14


దృక్‌


       బ్రహ్మము స్వయం ప్రభ, స్వయం ప్రకాశము. ఏ ఇతర చైతన్యమునకును విషయము కాదు. ప్రభకి, స్వయం ప్రకాశానికి తేడా ఏమిటి? రెండూ ఒక్కటే. జ్యోతి యొక్క స్వరూపానికి, జ్యోతి యొక్క ప్రకాశానికి ఏమి తేడా? ఒక దీపం వెలిగించి, దాని మీద బుట్ట బోర్లిస్తే ఆవరణ లేకపోతే జ్యోతి మాత్రమే ప్రకాశ ఘనముగా ఉంటుంది. ప్రకాశము ముద్ద అయినట్లు ఉంటుంది. బుట్ట తీసేస్తే, ఆ గది అంతా కూడా జ్యోతి యొక్క వెలుగు వ్యాపిస్తుంది. కనుక ప్రకాశం అంటే, వ్యాపకమైనటువంటి వెలుగు. ప్రభ అంటే ఒక ప్రభలాగా కనబడుతున్నటువంటి జ్యోతి రూపం.

       చంద్రుడు, చంద్రుని వెన్నెల. సూర్యుడు, సూర్యప్రకాశం ఉన్నాయి. సూర్యబింబం అనేది స్వయం ప్రభ అయితే, సూర్యరశ్మి, ఎండ అంతా ఎక్కడైతే లోకమంతా వ్యాపించి ఉందో, అది వ్యాపకముగానున్న ప్రకాశము. స్వప్రకాశం అంటే ఏమిటి? స్వయం ప్రభే స్వప్రకాశం. రెండూ ఒక్కటే.

       ప్రభ, ప్రకాశం విడివిడిగా చెప్పినప్పటికీ స్వయం ప్రభ అనేది పరబ్రహ్మ. ప్రకాశం అనేది మాయ వరణంలో వ్యాపించిన ప్రకాశము. మళ్ళీ స్వప్రకాశం అనగానే, అది కూడా పరబ్రహ్మే. వెలుగు జ్యోతికూడా తనను తాను వెలుగించుకుంటూ ఉంది. ఆ వెలుగుతున్నటువంటి జ్యోతి ఆవరణలో ప్రకాశించినా, ప్రకాశించక పోయినా, తనను తాను మాత్రము నిత్యము ప్రకాశింప జేసుకుంటూ ఉంటుంది. కనుక స్వయం ప్రకాశం, స్వయం ప్రభ. ఈ రెండూ పరబ్రహ్మ నిర్ణయం. ఏ ఇతర జీవ చైతన్యమునకును ఇది విషయము కాదు. ఏ ఇతర చైతన్యము అంటే, జీవ చైతన్యము అహం అహం అనే వాడియొక్క చైతన్యము, బుద్ధితో మలినమైన చైతన్యము విషయాలతో మాలిన్యమైనటువంటి మనస్సు యొక్క చైతన్యము స్వయం ప్రభ అనేదానికి విషయం కాదు. ఎందుకు విషయం కాదు?

       మనస్సు యొక్క ఆలోచనకి, బుద్ధి యొక్క భావనకి, ఊహకి అందేటట్లయితే అది విషయం. శబ్ద, స్పర్శ, రూప, రస, గంధాలను గ్రహించే జ్ఞానేంద్రియాలకు ఆ శబ్దాదులే విషయమౌతాయి. ఐదు జ్ఞానేంద్రియాలు ఐదు విషయాలను తెలుసుకునేందుకు పరిమితమై ఉన్నాయి. ఐదు విషయాలు దాటిన దానిని, ఈ ఐదు జ్ఞానేంద్రియాలు ఏమీ తెలుసుకోలేవు. ఈ ఐదు జ్ఞానేంద్రియాలకి, మనస్సుకి, బుద్ధికి, శబ్దాదులు వాటి యొక్క రెండూ, మూడు, నాలుగు, ఐదు కాంబినేషన్స్‌గా కలిసిపోయినటువంటివి గూడా, వేరే అనుభవంగా మీరు చెప్పినప్పటికి అన్నీ వీటియొక్క కలయికతో కూడినటువంటి అనుభవాలే. మీ ఇంద్రియాల ద్వారా గోచరమౌతాయి. ప్రత్యక్ష్యంగా ఈ ఐదు ఇంద్రియాల ద్వారా గోచరమయ్యింది. వృత్తిలోకి వచ్చి, మళ్ళీ జ్ఞాపకానికి, గుర్తుకి, వచ్చినప్పుడు అవి విషయాలు. ప్రత్యక్ష్యంగా ఈ ఐదు లేకపోయినప్పటికీ, ఊహలో, భావనలో కూడా ఈ ఐదే వస్తాయి. చూసినటువంటి దృశ్యము ఎదురుగా ప్రత్యక్షముగా లేకపోయినప్పటికీ, ఊహలో ఆ దృశ్యము ఉంటుంది. ఊహలో ఆ శబ్దం ఉంటుంది. ఊహలో ఆ రుచి ఉంటుంది. అంటే జాగ్రదావస్థలో ప్రత్యక్షముగా అనుభవించినవన్నీ కూడా, వాసన రూపంలోకి వెళ్ళి, ఇష్టాయిష్టాలను, రాగద్వేషాలను అనుసరించి, ఊహించినప్పుడు ఊహలోనికి ఇవన్నీ కూడా రావచ్చు. అంటే, స్వయం ప్రభ అయిన బ్రహ్మకు ఇటువంటి విషయాలు ఊహలోకి రావు. యతోవాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా’ - పరబ్రహ్మను తెలుసుకోవడానికి, మనస్సు - వాక్కు రెండూ వెళ్ళి తెలుసుకోలేక, వెనక్కు తిరిగి వెళ్ళిపోతాయి. నివర్తంతే అంటే వెనక్కు తిరిగి వెళ్ళిపోతాయి. అంటే, వాక్కుకి అందదు, మనసు యొక్క ఊహకి అందదు. నివర్తతంతే అంటే ఇంకొక అర్థము ఉన్నది. ఇంద్రియాలన్నీ వర్తించడము మానేస్తాయి, ఆ పరబ్రహ్మ అయినవాడికి. స్వానుభవ సాక్షాత్కార జ్ఞానము ఇంద్రియ గోచరము కాదు. విషయము కాదు. ఊహాతీతము, భావాతీతము. అనిర్వచనీయము. కేవలము సచ్చిదానంద ఘనము. స్వస్వరూపము, అపరోక్షము.

