఆ మొదటి దీపాన్ని ఎవరూ వెలిగించరు. ఆ మొదటి దీపమే పరమాత్మ, పరమాత్మ ప్రకాశము స్వయం ప్రకాశము. ఇట్టి ఆత్మను మళ్ళీ సాక్షి అన్నారిక్కడ. సాక్షి అంటే ఏమిటి? అంటకుండా ఉండడము. ఈ వికారాత్మకమైన, చలనాత్మకమైనటువంటి ఈ ప్రకృతిలో ఆత్మ అతి సన్నిహితంగా ఉన్నా కూడా ప్రకృతియొక్క చలనాలు ఈ ఆత్మకు అంటవు. ఆత్మ అక్కడ ఉంటేనే జరుగుతోంది. కాబట్టి సాక్షిగా ఉంటోంది.

       అందుకే జగత్‌ చక్షువు అన్నారు సూర్యుడిని. చూస్తున్నాడు. అది కూడా మళ్ళీ అంటకుండా చూస్తున్నాడు. అంటితే విషయాలున్నాయి. అంటకుండా చూసేవాడికి విషయాలు లేవు. ఇద్దరూ కొట్టుకుంటున్నారు. పోట్లాడుకుంటున్నారు. దెబ్బలు తగిలినాయి. అక్కడ ఒక సన్యాసి కూడా ఉన్నాడు. ఆ సన్యాసి వీరిద్దరిని చూస్తున్నాడేమోనని వాళ్ళు అనుకున్నారు. సన్యాసి, ఏదో ధ్యాన స్థితిలో ఉన్నాడు. వీరిద్దరూ కోర్టుకు వెళ్ళారు. ఇద్దరూ వాడిది తప్పంటే, వాడిది తప్పని చెబుతున్నారు. ఎదుటివాడి మీద. జడ్జిగారు దీనికి సాక్షి ఎవరూ అని అడిగారు. అక్కడ ఒక సన్యాసి ఉన్నాడు, అతను దీనికి సాక్షియే అన్నారు. ఆ సన్యాసి చూసాడా? వీళ్ళు అనుకుంటున్నారు వాడు సాక్షియని. వాడు ధ్యానస్థితిలో ఉన్నాడు. చూడనే లేదు. ఆ సన్యాసివలె వీటికి అంటకుండా, వ్యవహారం యొక్క జోలి తనకు లేకుండా, వ్యవహారం యొక్క బాధ తనకు లేకుండా, అంటకుండా అతి సాన్నిధ్యంలో విలక్షణంగా, ఉన్నప్పటికి తాను తానుగా ఉన్నవాడే సాక్షి.

       ఇప్పుడు పరమాత్మ తాను తానుగానే ప్రకాశిస్తూ, సహజ ప్రకాశముగా, ఆ ప్రకాశమే సహజలక్షణముగా ఉన్నాడు. తన ప్రకాశము యొక్క సత్తాతో, ఏవైనా జరుగుతున్నప్పటికీ, తనకేమీ సంబంధం లేదు, కర్తృత్వం, భోక్తృత్వం లేదు. ఇచ్ఛా ప్రయత్నాలు లేవు. ఈ మాటలన్నీ దేనికి ఉపయోగిస్తామో దానికి సాక్షి అని పేరు. ఇచ్ఛ, ప్రయత్నాలు లేక, కర్తృత్వ భోక్తృత్వాలు లేక, నేను నాది లేక, గుణములు, స్వభావము లేక, చలనములు లేక విలక్షణమై, అంటకుండా, తనకూ, ఈ ప్రకృతిలో జరిగే పరిణామాలకు, ఏ ప్రమేయమూ లేకుండా, అప్రమేయంగా ఉండేవాడే సాక్షి. అటువంటి సాక్షి యగు ఆత్మకు ప్రమాణాలు లేవు. ప్రమాణాలు లేవు అంటారేమిటి? మళ్ళీ ప్రమాణం అంటూ ఉంటే, ప్రమాత, ప్రమేయం రెండూ ఉండాలి. అగ్ని కాలును అన్నప్పుడు, అగ్నిలో ఉన్నటువంటి ఉష్ణత్వము వలన, కాలుట అనేది జరుగుతుంది. కాలుట అనేది ప్రమాణము. అగ్ని అనేది ప్రమాత. అందులో ఉన్న ఉష్ణత్వము ప్రమేయము. ఉష్ణత్వము యొక్క ప్రమేయము చేత, కాలుట అనేది జరిగింది. లోకంలో అట్లా త్రిపుటులు ఉంటాయి.

       జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము, ధ్యాత, ధ్యానము, ధ్యేయము, ప్రమాత, ప్రమాణము, ప్రమేయము ! జ్ఞాతకు జ్ఞానముంది. జ్ఞేయ వస్తువుకు సంబంధించి ఇక్కడ అద్వైతం వచ్చేసరికి ఏమైంది? మూడు ఉంటాయా? బ్రహ్మము ఒక్కటే అన్నప్పుడు, జ్ఞేయ వస్తువు ఒక్కటే ఉంది. అది కూడా బ్రహ్మమే అన్నప్పుడు, జ్ఞాత కూడా బ్రహ్మమే అయ్యాడు. అప్పుడు జ్ఞాత, జ్ఞేయ వస్తువు రెండూ బ్రహ్మమే. జ్ఞాత త్వం’, జ్ఞేయ వస్తువు తత్‌’. తత్వమసి అనంగానే జ్ఞాత, జ్ఞేయముకు భేదం లేదు. అభేదం. అప్పుడు ఏమైంది? జ్ఞాత, జ్ఞేయ వస్తువు ఒక్కటే అయ్యింది. అది సిద్ధాంతం.

       కాని, ఇక్కడేమిటి? అజ్ఞానంలో, భ్రాంతిలో జ్ఞేయవస్తువు అయిన పరమాత్మ జ్ఞానము జ్ఞాతకి లేదు. అజ్ఞానంలో లేదు. కనుక ఇప్పుడు జ్ఞానాన్ని సంపాదించాలి వీడు. సంపాదించి పరమాత్మ, పరబ్రహ్మ అవ్వాలి అన్నప్పుడు ఏమైంది? జ్ఞాత, జ్ఞానము, జ్ఞేయము ఉంది. ఇక్కడ జ్ఞాత ఎవరు? ప్రమాత. ప్రమాత ఎవరు? జీవుడు. జీవుడు ఎవరు? అవిద్యా ప్రతిబింబుడు. మరి ప్రమాణం ఏమిటి? జ్ఞానము. ప్రమేయము ఏమిటి? జ్ఞానమే తానైన వాడు. జ్ఞేయ వస్తువు ప్రమాణము కంటే, ప్రమేయము కంటే వేరే లేదు. అప్పుడు ప్రమేయము, ప్రమాణము ఒక్కటే. త్రిపుటి ఉన్నప్పడు అది వేరుగా ఉందేమో కానీ, వస్తునిర్ణయం అయితే బ్రహ్మమొక్కటే, పరబ్రహ్మమొక్కటే! అంటే జ్ఞానమే తానైనటువంటి జ్ఞేయము. జ్ఞేయవస్తువు నీ కంటే వేరనుకుని, అనుష్ఠానము, ఉపాసన చేసావు. ద్వైత బుద్ధితో ఆరాధన చేసావు. భక్తితో పూజ చేసావు. మరి సిద్ధాంతము ప్రకారము త్రిపుటి లేదుగా! కనుక ప్రమాతే లేడు. ప్రమాతే జీవుడు. జీవుడు అవిద్యా కల్పితుడు. అవిద్యా కల్పితం అంతా భ్రాంతి. భ్రాంతి పోతే జీవుడు లేడు, ప్రమాతయే ప్రమేయమై అద్వైతము సిద్ధించింది.

       ప్రమాత లేకపోతే ఈ జ్ఞానాన్ని సంపాదించేవాడు ఎవడు? ఈ జ్ఞానం ఎవరికి? జ్ఞానమే ఇక్కడ ప్రమాణము. వేదాలే జ్ఞాన విషయంలో ప్రమాణం. వేద ప్రమాణము జ్ఞానాన్ని నిర్వచిస్తోంది. మరి జ్ఞానం అనేది ఉంటేనే నిర్వచించిందా? లేకుండా నిర్వచించిందా వేదము? ఈ జ్ఞేయవస్తువు ఉంది. ఏ ప్రమాణం చేత తెలుసుకుంటారు? వేదాలు, వేదాంత ప్రమాణం ద్వారా బ్రహ్మను తెలుసుకున్నాము. వేదాల్లేకపోతే బ్రహ్మ తెలియదా? వేద ప్రమాణం కావాలా? ఇట్టి పరమాత్మకి అంటే ఎటువంటి పరమాత్మకి ? శరీరం నశించాక ఉండే పరమాత్మ కాదు. సాక్షియగు పరమాత్మ. సాక్షియగు పరమాత్మకి ఏ ప్రమాణము లేదు. ప్రమాతేమో అవిద్యా కల్పితం. వాడుంటే వాడికే జ్ఞానం కావాలి. అవిద్య పోవడానికి స్వరూప సాక్షాత్కర జ్ఞానం కావాలి. ప్రమాత ఉన్నాడనుకుని, జ్ఞానాన్ని సంపాదించుకుని, ప్రమేయమైనటువంటి బ్రహ్మను పొందాలి అని చూసాడు. పొందే ప్రయత్నంలో ఏం చేశాడు? బ్రహ్మోపాసన చేసాడు. దానికి ఆటంకముగా ఉన్నటువంటి అవిద్యా దోషం పోగొట్టుకుని, ఆటంకాలు తొలగించుకున్నాడు. అప్పుడు జీవుడు శుద్ధంగా మిగిలాడు. ప్రమాత, ప్రమేయానికి భేదం పోయింది. ప్రమాతే, ప్రమేయుడయ్యాడు. అప్పుడు ప్రమేయమనేది విడిగా లేకుండా పోయింది. ప్రమేయత్వము ప్రమాతత్వంగా వచ్చేసరికి, ప్రమేయము విడిగా లేకుండా పోయింది.

       ప్రమేయం విడిగా ఉంటే, వేద ప్రమాణం, శాస్త్ర ప్రమాణం ప్రకారముగా ప్రమేయ వస్తువును తెలుసుకుంటాము. ప్రమాత, ప్రమేయం ఒక్కటయ్యాక ధ్యేయ వస్తువే ధ్యాత అయ్యాక ధ్యేయ వస్తువే పరబ్రహ్మ అయ్యాక ధ్యాత పరబ్రహ్మ ఒక్కటి అయ్యాక, ప్రమాత జీవుడనేది అవిద్యా కల్పితం కనుక ప్రమాత లేడుగా! ప్రమాతే ప్రమేయం అయ్యాడు కాని, ప్రమాత లేడక్కడ. ప్రమాత ఉంటే, వాడికి అజ్ఞానం కాబట్టి, జ్ఞానం కావాలి. ప్రమాణం కావాలి. ప్రమాత లేడు కాబట్టి, ప్రమాణం ఎవరికి? జ్ఞానం ఎవరికి? జ్ఞానస్వరూపుడనైన నాకు జ్ఞానంతో ఏం పని? జ్ఞాన స్వరూపుడయ్యాక నాకు మళ్ళీ జ్ఞానం కావాలా? ఇప్పుడు అప్రమేయుడు అనంగానే, ఎవరైతే పరబ్రహ్మమో, అతను పరబ్రహ్మము అని తెలుసుకోవడానికి మరొక ప్రమాణము అక్కర్లేదు. అది ప్రత్యక్షము.

       దృష్టాంతాలతోటి, ఉదాహరణలతోటి ఎన్ని చెప్పినప్పటికి ఆయన అప్రమేయుడు. అప్రమేయుడికి ప్రమాణంతో పని లేదు. ప్రమాత అజ్ఞానంలో ఉంటే వాడికి కావాలి ఈ ప్రమాణాలు. ఆ ప్రమాణం ద్వారా కొంత సాధన చేసాడు. సాధన యొక్క చరమాంకానికి, చిట్టచివరికి వచ్చేసరికి, త్రిపుటి, ద్విపుటి రహితం చేసుకునే సందర్భంలో, ప్రమాతే ప్రమేయుడు అయ్యాడు. ప్రమేయుడికి, ప్రమాతకి భేదం లేదు. ప్రమేయత్వం ఎప్పుడైతే వచ్చిందో, అప్పుడు ప్రమాత లేనివాడయ్యాడు. అవిద్యాకల్పితుడు గనుక అవిద్య వల్ల ఉన్నవాడు కనుక జ్ఞానోదయం కాగానే అవిద్యాకల్పితము లేనిదౌతుంది. బ్రహ్మసాక్షాత్కారంలో లేకనే తోచిన ప్రపంచం లేకనే పోయింది. ప్రపంచమే తోచదు. జీవుడు కూడా అలాగే తోచడు. అప్పుడు ప్రమాత లేడు, ప్రమాణం యొక్క ఆవశ్యకత కూడా లేదు.

       అద్వైత సిద్ధాంతంలో అప్రమేయుడు అనేవాడికి, ప్రమేయం అనే పదం ఎందుకు వచ్చింది? ప్రమాత, ప్రమేయం అనేది ఉంది కాబట్టి. ఆ ప్రమేయుడెవరో నిజానికి వాడు అప్రమేయుడే. సృష్టిలో భౌతిక వస్తువుల దగ్గర, ప్రమాత, ప్రమాణం, ప్రమేయం అనే త్రిపుటి ఉంటుంది. భౌతికమైన వస్తువుల మధ్య, కర్త, కర్మ, క్రియ ఉంటుంది. అద్వైతం సిద్ధించే సరికి, ప్రమాత లేడు, ప్రమాణం లేదు. ఆ రెండూ లేనందు వలన, ప్రమేయుడు కూడా అప్రమేయుడౌతాడు.

       పరమేశ్వరుడు - సమష్టియగు బ్రహ్మమునకు మాయా సంబంధము లేకపోయినను, ఆధ్యాస ఉన్నట్లు భావించబడుతున్నది. సమష్టిగా ఉన్న బ్రహ్మకి మాయ సంబంధము లేదు. మాయ అంటే ఏమిటి? లేనిది ఉన్నట్లుగా తోపింప చేసేది. ఈ కనపడే వస్తువులు లేకనే ఉన్నట్లుగా తోచాయి. విచారిస్తే లేనివి. సత్యముగా లేనివి. అసత్యముగా భ్రాంతిలో చూస్తే, అవిద్యా దోషంతో చూస్తే, జీవభావంతో చూస్తే, పూర్వజన్మ సంస్కారాలకు అనుగుణంగా చూస్తే, నిజమనిపిస్తూ ఉన్నాయి. సంస్కారం నుండి విడుదలైనవాడికి లేదు. అవిద్య నుండి విడుదలైనవాడికి లేదు. సత్యసాక్షాత్కారం అయినవాడికి లేదు.