       పరబ్రహ్మము స్వప్రకాశము, స్వయం ప్రభ. అది ఏ ఇతర చైతన్యములకు విషయము కాదు. అంటే బుద్ధి గత చైతన్యానికి, ఇంద్రియగత చైతన్యానికి పార్థివ శరీరం లేని, యక్ష, కిన్నెర, కింపురుషాది దేవతలందరూ కూడా ఉన్నారు. వాళ్ళు దివ్య శరీరము కలిగిన వారు. ఆ దివ్య శరీరముగా ఉన్నవాళ్ళకి దివ్యత్వము, దైవీ చైతన్యము ఉంటుంది. ఆ దివ్య చైతన్యము కూడా పరబ్రహ్మకు విషయము కాదు. మానవ చైతన్యమనేదీ విషయము కాదు. జీవగత చైతన్యము కూడా విషయము కాదు. ప్రాణ చైతన్యము ఆ పరబ్రహ్మకు విషయము కాదు. 

       నేను అనేటటువంటి సాక్షి చైతన్యము కూడా విషయము కాదు. దృక్‌ దృశ్య వివేకాన్ని పొడిగిస్తే, ప్రతి బింబముగా అంతఃకరణ వృత్తులుగా, సాక్షి చైతన్యంగా ఉన్నప్పటికీ, అంతఃకరణ వృత్తులు ఆగిపోయి, కేవల సాక్షి రూపంగా ఉన్నటువంటి చిదాభాస చైతన్యము కూడా స్వయంభాస చైతన్యానికి దృశ్యమయ్యింది. స్వయం ప్రకాశ, స్వయంభాస చైతన్యం అనేటటువంటిది  సాధకుడికి ఇప్పుడు ఆత్మ అయ్యింది. దేహాత్మ, జీవాత్మ, జీవచైతన్యములో ఉండేటటువంటిది, సాక్షి చైతన్యములో ఉండేటటువంటి ఆత్మ. ఇలా ఆత్మ అనేది మాత్రం విలక్షణం చేసి పట్టుకోవాలి. ఎందుకంటే నీవే ఆ బ్రహ్మవి. నీవు కాకుండా బ్రహ్మ ఎక్కడా లేడు. కాకపోతే నీవు చాలా అనుకుంటున్నావు. అవన్నీ ఆగంతుకములు. వచ్చిపోయేవి. అవి ఏవీ నీ సహజస్థితిని చెడగొట్టలేవు. ఆవరణ, విక్షేప దోషాల చేత, నీ సహజస్థితి చెడకనే, భ్రాంతిలో చెడినట్లు కనబడుతోంది. భ్రమవీడితే చెడినట్లు కనపడేది, చెడినట్లు కాదు. సహజంగా నీవు నీవుగానే ఉన్నావు. అందుకే నేను అనేటటువంటిది, ఆత్మను, సూత్రాత్మను పరమాత్మను అంటూ పోయి, బ్రహ్మమే ఉందంటే, నీకేమి ఉపయోగం? బ్రహ్మ ఎంతగా గొప్పదైనా, నీకేమీ లాభం లేదు. నువ్వే ఆ బ్రహ్మవు కాబట్టి, నీవు ప్రయత్నం చేస్తున్నావు.

       ఆత్మానాం ఉద్ధరేత్‌ ఆత్మానంనిన్ను నీవు ఉద్ధరించుకోవడమే. ఉత్‌ అంటే పైకి ధరించడం అంటే ధారణ చేయడం. దేహాత్మగా ఉన్న నీవు దేహము నేను కాదని జీవాత్మనని జీవాత్మగా ఉన్న నీవు జీవుడివి కాదని యదార్థ నేనుగా ఉన్నటువంటి దృక్కుగా ఉద్ధరించుకో! ధారణ చేయి!  ఆ ధారణగా ఉన్నదానిని దృశ్యాన్ని చేసి, బింబ చైతన్యంగా, బింబ ప్రకాశంగా ఉన్నటువంటి పరమాత్మని ధారణ చేయి. దృష్టిని పైకి తీసుకెళ్తున్న కొద్దీ, సాధకుడైనవాడు, వాడే పైకి వెళ్తున్నాడు. ఆ క్రిందివన్నీ దృశ్యమై, యదృశ్యం తన్నశ్యమై, కనపడుతున్నప్పటికీ, లేనివిగా, మిథ్యగా, చూడడం అనేది అలవాటు చేసుకుంటావు. లేని దానికి ఎందుకు తాదాత్మ్యత? అని విడిపోతావు. లేనిదానికి ఎందుకు వెంపర్లాట? అని వైరాగ్యాన్ని పెంచుకుంటావు. లేనిదాని గురించి వచ్చిన ప్రారబ్ద కర్మని, వైరాగ్యంతో, మిథ్యాభావంతో, ఆగామి జోలికి పోకుండా, ఆ జనన మరణ చక్రాన్ని అక్కడికి ఆపేస్తావు. పాతకర్మ అనుభవిస్తూ, కొత్తకర్మ జోలుకి వెళ్ళడు. కొత్తకర్మ అతనికి అంటుకోదు. కొత్తకర్మ అంటుకోని స్థితిలో, తను ఆత్మకు దగ్గరగా, సమీపానికి వెళ్తాడు. తన అనుభవంలో సాక్షి చైతన్యాన్నే అనుభవిస్తుంటాడు. విషయాకారం పొందక, ఆత్మాకారం పొంది, ఆత్మ చైతన్యాన్ని అనుభవిస్తుంటాడు. ఇది ఉద్ధరేతి ఆత్మానం అంటే!