       ఇప్పుడు ఇబ్బంది పెట్టేది ఏమిటి? మాయా కల్పిత ప్రపంచమే. అదేం చేస్తుందంటే, బ్రహ్మకు కూడా మాయా సంబంధం అంటకడుతోంది. మాయకి సంబంధం లేకపోయినా, సంబంధం ఉన్నట్లుగా అంటకడుతోంది. అప్పుడు బ్రహ్మ సృష్టికి కారణం అని చెబుతోంది. సృష్టికి కారణం కాకపోయినా కారణం అని చెబుతోంది. లక్షణంలో ఏం చెప్పాము? అది అసంగుడు, సాన్నిధ్యముగా ఉన్నాడు, ఏ మాలిన్యం అంటకుండా ఉన్నాడు. మాయకు తనకూ ఏ సంబంధము లేదు. సహజ ప్రకాశముగా ఉన్నాడు. ఆత్మకి ఆత్మ ప్రకాశం అనే లక్షణం, ఈ రెండు విడదీయడానికి వీలులేకుండా ఉన్నాయని చెప్పాము. అటువంటి వాడికి కర్తృత్వము, భోక్తృత్వము లేవు అన్నాము. వాడికి ప్రమాణము లేదు, అప్రమేయుడు అన్నాము. అటువంటి బ్రహ్మకు ఇవాళ అసలు ఏం చెబుతున్నారు? మాయా సంబంధమైన జగత్తు, ప్రకృతి అంతా వచ్చేసరికి, సంబంధం లేకపోయినా, సంబంధాన్ని ఎవరో అంటగట్టారు.

    ఎవరు అంటగట్టారు? ఎవరైతే భ్రాంతిలో ఉన్నారో, వాళ్ళు సర్వసృష్టికి కారణం బ్రహ్మమే అన్నారు. సరే, అననివ్వండి! ఎందుకంటే మనం మూలం దాకా పోదాము. ఏ బ్రహ్మమైతే ఈ సృష్టికి మూలమో, అక్కడిదాకా పోదాము. అప్పుడు మూలచ్ఛేదో అని మనం చదువుకున్నాము గురుస్తుతిలో, ఆ మూలాన్ని మళ్ళీ పరిహరించాలి. ఎందుకంటే, మాయాశబలిత బ్రహ్మము, అయిఉన్నాడతను మూలంలో. మాయను అధిగమించినప్పుడు, బ్రహ్మముకు మాయకు ఎట్టి సంబంధము లేదు అన్నప్పుడు ఆ మాయకు సంబంధము లేనటువంటి, మాయకు పరమైనటువంటి, బ్రహ్మ అచల పరిపూర్ణమే.

       ఇక్కడ నిర్గుణ బ్రహ్మని, అధ్యాసవల్ల సగుణ బ్రహ్మ అని చెప్పడం జరిగింది. సగుణ అంటే మూడు గుణాలతో కూడినది. త్రిగుణాత్మక మాయ. మాయ సంబంధం కాకపోయినా మాయ సంబంధం ఉన్నట్లుగా కల్పింప చేస్తుంది. కనుక నిర్గుణ బ్రహ్మ అయినటువంటిది కూడా మాయా శబలిత బ్రహ్మ’ - అనే పేరుపెట్టి చెబుతున్నాము. భ్రాంతిలో ఉన్నవాళ్ళకి ముందు ఇది లక్ష్యం. ఈ లక్ష్యం తటస్థ లక్షణంగా తీసుకున్నాం. మాయా శబలిత బ్రహ్మలో ఉన్న సత్‌చిత్‌ ఆనందము అనే అనుభవాన్ని తటస్థ లక్షణంగా, ఇంటర్మీడియట్‌గా సగం ప్రయాణం దాకా దీనిని తీసుకున్నాము. మిగితా సగం ప్రయాణంలో ఇక మాయకు సంబంధం లేని, త్రిగుణ రహితమైనటువంటి బ్రహ్మని వేరు పరుస్తాం. వేరు పరచి ఈ బ్రహ్మమే ఉన్నాడని, వస్తు నిర్ణయం చేస్తాం. ఇప్పుడు ఈ వాక్యం ద్వారా ఏం తెలుస్తోంది? మాయకు సంబంధం లేకపోయిననూ, అధ్యాసతో ఉన్నట్లుగా భావించబడుతోంది. ఈ భావించబడే బ్రహ్మనే మనం మాయా శబలిత బ్రహ్మమని అంటున్నాము.

       పరమాత్మ ప్రతిబింబంతో కూడి, మాయయే పాలు పెరుగుగా పరిణమించినట్లుగా, ఆకర్షణ శక్తిచే జగత్తుగా పరిణమించింది. పరమాత్మ యొక్క ప్రతిబింబముతో కూడి మాయే సృష్టించింది ఇదంతా. పరమాత్మ ప్రకాశాన్ని వాడుకుంది. పరమాత్మ ప్రకాశం సాక్షిత్వంగా, అప్రమేయముగా, త్రిపుటి, ద్విపుటి రహితముగా, నిర్వికల్పముగా, నిర్వికారముగా, అచలంగా, ఉన్నదున్నట్లుగా ఉంది. అయితే దాని లక్షణము. ఈ మాయా ప్రపంచములో వ్యాపకమై, అతి సాన్నిధ్యమయ్యే సరికి, ఆ ప్రభావానికి ఈ మాయయే పాలు పెరుగుగా మార్చినట్లుగా, తన్మాత్రలను సూక్ష్మభూతాలుగా, సూక్ష్మభూతాల్ని స్థూలభూతాలుగా అలా పరిణామాన్ని పట్టుకొచ్చింది. ఆకర్షణ శక్తిచే జగద్రూపముగా పరిణమించింది.

       మాయలో ఒక ఆకర్షణ శక్తి ఉంది. ఆకర్షణ అనకూడదు. నన్నడిగితే అది కర్షణ శక్తి’. అది ఆ...కర్షణ కావచ్చు, వి...కర్షణ కావచ్చు. కొన్ని వస్తువులకు ఒకదానికొకటి ఆకర్షణ ఉంది. కొన్ని వస్తువులకు ఒకదానికొకటి వికర్షణ ఉంది. కొన్ని వస్తువులకు రెండూ లేవు. ఇవి కొన్ని దూరంగా జరుగుతాయి, కొన్ని దగ్గరగా జరగుతాయి. కొన్ని ఎంత దూరంలో పెడితే, అక్కడే ఉంటాయి గానీ, లాగబడవు, విడిచివేయ బడవు. ఈ మూడు రకాల శక్తిని కర్షణ శక్తి అంటాము. లాగినప్పుడేమో ఆకర్షణఅంటాము. విడగొట్టినప్పుడు వికర్షణఅంటాము. ఈ స్థితి ఎక్కడుంది అంటే, మాయలోనే ఉంది. మరి గోళాల మధ్యకూడా ఈ గోళాలు, గ్రహాలు. ఉపగ్రహాలు అదే కక్ష్యలో ఉంటున్నాయి. మరి ఆకర్షణ అనేది ఉంటే, ఈ భూమి వెళ్ళి సూర్యుడికి ఢీ కొట్టాలి. చంద్రుడు వెళ్ళి భూమిని ఢీ కొట్టాలి. వికర్షణయే ఉంటే చంద్రుడు భూమి నుంచి పారిపోవాలి, సూర్యుడి దగ్గర నుంచి భూమి పారిపోవాలి. ఈ రెండూ జరగడం లేదుగా! అది ఒక వింతైనటువంటి శక్తి. విచిత్రమైన శక్తి. ఇటు ఆకర్షణ, అటు వికర్షణ కాదు. ఎంతవరకూ ఆకర్షించాలో, అంతవరకూ ఆకర్షించింది. అక్కడినుంచి మరీ ముందుకు రానివ్వకుండా మళ్ళీ వికర్షిస్తూ ఉంటుంది. ఈ మాయలో ఆ వింత శక్తి ఉంది. దాన్ని కర్షణ శక్తిఅనాలి. ఆ శక్తితోనే జగద్రూపం వచ్చింది.

       ఆకర్షణలు ఉన్నవన్నీ ఏమౌతున్నాయి? రెండు మూడు రకాల పదార్థాలు కలిసి ఒకే కొత్త పదార్థం అవుతున్నాయి. హైడ్రోజన్‌ రెండు పరమాణువులు, ఆక్సిజన్‌ ఒక పరమాణువు. ఈ రెండూ కలిసి, హెచ్‌టుఓ [H2O] నీరు అని వాటర్‌ అయ్యింది. అట్లా కొన్ని అవుతున్నాయి, కొన్ని కావడం లేదు. కానివన్నీ ఏ పదార్థానికి, ఆ పదార్థం విడివిడిగా ఉన్నాయి. అయ్యేవన్నీ ఏమో, రెండు పదార్థాలు కలసి మూడవ పదార్థంగా రూపాంతరం చెందాయి. ఆక్సిజన్‌ వాయువే, హైడ్రోజన్‌ కూడా వాయువే. కొన్ని నిష్పత్తులలో ఆకర్షించబడి కలసిపోయినప్పుడు, జలం అనేది వచ్చింది. వాయువు నుండి జలం వచ్చింది. ఆ విధంగా ఆకర్షణ, వికర్షణ పనిచేస్తున్నాయి. ఈ ఆకర్షణ, వికర్షణ. మాయ యొక్క లక్షణమే. మాయ యొక్క లక్షణం అంతే కాదు, పాలు చెడి పెరుగయ్యింది. తండ్రికి బిడ్డ పుట్టాడు, తండ్రి చెడకుండా పుత్రుడు పుట్టాడు. తల్లి, తండ్రి చెడకుండానే, వాళ్ళు వాళ్ళుగా ఉండంగానే, వాళ్ళకి బిడ్డలు కూడా పుట్టారు. ఇక్కడ పాల విషయంలో ఏమైంది? పాలు పాలుగా ఉండి పెరుగురాలేదు. పాలే పెరుగుగా మారింది, పాలు చెడి పెరుగయ్యింది. తండ్రి చెడకనే పుత్రుడొచ్చాడు. ఇది కూడా మాయాకార్యమే.

    ఇది మాయయే కాని, ప్రతిబింబము కలది కాదు. ప్రతిబింబము ఉందా? లేదా? మాయా అనే అద్దంమీద, మాయా ప్రతిబింబుడుగా ఈశ్వరుడు అంటున్నాముగా! మాయకు ప్రతిబింబము లేదు గాని, మాయవల్ల ప్రతిబింబము తోస్తోంది. లేదని ఎందుకు అంటున్నావు? మాయవల్ల నిజంగా లేని వస్తువులు రాలేదు. మాయవలన లేని వస్తువు ఉన్నట్లుగా కనబడ్డాయి. కనుక ప్రతి బింబము ఉన్నది అని కూడా అనడానికి లేదు. ప్రతిబింబమే చిదాభాసుడు. భ్రాంతిలో మాత్రం నేనుఉంటుంది. భ్రాంతిలో ప్రతిబింబమూ ఉంటుంది. అట్లాగే భ్రాంతిలో ఈశ్వరుడు అనే ప్రతిబింబము ఉంటుంది. భ్రాంతి పోతే మాయకి ప్రతిబింబించేటటువంటి లక్షణం నిజానికి లేదు కనుక, మాయవల్ల లేనిదే ఉన్నట్లు కనబడుతాయి కనుక, ప్రతి బింబాలు కూడా లేనివే ఉన్నట్లు కనబడుతున్నాయి.

       చిదాభాసుడు అనే నేను కూడా లేనివాడే ఉన్నట్లుగా కనబడుతున్నాడు. లేదు అంటే సత్యముగా లేదు అని అర్థము. అందుకనే మాయని, ఇట్టిది అట్టిది అని నిర్వచించడానికి వీలు లేదు. మాయ సత్తు కాదు, అసత్తు కాదు. మాయ అనాది. మాయకి అంతముంది. ప్రళయంలో మాయ యొక్క అంతముంది. మళ్ళీ మాయచే సృష్టి, మాయ కారణంగానే ప్రళయం. కాని మాయకు అంతము ఉంది. ముక్తుడి విషయములో మాయకు అంతమున్నది. పరబ్రహ్మమందు మాయలేదు. ఒక పాద బ్రహ్మమును మాయ ఆశ్రయించినా, ఆ బ్రహ్మ మాయకు అసంగుడు. మాయలో మూడుగుణాలు కూడా చైతన్యము లేనిదే పనిచేయవు.

       ఒక పాదం బ్రహ్మనే మాయ ఆశ్రయించింది. ఆ ఒక్క పాదం బ్రహ్మే, మాయా శబలిత బ్రహ్మ. ముప్పావువంతు బ్రహ్మ, ఉన్నదున్నట్లుగా ఉన్న బ్రహ్మ. నిజానికి ఈ బ్రహ్మ కూడా, ఉన్నదున్నట్లున్న బ్రహ్మమే. బ్రహ్మకు అసలు నాలుగు వంతులు వేయడానికి కుదరదు. బ్రహ్మలో ఏ వికారము జరుగలేదు. ఒక వంతు బ్రహ్మలో వికారములు కలిగినట్లుగా, మాయ చూపించిందే తప్ప, అప్పటికి ఆ బ్రహ్మ నిర్వికారుడే. అయినా ఒక వంతుగానున్న పరబ్రహ్మకి మాయ తన స్వాధీనంలో ఉంటుంది. అందుకే ఏకామేవాద్వయం బ్రహ్మగా నానా అస్తిన కించనః’ - తనకంటే అన్యము కొంచెము కూడా లేకుండా ఉంటుంది.

    సాధకుడు కూడా సాక్షాత్కారం పొందితే, ఏదన్నా కొంత మిగిలి ఉన్నా కాని, ఆ సాక్షాత్కార జ్ఞానంయందు మొత్తం హరించిపోతాయి. లేకుండా పోతాయి. మాయకు ప్రభువు తానే. ఎవరూ? ఆ పరమేశ్వరుడు, సర్వజ్ఞుడు, సర్వశక్తిమంతుడు. జీవుడు ఈశ్వరుడు జగత్తు, భూతములు, నామరూప ప్రపంచము, తన్మాత్ర సృష్టి, పంచభూతములు, జీవోపాధులు అన్నీ కలిపి  తమోగుణ సృష్టి, జీవులేమో రజోగుణ సృష్టి. ఈశ్వరుడు శుద్ధ సత్వ మాయా ప్రతిబింబుడు కనుక సత్వగుణ సృష్టి. మూడు తత్వములు అనంగానే, మూడు గుణములతో, ఆ గుణాల వల్ల జీవుడికి జీవతత్వం, ఈశ్వరుడికి ఈశ్వరత్వం, జగత్తుకు భూతతత్వం వచ్చింది.

       ఇందులో ఏది ముఖ్యము?  జీవులు లేకపోతే ఈశ్వరుడికి ఏం పని ఉంది? జీవుడికి ఉపాధి లేకపోతే, జన్మకు వచ్చే కర్మ ఎక్కడిది? జగద్వాసన, ప్రపంచ వాసన ఎక్కడిది? ఉపాధులు కూడా పంచభూతాలేగా! పంచభూతాలు లేకపోతే ఉపాధులు లేవుగా. ఉపాధులు లేకపోతే పనిముట్టు లేదుగా. పనిముట్టు లేకపోతే, కర్మ, కర్మ ఫలితము లేదుగా! సూక్ష్మ శరీరం ఉండి ఏం భోగిస్తుంది? అప్పుడు సూక్ష్మ శరీరం ఉండి కూడా లేనిదేగా! జగత్తు లేనప్పుడు జగద్వాసన లేదుగా! జగద్వాసన లేకపోతే కారణ శరీరం లేదుగా! స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు లేకపోతే, చైతన్యమే ఉందిగా! చైతన్యమే తాను అయినటువంటి పరమాత్మ ఉన్నాడుగా! పరమాత్మే తాను అయినవాడికి జీవులను ఆడించాల్సిన అవసరము ఉండదుగా! జీవులు ఉంటే కదా, ఆడించేది. జీవుడే లేకపోతే ఏముంది? పంచభూతాలు లేకపోతే, జీవుడు లేడు, ఈశ్వరుడు లేడు. జీవుడు లేకపోయినా ఈశ్వరుడు లేడు.

       ముగ్గురూ, మూడూ కూడా ఒకదాన్నిబట్టి ఒకటి అవినాభావ సంబంధముగా, ఒకదానిమీద ఒకటి ఆశ్రయించి, ఆధారపడి ఉన్నాయి. ఒకటి లేకపోతే రెండు లేవు. రెండు లేకపోతే మూడు లేవు. ప్రపంచం లేకపోతే జీవుడు లేడు, జీవోపాధి లేదు. జీవోపాధి లేని జీవుడు జీవుడే కాదు. జీవుడే లేనప్పుడు ఎవరిని ఆడిస్తాడు ఈశ్వరుడు? జగత్తే లేనప్పడు దేనిని సృష్టి, స్థితి, లయలు చేస్తాడు? ఎవరి కర్మలని పంచి పెడతాడు? కర్మలు ఏమైనా చేసిన వాడుంటే, పంచిపెడతాడు.

       జీవుడే లేకపోతే, కర్మలు చేసేవాడే లేకపోతే, ఆ కర్మలని, ఆ విధిని నిర్ణయించేటటువంటి విధాత ఎక్కడుంటాడు? ఆ విధాతగా ఉన్నటువంటి ఈశ్వరుడు కూడా లేనివాడౌతాడు.
       అన్నీ మూడుగుణాల్లో తోచాయి కాబట్టి, మాయ లేనిది కాబట్టి, లేని మాయ వలన తోచినవన్నీ కూడా లేనివే. ఈ మాయ ఏమిటంటే మూలకారణాంశము. మూలకారణంలో మాయ లేనిదని తెలిసింది. కాబట్టి దాని అంశము కూడా మాయవల్లే ఉత్పత్తి అయ్యింది. మాయ యొక్క మూడు గుణాలు ఈ సృష్టి అంతా ఉన్నాయి. కాబట్టి, మాయా కల్పిత ప్రపంచము కూడా లేనిది. లేని ప్రపంచాన్ని చూస్తూ, లేని కర్మలు చేసి, లేని కర్మఫలితాలు పొందుతూ, పునర్జన్మలు పొందుతూ, లేని ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం ప్రాకులాడి, ముందు ఈశ్వరుడున్నాడని, జీవుడు లేడని, జీవేశ్వరైక్యం పొంది, ‘బ్రహ్మసత్యం జగన్మిథ్యఅని జీవబ్రహ్మైక్యం పొంది, ఇన్ని చేస్తున్నాడు కాని, ఒక్కటి తెలియడం లేదు వాడికి. జగత్తు మిథ్య అని ముందే తెలిస్తే, జీవుడు, ఈశ్వరుడు, బ్రహ్మ కూడా లేరు. కేవల పరబ్రహ్మమే, మాయకు పరమై, మాయకు అతీతమై ఉన్నాడు.

       మనం భ్రాంతిలో, మాయలో, మాయా ప్రభావానికి, అవిద్యా ప్రభావానికి, గుణాల ప్రభావానికి లోబడి, మనసులో ఉన్న గుణాలతో మళ్ళీ మనం ప్రవర్తిస్తున్నాము కాబట్టి, గుణాలు గుణాలతోనే ఒకరి యందున్న గుణములు, ఇంకొకరి యందున్న గుణములతో ప్రవర్తిస్తున్నాయి. ఇదే ఆట. గుణాల యొక్క ఆట. ఆ గుణాలు ఆడటానికి ఒక ఉపాధి కావాలి కాబట్టి, పనిముట్లు వచ్చాయి. నీ ఆటగా పనిముట్టు ద్వారా జరుగుతున్నట్లు ఉంది కాని, అసలు ఆట గుణాలదే. ఇక అసంగంగా ఉన్న చైతన్యానికి ఈ ఆటలేదు.

       అసంగంగా ఉన్న చైతన్యము, ఆ చైతన్యమే ప్రకాశము. ఆ ప్రకాశమే జ్ఞానము అని ఏ సాధకుడికైతే, ఆ జ్ఞానం ఉన్నదో, ఆ జ్ఞానం ఉన్నవాడికి ఇదంతా చిద్విలాసం. చిద్విలాసంఅంటే చైతన్యం యొక్క సత్తా చేత, తన ప్రమేయం లేక, కర్తృత్వ భోక్తృత్వాలు లేక, నేను, నాది లేక. ఇచ్ఛ, ప్రయత్నాలు లేక, సంగత్వము లేక అచలముగా, పరిపూర్ణముగా, స్థిరముగా, నిర్వికారముగా ఉన్నటువంటి పరమాత్మ వలన జరుగుతున్నది. అట్టి చైతన్యమే, ఆ పరమాత్మయే శరీరము ధరించాడు అనుకోండి. అప్పుడతను ఈ ప్రపంచాన్ని ఎలా చూస్తాడు? ‘చిద్విలాసంగా చూస్తాడు. ఎవరికైనా ఇవన్నీ నిజం అయితే విలాసం కాదు. ఇవన్నీ మిథ్యగా తోచాయి అనే దృష్టి ఉన్న జ్ఞానికి నిజం కాదు గనుక విలాసము, లీలగా చూస్తాడు. లీల’ - అంటే అస్పష్టం. కల’ - అస్పష్టంగా వస్తుంది. కలవలె తోచేది అంతా కూడా లీల.

       కరృత్వ భోక్తృత్వాలు ఇచ్ఛా ప్రయత్నాలు లేకుండా జరుగుతుంది. అయినప్పటికి, తన ప్రమేయం, తన సత్తా, తన లక్షణాలు వాటి యొక్క సాన్నిధ్యంలో ఉంటే, నీ సత్తా చేతే, నీకు తెలియకుండానే అవన్నీ జరుగుతూ ఉంటే, అది నీకు లీల. అది విలాసము.

       ఈ మూడు తత్త్వములు జీవుని భోగార్థమై, ఈశ్వర సృష్టి ఏర్పడింది. జీవుడు అనేవాడు ఉంటేనే ఈశ్వర సృష్టి ఉంది. జీవుడు లేనప్పుడు, ఈశ్వర సృష్టిని ఈశ్వరుడే ఈక్షిస్తాడు. మాయకు వశుడు కాడు. ఎన్నాళ్ళు ఈక్షిస్తాడు? దాన్ని అట్లా చూస్తూ ఉంటాడు. చూడబడుతూ ఉంటుంది అంతేనా? ఏం పనీ లేనప్పుడు చూడడం దేనికి? చూడబడడం దేనికి? అలా ఉండిపోతాడు ఈశ్వరుడు. కొంత కాలానికి ఈక్షణ నిరీక్షణ అయి, పరమాత్మగా ఉండిపోతాడు. నిర్వికారంగా ఉండిపోతాడు. అప్పుడతడు పరబ్రహ్మమే. ఈశ్వరుడు, ఈశ్వరత్వము ఏమీ లేవు. జీవుడు జగత్తు ఉంటే ఆ పరమాత్మ ఎలా ఉన్నాడు? ప్రభువయ్యాడు, విభుడయ్యాడు, సర్వజ్ఞుడయ్యాడు, సర్వాంతర్యామి అయ్యాడు, సర్వవ్యాపకుడయ్యాడు, సర్వమూ ఉంది కనుక సర్వమందూ వ్యాపించాడు. సర్వమందూ అణోరణీయాన్‌గా ఉన్నాడు కాబట్టి, అంతర్యామిత్వం వచ్చింది. సర్వమూ తనయందు కలిగి, సర్వమునకూ మించి ఉన్నాడు కాబట్టి, సర్వవ్యాపకత్వం వచ్చింది. మించి ఉన్నదేమో మూడు వంతుల బ్రహ్మ, పరబ్రహ్మ. సర్వము వరకూ ఒక పరిమితంగా ఉండేటటువంటి బ్రహ్మ మాయాశబలిత బ్రహ్మ. ఇది ఒకపాద బ్రహ్మ.

       ఈశ్వరుడు ఆప్తకాముడు. జీవుడినిబట్టి తయారైనటువంటి ఈశ్వరుడు ఆప్తకాముడు. అంటే, ఆప్తులను రక్షించేవాడు. శరణార్థులను కాపాడేవాడు. ఆప్తకాముడంటే ఈశ్వరుడు తన భక్తులను తనలో ఐక్యం చేసుకునేవాడు. సృష్టియందలి సర్వభోగములు, ఈశ్వరుని నుండియే ఏర్పడుతున్నాయి.

       కాసేపు ఈశ్వరుడు అంటారు, కాసేపు బ్రహ్మము అంటారు.  ఏమైనా పర్వాలేదు. ఆ పేర్లు, ఆ బోధ చెప్పేటప్పుడు, ఆ సృష్టికి సంబంధంగా చెప్పేప్పుడు, ఈశ్వరుడికి, ఆ బ్రహ్మకు పేర్లు మారుతూ ఉంటాయి. సమష్టి అన్నప్పుడు ఈశ్వరుడు అంటాము. వ్యష్టి సమష్టి లేకుండా కేవల లక్షణం పెట్టినప్పుడు పరమాత్మ అంటాము. మూలకారణం అన్నప్పడు బ్రహ్మఅంటాము. కారణం కాని బ్రహ్మ అయినప్పటికి, ఆ బ్రహ్మకారణం అంటున్నాము కాబట్టి, ఆ బ్రహ్మను మాయాశబలిత బ్రహ్మ అన్నాము. ఇలా ఇన్ని పేర్లు వచ్చాయి.

       మాయాశబలిత బ్రహ్మ కాకుండా నిజమైన బ్రహ్మ ఎవరయ్యా? అంటే, మాయకు అతీతంగా, మాయకు పరమైన, మాయకు అంటక, మాయకు సాక్షిగా, మాయాపదార్థాలలో బింబప్రకాశముగా ఉన్నప్పటికి, తానైతే ప్రతిబింబ ప్రకాశముగా కూడా లేనటువంటి వాడు. వాడు వాడుగా ఉండేటటువంటివాడు. స్వయం ప్రకాశరూపుడు ఎవడో, వాడు పరబ్రహ్మ.

       పరఅని ఎందుకు పెట్టాము? ఈ బ్రహ్మకు పరమై, అతీతమై, విలక్షణమై ఉన్నాడు కనుక. ఈ బ్రహ్మ యొక్క లక్షణాలు ఆ పరబ్రహ్మలో లేవు కనుక అక్కడ పరఅనే శబ్దము వాడాము. పర... పరి... పరమ అనేవి వాడుతూ ఉంటాము. ఆత్మ, పరమాత్మ, పరి అని ఎక్కడ వాడుతాము? ‘పరి ప్రశ్నేన సేవయా’ ‘పరిఅంటే, ఆధ్యాత్మికంగా, జ్ఞానపరంగా, మోక్షాన్ని లక్ష్యంగా పెట్టుకుని వేసేటటువంటి చాలా గొప్ప ప్రశ్న  పరిషశ్న. చాలా శ్రేష్ఠమైన ప్రశ్న. అందుకని పరిప్రశ్న అన్నాము.

       నిజానికి శ్రమ, పరిశ్రమ. పరిశ్రమ అంటే, సాధకులు మోక్షం కోసం చేసేటటువంటి సాధన. కార్మికులు పనిచేసేటటువంటి పరిశ్రమలు ఇండస్ట్రీ కాదు. పరి అనే శబ్దంతో అది అట్లా వాడుకలోకి వచ్చేసినాయి. అలాగే త్యాగము, పరిత్యాగము.

       ‘‘ప్రవచనము’’ మామూలుగా మాట్లాడేది వచనము, ‘అంతర్యామియొక్క గొప్ప స్ఫూర్తితో, ‘గురువుయొక్క స్ఫూర్తితో, నీవు మాట్లాడకుండా, ఆ స్ఫూర్తే నీ చేత మాట్లాడించి, గురువాక్యమే, దైవ వాక్యమే, నీ వాక్యంగా ఉన్నప్పుడు, అటువంటి బోధ ప్రవచనం. అలాగే ప్రబోధ.

       ప్రపెట్టినప్పడు, ‘పరపెట్టినప్పుడు అతీతము. దేనికైతే పరపెట్టామో, అది కానిది. ఇహము ప్రక్కన పరపెట్టాము అనుకోండి. ఇహము కానిది అని. జ్ఞానికి ఇహమే పరమై ఉంటుంది. ఇహము మిథ్య కదా! ఇహము కానిది పరమేగా. ఇహము యొక్క లక్షణాలు పరమందు లేవు. బ్రహ్మ యొక్క లక్షణాలు పరబ్రహ్మయందు లేవు. ఆత్మ యొక్క లక్షణాలు పరమాత్మ యందు లేవు. మామూలు ప్రశ్నలో విషయాలతో ఉంటే, పరి ప్రశ్న యందు విషయాలు లేవు. ఆత్మజ్ఞానానికి సంబంధించిన ప్రశ్న అది. ప్రఅంటే ప్రకృష్ఠము. ప్రకృతిలో కృతి అంటే సంగీతంలో కృతులుఅంటారు. త్యాగరాయకృతి అలాగ. కృతి అంటే, కొన్ని స్వరాలయొక్క కూడికతో, అన్నీ కలిపి, ఒక పద్ధతిలో, శ్రావ్యంగా ఉండే దానిని కృతి అంటాము. కృతి అంటే చక్కగా చేయబడినది. సంస్కృతి అంటే చక్కగా చేయబడినది. ప్రకృతి అంటే ప్రకృష్ఠముగా, శ్రేష్ఠముగా చేయబడినది.

       ఆధ్యాత్మికంలో పర అని, పరి అని, పరమ అని వస్తుంటాయి. ఆ విషయాల్లో అక్కడ వచ్చినప్పుడల్లా కూడా, అక్కడ ఉన్నదానికంటే కూడా, అతీతమని, పరమమని, ప్రకృష్ఠమని, ఆధ్యాత్మికంగా ఉపయోగం అని చెప్పుకోవాలి. భౌతికంగా, లోపభూయిష్ఠంగా ఉన్నటువంటి ఈ ప్రపంచంలో, ఇవి వాడము. అక్కడక్కడ ఇలా వాడే అలవాటు ఉన్నప్పటికి, ఇక్కడకు వస్తే, ఆ పర అనే శబ్దానికి ఈ రకంగానే తీసుకోవాలి.