    ఈ దృక్‌ దృశ్య వివేకాన్ని ఇంకా పైకి తీసుకెళ్ళాలి. శరీరము ఆత్మ కాదు. దృశ్య విషయం అంతటికీ కూడా ఈ ఆత్మ విలక్షణం. ఆత్మ అనగానే, ఇదంతా అనుకోండి, మీ మీద అప్లై చేసుకోవాలి. సాధన ప్రతి దశలో పైకి ఎదుగుతున్న కొద్ది, ఆత్మకు నిర్వచనం పై మెట్టులో పెట్టుకోవాలి. జీవాత్మ సూత్రాత్ర దాకా ఎదిగితే, ఆత్మ అనేది సూత్రాత్మగా పెట్టుకోవాలి. సూత్రాత్మని, శుద్ధ చైతన్య స్వానుభవంలో ఉన్నప్పుడు, అది పరమాత్మ. అప్పుడు ఆత్మ అంటే, సూత్రాత్మ బదులు పరమాత్మ అని పెట్టుకోవాలి. ఇదే ఉద్ధరించుకోవడం అంటే! ఎవరూ ఉద్ధరించరు. నిన్ను నీవే ఉద్ధరించుకోవాలి. నేనైన నేనే అలా పైకి వెళ్తుంది. ఆ ప్రతిబింబముగా ఉన్న నేను కూడా బింబజ్ఞానం వచ్చేసరికి, ప్రతిబింబమే పోతోంది. అప్పుడు నేనుకూడా ఏమయ్యాడు? పారమార్థికంగా మారినటువంటి నేనుకు, వ్యవహారికమంతా నటనగా మారింది. ఇప్పుడు వ్యవహారికంగా ఉన్న నేను నటిస్తోంది. నటన కాకపోతే మళ్ళీ వృత్తైపోతుంది. వృత్తైతే ఆగామి వస్తుంది. ఆగామి అయితే అజ్ఞానం. ఆగమి రాకుండా జాగ్రత్తపడ్డాడు కాబట్టి, వృత్తి రహితమై, వృత్తి నివృత్తి అవుతోంది గనుక, ఇప్పుడు ఈ నేను ఏమౌతున్నాడు? విషయాకారం పొందకుండా, వైరాగ్యంచేత, మిథ్యాభావంచేత, విషయాలపట్ల, ప్రారబ్దంపట్ల, అవన్నీ బాధించినప్పటికీ కూడా, తాను విషయీకరించుకోకుండా, తాను అనుసరించకుండా, దానిమీద స్పందించకుండా, దాని మీద ఇష్టాయిష్టాలు చూపకుండా, వాటి మీద వైరాగ్యము, మిథ్యాభావము, అసంగత్వము పెంచుకుని, చివరికి ఆత్మాకారము పొందుతున్నాడు.

       అప్పుడు తాను ఆత్మ అనేటటువంటి దానిని ధారణ చేశాడన్నమాట. ఉత్‌ ధారణ. ఉద్ధరణము. పై స్థితిని ధారణ చేశాడు. ధారణ అంటే కూడా మళ్ళీ అక్కడ తాదాత్మ్యతే. తాదాత్మ్యత అంతాకూడా ఇటు అవిద్యా దోషం ఉన్నా ఉంటుంది, అటు మాయా దోషం ఉన్నా ఉంటుంది. రెండవ వస్తువు లేనప్పుడు, దేనితోనూ తాదాత్మ్యత లేనప్పుడు, తాను తానైనటువంటి సహజస్థితి ఎప్పుడైతే వచ్చిందో, అది అద్వైతం. అక్కడ వృత్తి ఉండదు, ప్రతిబింబము ఉండదు, బింబ ప్రకాశము కూడా ఉండదు. ఆవరణ అనేది లేదు. కనుక వ్యాపకము ఉండదు. అది ఘనమై, స్వయం ప్రకాశమై ఉంటుంది. తనలో తాను రమించుకుంటూ, తనను తాను ప్రకాశించుకుంటూ, తానైనటువంటి స్వస్వరూప జ్ఞానంలో ఉంటాడు. స్థిరముగా, అచలముగా, పరిపూర్ణముగా, ఉన్నదున్నట్లు ఉండిపోతాడు.

       ఇక్కడ ఈ దృక్‌ని ఆత్మగా, విలక్షణంగా తీసుకెళ్ళాడు. శరీరం ఆత్మ కాదు అన్నాడు. శరీరము అంటే? మీరు శరీరాల జోలికి వెళ్ళకండి. శీర్యతే ఇతి శరీరః’ - నశించేవన్నీ కూడా శరీరాలే. అష్టతనువులు ఉన్నాయి కదా! పరమాత్మ దాకా కూడా నశించేదే. ప్రత్యగాత్మ, పరమాత్మలు కూడా బహిః ప్రకాశములే అంటే నశించేవే. స్వయం ప్రకాశం ఒక్కటే నశించనది. ఆత్మ అంటే, స్వయం ప్రకాశము, స్వయం ప్రభ. స్వప్రకాశము.

       అందరిలో కామన్‌గా ఉండేది సూత్రాత్మ. చరాచరజగత్తు అంతా ఉండేది సర్వాత్మ. విశ్వమంతా ఉన్నది విశ్వాత్మ. విశ్వంతో తాదాత్మ్యత ఉండవచ్చు. అప్పుడు విశ్వాకారుడు అవ్వచ్చు. విశ్వంభరుడు కావచ్చు. విశ్వసాక్షి కావచ్చు. విశ్వానికి సాక్షి అనేటటువంటి, సాపేక్ష సాక్షి చైతన్యానుభవంలో ఉండవచ్చు. ఈ సాపేక్షాన్ని నిరపేక్షం చేసుకుంటే, నీకు అర్థం అవుతుంది, అవన్నీ మిథ్య అని. కనుక ఆత్మని ఎలా ఉపయోగించుకుంటున్నామో, జీవాత్మ నుండి ప్రత్యగాత్మకి, ప్రత్యగాత్మ నుంచి సూత్రాత్మకి, సూత్రాత్మ నుంచి సర్వాత్మకి, సర్వాత్మ నుంచి విశ్వాత్మకి, విశ్వాత్మ నుంచి శుద్ధ చైతన్యంగా ఉన్నటువంటి కేవల చైతన్యానుభవంలో ఉన్నటువంటి పరమాత్మకి, చివరికి పరమాత్మ కూడా సాపేక్షంగా, వ్యాపకంగా, వ్యాపక స్థితిలో ఉన్నదంతా మాయావరణే. కనుక నిరావరణ యందు వ్యాపక లక్షణం తనకు లేదని, ఘనమై, ఊరక ఉంటే, ఆ ఉన్నదున్నట్లున్నదేదో అది స్వయం ప్రభ, స్వయం ప్రకాశము స్వప్రకాశము. ఇలా ఆత్మని ఉద్ధరించుకుంటున్నాము.

       కనుక ఆత్మ అష్టతనువులకి విలక్షణము. అష్టతనువులు కూడా శరీరాలు కనుక అవి క్షీణించిపోయేవే. నీకు శరీరాలు దృశ్యమే. దృక్కే నిత్యము. దృశ్యము నశ్యము. శరీరము నశ్యము. ఆత్మకి శరీరము దృశ్యము కనుక శరీరము నశ్యము. ఆత్మ నిత్యము. ఈ ఆత్మ యొక్క నిత్యత్వాన్ని ఇలా పైకి తీసుకెళ్తూ ఉంటాము. శరీరాల యొక్క దృశ్యత్వాన్ని, నశ్యత్వాన్ని, ప్రత్యగాత్మ, పరమాత్మల దాకా తీసుకెళ్ళి, ప్రత్యగాత్మ, పరమాత్మ కూడా నశించేవాళ్ళే, లేనివాళ్ళే, నశించడం అంటే, రాకడ పోకడ ఉన్నవాళ్ళని అర్థం. మరి నశించడం అని మీరు అనుకుంటున్నారు.