       సృష్టి యందలి సర్వ భోగములు ఈశ్వరుని నుండి ఏర్పడినవి కనుక, ఈశ్వరుడు కోరవలసినది ఏదీ కూడా లేదు. న మే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన’ (భగవద్గీత 3వఅ 22వ శ్లో), ‘న - మే - పార్థాఅస్తి కర్తవ్యం - త్రిషు లోకేషు - కించనఅనగా, మూడు లోకముల యెడలా నాకు ఎట్టి కర్తవ్యము లేదు. మూడు లోకాలు అంటే ఏమిటి? జీవుల యందు స్థూల ప్రపంచము, సూక్ష్మ ప్రపంచము, మానసిక ప్రపంచము. ఈ మూడు లోకాల్లో ఆత్మ, పరమాత్మకి ఎటువంటి కర్తవ్యము లేదు. నిజమే కదా! నీకు స్థూల, సూక్ష్మ, కారణ శరీరాలు ఉన్నాయి. ఈ సాధనలో సూక్ష్మంలో స్వప్నావస్థ ఉంది. కారణంలో ఏమీ తెలియని స్థితి వస్తోంది. జాగ్రదావస్థలో నామరూప జగత్తుతో వ్యవహారం ఉన్నది. ఈ మూడు లోకాల్లో కూడా ఆత్మ సత్తామాత్రంగా, సాక్షిగా కదలకుండానే ఉంది. అతి సాన్నిధ్యంగా ఉంది. ప్రమేయం లేకుండా ఉంది. ప్రమాణం కూడా కాకుండా ఉంది. ఆ సత్తా వలన ఏం జరగాలో అవి జరుగుతున్నాయి. జరిగే దానికి, ఆ పరమాత్మకి ఏమీ సంబంధము లేదు. ఆయన పని చేసేవాడు కాదు, పని చేయించేవాడూ కాదు. తన ప్రభావం వలన అన్నీ జరుగుతున్నాయి.

       ఒక అసెంబ్లీలో స్పీకర్‌ కూర్చున్నాడు. అతనిని ఏమంటారు? అధ్యక్షులు అంటారు. అధ్యక్షులు ఏం చేస్తారు? మాట్లాడకుండా ఉంటారు. పక్షాలు, విపక్షాలు మాట్లాడుకుంటూ ఉంటారు, పోట్లాడుకుంటూ ఉంటారు, తీర్మానాలు చేస్తారు, చట్టాలు చేస్తారు. స్పీకర్‌ ఎప్పుడు మాట్లాడుతాడు? సాక్షిగా ఉంటాడు. అయినా స్పీకర్‌ లేకుండా సభ జరుగదు. స్పీకర్‌కు గౌరవం ఇచ్చి, వీళ్ళే అధ్యక్షా అంటూ మాట్లాడుతూ ఉంటారు. స్పీకర్‌ ఉన్న సభ ఎలా ఉంటుంది? అతను ఏ పార్టీకీ వకాల్తా తీసుకోడు. న్యాయంగా, ధర్మంగా, తటస్థంగా ఉంటాడు.

        అలాగే ఆత్మ కూడా ఈ మూడు లోకాలలో, అక్కడ ఏమి జరుగుతున్నా, ఏం జరుగక పోతున్నా, స్థూల సూక్ష్మ మానసిక ప్రపంచాలలో జరుగుతున్న దానికి ఎటువంటి సంబంధము లేకుండా, చిద్విలాసంగా, వినోదంగా, అంటకుండా, సాక్షీ భూతంగా ఉంటాడు. అయినా తన వల్లనే సర్వము జరుగుతోంది. అధ్యక్షులు లేకుండా అసెంబ్లీ ఎలా జరుగదో, ఆ పరమాత్మ అధ్యక్షస్థానంలో లేకుండా ఏదీ జరుగదు. ఈ అధ్యక్షుడినే అధిష్ఠానం అంటాము. అధిష్ఠాన ప్రకాశం అన్నప్పుడు పరమాత్మ ప్రకాశము. అధిష్ఠానంఅని పేరు ఎందుకు పెట్టాము? అతను అసంగుడు, సాక్షీ భూతుడు, అతడు కర్తా, భోక్తా కాదు, అతని ద్వారా క్రియ జరగట్లేదు. కేవలం అతను ఉండుట వలననే సర్వమూ జరుగుతుంది.

       ఫ్యాన్‌లో కరెంటు ఉండుట వలన ఫ్యాను తిరుగుతుంది. అదే కరెంటు లైటులో ఉండుట వలన లైటు వెలుగుతుంది. కరెంట్‌ లైట్‌ని వెలిగించడం లేదు, కరెంటు ఫ్యానుని త్రిప్పటం లేదు అని మనం గ్రహించాలి. కరెంటు యొక్క సత్తావల్ల, దేని ధర్మం ఏదో, అది అలా ఉంది. ఆ సత్తా ఇచ్చేదాని సాన్నిధ్యం వలన క్రియలు జరుగుతున్నాయి. దాని సాన్నిధ్యం లేకపోతే, ఈ జడవస్తువులు తిరుగుతాయా? కరెంటు యొక్క సాన్నిధ్యం, కరెంటు యొక్క ఉనికి ఈ ఫ్యానులో గనుక లేకపోతే, ఫ్యాను తిరుగుతుందా?

       అలాగే ప్రకృతి యొక్క మనుగడే లేదు. సర్వ జీవరాశుల యొక్క చైతన్యము, పరిణామము నిమిత్తమే. వీటన్నిటికీ మూలం పరమాత్మ చైతన్యమే! ఆ కృష్ణ పరమాత్మ ఏ పరమాత్మ చైతన్యం గురించి చెబుతున్నాడో, ఆ పరమాత్మ చైతన్యమే మూలం. అది చేసేదీ కాదు, చెందేదీ కాదు. కానీ, ఈ చైతన్య ప్రభావంవల్ల, మిగితావన్నీ చైతన్యవంతమై, వాటి ధర్మాల ప్రకారంగా, ఆ ధర్మాన్ని బయటకు ప్రకటించే తరుణంలో, అవి తెలుస్తున్నాయి, ప్రవర్తిస్తున్నాయి, పరిణామం చెందుతున్నాయి. వికారం చెందుతున్నాయి. అవన్నీ నిమిత్తమే. తాను కర్మను సృష్టించుచూ, ఆజ్ఞాపించుచున్నాడు. మళ్ళీ ఇక్కడ కర్మను సృష్టిస్తున్నాడు, ఆజ్ఞాపిస్తున్నాడు అంటే, కృష్ణ పరమాత్మ అలా చెప్పాడు కాని, పరమాత్మయేమీ కర్మను సృష్టించడు. పరమాత్మ ఆజ్ఞాపించడు. మాయ తన స్వాధీనములో ఉండడముచేత అది పరమాత్మయొక్క ఆజ్ఞయేనని అనవచ్చు. ఇక్కడ అధిష్ఠానం అని, అధ్యక్షస్థానం అని చెప్పుకోవాలి. అక్కడ భక్తుల కోసం సగుణ బ్రహ్మ పనిగా ఆ రకంగా చెప్పారు, భగవద్గీతలో ఆయన. జ్ఞానుల కోసం మరొక రకంగా చెప్పారు. జ్ఞానంకోసం చెప్పినప్పుడు ఆయన కర్మను సృష్టించడం లేదు. ఇదంతా మాయా కల్పితం. చేసిన కర్మకు మంచి, చెడు ఫలితాలు ఇవ్వడం అనేది, ఆ కర్మ యొక్క ధర్మం. కర్మ జడం, చైతన్యంయొక్క సాన్నిధ్యం చేత, జడమైన కర్మలో చైతన్యం వచ్చి, చేతనత్వమై, అది ఉపాధులను సృష్టించుకుని, ఉపాధులనే పనిముట్ల ద్వారా సూక్ష్మశరీరాన్ని సృష్టించుకుని, సూక్ష్మ శరీరం ద్వారా కర్మఫలితాలు ఇస్తున్నది. ఆ ఫలితాలు పొందేక్రమంలో పొందనప్పుడు అది కారణ శరీరంగా ఉంటోంది. పొందినప్పుడు కార్యరూపంలోకి వచ్చి పొందుతోంది. ఇలా జరుగుచున్న మూడు లోకాలకి, పరమాత్మకి ఎటువంటి సంబంధము లేదు. కాని ఆయనయొక్క సాన్నిధ్యం చేత, ఇవన్నీ నిమిత్త కారణంగా జరుగుతున్నాయి. తాను కర్మఫల ప్రదాత. తాను అంటే ఇక్కడ ఎవరు? అవిద్యా శబలిత బ్రహ్మ, సగుణముగా పిలువబడే బ్రహ్మ. నిర్గుణమైనటువంటి పరమాత్మ అయినప్పటికీ కూడా మాయ సగుణంగా చూపించి, ‘సర్వకారణ మీశ్వరం, నిటలాంతరాళ విహారకంఅన్నట్లుగా ఈ బ్రహ్మను సర్వకారణంగా చూపిస్తోంది. మాయ చూపించిన పద్ధతిలో మాట్లాడుతున్నాము. నిజానికి బ్రహ్మ కారణం కాదు, కర్మఫల ప్రదాత కూడా కాదు. కర్మలు వాటికి అవే ఫలములను ఈయ జాలవు. ఇదే చెబుతున్నాము. కర్మ జడము, దానికదే ఫలితమును ఇవ్వదు. చైతన్య సాన్నిధ్యము చేత, కారణ శరీరాలు, కర్మలు, వాసనలు ఉండబట్టి కర్మ ఫలితాలుంటున్నాయి. ఇది మాయలో ఉన్న నియతి.

       వాసన ఎప్పుడూ కూడా నీకు అనుభవాన్ని ఇచ్చి ఖర్చు అయిపోవాలి, ఖర్చుకాని వాసన అలా ఉంటే, ఆ వాసన ఖర్చు అవ్వడం కోసం, జీవులయొక్క భోగం ద్వారా, భోగించడం కారణంగా, ఖర్చు అవ్వడంకోసం, దానిలో ఒక గుబులు, ఒక కదలిక వస్తుంది. ఆ కదలిక చైతన్య సాన్నిధ్యం చేత వస్తుంది.

    తాను కర్మను సృష్టించుచూ ఆజ్ఞాపించుచున్నాడు. తాను కర్మఫల ప్రదాత. కర్మలు వాటికవే ఫలములనీయజాలవు. ఈ కర్మకు ఈ ఫలము అని జడమగు కర్మ, స్వయముగా వినియోగించుకొనజాలదు. మరి ఎలా వినియోగపడుతోందది? ప్రకృతి సిద్ధముగా వినియోగపడుతోంది. అది మాత్రం ఎలా అవుతోంది? ఆ పరమాత్మ చైతన్యం యొక్క అతి సాన్నిధ్యంచేత. పరమాత్మ చేస్తున్నాడా? ఆ పరమాత్మ యొక్క ప్రకాశంలో ఉన్న సత్తాచేత, పరమాత్మచేత మాత్రము కాదు. పరమాత్మ యొక్క ప్రకాశంలో ఉన్న సత్తాచేత, ఆ సత్తావల్ల దాని ప్రభావానికి లోనై, అవి చేసుకుంటున్నాయి. అంతేకానీ పరమాత్మ చేయడం లేదు. అది తెలియక కొంతమంది, ఆయనే చేస్తున్నాడు, ఆయనే సర్వకారణం, వాడే కర్మ ఫలితాన్ని ఇస్తున్నాడు అని అంటూ ఉంటారు. వాడే సృష్టి, స్థితి, లయకారుడు, తిరోధాన అనుగ్రహములు ఉన్నాయని, అనుగ్రహిస్తాడని, ఏదన్నా పోగొడతాడని, ఏదైనా సంప్రాప్తింప చేస్తాడని అనుకుంటారు. ఇది ఏ జీవికాజీవి చేసుకున్న కర్మలు పాప పుణ్య మిశ్రమ కర్మల ఫలితాన్ని, దేనికి ఎంత ఫలితం ఎప్పుడివ్వాలి? ఎక్కువా? తక్కవా? ఇప్పుడా? అప్పుడా? అనే ఇంకా రాబోయే నాలుగు జన్మల తరువాతా? అనేదానిమీద, ఆ విధాత కర్మనిర్ణయాన్ని చేస్తాడు. విధాత అంటే బ్రహ్మ, పరబ్రహ్మ కాదు. యోగ వాశిష్ఠంలో విధాతను పరబ్రహ్మ అనలేదు. కొంతమంది దేవుడే ఇవన్నీ చేస్తున్నాడు అంటే, దేవుడే విధాత అంటారు.

       విధాతఅంటే, విధిని వ్రాసేవాడు. విధిఎక్కడిది? మళ్ళీ జీవుడిదే! ఇది మళ్ళీ ఏమైంది? వాసనారూప కర్మ అయ్యింది.

వాసనారూప కర్మ ఏమైంది? జడమయ్యింది. జడమైన కర్మ నీకు మళ్ళీ ఉపాధిని సృష్టించి, ఆ కర్మ యొక్క ఫలితాన్ని అనుభవింప చేయాలి అంటే, చాలా కాలం జరగాలి. ఈ పనంతా కర్మే చేస్తోందా? అంటే, చైతన్యం యొక్క సాన్నిధ్యంచేత, ఈ కర్మ జరుగుతోంది. అయితే, చైతన్యం యొక్క సాన్నిధ్యం చేత ఈ కర్మ జరుగుతోంది అంటే, మళ్ళీ ఈ మధ్యలో ఇంకొకటి పెట్టాలి.

       కరెంటు ఉంటేనే ఫ్యాను తిరుగుతుంది అన్నప్పుడు, మధ్యలో ఇంకో అధిష్ఠాన దేవతను పెట్టాము. ఆ అధిష్ఠాన దేవత ఎవరూ అంటే, ఫ్యానును త్రిప్పే శక్తి. ఫ్యానును తిరిగేటట్లు చేసే శక్తి, అధిష్ఠాన దేవత. చైతన్యమేమో చైతన్యమే! ఫ్యానేమో తిరుగుతుంది. అధిష్ఠాన దేవత ఫ్యాను తిరగడానికి కావలసిన శక్తిని అందిస్తాడు. అప్పుడు ఫ్యాను తిరుగుతుంది. మన కన్ను సూర్యుడనే అధిష్ఠానదేవత ప్రేరణ చేత చూస్తుంది. మనస్సు చంద్రుడనే అధిష్ఠాన దేవత యొక్క ప్రేరణచేత ఆలోచిస్తుంది. ఫ్యాను త్రిప్పే శక్తి అనేటటువంటి అధిష్ఠానదేవత చేత తిరుగుతోంది. కాబట్టి, ఈ మధ్యలో ఒక అధిష్ఠాన దేవతను పెట్టాము. విధాత అనేవాడు, అధిష్ఠాన దేవతగా ఆ మధ్యలో వచ్చినవాడు.

       నిజానికి డైరెక్టుగా పరమాత్మే చేస్తున్నాడు అనకూడదు కాబట్టి, పరమాత్మ లేకుండానే ఇది జరుగుతోందా? అంటే, పరమాత్మ యొక్క ఒకానొక శక్తి చేత జరుగుతోంది. ఆ శక్తేమో అధిష్ఠాన దేవత. అది పరమాత్మ యొక్క ఒకానొక శక్తి. పరమాత్మకు అసలు శక్తి ఉందా? ప్రకృతిలో అనేక ధర్మాలున్నాయి. ఈ పరమాత్మ చైతన్యముచేత ప్రకృతి యొక్క ఆ ధర్మము, అప్రకటితంగా ఉండగానే, ఈ పరమాత్మ చైతన్యం యొక్క సాన్నిధ్యం చేత, సత్తా చేత, అక్కడ ఒక శక్తి పుట్టింది. ఆ పుట్టినటువంటి శక్తిపేరే అధిష్ఠాన దేవత. ఇక్కడ ఆ అధిష్ఠాన దేవత పేరే విధాత. ఆ విధాతే కర్మ యొక్క ఫలితాలను, ఏ జీవుడికి ఎలా ఎంతెంత పంచి పెట్టాలో, అలా పంచిపెడుతాడు. నిజానికి ఈ అధిష్ఠాన దేవతలు అని మధ్యలో ఒకటి పెట్టాము కాని, సర్వకారణం ఎవరు? ఆ బ్రహ్మే.

       త్రిమూర్తులు కూడా అలాగే అధిష్ఠాన దేవతలే, సృష్టి స్థితి లయలు చేసేది. కాని సృష్టి, స్థితి, లయలు ఆటోమేటిక్‌గా జరుగుతున్నాయి అనడానికి వీలు లేదు. పరమాత్మ యొక్క చైతన్య సత్తా చేత, సృష్టి స్థితి లయలు జరుగుచున్నాయి అంటున్నాము. నిజానికి అదే కాని, మధ్యలో మనం ఏం చేస్తున్నాము? ఈ సృష్టి అనేటటువంటి కార్యానికి, సరియైనటువంటి శక్తి ఒకటుంది. ఆ శక్తి పేరు బ్రహ్మ. పోషించే శక్తి పేరు స్థితి కారుడు విష్ణువు. లయకారుడు, ఆ శక్తి సహితుడు రుద్రుడు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఏ పేరైనా పర్వాలేదు, రుద్రుడే అంటాను నేను. మహేశ్వరుడికి ఇంకోచోట వేరే అర్థంతో ఉంది. కాబట్టి అదిక్కడ వాడను. కనుక చైతన్యం నుండి జడపదార్థముల యొక్క వ్యవహారానికి మధ్యలో, ఒక శక్తి తయారై ఉంది. ఆ శక్తే ఆ పరమాత్మ ప్రకాశంలో ఉన్న సత్తా. ఆ సత్తాయే ప్రకృతి ఎన్ని రకాలుందో, అన్ని రకాల దేవతలుగా, అధిష్ఠాన దేవతలుగా, దేవతా శక్తులుగా చెప్పడమైంది. త్రిమూర్తులు గాని, విధాత గాని, పిండాండంలో 25 తత్వాల యొక్క అధిష్ఠాన దేవతలు గాని, వీళ్ళంతా కూడా ప్రకృతిలో శక్తిరూపులు. మరలా ఆ శక్తికి మూలం ఆ పరమాత్మ చైతన్యమే. కనుక త్రిమూర్తులలో అంతర్యామి పరమాత్మే. త్రిమూర్తులు వాళ్ళ వ్యవహారం కనుక ఆపితే, అంతర్యామి అయినటువంటి పరమాత్మయే ఆ త్రిమూర్తుల యొక్క తురీయస్థితి. ఆ తురీయజ్ఞానము శుద్ధ చైతన్యం, పరమాత్మ.

       జడమగు కర్మ స్వయముగా వినియోగించుకొనజాలదు. కర్మకు ఈశ్వరుడేమో అధిష్ఠానము. అసెంబ్లీలో అధ్యక్షులవారి లాగా. మధ్యలో ఇంకా ఎవరు వచ్చారు? విధాత వచ్చాడు. ఆ కర్మను పంచిపెట్టేవాడు. కర్మ స్వయంగా అవుతుందా? కొన్ని శక్తుల ద్వారా జడమైనవి కదులుతాయి. ఆ శక్తికి మూలం చైతన్యం. శక్తిప్రకృతిలో అనేకంగా ఉంది కాబట్టి, లక్షలాది ప్రకృతి శక్తులున్నాయి. ఆ లక్షలాది ప్రకృతి శక్తులు కూడా నిజానికి శక్తులు కావవి. ప్రకృతి యొక్క ధర్మాలు, గుణాలు. అందులో చైతన్యం వ్యాపించేసరికి, ఒక్కొక్క ధర్మం ఒక్కొక్క ప్రకృతి శక్తి అయ్యింది. ప్రకృతి అంటే మళ్ళీ అది జడమే. జడమైన ప్రకృతికి, పరమాత్మ యొక్క అతి సాన్నిధ్యానికి, మధ్యలో పరమాత్మ యొక్క ప్రకాశ లక్షణం చేత, ఆ సత్తాతో ఇది ఏదైతే జరుగుతోందో, ఆ జరగడానికిన్నూ ఆ సత్తాకీ మధ్యలో, ప్రకృతి ధర్మాలతో తయారైన ఈ శక్తి కూడినప్పుడు, అవి ప్రకృతి శక్తులుగా మారి, ఆ శక్తి రూపములుగా అధిదేవతలయ్యాయి. అందుకనే హిందూ ధర్మంలో ముక్కోటి దేవతలున్నారు. దేవుడొక్కడే అని వేరే మతాలు చెబుతాయి. వీళ్ళకి ఇంతమంది దేవుళ్ళేమిటి? వీళ్ళది తప్పు అంటారు వాళ్ళు. ఈ దేవుడు బ్రహ్మజ్ఞానం దేవుడు కాదు. అతను సాక్షి, అసంగుడు, సత్తామాత్రుడుగా, తానుతానుగా, రెండోది లేకుండా ఉన్నవాడు ఎవరో, వాడిని దేవుడు అనడం లేదు మనం, బ్రహ్మము అంటున్నాము. ఆ బ్రహ్మము ఒక్కటే అంటున్నాము.

       మనకున్నటువంటి ఉపనిషత్తులు, వేదాలు, వేదాంతంలో మనకి విన్నవిగా ఋషులు అందించినటువంటి విమర్శ, లోతైనటువంటి వివరణలు, తర్కానికి, విచారణకి నిలబడేది, శాస్త్రానికి ఋజువయ్యేది, శాస్త్రం ఎంతవరకు వస్తుందో, అంతవరకు ఋజువయ్యేది అందించాయి. అంతకంటే చెప్పలేనిచోట, అనిర్వచనీయంగా అందేటటువంటిది, ఇన్ని కాలాల్లో సైంటిస్ట్‌లు కనిపెట్టినా కూడా, ఈ వేద ప్రమాణానికి సరిపోయేది ఈ వేదాలలో ఉన్నది. ఎవరు ఏదన్నా చెప్పినా కాని, దీనిలో భాగంగానే. కొంతవరకే సరిపోయేటట్లు ఉంటాయి తప్ప, ఇంత పరిపూర్ణంగా ఉండేటటువంటిది, ఏదీ ఏ మతంలో లేదని, గర్వంగా చెప్పుకోవచ్చు. మతం అనవద్దు. ఈ వేద సాంప్రదాయంలో, ఈ సనాతన ధర్మంలో, ఉపనిషత్తులు ఋషిప్రోక్తంగా, ఏదైతే మనకి ఋక్కులుగా అందించబడ్డాయో, ఇంత సమగ్రమైనటువంటిది, ఈ ప్రపంచంలో ఎక్కడా లేదు. ఎవ్వరు ఏది చెప్పినా దీంట్లోనే ఉంది, అది ముందే చెప్పబడి ఉంటుంది. అది దొరుకుతుంది తప్పకుండా! ఇన్ని విభాగాలు లేకపోతే, అచల పరిపూర్ణంగా, సర్వసాక్షిగా ఉన్న పరమాత్మని త్రిగుణ రహితంగా, నిర్గుణంగా, మనం వస్తు నిర్ణయం చేయలేము. ఇన్ని స్టెప్స్‌గా చెబితే అది నిర్ణయం అవుతుంది అని మనం గమనించాలి.

       పుట్టుక, సంస్కారము, వేదాధ్యయనము అనునవి ఏదియూ బ్రహ్మత్వమునకు కారణము కాదు. బ్రహ్మత్వానికి చావు పుట్టుకలతో ఉన్నది కారణము కాదు. వర్తనమే మూలకారణము. ఎప్పటికప్పుడు ఏది జరుగుతోందో అది అంతే. వర్తనం లేనప్పుడు వాసనారూపంలో నిష్క్రియా రూపంలో ఉంటాయి, కారణ రూపంలో ఉంటాయి. కారణరూపంలో ఉన్నదానికి ఏ అనుభవమూ లేదు, ఏ పరిణామమూ లేదు, ఏ వికారము లేదు. అయినప్పటికీ అది మోక్షంకాదు. కారణంగా ఉన్నది ఏదైనా సరే, అది మోక్షం కాదు. సర్వకారణమూ బీజరూపంలో ఉంటే, ఆ బీజం నిర్బీజమైనప్పుడే మోక్షం. అన్ని కారణాలు లేకుండా పోయినప్పుడు, కార్యకారణానికి ఏదైనా మూలం వుంటే, ఆ మూలచ్ఛేదో, మూలాన్ని ఛేదించాలి. ఆ మూలం అనేది ఏమైనా దొరికితే, కూకటి వ్రేళ్ళతో సహా తీసేయాలి. ఒక విత్తనంగా దొరికితే, దానిని నిర్బీజం చేయాలి. ఆ మూలాన్ని నిర్బీజం చేయాలి.   

       ఇక్కడే ఎప్పుడో ఒకప్పుడు మృతి నొందక తప్పదు. లోకమున ప్రతి నిమిషము ఎందరో పుడుతూ, గిడుతూ ఉన్నారు. పుట్టుక, మరణములు లేకుండా చేసుకొనుట యెట్లు? ముందు అసలు పాయింటు ఇది. చావు పుట్టుకలు లేకుండా, సంసారబంధము లేకుండా, దుఃఖమునుండి బయటపడడం అనేది కావాలి. ఈ ఆధ్మాత్మిక బోధ ఎవరికి? ఎందుకు కావాలి? చచ్చి పుట్టేవాళ్ళు, ఈ చచ్చి పుట్టే స్థితినుంచి బయట పడటానికి సుఖదుఃఖాలని అనుభవిస్తూ, బాధపడుతూ ఉపాధికి సంబంధించిన వ్యాధి, బాధ పడలేక, ఓర్చుకోలేక, సంసారంలో ఉన్న నేను నాది ఇతరులు అనేదాని మధ్యలో, ఆ విభజనలో విడిచిపెట్టి ఉండలేక, ప్రియం మోదం ప్రమోదాలతో భోగాలు కోరుకుంటూ, అయినప్పటికి అది రాకపోతే చింతిస్తూ, విచారిస్తూ, నిరాశపడుతూ, అవమాన పడుతూ ‘‘ఇవన్నీ అవసరమా?’’ వీటినుంచి మనకు విముక్తి కావాలి. వీటినుండి విడుదల కావాలి.

       విడుదల అయ్యే మార్గం ఉంటే, విడుదల కావాలి అన్నా పర్వాలేదు. విడుదలయ్యే మార్గమే లేకపోతే, చచ్చినట్లు అలానే అనుభవించాలి. పశుపక్ష్యాదులు ఏం చేస్తున్నాయి పాపం. కష్టసుఖాలు ఏది వచ్చినా బ్రతుక గలిగితే బ్రతుకుతాయి, బ్రతుక లేకపోతే చస్తాయి. వాటికి ఏమైనా మార్గం ఉందా? ఒక్క మానవుడే తప్పించుకుంటున్నాడు. మానవుడైనా పూర్తిగా తప్పించుకోగలిగాడా? కాని తప్పించుకోవాలనే ఆశ వచ్చింది. తప్పించుకోవాలనే ఆశయం కలిగింది. తప్పించుకునే ఉపాయం కోసం వెదుకుతున్నాడు. ఈ వేదాంతం తప్పించుకునే ఉపాయం కనిపెట్టింది. ఉపనిషత్తుల ఋషులు తపస్సు చేసి కనిపెట్టారు ఉపాయం ఉందని. ఉపాయం ఇచ్చి వాళ్ళు తరించారు. వాళ్ళకు జన్మరాహిత్యం అయ్యింది, బ్రహ్మజ్ఞానం కలిగింది. ఇలా వాళ్ళు శాస్త్రాన్ని తయారు చేశారు. వాళ్ళ అనుభవమే శాస్త్రమయ్యింది. శాస్త్రమై, ఆగమ ప్రమాణమయ్యింది. వాళ్ళ అనుభవమే వాళ్ళకు ప్రత్యక్ష ప్రమాణమైంది. ఆ ప్రతక్ష్య ప్రమాణం శాస్త్రమనే ఆగమ ప్రమాణం ద్వారా మనకు అందించబడింది. అందించబడినా కాని తీసుకోగలిగామా? అంటే ఒక గురువు మనకు సహాయం చేసి, నిరంతరము మనకు దగ్గరుండి కనిపెట్టి అందిస్తే తెలిసింది.

       ఎందుకంటే, అజ్ఞానం నుంచి జ్ఞానానికి మార్గం లేదు కనుక. ఒక్కసారి ఇది విదిలించి, అది పట్టుకోవడం చేత కాదు కనుక, క్రమక్రమంగా చేయాలి కనుక, కొన్ని ఉపాయాలను ఆశ్రయించాలి. ఆ ఉపాయాల ద్వారా సాధనామార్గాలు, ఆ సాధనామార్గాలే ధర్మార్థ కామ మోక్షాలై, మోక్షం విషయంలో మహావాక్యాలు, ఇవన్నీ కూడా ఈ వేదాలు, వేదంతంలో మనకు అందుబాటు అయినవి. వాటిని వినియోగించుకోవాలి. అయితే వాటిని గుడ్డిగా నమ్మక్కర్లేదు.

    శాస్త్ర ద్రష్టం, గురోర్వాక్యం, తృతీయం ఆత్మనిశ్చయం’ - శాస్త్రాన్ని పరిశీలించండి. దుఃఖాన్ని నివారించుకునే మార్గం ఉందని తెలుసుకోండి. వేదం చెప్పినటువంటి పద్ధతిలో, సాధనామార్గం తీసుకుని ఆచరించవచ్చు. మహావాక్యనిర్ణయ పద్ధతిలో బ్రహ్మజ్ఞానం పొందవచ్చు. అచల సిద్ధాంతం ప్రకారంగా ఎఱుక విడువవచ్చు. ఇవన్నీ చేయచ్చు అని అయిన వారు, చేసిన వారు చెబుతున్నారు కనుక, ఎవరికైతే తీవ్రంగా విడుదల కావాలి అనేటటువంటి తపన ఉందో, తీవ్ర మోక్షేచ్ఛ ఉందో, ఎవరైతే ఇన్ని జన్మలతో విసిగి వేసారారో, సర్వమూ నేను సర్వార్పణ చేస్తానో, త్యాగం చేస్తానో, ఇవి ఉండి నాకేం చేస్తాయిలే, మళ్ళీ మళ్ళీ జన్మకి తీసుకొస్తున్నాయి, నేనది ఒదిలేసుకుంటాను, అనేటటువంటి తీవ్రమైన స్థితిలో మన గురువుగారు చెప్తారు కొట్టబడ్డప్పుడే వస్తారిట్లా! అంతా బాగుంటే ఎవరూ రారు.

       భక్తులు కూడా అలాగే చెప్తారు, కష్టాలు వస్తేనే దైవాన్ని తలచుకుంటారట! సుఖంగా ఉన్నప్పుడు దైవమును మరచిపోతారు. కనుక తన కష్టాలన్నీ కూడా దైవీ ప్రణాళికలో భాగంగానే ఉంటాయి. అందుకే కష్టం వచ్చిందని కృంగిపోకూడదు. ఏదైనా మన మేలుకోసమే అని స్వీకరించి దానినుంచి అధిగమించే ప్రయత్నం చేయాలి. మావన మేధస్సుకి, విచక్షణా జ్ఞానానికి, వివేకానికి, సాధన చేయగలిగినటువంటి శక్తియుక్తులు, ఇవన్నీ కూడా మానవజన్మలో మానవునికి వచ్చినాయి కనుక వాడికే ఆ యోగ్యత ఉంది. మరి ఆ యోగ్యతను తీసుకుని, నాకా యోగ్యత ఉంది, దీనిని వినియోగించుకోవాలి అని వచ్చిన వాళ్ళు ఎంతమంది? రానివాళ్ళు ఎంతమంది?