       నాశనము అంటే న+అశనము. అశనము అంటే ఆహారము, అనుభవము. న అశనము అంటే అనుభవాలు పోయేవే. ఇదీ దానియొక్క అర్థము. స్థూల శరీరము నశించింది అంటే, స్థూల శరీరము యొక్క భోగము, స్థూల శరీరముతో కూడినటువంటి అనుభవము, తాదాత్మ్యత పూర్వకమైనటువంటి అనుభవము పోతాయి. సూక్ష్మ శరీర భోగము పోయింది, నాశనమయ్యింది. అంటే, సూక్ష్మ శరీరంతో తాదాత్మ్యత వలన కలిగే అనుభవం నశించింది. ఆ భోగము లేకుండా పోయింది. మళ్ళీ కారణ శరీరంతో ఉన్నదికూడా పోయింది. ప్రత్యగాత్మ అనుభవం కూడా నశించింది. లేనెఱుకలే పరమాత్మానుభవము లేనిది. అందువలన  పరమాత్మ కూడా శీర్యతే ఇతి శరీరః. ఆ అనుభవాలన్నీ దాటిపోవలసినదే! పరమాత్మ దృక్కుగా కూడా మిగలడు. జీవతనువులలో నాల్గవది ప్రత్యగాత్మ, ఈశ్వర తనువులలో నాల్గొవది పరమాత్మ. వీటి అనుభవాలను అశనము అంటున్నాము. అది కూడా దృశ్యమే కాబట్టి నశ్యమే. కనుక అశనమును, భోగమును, అనుభూతిని విడిచిపెట్టవలెను. ఈ నాశనము అనే పదము, లోక సంబంధముగా, వ్యవహారముగా వాడేది కాదు ఇక్కడ. శరీరము అన్నప్పుడు నశించేది, పరమాత్మానుభవం కూడా రాకడ, పోకడ ఉన్నందున లేనిదే. నశించడం అంటే ఏమిటి? ఆ అనుభవం సత్యం కానిది అని. పరమాత్మానుభవం సత్యం కాదు అని. సత్యం కానివి అన్నీ కూడా రాకడ, పోకడ ఉన్నవే. ఆది అంతము ఉన్నవే. ఉత్పత్తి ఉన్నది, నాశనము ఉన్నది. అవన్నీ కూడా యద్భావం తద్భవతిగా కల్పించుకున్నవే.

       పరమాత్మ కూడా కల్పితుడే. ప్రత్యగాత్మ కూడా కల్పితుడే. వీళ్ళందరూ మాయావరణంలో ఉన్నవాళ్ళే. మాయావరణ దాటితే శుద్ధ చైతన్యము ఘనరూపముగా ఉంటుంది. దేశకాలములు లేవు కనుక, మాయావరణ లేదు కనుక, ఆవరణయందే వ్యాపకం ఉంది గాని, నిరావరణయందు వ్యాపకము ఉండదు. కనుక, నిరావరణయందు ప్రకాశము ఘనమై, ఆ ప్రకాశమే పరబ్రహ్మ కనుక, ఆ పరబ్రహ్మమే స్వప్రకాశమై, స్వయం ప్రకాశమై, స్వయం ప్రభయై ఉన్నాడు. శుక్తి, రజితము వలె దృశ్యమాత్రములే. ముత్యపు చిప్ప ఎలాగైతే ప్రకాశిస్తుందో, దానిని చూసి, వెండి అని ఎలాగైతే భ్రాంతి పడుతున్నారో, ముత్యపు చిప్ప యొక్క ప్రకాశము, వెండి ప్రకాశము అని భ్రాంతి పడినట్లు అవుతుంది. పరమాత్మ ప్రకాశమును పరబ్రహ్మ ప్రకాశమని భ్రాంతి పడినట్లు ఇక్కడ దృక్‌ దృశ్య వివేకంతో ఎక్కడిదాకా ఉద్ధరించుకున్నావో, ఆ ఉద్ధరించినటువంటి ధారణ సహజంగా ఉందా? తాదాత్మ్యతతో ఉందా? తాదాత్మ్యతతో ఉంటే నాశనము. తాదాత్మ్యత లేకపోతే స్వయం ప్రకాశము. అక్కడ అశనము ఏమైంది? నాశనము అయ్యింది. అన్నీ నశిస్తే మిగిలినది స్వయం అనుభూతి అయ్యింది. అన్యము ద్వారా కాకుండా, స్వయమే అయ్యింది. అన్యప్రకాశముగా కాకుండా స్వయం ప్రకాశముగా ఉంది. అన్యప్రకాశమేమో మాయావరణములో ఉంది. అది శుక్తి వంటిది. నిరావరణంలో అన్యప్రకాశం అనేది లేక, స్వయం ప్రకాశమే స్వతఃసిద్ధమై ఉన్నది. అది వెండి వంటిది. ఏలయన, ఘటాదులవలె, స్థూల సూక్ష్మ కారణములుగా ఎఱుగబడుచున్నది.

       నీ కళ్ళెదురుగా కుండ కనబడితే, ఇది కుండా అని ఎలా చూసావో, అపరోక్ష అనుభూతిలో, స్వయం ప్రకాశ రూపుడు అంతస్పష్టంగా, తాను తానైనటువంటి స్వస్వరూప సాక్షాత్కార జ్ఞానమును కలిగి ఉంటాడు అని అర్థము. ఇంకా కుండను కూడా మసక చీకటిలో గుర్తుపట్టవేమో, కుండని చూసి మరొకటి అని అనుకుంటావేమో, కాని స్వస్వరూప సాక్షాత్కార జ్ఞానములో, స్వప్రకాశ అపరోక్ష అనుభూతిలో, అంతకంటే మిక్కిలి స్పష్టంగా, ఎటువంటి ఢోకా లేకుండా, నూటికి వెయ్యి శాతంగా, నిన్ను నీకు స్వయం ప్రకాశముగా, తనలో తాను రమించేటట్లుగా, చిత్‌ ఘనముగా, సత్‌ ఘనముగా, ఆనంద ఘనముగా, సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అనేటటువంటి స్వరూప లక్షణముగా, అది నీవై ఉంటావు. ఎదురుగా చూసేటటువంటిది ఇది కుండ అనే జ్ఞానం కంటే కూడా, ఈ స్వయం ప్రకాశ, స్వ ప్రకాశ, సాక్షాత్కార, అపరోక్ష అనుభూతి ఏదైతే ఉన్నదో, దానికి వెయ్యి రెట్లు ఖచ్చితంగా, స్పష్టంగా, నిరంతరాయంగా, నిత్యవర్తమానంగా, పరిపూర్ణంగా ఉంటుంది. ఈ కుండని చూస్తే వచ్చే ప్రియా ప్రియములు అపరోక్షములో ఉండవు. కుండ పగిలిపోతే, దుఃఖం కలుగవచ్చు, కాని, స్వస్వరూప సాక్షాత్కారంలో, నిత్యవర్తమానమైనటువంటి, సహజమైనటువంటి, ఆనందము అనేటటుంవంటిది ఘనమై, నీ స్వరూపమై ఉంటుంది. ఆ బ్రహ్మ, శాశ్వతము, సత్యము గనుక, ఆ అనుభూతి కూడా శాశ్వతము సత్యముగా, సహజముగా ఉంటుంది.

       అది నీవే అయివున్నావు గనుక, నీకు అది సహజమై ఉంటుంది. తెచ్చుకున్నదైతే ఎప్పటికైనా పోతుంది. ఇది అర్థమవ్వడం కోసం, ఇదంతా చెప్పుకుంటున్నాము. అది నీవే కదా! బోధలో అది ఒకటి, ఇది ఒకటి అని, అదీ ఇదీ ఒక్కటే అని, అది నీకు సహజత్వమని చెబుతున్నాము కానీ, అపరోక్షానుభూతిలో ఈ మాటలు పనికి వస్తాయా? నీది కానిది, నీ స్వంతం చేసుకుని సహజం చేసుకోవడం అనేలాగా, సాధనతో వచ్చింది ఆ మాట, పరోక్షము ఉందని, అన్యమనేది పోయి, అనన్యము సిద్ధించిన తరువాత ద్వైతము నశించి, అద్వైతము సిద్ధించిన తరువాత, ఇక సహజము అనే మాట మాత్రము ఎక్కడుంది? మనకు సహజము అంటే ఏమిటంటే, నీ నుంచి విడదీయలేనిది అని అర్థము. అంటే వాక్యాలు ద్వైతాన్ని సూచిస్తున్నాయి. అందువలన ఏ వాక్యమూ సరిపోదు. కనుక అనిర్వచనీయము అంటున్నాము.

       ఆత్మకు ప్రకాశము సహజము. ఆత్మ నుండి ప్రకాశము విడదీయలేము. అయితే మాయావరణలో ఉన్న ప్రకాశం, మాయావరణలో నుంచి నిరావరణగా ఉన్నప్పుడు, నీవు నీవుగా ఉన్నప్పుడు, స్వయంప్రకాశం మాత్రమే సత్యం. ఆత్మ తనకోసం తాను కేవలంగా ఉంది. ఎవరికోసమో లేదు. విషయ ప్రపంచము ఒకరికోసము ఒకరు ద్వంద్వముగా ఉన్నది. ప్రపంచము ఒకసారి ఊహించుకుంటే, ప్రపంచమంతా ఉంది. విషయాలన్నీ ఉన్నాయి. ఇతర జీవరాశులు లేవు. నీవు ఒక్కడివే ఉన్నావు అక్కడ. మరి నీ కోరికలు ఎలా తీరుతాయి? ఇంకేదోకావాలి. ఇచ్చేవాళ్ళు ఉండాలి. మమకారం కావాలి. బిడ్డలు పుడితేనే మమకారం. రాగం కావాలి, నిన్ను సుఖపెట్టేది ఉంటేనే రాగం. ద్వేషం కావాలి, నిన్ను దుఃఖపెట్టేది ఉంటేనే ద్వేషం. నీకంటే వేరే ఏదీ లేనప్పుడు మమకారం ఎక్కడిది? రాగద్వేషాలు ఎక్కడివి? అసలు నీకు పని చేయడానికి కర్తృత్వం ఎక్కడుంది? భోక్తృత్వం ఎక్కడుంది? నీవు తప్ప రెండవది లేదు. ఒక టన్ను బంగారం ఇచ్చా. ఏం చేసుకుంటావు నీవు? కొనుక్కోవడానికి మార్కెట్‌ లేదు. వస్తువులు లేవు. అమ్మేవాడు లేడు. కోటి రూపాయిలు ఇచ్చాము. ఏం చేసుకుంటావు? కోటి రూపాయిలు ఒక విషయం కాదు, బంగారం ఒక విషయం కాదు. అలాగే కేవలాత్మ తాను తప్ప రెండవది లేదు. తనకంటే అన్యము లేదు అనేది సిద్ధించినప్పుడు ఇంకా విషయాలు ఎక్కడుంటాయి? పోనీ, అసంతృప్తిగా, దుఃఖముగా, ఇబ్బందిగా, అసౌకర్యముగా, బాధగా ఉన్నాడన్న ఆ ఒక్కడే. అప్పుడు ఈ బాధ నివారణ ఎలా? కాని ఆ ఇబ్బందేమీ లేదు. అది నిత్యతృప్తము, పరమ ఆనందము, ఆనందమే తానై, అంతకు మించి మరొక విషయము ఎక్కడాలేదు. ఆ గొప్పదానికంటే గొప్పది లేదు. ఆ గొప్పదే తానైనటువంటి ఆనంద స్వరూపునికి, బయట వెతకాల్సిన అవసరం ఏమిటి? వెతికినా విషయాలు ఉండవు. కేవలాత్మ అనగానే, నేను అనేవాడు కేవలంగా ఉండే పరబ్రహ్మే. సాధకుడు ఈ ప్రపంచంలో ఎంతమంది ఉన్నా, ఇంతమందినీ పట్టించుకోకుండా, తానుతానుగా ఉంటే, తాను పరబ్రహ్మే. ప్రపంచంలో ఎన్ని విషయాలున్నా విషయీకరించుకోకుండా ఉంటే పరబ్రహ్మే. మూడు గుణాల వలన వికారము చెందకపోతే తాను పరబ్రహ్మే. నీవు తప్ప అన్యము లేనప్పుడు, ద్వంద్వాలు లేనప్పుడు, ద్వంద్వాతీతం గగన సదృశం అనగా ఆకాశమువలె నిర్మలమై, అసంగమై ద్వంద్వాలయొక్క విమర్శ లేనప్పుడు అసిపదం సిద్ధిస్తుంది. భేదాలు, నానాత్వం పోతే అసిపదం సిద్ధిస్తుంది. అసిపదమే పరబ్రహ్మ. విషయ ప్రపంచమంతా ఒకరికొకరు ద్వంద్వంగా ఉంది కనుక, మనకి బంధంగా ఉంది. అది లేకపోతే మోక్షమే.