       నరకానికి పోయేదారి హై వే లా ఉంటుంది, స్వర్గానికి పోయేదారి ఇరుకుగా, ఒక్కళ్ళు కూడా పట్టనట్లుగా ఉంటుంది. అందుకని లోకసంబంధముగా, అందరితో ఎప్పుడూ పోల్చుకుని, ఇలా అయితే మనం బ్రతుకలేమని, మనం అలా జారిపోకుండా, లక్షకో కోటికో ఒక్కరికే మోక్షం అంటున్నారు కనుక ఆ కోటికొక్కరు నీవే ఎందుకు కాకూడదు అనే పద్ధతిలో, గట్టిగా పట్టు పట్టాలి.

       పట్టు పట్టరాదు, పట్టినపట్టు విడువరాదు. పట్టిన పట్టు విడుచుటకంటే చచ్చుట మేలయా విశ్వదాభిరామ వినుర వేమ.

ఆ పట్టే పట్టేదో గట్టిగా పట్టండి. మధ్యలో సడలిపోతే రెంటికీ చెడడం అవుతుంది. ఇటు భౌతిక సుఖంలేక అటు ఆధ్యాత్మిక పురోగమనం లేక రెండిటికీి చెడతాము. పట్టకపోతే మానేయ్యండి. పడితేమాత్రం కడతేరేదాక వదిలిపెట్టకండి.

       ఆత్మ ఎన్నడును పుట్టదు. పుట్టని ఆత్మకు మరణమే లేదు. పుట్టడమంటే ఏమిటి? కనబడకుండ ఉన్న రూపములో ఉన్నదేదో అదే కనబడే రూపానికి రావడము పుట్టడము. జీవుని విషయములో జీవోపాధికి పుట్టుట అనేది యున్నది. మామూలు  మిగతా పంచభూతాలకి వాటికి, వీటికి పుట్టడమంటే సృష్టి తన్మాత్రలుగా వున్నప్పుడు కనబడుటలేదు. సూక్ష్మ భూత రూపమున్నప్పుడు శక్తి రూపంగా వుంది. స్థూల భూతమయ్యేసరికి కనబడుతుంది. ఎక్కడికక్కడ కనబడటము అనేది వస్తే సృష్టి అన్నమాట. కనబడటము మరుగైపోతే లయము. జీవుల యొక్క మానవుల ఉపాధి అయితే పుట్టడము అంటే నామరూపంగా ఒక పిండంగా కనబడుతుంది. చచ్చుట అంటే ఆ పిండము కనుమరుగైపోవుట. ఎలా అంటే? ప్రాణముతో కూడుకున్నది. ప్రాణము లేకుండా వుంటుంది. ఇంకా దాన్ని విచారణ చేయాలి. పుట్టుక అంటే ఎమిటో శరీరము, ప్రాణము, మనసు, బుద్ధి ఇవన్నీ విచారణ చేస్తే పుట్టుక అంటే ఏమిటో తెలుస్తుంది. అయితే జడమైనటువంటివన్నీ వాటికవే వాటికవే వ్యక్తమై అవ్యక్తమవుతాయా? మూలా ప్రకృతి రూపము నుండే ఈ నామరూప జగతి రావడానికి దానంతట అదే వచ్చిందా? నీళ్ళు వుంటే ఆ సహకారముతో కదా అన్నము వుడికింది. నీళ్ళు అగ్ని వుంటేనే అన్నము ఉడికింది. బియ్యము వేస్తే ఉడికిందా? అగ్నివల్ల వుడికింది.

       అదే మాదిరిగా పుట్టుట, చచ్చుట అనేటటువంటిది, ఉత్పత్తి నాశనము అనేటటువంటిది దానికి నామరూప వస్తువులకు గాని, జీవుల యొక్క ఉపాధులకు గాని ఇవన్నీ ఆధారమైనటువంటి చైతన్యము తప్పనిసరిగా వుండాలి. ఆ చైతన్యమే బ్రహ్మాండ పిండాండమైన దానిలో ఉన్నది. ఆ చైతన్యమే ఆత్మ. బ్రహ్మ శాశ్వతము గనుక ఆది అంతము లేదు, ఆది మధ్యాంత రహితము గనుక ఆ బ్రహ్మమే సర్వదా సర్వత్రా వ్యాపించి వున్న బ్రహ్మ. ఆ మహాకాశమే ఘటాకాశముగా వున్నట్లుగా ఉపాధి  వచ్చేసరికి అందులో ఆత్మ అనే పేరు పెట్టాము. ఘటాకాశానికి ఆత్మ అన్న పేరు పెట్టాము. ఘటాకాశానికి వెలుపల వున్న ఆకాశానికి మహాకాశమును బ్రహ్మ అన్నాము. ఈ బ్రహ్మ ఆది అంతము లేనిది, చావు పుట్టుకలు లేనిది. అందుకే ఆత్మకు కూడా మరణము పుట్టుక లేదు. మనము ధరించినటువంటి శరీరము ఏదైతే ఉందో దానికి పుట్టుక, మరణము వుంది. జాతస్యమరణం ధృవం. పుట్టిన ప్రతీది నశిస్తుంది. అలాగే సృష్టి అయిన ప్రతీది ఎప్పటికో అప్పటికి లయమవుతుంది.

       ఉత్పత్తి అయినవన్నీ కూడా నశిస్తాయి. ఇవన్నీ అనిత్యములు. అసలు ఇవి ఎలా వస్తున్నాయి? కామ్యముతో కూడిన దేహమునకే మృత్యువు. దేహము ఎట్లా వస్తుంది? కామముతో వస్తుంది. సృష్టి ఆదిలో బ్రహ్మకు సంకల్పము కలగడమే కామము. సంకల్ప ప్రకారము వచ్చినవన్నీ ఊహా మాత్రమే. మన దగ్గరకు వస్తే ఎట్లా వుంది? కోరికలే పునర్జన్మకు హేతువు అని బౌద్ధ మతములో బుద్ధుడు చెప్పాడు. నిజానికి కామము ఎన్ని రకాలైన వుండవచ్చు. ఇష్టాఇష్టాలు అన్నీ కూడా, ఒకటి వద్దని ఒకటి కావాలని ఉన్నది కూడా కామమే. ఒకదానిమీద ప్రీతి, ఒకదానిమీద అప్రీతి వుంటే అది కూడా కామమే. కామ, క్రోధ, మోహ, లోభ, మద, మత్సరాలన్నీ కూడా ఒకే కామమనే హెడ్డింగు క్రిందే వస్తాయి.

       ఈ కామము స్థూల దేహానికా? ఈ కామమనేది ఎక్కడ వుందీ? కామమనేది నేనులో వుంది. నేనులో వున్నంతకాలమేమైందీ? నేనులో వున్న కామము అనగానే నేను వేరు అయింది. కామము వేరు అయ్యింది. ఈ కామమంతా మనసుకు సంబంధించినది అయినది. నేనును గనుక వేరు చేస్తే, అసత్య నేనుగా వున్నప్పుడు నేనులోనే కామముంది. నేనుని, మనస్సును వేరుచేస్తే ఈ కామమనేది మనస్సు. ఈ మనస్సు గూడ జడమే. మనస్సులో ఆత్మ వ్యాపించి వుండటము వలన మనస్సు పనిచేస్తుంది. ప్రాణము గూడ జడమే. ప్రాణములో ఆత్మ చైతన్యము వ్యాపించి వుండటము వలన ఆత్మ సత్తాచేత ఈ ప్రాణము స్థూల దేహములో పనిచేస్తుంది. ప్రాణము స్థూల దేహములో పనిచేయడము వలన స్థూల దేహము శవము గాకుండ పనికొచ్చే పనిముట్టుగా అయింది.

        ఈ సంఘాతములో నేను ఎవరు? అనేది తెలుసుకోవాలి. స్థూల దేహమా, ప్రాణమా, మనసా, ఆత్మా ఏది నేను? ఈ బోధ చెప్పేదెవరికి దేహానికా, ప్రాణానికా, మనసుకా, బుద్ధికా? నేనుకు. బుద్ధి ఇవన్నీ సహాయకారిగా వున్నాయి. నేనుకి మనసు, ఇంద్రియాలు సహాయకారిగా వున్నాయి. ఈ దేహము గూడ కోరికల వల్లనే పునర్జన్మగా వచ్చినటువంటి దేహమిది. ఒక జన్మము అంటే రాకడ అన్నమాట. ఆ జన్మలో అదే దేహముయొక్క పోకడ మృత్యువన్నమాట. మళ్ళీ రాకడ, పోకడ, అంటే, దేహానికే జననము, మరణము. మరి శరీరము నేనా? నేను అంటే శరీరత్రయ విలక్షణమని, అలాగే పంచకోశ లక్షణ వ్యతిరిక్త లక్షణమైనటువంటి ఆత్మ అని, అవస్థాత్రయ సాక్షి, ఈ మూడు విచారణలు చేస్తే దేహము నేను కాదు. నేను ఆత్మ అని తెలుస్తుంది. విచారణ చేసేది నేనన్నమాట. నేను యొక్క విచారణకు బుద్ధి సహకరిస్తుంది. మనసు సహకరించదు. మనసేమో పూర్వజన్మల కర్మవాసనల ప్రకారముగాను, చిత్తమందు చిత్తవృత్తులు సహజంగానే వాటికవే వచ్చేస్తూ వుంటాయి. ప్రతి జీవికి ప్రతి మానవునికి చిత్తవృత్తి ప్రకారము వచ్చిన విషయాన్ని స్వీకరించాలా, నిరాకరించాలా, ఆస్వాదించాలా, ఆస్వాదించకూడదా, ఉదాసీనంగా ఉండాలా అన్నది బుద్ధిలో వున్నటువంటి వివేకాన్నిబట్టి వుంటుంది.

       ప్రస్తుతము బుద్ధి ఏంచేస్తున్నది? అనేక జన్మలయొక్క అనుభవాలయొక్క సారముతో ప్రియం, మోదం, ప్రమోద పద్ధతికి కుదిరేవన్నీ కావాలనీ, అలా కుదరనివన్నీ బాధపెట్టేవన్నీ వద్దని బుద్ధి నిర్ణయిస్తున్నది. ఇక్కడ తాత్కాలిక లాభనష్టాలే చూస్తుంది. బుద్ధి మళ్ళీ ఒక్కొక్కసారి ఈ ప్రపంచములో కూడా దీర్ఘకాలిక లాభమే చూస్తుంది. కష్టపడి ఒకటి సాధించాలని, లేదా సంపాదించాలి అన్నప్పుడు తాత్కాలిక సుఖాన్ని మనము త్యాగము చేసి కష్టపడి సంపాదిస్తాము. వెంటనే వచ్చేటువంటి లాభము అనిత్యమని, కొంచెము టైమ్‌ తీసుకొని కష్టపడితే వచ్చే లాభము మన జీవితకాలము వుంటుందన్న దానిలో వుంటాము. మనము బుద్ధియొక్క వివేకాన్ని తక్కువ అనిత్యత్వము, ఎక్కువ అనిత్యత్వము, మధ్యలోనే వాడుకుంటున్నాము. అజ్ఞానముతోనే ఎక్కువగా అనిత్యమును వద్దంటున్నాము. నిత్యత్వము ఎక్కువున్న దాన్ని పొందాలనుకుంటున్నాము. కనుక బుద్ధి ఆ విధమైన నిర్ణయం చేయగలుగుతుంది. అటువంటి నిర్ణయం చేసే బుద్ధిని మానవుడు ఇప్పుడు పొందియున్నాడు. సృష్టి పరిణామములో మానవజన్మ వచ్చేసరికి అటువంటి బుద్ధి కలిగియున్నాడు. ఆ బుద్ధికూడా నేనుకు లోబడియున్నది. ఆనందమయకోశం వుంది. ఆనందమయ కోశము ప్రియం, మోదం, ప్రమోదం కావాలి, ఇతరమైనవి వద్దని దానిలో ఉంటుంది. విజ్ఞానమయ కోశంలో బుద్ధి ఆ ప్రభావానికి లోనై పనిచేస్తుంది. బుద్ధి అలా పనిచేస్తుంది కాబట్టి, బుద్ధి కర్త. నిజమైన భోక్తమో మనసులో వున్నాడు. అనగా బుద్ధిలో కర్త వున్నాడు, భోగానికి ప్రేరణగా ఆనందమయకోశము వుంది. భోగించినటువంటి దాంట్లో మనసుకి సుఖము, దుఃఖము అనేటువంటి భోగము మనోమయ కోశములో వుంది.

       ఈ రకంగా విచారణ చేస్తే మనము ఇంతకుముందే నిర్ణయించుకున్నాము. యద్భావం తద్భవతి’. భావించినదే కారణ శరీరములోనున్న వాసన అవుతుంది. పునర్జన్మలో అదే మళ్ళీ తిరిగి అనుభవానికి వస్తుంది. ఇది యత్‌భావం తత్‌ భవతి’. కాబట్టి భావాన్నిబట్టి వచ్చేది భావనా మాత్రమే. వాసనబట్టి వచ్చే అనుభవమంతా ఒకప్పటి భావనే. వాసనే పునర్జన్మలో ప్రారబ్దము. కనుక వాసన లేనివాడికి ప్రారబ్దము లేదు. నామరూప జగత్‌ మీద ప్రపంచ వాసన ఉంటే, ఈ ప్రపంచము ఉన్నది. వాసన లేనివాడికి జగత్తు లేదు. ఏదైనా సంసారానికి సంబంధించిన వాసన నీలో ఉంటే నీకోసం సంసారం వస్తుంది. ప్రతి జీవికి ఎవరి సంసారము వారికుంది. ఇతరుల సంసారము నీకు లేదు, నీ సంసారము ఇతరులకు లేదు. కారణం ఏమిటంటే యద్భావం తద్భవతి’’ అన్న వ్యక్తికి ఇక్కడేముందో దాని ఫలితము అక్కడుంది. వేరేవాడియొక్క యత్‌భావం తత్‌ భవతి కొచ్చేవాసన ప్రకారము వాడి ప్రారబ్దము వాడికుంది. లోకములో ఎంతమంది వున్నారో అన్ని కారణ శరీరాలు దానికనుగుణమైనటువంటి ప్రారబ్దము వారికుంది. నీవనుకున్నది వాళ్ళు అనుకోవడము లేదు. వాళ్ళనుకున్నది నీవనుకోవటము లేదు. నీవనుకున్న ప్రకారము నీ సంసారము నీ ప్రారబ్దముంది, ఇంకొందరనుకున్న ప్రకారము వారివారి సంసారములో ప్రారబ్దము ఉంది. అసలు అనుకోకపోతే వాసనలే లేకపోతే ప్రారబ్దముండదు. ప్రారబ్దము లేకపోతే దేహము ఉత్పత్తికాదు. ఇప్పుడు భ్రమ అనే మాటకి అర్థమేమిటంటే యత్‌ భావం తత్‌ భవతి వల్ల వచ్చిందే భ్రమ. అభావ స్థితిలో ఏదైతే వుందో అది నిత్యము, శాశ్వతము, అది సత్యము. భావన మూలంగా వచ్చేవన్నీ భ్రమే. ఒక భావమునుబట్టి వాసన, వాసనబట్టి ప్రారబ్దము, ప్రారబ్దముబట్టి ఇంద్రియ గోచరమైనది వస్తుంది. అనుభవానికి రావడమంతాకూడా భావనామాత్రము, కాబట్టి భ్రమే. ఊహామాత్రము, కాబట్టి భ్రమే. భ్రమంటే అసత్యాన్ని సత్యం అనుకోవడము. భ్రమలేకుంటే అమృతత్వము. శరీరము నేను అనేది భ్రమ, సుఖదుఃఖాలు శరీరానుసారంగా ఉన్నాయనుకోవడము భ్రమే. ప్రియం, మోదం, ప్రమోదం, నీలోవున్న సుఖస్వరూపాన్ని కనిపెట్టకుండా బాహ్య ప్రపంచములో దేవులాడుట భ్రమే.

       ఆ బాహ్య ప్రపంచములో మనము ప్రియం, మోదం, ప్రమోదం పద్ధతిగా విషయాల ద్వారా లభించే దానికి నీవు భోక్తవు కాకపోతే అంతా అభావమే. అభావములో ఏమైంది? ఏదైతే భావనామాత్రంగా వుందో అది లేకుండా పోయింది. వాసనా క్షయమైనా కూడా అంతే! లేనిది లేకుండా పోతుంది. భ్రాంతి రహితమైనపుడు కూడా, జగత్‌ జీవులయొక్క వ్యవహారమంతా కూడా, లేనివి లేకుండా పోతాయి. ఇవన్నీ లేకపోతే ఏదైతే వుందో అదే బ్రహ్మ. ఆ బ్రహ్మము పుట్టలేదు కాబట్టి ఆ బ్రహ్మము చచ్చేది కాదు. కాబట్టి ఆ బ్రహ్మానికి ఆది అంతము లేదు కాబట్టి, ఆ బ్రహ్మము అమృత స్వరూపము. బ్రహ్మ అంటేనే అమృతము. ఈ పిండాండములో నీయందే ఆత్మ అనే పేరుతో వుంది. కనుక ఆత్మే అమృతత్వము.

       కామ్యముతో కూడిన దేహము వున్నప్పుడు కామ్యము కారణ శరీరములో వుంటుంది. ఆ కామ్యాన్ని పనిగట్టుకొని అనుభవించే సూక్ష్మదేహము వుంది. సూక్ష్మ దేహములో కారణ శరీరము వలన తోచినటువంటి చిత్తవృత్తుల ద్వారా ఏ అవసరాలు, ఏ కోరికలు, ఏ ఇష్టాఇష్టాలు వచ్చాయో దాని ప్రకారము నీవు చేసినప్పటికీ చేసేవాడు ఎక్కడున్నాడు సూక్ష్మ శరీరములో వున్నాడు. వాడు చేయాలంటే కేవలము సూక్ష్మ శరీరముగా వున్నవాడు ఎలా చేయగలుగుతాడు? అందుకే ఆ సూక్ష్మ శరీరానికి కావలసిన అనుభవాలకోసము అదే సూక్ష్మశరీరము ఒక స్థూల శరీరాన్ని పనిముట్టుగా వాడుకున్నది. కాబట్టి ఈ చేతలన్నిటికి స్థూల శరీరము పనిముట్టు. ఇదంతా చెప్పకుండా ఒక్కమాట ఏం చెప్పుచున్నాడంటే దేహమునకే మృత్యువు ఆత్మకు మరణము లేదు. కామముతో కూడుకున్న దేహమునకే మృత్యువు. దేహానికి కామమెక్కడుదండీ? అయితేే దేహమనే మాటలో కారణ దేహము, సూక్ష్మ దేహము, స్థూల దేహము, మూడూ ఉంటున్నాయి. కాబట్టి ఇక్కడ దేహమంటే స్థూల దేహము ఒక్కటే అనుకోకూడదు. శరీరత్రయాన్ని దేహము అనాలి. కనుక శరీర త్రయము ఒక జట్టుగా పనిచేస్తున్నాయి. ఆత్మ సత్తాతో పనిచేస్తున్నాయి. ఆత్మ సత్తా లేకపోతే శరీరత్రయాది క్రియలు లేవు.

       కాబట్టి ఈ శరీరము నేను అనేది అజ్ఞానము. శరీరానికి వచ్చే నాశనానికి మృత్యువు అని పేరు పెట్టినప్పుడు అజ్ఞానానికి మృత్యువున్నది. బ్రహ్మ  అమృతము.  నీవు శరీరము కాదు కాబట్టి అప్పుడు నీవు కూడా అమృతము. ఆత్మ మూలంగా నీవు అనాత్మకాదు కాబట్టి చచ్చిపుట్టని అమృతత్వము వస్తుంది. భ్రమ వల్లనే మృత్యువుంది. దేహము నేను కాదు, నేను ఆత్మను అన్నప్పుడు ఆత్మగా స్థిరమై కూటస్థుడై వుంటాడు. భ్రమ లేకుంటే అమృతత్వము. భ్రమ వుంటే మృత్యువు. ఈ శరీర త్రయము, అవస్థాత్రయము, విలక్షణత్వము, సాక్షిత్వము వీటన్నిటినుండి తీసుకెళ్ళి ఇదంతా బ్రహ్మ మూలం ఇదం జగత్‌. బ్రహ్మైవాహం ఈ నేను బ్రహ్మతో కూడినది. ఆ బ్రహ్మమే ఈ మాయా కల్పిత ప్రపంచములో చలామణి అవుతుంది. అట్టి భ్రమ గనుక వుంటే శరీరము నేను అనేది వస్తే శరీరము పుట్టింది కాబట్టి నశిస్తుంది. కాబట్టి భ్రమ వల్లే మృత్యువు. భ్రమరహితమైతే, భ్రమ లేకపోతే, శరీరము నేను అనేటువంటి భ్రాంతి లేకపోతే, భ్రాంతులన్నీ ఒక్కటి కూడా మిగలకుండాపోతే, ఉన్నటువంటి ఆత్మ స్వరూపము నువ్వే అయివున్నావు గనుక అహం బ్రహ్మ అనేదే అమృతత్వము. మృతి చెందేది దేహమే గాని ఆత్మ గాదు అని తెలిసినదే! చెప్పే పద్ధతిలో చూడండి. దేహము ఎప్పుడును మారుతూనే వుంటుంది. శుక్ల శోణితాల దగ్గరనుంచి గర్భములో వృద్ధిచెంది, పుట్టి పుట్టిన తరువాత మళ్ళీ వృద్ధిచెంది, మార్పుచెంది, క్షీణించి, నశిస్తుంది. కృశిస్తుంది, క్షీణిస్తుంది, నశిస్తుంది దేహమంటే అంతే!

       స్థూల దేహము చెప్పాము. మరి సూక్ష్మ దేహము అదికూడా దేహమే కదా! ఏదైతే దహిస్తుందో ఏదైతే దాహకమో అదే దేహము. పొట్టలో వైశ్వానరాగ్ని వుంది. జఠరాగ్ని వుంది. అగ్ని వలన ఆకలి పుడుతుంది. కాస్త అన్నం వేయకపోతే ఏం చేస్తుంది? పొట్టలోపలి భాగాల్ని తినేస్తుంది. లోపలి భాగాల్ని దహింపచేస్తుంది. అన్నం వేస్తే ఏం చేస్తుందీ? అన్నాన్ని దహింప చేస్తుంది. అన్నము దహింపబడగా రూపాంతరము చెంది అన్నరసం రక్తంగా మారుతుంది. ఇదంతా దాహకము వల్లే అనగా దహింపబడే తత్వం వుంది కాబట్టి. స్థూల దేహం కూడా కాలిపోతుంది చివరికి. ఇక్కడ అన్ని రకాల అగ్నులు వున్నాయి. కోపాగ్ని కోపము అనే అగ్ని వుంది. అగ్నితత్వం అంటే ఏమిటీ? సోమరితనము, సంగత్వము, నిద్ర, ఆకలి, దప్పిక, ఇవన్నీ కూడా. దప్పిక అంటే ఏమంటాము? దాహము. దాహము అంటే ఏమిటి? లోపల వున్న అగ్నితత్వము వుండి దహింపచేస్తుంది. అందుకే దీనికి దేహమని పేరు.

       కారణ దేహము అంటే అదికూడా అంతే. కర్మఫలంగా వస్తుంది. పూర్వజన్మ వాసనవలన వచ్చి కర్మానుభవము పొందుతుంది. కర్మ లేకపోతే కారణ శరీరము నశిస్తుంది. వాసనాక్షయమైతే కారణ శరీరము లేకుండా పోతుంది. ఏదైనాసరే లేకుండా పోవడమనేది శీర్యతే ఇతి శరీరహః దేనికైతే క్షీణించి నశించేటటువంటి గుణమున్నదో అది శరీరము. స్థూల శరీరము అలాగే నశిస్తుంది. వాసనా క్షయమైనప్పుడు కారణ శరీరము నశిస్తుంది. సూక్ష్మ శరీరము ఎలా నశిస్తుంది? దానికి ఒకే జన్మ, ఒకే మరణము అంటారు. సూక్ష్మ శరీరము ఎప్పుడు పుట్టిందో మనకు తెలియదు.  

       మూలానికి వెళ్దాము. జన్మ ముందా? కర్మ ముందా? ఏదైతేనేమి ఒకసారి వచ్చేసింది సూక్ష్మశరీరము. ఆ తర్కము పక్కనపెట్టి, సూక్ష్మ శరీరము అనేక సృష్టిపరిణామ దశలను దాటి, మానవ పునర్జన్మను దాటుతున్నాము. వీటిలో ఉపాధియొక్క మార్పులు వచ్చినప్పుడు 84 లక్షల జన్మలుగా ఉపాధులు మారిపోతున్నాయి. సృష్టి పరిణామములో కూడా అనేక ఉపాధులు రాలిపోతున్నాయి. సూక్ష్మ శరీరానికే జీర్ణమైన వస్త్రము తీసివేసి మళ్ళీ కొత్త వస్త్రము వేసినట్లుగా స్థూల దేహాలు పోతున్నయి, వస్తున్నాయి. సూక్ష్మ శరీరము ఇన్ని లక్షల జన్మలలో కూడా నశించట్లేదు. ఎప్పుడైతే తనకి భ్రమ పోయిందో అప్పుడు తన స్వరూపము బ్రహ్మమైయుండి చావు పుట్టుకలు లేనటువంటి అమృతత్వమును పొందుతుంది. తన స్వరూపమే బ్రహ్మమని ఎప్పుడైతే జ్ఞానము కలిగిందో, భ్రమ పోయి భ్రమ కారణంగా కలిగిన అజ్ఞానము తొలగుతుంది. అప్పుడేమయ్యాడు? సూక్ష్మ శరీరము భంగమైయింది. లింగ శరీరము భంగమయింది. కారణ శరీరము సున్నా అవగానే సూక్ష్మ శరీరము లేకుండా పోయింది. సూక్ష్మ శరీరము కూడా నశించిందిగా! సూక్ష్మ శరీరానికి శరీరమనే అర్థము సరిపోయిందిగా. ఒకే జన్మ అనాది మాయచేత కలిగింది. ఒకే మరణము విదేహ ముక్తస్థితి రాగానే పోయింది.

       విదేహ ముక్తుడికి ఇక సూక్ష్మ శరీరము లేదు కాబట్టి ఇంక స్థూల దేహాన్ని నిర్మించుకోవలసిన అవసరము లేదు. అవసరము ఎప్పుడు పోయింది? కారణ శరీరములో వాసనా క్షయము అయినప్పుడు పోయింది. కనుక ఏది ముందు? కారణ శరీరము సున్నా అయినప్పుడు సూక్ష్మ శరీరము భంగమైనప్పుడు ఈ రెండూ లేకపోతే స్థూల శరీరము రానేరాదు. ఆ రెండూ వుంటే వస్తుంది. ఏదైనప్పటికీ దేహము, శరీరము అనే పేర్లు మూడింటికి వున్నాయి. స్థూల, సూక్ష్మ కారణ శరీరాలు ఎప్పుడూ కూడా మారుతూనే వుంటాయి.

       కారణ శరీరము మారటంలేదా? పశువుగా వున్నప్పటి కారణ శరీరానికి, అనాగరిక మానవునిగా వున్న కారణ శరీరానికి, వాడే కొన్ని లక్షల పునర్జన్మలు దాటి నాగరిక మానవునిగా వున్న కారణ శరీరానికి తేడాలేదా? మారుతుంది. అలాగే సూక్ష్మ దేహములో కూడా మార్పులొస్తున్నాయి. ఎక్కడున్నాయి మార్పులు? పశువు దగ్గరున్నటువంటి మనసు బుద్ధి ఎక్కువ జడత్వంగా ఉన్నాయి. మానవుని దగ్గర వచ్చినటువంటి బుద్ధి జడత్వము తగ్గి విచక్షణా జ్ఞానము పెరిగి, వివేకము పెరిగి, స్థూల దేహాన్ని పనిముట్టుగా వాడుకునేటటువంటి తెలివిగూడా పెరిగింది. అదివరకున్నటువంటి పశుపక్ష్యాదులకున్నటువంటి భోగము అంత విశ్లేషణగా లేదు. మానవ జన్మలో వచ్చినటువంటి శరీరానుసారమైన భోగము విశ్లేషించి జ్ఞాపకము పెట్టుకొని, మళ్ళీ ఇటుంటిది బాగుంటే మళ్ళీ మళ్ళీ రావాలని, బాగుండకపోతే ఇటువంటిది మళ్ళీ మళ్ళీ రాకూడదనేటువంటి వాసనతో కర్మ చేసుకుంటూ జాగ్రత్తపడుతున్నాడు. ఆస్వాదిస్తున్నాడు. అప్పుడున్నటువంటి సూక్ష్మ దేహము, ఆకలి, భయము, నిద్ర, మైధునముతో పరిమితమైనది. మానవ దేహము వచ్చేసరికి దానికి మించి, ఆకలి లేకపోయినా తినటమని, రుచికోసము తినటమని, ఇవన్నీ కూడా ప్రకృతి సిద్ధంగా జరిగేవాటిగా కాకుండా ప్రకృతి సహకరించకపోయినా, తనకు కావలసిన ఏర్పాట్లు చేసుకుంటూ కూడా భోగిస్తున్నాడు. ఈ విధంగా సూక్ష్మ శరీరములో పరిణామముంది. వాసనలలో మార్పుంది. సూక్ష్మ శరీరములో మార్పుంది. మనసులో నిరంతరము ఆలోచనలు వస్తూపోతూ మారిపోతున్నాయి. జన్మజన్మకి కూడా వివేకము, విచక్షణ, ఆలోచన, దాని పదును, దాని చురుకుతనము, దానియొక్క నిర్ణయములు, తెలివి, గడుసుతనము అన్నీ పెరగట్లేదూ? అందుకనే పుట్టింది ఎలా చస్తుందో, మార్పు చెందేది కూడా చిట్టచివరికి మార్పు చెంది ఇక మార్పు చెందడానికి ఏమీలేక నశిస్తుంది.