       కేవలాత్మ అంటే ఏమిటి? జగత్తు అంటే ఏమిటి? జగత్తు అంటే స్వయం సత్తా వంతము కాదు. నేను అనేటటువంటి సాధకుడు అక్కడ ఉన్నాడు. వాడి సత్తాతోటే ఇవన్నీ అవుతున్నాయి. వాడే బ్రహ్మ. ఆ బ్రహ్మ సత్తాతో, చైతన్యంతో అన్నీ అవుతున్నాయి. అయితే అవి ఆధార, ఆధేయంగా ఉన్నాయి కదా! జడమైనవి అన్నీ ప్రజ్ఞావంతము, చైతన్యవంతము, ప్రకాశవంతము అవుతున్నాయి కదా! ఈ ప్రజ్ఞానము, చైతన్యము, ప్రకాశము. ఆత్మలక్షణము కదా! ఆత్మ అంటే, నేను నేను అనే సెల్ఫ్‌ కదా! అది నీవై ఉన్నావు కదా! అది నీ సత్తా కదా! అది నీ ప్రకాశము, నీ ప్రజ్ఞానం, నీ చైతన్యం కదా! నిన్ను బట్టే ఇది అంతా ఉంది. నిన్ను బట్టే ఇది అంతా ఉంటే, నీవు వాటికి అతీతంగా ఉండాలి కదా! నీవు వాటికి విలక్షణముగా ఉండాలిగా! నీవు తెచ్చుకున్న కుండ నీకంటే వేరేకదా! కుండ పగిలిపోతే నీవు పగిలినట్లు కాదుగా! కుండ, నీవు ఒక్కటి కాదుగా! అలాగే నీ సత్తా చేత జగత్తు ఉంటే, జగత్తుకు స్వయం సత్తా లేకపోతే, నీ సత్తావల్లే, జగత్తు యొక్క ధర్మాలు, ఎప్పుడెప్పుడు ఏమేమి ఉన్నాయో అవి ప్రకటితం అవుతున్నాయి.

       ఎప్పుడెప్పుడు ప్రకటితం అవుతుంది? సృష్టి ధర్మంగా, సృష్టిలో ప్రకటితం అవుతున్నాయి. యద్భావం తద్భవతిగా, ఇవన్నీ తానే జరిపించుకుంటున్నాడు ఆత్ముడు. తనచేత సృష్టించబడ్డ స్థూల సూక్ష్మ కారణ శరీరాలు తనకంటే వేరు. తనచేత తయారైన కుండ, తనకంటే వేరు ఎలాగో, ఆ స్వయం సత్తా కలిగిన బ్రహ్మ తనచేత సృష్టించబడిన, స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాలు, స్థూల సూక్ష్మ కారణ దేహాలు, స్థూల సూక్ష్మ కారణ ప్రపంచ అనుభవాలు, తనవి కావు. తాను వాటి అన్నిటికి విలక్షణము. అవి బ్రహ్మము నుండి విడివడి, బ్రహ్మము పైనే ఆధారపడి ఉన్నవి. తనయొక్క స్వయం సత్తా వలన, బ్రహ్మము యొక్క ప్రకాశము. మాయావరణములోనే వ్యాపించి ఉన్నది. మాయావరణ యందు, ఈ జగత్తు, ఆ బ్రహ్మ సత్తా చేత సృష్టించబడి ఉంది. ఈ జగత్తు అంతా కూడా, ‘అణోరణీయాన్‌, మహతో మహీయాన్‌గా వ్యాపించింది. ఆ ప్రకాశమే మాయావరణలో సాక్షి. ఆ ప్రకాశమే. సర్వ దృశ్యములకు దృక్కు. ఆ ప్రకాశమే. మాయావరణకు ఆవల, నిరావరణ యందున్న పరబ్రహ్మ, స్వయం ప్రభ, స్వయం ప్రకాశము. నిజమైన దృక్కువాడు. ఆ దృక్‌లో, దృక్‌స్థితిగాని, ద్రష్టత్వంగానీ లేదు. ఎందుకంటే, ఆ దృక్కుకంటే అన్యము లేదు కనుక. ఆ దృక్కు కంటే అక్కడ దృశ్యము లేదు కనుక. నిరావరణయందు దృక్కుకి దృశ్యము లేదు. దృశ్యత్వము, ద్రష్టత్వము లేనిది కనుక, ఆ పేరు తీసేస్తే, వాడే పరబ్రహ్మ. వాడే సన్మాత్రుడు, చిన్మాత్రుడు, ఆనంద మాత్రుడు. వాడే సద్ఘనము, చిద్ఘనము, ఆనంద ఘనము. వాడే సత్‌ స్వరూపుడు, చిత్‌ స్వరూపుడు, ఆనంద స్వరూపుడు. వాడే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ.

       ఇంద్రజాలకునిచే ఇతరుల కొరకు కల్పించబడిన వస్తు సముదాయము, ఎలాగైతే ఇంద్రజాలకుని బాధింపదో, అలాగే ఈ జగత్తు అనే మాయ, బ్రహ్మముచే కల్పింపబడినందున, బ్రహ్మమును బాధించదు. ఒక ఇంద్రజాలకుడు కప్పలను ఉన్నట్లుగా సృష్టించాడు. చుట్టూ ఉన్న ప్రేక్షకులకు కనికట్టు అయ్యింది. వాళ్ళకి ఈ కప్పలన్నీ, వాళ్ళ మీదకి గెంతుకుంటూ పోతే, వాళ్ళు ఒంటిమీద ఎక్కడ కప్పబడుతుందో, లేక కప్పమీద వాడి కాలు పడుతుందో అని భయపడి అందరూ అటూ ఇటూ దూరంగా వెళ్ళే ప్రయత్నం చేశారు. గారడీవాడు అక్కడే ఉండి నవ్వుతూ ఉన్నాడు. ఎందుకంటే, అవి మాయాకల్పిత కప్పలు. అవి సత్యం కాదు. అవి అతనిమీద పడడం లేదు. అలాగే ఈశ్వరుడు మాయకు వశుడు కాదు. కనికట్టులో ఉన్నటువంటి ప్రేక్షకుడు, ఎలా అయితే ఇంద్రజాలము యొక్క మాయకు వశులై, కప్పల విషయంలో, అటూ ఇటూ పరిగెత్తారో, ఈ నామరూప జగత్తు విషయంలో, అవిద్యా దోషం అనే కనికట్టు ఉన్నప్పుడు, అటూ ఇటూ చలిస్తూ ఉంటారు జీవులు. కేవలాత్మ మాయకు అతీతం కనుక చలించదు. కేవలాత్మయందున్నటువంటి మాయ, ఆ కేవలాత్మ స్వరూపుడైనటువంటి బ్రహ్మకు సంకల్పంగా తోచి, ఆ సంకల్పము యొక్క పరిణామముగా, ఇంద్రజాలమువలె వీక్షించబడినటువంటి, ఈ కల్పిత జగత్తు తోచింది. ఆ కేవలాత్మ స్వరూపుడైన బ్రహ్మకి, ఈ తోచిన ప్రపంచము బాధించదు. మరి ఎవరిని బాధిస్తుంది? మాయకు వశులైనవారు ఎవరైనా ఉంటే వాళ్ళను బాధిస్తుంది. ఇంద్రజాలకుని కనికట్టు ఎవరిమీద పనిచేస్తుందో, వారిని బాధిస్తుంది.

       ఒకసారి గారడీవాడు, ఒకచోట గారడీ చేస్తే ఒక ఎత్తైనటువంటి చెట్టుమీద అప్పటికే ఒక కుర్రాడు ఆ చెట్టెక్కి పైన ఉన్నాడు. ఇంద్రజాలకుడు ఆ చుట్టూ ఉన్న ప్రేక్షకుల మీద కనికట్టు చేశాడు. ఆ కనికట్టుకి, ఆ ఇంద్రజాలకుని మాయకు అందరూ వశులయ్యారు. చెట్టుమీదెక్కి ఆ పై కొమ్మమీద ఉన్నవాడు, ఈ క్రింద జరిగేదంతా చూస్తున్నాడు. వాడి మీద ఈ కనికట్టు పనిచేయలేదు. ఎందుకంటే ఆ ఇంద్రజాలకుడు ఆ పైకి ఎక్కిన వాడిని చూడలేదు. చూస్తే, ఆ కనికట్టు వాడిమీద కూడా ఉండేది. అప్పుడు ఆ కప్పల విషయాన్ని చూచి ఆ చెట్టుమీద ఉన్నవాడు నవ్వుకుంటున్నాడు. వాడికి మిథ్యా భావము ఉంది. ఇంద్రజాలకునిచే ఇతరుల కొరకు కల్పింపబడిన ఆ వస్తుసముదాయము ఏ విధంగా అయితే, ఆ ఇంద్రజాలకుని బాధింపదో, అలాగే ఈ జగత్తు అనే మాయ, బ్రహ్మము చేత కల్పింపబడినందున ఆ బ్రహ్మమును బాధించదు.

       బ్రహ్మ సంగతి చెబుతున్నానా? నీ సంగతి చెబుతున్నానా? నీవు ఉద్ధరించబడితే, నీకు ఆ స్థితి అయితే, నీవు ఆ స్థితిలో ఉంటావని తెలుసుకో! నీవే ఆ బ్రహ్మమైనప్పుడు ఈ ప్రపంచం నిన్ను బాధించదు. తెలిసిందిగా! ప్రపంచం బాధిస్తున్నప్పటికీ, ఈ ప్రపంచం బాధించదు అనే మాట మీద ఉండాలి. ఎవరికి ఈ ప్రపంచం బాధించదో, వాడు సాక్షి. ఎవరిని ఈ ప్రపంచం బాధిస్తుందో వాడికి తాదాత్మ్యత ఉంది.

       తాదాత్మ్యత ఉన్నవాడే, ప్రపంచాన్ని బాధకంగా చూస్తాడు. కాని మిథ్యగా చూస్తూ ఉంటే, పోయిందేమీ లేదుగా! నేను ఆత్మను కదా అనుకుంటే, ఇదీ సాధన. ఆ సాధనచేత, వాడు సాక్షి చైతన్య స్వరూపుడై, కేవలాత్మ స్వరూపుడై, గురుకృపతో బ్రహ్మానుభవం పొందుతాడు. ఆ పొందిన వాడికి ఇది బాధించదు. నిజానికి పొందని వాడికి కూడా బాధించదు అనేది నిజము. బాధిస్తున్నప్పటికి ఈ బాధ లేదుగా! ఇది మిథ్యకదా! అని అనుకోవాలి.

       అవస్థాత్రయముతో బ్రహ్మమునకు సంబంధం ఉన్నట్లు తోచుట, రజ్జువునందు సర్పదృశ్యము వలె భ్రాంతి. ఈ మాయను అసత్‌ అని చెప్పజాలము. అవస్థా త్రయము ఏమిటి? జాగ్రత్‌ స్వప్న సుషుప్తులు అవస్థాత్రయము. ఈశ్వరునికి కూడా అవస్థాత్రయము ఉంది. విరాట్‌ హిరణ్యగర్భ అవ్యాకృతులు ఆ మూడు అవస్థలకు అభిమానులు. జీవుడి అవస్థలకు విశ్వ తైజస ప్రాజ్ఞులు అభిమానులు. ఈశ్వరుడికి ఈ మూడు అవస్థలు కల్పితం అని, ఇవి నన్ను బాధిస్తున్నాయి కానీ, విచారిస్తే, నేను వీటిచేత బాధింపబడని వాడిని అన్నప్పుడు, ఆ ఈశ్వరుడు సాక్షీ మాత్రుడైనప్పుడు, ఈ జగత్రయ సాక్షి యొక్క ఎఱుకలో ఉన్న, అవస్థాత్రయ సాక్షి పరమాత్మే. ఈశ్వరుడు కూడా సాక్షి పరమాత్మే. జీవుడు కూడా సాక్షి పరమాత్మే. మూడు అవస్థలు, మూడు శరీరాలు కలిపేసుకోండి. స్థూల సూక్ష్మ కారణ శరీరాలు మూడు అవస్థలలోనూ పనిచేస్తున్నాయి. జాగ్రదావస్థలో స్థూల శరీరం బాగా పనిచేస్తుంది. స్వప్నావస్థలో స్థూల శరీరం పనిచేయకుండా, సూక్ష్మ శరీరం పనిచేస్తుంది. సుషుప్త్యావస్థలో స్థూల సూక్ష్మాలు  రెండు పనిచేయక, కారణం అజ్ఞతను కలిగిస్తుంది.