       నాశము గల దేహము నేను అని భ్రమపడి జ్ఞానహీనుడైన నేను అనేదే అజ్ఞానము. అంటే ఆత్మ నేను అని మరచిపోయినవాడు, జ్ఞానహీనుడై మృతినొందును. మానవుడంటే ఏమిటంటే నేను నాది అనేటువంటి అహంకారముయొక్క అభిమానము ఎక్కువగా వున్నవాడు. మానము ఎక్కువగా వున్నవాడు. బహుమానము, అవమానము, అభిమానము ఎక్కువగా వున్నాడు మానవుడు. నేను వేరు కాకుండా మనసే తాననుకునేవాడు మనుష్యుడు. నేను నాది అని అభిమానము కలవాడు మానవుడు. దహించేది, దహించబడేది దేహము. నశించేది, నశించే గుణము ఉన్నది శరీరము. ఈ పేర్లు గుర్తుపెట్టుకోవాలి. శరీరము ఉన్నప్పుడల్లా ఇది నశించే శరీరము, అని రావాలి. దేహము నేను అన్నప్పుడల్లా, ఇది దహించబడేది, దహిస్తుంటుంది అని రావాలి. నిన్ను నువ్వైనా దహింపచేసుకుంటావు. లేక ఎదుటివాళ్ళనైన దహింపచేస్తావు.

       అన్నాన్ని తీసుకొని నీ నోట్లో పడేసుకొని పొట్టలోవున్న జఠరాగ్నికి ఆహుతి చేస్తావు. ఆ రకంగా అన్నాన్ని గూడా దహింపచేస్తున్నావు నీవు. అలా ప్రతీది దహింపబడుతుంది. కర్మ చేస్తుంటే స్థూల శరీరములో వున్నటువంటి శరీర కణాలన్నీ దహింపబడుతున్నాయి. ఆ అన్నము వలన మళ్ళీ కొత్త కణాలు ఉత్పత్తి అవుతున్నాయి. పాత కణాలు దహింపబడుతున్నాయి. రాత్రిపూట కర్మ తక్కువవటము వలన కణాల యొక్క దహనము తక్కువవ్వడము వలన మన శక్తి వినియోగము తక్కువవ్వడము వలన, మళ్ళీ అలసట లేకుండా లేస్తున్నావు. రాత్రి పడుకోబోయముందు అలసటగా నిద్రలోకి జారిపోతున్నాము. పగలల్లా కర్మ చేయడము వలన అలసట వస్తుంది. రాత్రి కర్మ చేయటము తగ్గింది. గుండె కొట్టుకోవడము, శ్వాసక్రియ జరగడము వంటి చాలా తక్కువపాటి కర్మ జరుగుతుంది. కాబట్టే అన్నము ద్వారా నీవు సంపాదించే శక్తి మిగులుతుంది. కర్మ తక్కువైతే శక్తియొక్క ఖర్చు తక్కువ. పగలేమో ఎంత తీసుకుంటే అంత కర్మచేసి కష్టపడి చేసేసరికి కణాలు దహింపబడుతున్నాయి. నశించబడుతున్నాయి. ఈ పేర్లు ఇలా గుర్తుపెట్టుకుంటే ఆత్మ దహించబడదు. ఆత్మ శోషించదు. ఆత్మ కాలదు. ఆత్మ కుళ్ళదు. ఆత్మ శస్త్రముచేత నరకబడదు అని భగవద్గీతలో చెప్పినట్లుగా ఎప్పుడూ గుర్తుపెట్టుకుంటే ఈ శవాన్ని దహిస్తున్నట్లుగా ఆవన చేస్తుంటే తప్పులేదు. నశించేదే నేను కాదని తెలుస్తుంది కాబట్టి ఆ పోయేకాలము వచ్చినప్పుడు ఇదంతా అనుకున్నదేగా, ఇప్పుడు పోతూ ఉంది అనిపిస్తుంది.

       జీవుడు కర్మానుష్ఠానము చేసి జ్ఞానము వృద్ధిచేసుకున్న కొలది శరీరములు మారిపోతున్నాయి. కర్మానుష్ఠానము వలన ప్రతి జన్మలో చేసినటువంటి కర్మ ఫలితము వల్ల, ఆ కర్మ ఫలితాన్ని ఎక్కువ సుఖంగా అనుభవించటము చేతను, దుష్కర్మల వలన వచ్చేటువంటి కర్మ ఫలితము ఎక్కువ బాధించగలిగేదైవుంటే, దాన్ని తెలుసుకొని అటువంటి బాధ రాకుండా జాగ్రత్తపడటములోనే తన తెలివి పెరుగుతుంది. జన్మజన్మకి తన తెలివి పెరుగుతుంది. ఇది లౌకిక జ్ఞానము నీ ఉపాధికి ఇతరుల ఉపాధికి సంబంధించినటువంటి జ్ఞానమే. ఈ ఉపాధులను సుఖపెట్టేటువంటి జ్ఞానము. ఉపాధిని బాధపెట్టకుండా వుండేటటువంటి జ్ఞానము. ఇదంతా అజ్ఞానములోనే వుంది. అజ్ఞానములోవున్న జ్ఞానము పెరుగుతుంది, వృద్ధవుతుంది. చివరకు వృద్ధి అయ్యి అయ్యి ఏమవుతుంది? ఈ వృద్ధి అవ్వడమువలన శరీరాలు మారిపోతున్నాయి.

       ఎందుకనీ? చీమకున్న శరీరము చీమకున్న మనస్సుకి సంస్కారానికి తగినట్లుగా వున్నది. పిల్లికున్న శరీరము పిల్లియొక్క సంస్కారానికి తగినట్లుగా వున్నది. ఈ పెరిగినటువంటి సృష్టి పరిణామములో, వృద్ధి అయినటువంటి జ్ఞానానికి తగినట్లుగా మానవ శరీరము వచ్చేసరికి, ఆ పరిణామములో వున్నటువంటి చాలాచాలా అనుభవాలు గుర్తించడము, తనకు కావలసిన అనుభవాన్ని పొందడానికి జాగ్రత్తగా కర్మ చేస్తూ ఆ కర్మ ఫలము కోసము ప్రయాసపడుతున్నాడు. అలాగే దుఃఖము బాధ రాకుండా వుండేందుకు ప్రయాసపడుతున్నాడు. ప్రతి జన్మకి ఎంత చేసినా కూడా ఎక్కడోఅక్కడ బాధలు వస్తూనే ఉన్నాయి. అనుకున్న సుఖము రావటము లేదు. కనుక అలా జన్మ జన్మకి బుద్ధ వికాసము పెరుగుతుంది. ఆఖరికొచ్చేసరికి ఇవన్నీ అనిత్యమేగా ఎంత ప్రయత్నించినా ఏమీ ఉపయోగము లేదు అని తెలిసింది. ఈ జ్ఞానముయొక్క వృద్ధి ఎక్కడిదాకా పోయిందంటే అనిత్యమైన వస్తువులతో మనము నిత్యమైనటువంటి సుఖాన్ని పొందలేము.  ఎన్ని జాగ్రత్తలు తీసుకొని సుఖము పొంది బాధపడకుండా వుండేటటువంటి ప్రయత్నము ఎంత చేసినప్పటికీ, పూర్వజన్మ కర్మ ఫలితంగా ప్రారబ్దంగా వుంటున్నాయి తప్ప మన చేతిలో ఏమీ లేదని, పురుష ప్రయత్నముతో ఎలాగో అలాగు జయించినప్పటికీ అది అనిత్యంగా వుంటుందని శాశ్వతముగా లేదని ఆ జ్ఞానము కూడా వచ్చింది.

       ఆ జ్ఞానము వచ్చినవాడు శాశ్వత సుఖము కోసము తపస్సు చేశాడు. ఉపనిషత్తులు వచ్చాయి. మనకు అందించబడినవి. అందరు అంత దూరము పోలేరుగా. మొదటివాడు కష్టపడతాడంటే రెండవ వాడికి మొదటివాడు మార్గదర్శకమై అంత కష్టపడకుండా తేలిక ఉపాయాలు సుఖ స్వరూపమైనటువంటిది ఎక్కడుందీ, ఏమిటీ, ఎలా వుంటుందీ, నాకొచ్చింది అని సాక్ష్యముతో సహా చెప్పినప్పుడు ఆయన్ని వెంబడించిన వారికి ఏమిటంటే, కొన్ని లక్షల జన్మలు తగ్గిపోయి ఆ సుఖాన్ని పొందటానికి వీలవుతుంది. ఇది కూడా జ్ఞానవృద్దే, లౌకిక జ్ఞానవృద్ధి.

       ఇక్కడ అనుష్ఠానము అనేమాట వాడారు చూడండి. కర్మానుష్ఠానములో తప్పనిసరిగా మొదటి స్థితికంటే ఉన్నత స్థితి వస్తుంది. ఈ కర్మాచరణలో కర్మానుష్ఠానములో కూడా అనేక బాధలు అనుభవించేవారు. మానవుడు అనేక సుఖములు పొందే మానవునిగా వృద్ధి చెందాడు. కనుక ఈ కర్మకూడా ఒక ఉపాసనా అనుష్ఠానమే. దాని ఫలితాన్ని చక్కగా మళ్ళీ శాశ్వతానందానికి నీవు నీవైనటువంటి ఆత్మ స్వరూపాన్ని తెలుసుకోవడానికి వాడాలి. ఆ టైమ్‌ వస్తుంది. బాగా కొట్టబడినప్పుడో, వైరాగ్యమొచ్చినప్పుడో, కష్టాలు ఆత్మహత్యా సదృశ్యంగా వున్నప్పుడో, బంగారము ముట్టుకుంటే మట్టి అయిపోయిన పరిస్థితిలోనో, బంధువులను, తనవారిని సర్వాన్ని కోల్పోయి ఏకాకి అయినప్పుడో ఒక మలుపు వస్తుంది జీవితములో. ఆ మలుపులో ఒక గురువో నీకంటే ఉన్నత స్థితిలో ఉన్నటువంటి మానవుడో నీకు సలహా ఇవ్వడము సహాయము చేయడము జరుగుతుంది. అటువంటి అజ్ఞానములో కూడా పోయింది ఏలాగో పోయింది. నేను ఏమీ చెయ్యాలో తెలియని స్థితిలో ఆయన చెప్పే సలహా పాటిద్దాము. అంతకంటే పోయేదేముంది? ఆయన చెప్పేది నిజమైతే పరవాలేదు. నిజము కాకపోయినా పరవాలేదు అని వింటాడు. మొదట్లో దానివల్ల అతని సమస్యకు పరిష్కారమొచ్చి సుఖమొస్తే ఇక పూర్తిగా వింటాడు. అలా వినటం అనేది ఎప్పుడైతే మొదలైందో గురువు దగ్గరకు చేరుతాడు. భ్రమనుండి విడుదలయ్యే ప్రయత్నము చేస్తాడు. కనుక జంతువు ద్వారా జంతువుదాకా వచ్చే పరిణామము, మానవ పునర్జన్మలన్నీ కూడా లౌకిక జ్ఞాన వృద్ధికోసమే పనికివచ్చాయి. ఈ లౌకిక జ్ఞానవృద్ధిలో కూడా కొన్ని నీచ సంస్కారాల నుండి విడుదలై, ఉన్నత సంస్కారాలన్నీ పోగుచేసుకుంటారు. దుష్కర్మ నుంచి విడుదలై సత్కర్మ ఆచరణ చేసుకుంటూ సత్కర్మ ఫలితాలని అనుభవిస్తాడు. ఇది కర్మానుష్ఠానము.

       కర్మానుష్ఠానములో భాగంగా సత్కర్మ ఎప్పుడైతే చేశామో, అనగా ధ్యానము చేయడము, దైవ ప్రార్థన చేయడము, నవవిధ భక్తిమార్గాలు, ఇవన్నీ కూడా సత్కర్మలే. ప్రజాసేవ, ఇతరుల కోసము నీ స్వార్థాన్ని త్యాగము చేయడము ఇవన్నీ సత్కర్మలే. ఆ సత్కర్మల ఫలితము వలన నీ మనసుకు శాంతినివ్వడము, ఆ మనస్సు యొక్క శాంతిచేత సత్వగుణము వృద్ధి చెందడము, సత్వ గుణముచేత పెద్దల వాక్యాలని, సలహాలని జాగ్రత్తగా విని అవగాహన చేసుకొని, మేలైనవి స్వీకరిస్తూ మేలుకానివి పక్కన పడేసుకుంటూ ముందుకెళ్తాము. సత్వగుణమున్నవాడు అలా చేస్తాడు. కనుక జీవుడు మొదట్లో తమోగుణముతో వున్నాడు. కొంతకాలము పోయిన తరువాత కొన్ని జన్మల తరువాత రజోగుణము ఎక్కువ పాళ్ళతో వున్నాడు. కొన్ని లక్షల జన్మలయ్యే సరికి సత్వగుణ ప్రధానంగా వుండటము నేర్చుకున్నాడు. దానివల్ల మానసిక శాంతి వచ్చి ఆత్మ జ్ఞానాన్ని పొందటానికి అనుకూలమైనటువంటి వాతావరణము వచ్చింది. తన మేలు కోరేవారు ఎవరైనా చెబితే వినదగు నెవ్వరు చెప్పిన అని వినటం అంటూ మొదలైంది. పచ్చి చింతకాయలో వున్న బెరడు, ఈనెలు, గింజలు, గుజ్జు వేరుచేయలేము. అటులనే విషయాసక్తులకు, దేహాభిమానులకు జ్ఞానము అంటదు. ఆ పచ్చి చింతకాయ చింతపండు అయితే లోపల పండు ఏర్పడి ఆ పైనున్నది బెరడైపోయి ఊడిపోవడానికి వీలుగా గుల్లగా లోపలనున్న గుజ్జును అంటిపెట్టుకున్న ఈనెలు తీసివేస్తే అందులోనున్న చింతగింజ తీసివేస్తే ఇవన్నీ పక్వమయ్యాక జ్ఞానము సాధ్యమైంది. పచ్చిగా వున్నప్పుడు సాధ్యము కాలేదు. అలాగే మానవ దేహత్రయములో స్థూల దేహమేమో బెరడు, సూక్ష్మ దేహమేమో పీచు, గింజేమో కారణ శరీరము, గుజ్జేమో ఆత్మరసం. విషయాసక్తులకు, దేహాభిమానులకు జ్ఞానమంటదు. వాళ్ళంతా పచ్చి చింతకాయలాటి వాళ్ళు. పండిన చింతకాయలో బెరడు మొదలైనవన్నీ కూడా లోనున్న పండులోనే అక్కడికక్కడే విడివడే వుంటాయి. కొంచెము ప్రయత్నము చేత చింతపండును వేరుచేయానికి వీలవుతుంది. చింతపండును బెరడునుండి, పీచునుండి, గింజనుండి వేరుచేయవచ్చును. ఈ మూడింటినుండి వేరుచేసిన చింతపండే ప్రత్యక్‌ ఆత్మ. పండును వేరుచేసి ప్రక్కన పెడితే అది ప్రత్యగాత్మ అది మిగిలినవాటికి విలక్షణము. ఈ చింతపండుకి పీచు లక్షణాలు లేవు. గింజ లక్షణాలు లేవు. బెరడు లక్షణాలు లేవు. ఇదే ప్రత్యగాత్మ, సాక్షి, విలక్షణము. అదే విధంగా దేహాభిమానము ఆత్మను వదలిపోతుంది. ఆత్మ విక్షేప ఆవరణలు లేక కేవలముగా ప్రకాశిస్తుంది. ఇక్కడే శరీర త్రయము విలక్షణము అని చెప్పటము జరిగింది.