       జాగ్రత్‌ శరీర అభిమాని, జాగ్రదావస్థ అనుభవాలు జాగ్రదావస్థ ఈ మూడు ఒక సెట్‌. సూక్ష్మ శరీరము, సూక్ష్మ శరీర అభిమాని, సూక్ష్మ ప్రపంచానుభవము. ఈ మూడూ ఒక సెట్‌. కారణ శరీరము, కారణ శరీరాభిమాని, కారణ ప్రపంచము యొక్క అనుభవము అంటే హాయి. ఏమీ తెలియకపోవడము, ఇది ఒక సెట్‌. ఈ మూడు సెట్‌లు త్రయముతో కూడా బ్రహ్మమునకు ఎట్టి సంబంధము లేదు. ఒక వేళ జగత్రయము తోస్తే, రజ్జువునందు సర్పము తోచినట్లు, సర్పభ్రాంతిలాగా ఉంటుంది. మాయ సత్‌ కాదు, అసత్‌ కాదు, శాశ్వతం కాదు. అసత్‌ యొక్క లక్షణాలు మాయకు లేవు. మాయాకల్పిత ప్రపంచానికి అసత్‌ లక్షణాలు ఉన్నాయి. మాయా కల్పిత జీవులకి అసత్‌ లక్షణాలు ఉన్నాయి. మాయాకల్పిత ఈశ్వరుడికి అసత్‌ లక్షణాలున్నాయి. పోనీ, మాయ ఇవన్నీ చేస్తుందా? అనంటే, మాయ సత్యమా? సద్వస్తువా? నిత్యమా? శాశ్వతమా? అంటే, మాయసత్యమైతే ఎవరికీ ముక్తి, మోక్షం లేదు. అందువలన మాయ సత్‌ కాదు. మాయ అసత్‌ కాదు, ఏమని నిర్ణయించాలి? ఏ నిర్ణయం చేయలేము కాబట్టి మాయ అనిర్వచనీయము. అన్‌డిఫైనబుల్‌. అయితే మాయకు ఆది అంతాలు ఉన్నాయా? అనాది మాయ అన్నాము. అనాది మాయ అంటే, మొదలు లేదని. మొదలు అంటే ఎక్కడుంది? సృష్టియొక్క మొదలు. మాయవల్లే సృష్టి వచ్చినప్పుడు, సృష్టి మొదలు కాకముందే మాయ ఉండాలిగా! మీకు పుత్రులు పుట్టినప్పుడు, పుత్రులు పుట్టకముందు మీరు ఉంటారుగా. మీ కారణంగానే కదా పుత్రులు పుట్టారు. మాయవల్లే ప్రపంచం వస్తే, ప్రపంచానికి ఆది ఉంది. మాయ కారణంగా ప్రపంచం ఉంది కాబట్టి, జగత్తుకంటే ముందు మాయ ఉండి, ఈ మాయే జగత్తుని కల్పించింది. ఈ కల్పిత జగత్తు ఎప్పుడు వచ్చిందో అది ఆది. అంతకంటే ముందు ఈ మాయ ఉంది కనుక, మాయా అనాది.

       జీవుడికి అవిద్యా దోషం కూడా మాయారూపంలోనే ఉంది కనుక, ఈ దోషాలు ఎవరి వల్ల వచ్చాయో, వాడు మీ కంటే ముందున్నాడు. జీవుడికంటే ముందే మాయ ఉంది. ఈశ్వరుడికంటే ముందే మాయ ఉంది. సర్వకారణమైన బ్రహ్మకంటే కూడా మాయ ముందే ఉంది. అందుకని మాయ అనాది. మాయకు అంతముందా? ప్రళయకాలంలో మాయ అవ్యక్తంలోకి వెళ్తోంది. అది మూలా విద్యగా ఉంటుంది. మాయతో పాటు, మాయాకల్పిత ప్రపంచం అంతాకూడా లేకుండా పోతుంది. అప్పుడు మాయ మూలాప్రకృతి రూపంలో ఉంటోంది. గాఢ తమస్సుగా ఉండిపోతోంది. సర్వము అవ్యక్త రూపంలోకి వెళ్తున్నాయి. ముక్తాత్మలు మాత్రం లేకుండా పోతున్నాయి. ముక్తాత్మలు కాని వాళ్ళు, బద్ధాత్ములు, ప్రళయకాలంలో మైనపు ముద్ద మీద, బంగారు రజను అద్దితే, ఎలా ఉంటుందో, అలాగ గాఢ తమస్సుగా ఉన్నటువంటి మూలా ప్రకృతి, అనే ముద్దలో బంగారు రజను లాగా, అణువులు లాగా, రాబోయే సృష్టికి మహాకారణంగా ఉండిపోతారు. మళ్ళీ పునఃసృష్టి కాలంలో, ఎవరి సంస్కారానికి, ఎవరి వాసనలకి, తగినటువంటి జీవసృష్టి, ఈ భూమి మీద, ఈ గోళాల మీద జరిగినప్పుడు, తగిన సమయం ఆసన్నమయ్యేదాకా కూడా, బంగారు రజను రూపంలో ఉంటారు వాళ్ళు. ఆ సమయము ఆసన్నమైనాక, అక్కడి నుంచి ఆ బద్ధాత్మలు వ్యక్తమై, కొన్ని పునర్జన్మలలో, ఏదో ఒక జన్మలో, సాధనలోకి దిగి, ఏదో ఒక జన్మలో ముక్తులు అవుతారు.

       ఇప్పుడు మాయ గురించి ఒక నిర్వచనాన్ని చెబుతున్నాను. మాయ అసత్‌ అని చెప్పలేము, సత్‌ అని చెప్పలేము. మాయ అనాది. అయితే మాయకు అంతము ఉంది. మాయ వల్ల కల్పించినటువంటి భ్రమ, నీ నుంచి తప్పుకుంటే, మాయకు అంతము ఉంది. మాయకు అంతము ఉంటే, నీవు బ్రహ్మము అవుతావా? మాయ అంతమైనంత మాత్రాన నీవు బ్రహ్మము అవుతావా? మాయతో కలసిపోయిన బ్రహ్మమైనప్పుడు, ఆ బ్రహ్మమును ఆశ్రయించిన మాయ, బ్రహ్మమునే ఈశ్వరుడిగా, జీవుడిగా, నానా రకాల జీవులుగా, క్రిమి కీటకాలుగా, పశుపక్ష్యాదులుగా, క్రిందికి దింపేస్తుంది. కనుక ఆ బ్రహ్మయొక్క మూలమేమిటో కనుక్కుని, ఆ కారణ బ్రహ్మకు ఆవల, మాయకు ఆవల, మాయకు పరమై, మూడొంతులు బ్రహ్మ ఏదైతే ఉన్నదో ఆ బ్రహ్మలో మాయ లేదు కనుక, ఆ మాయా రహిత స్థితిగా ఉన్న, మూడు వంతుల పరబ్రహ్మ స్థితి, మనకు లక్ష్యముగా, మోక్షముగా, గమ్యముగా ఉన్నది.

       అక్కడికి వెళ్ళినవాళ్ళు, ఆ బ్రహ్మ స్వరూపముగా, నిత్యత్వంగా, సత్యముగా, శాశ్వతముగా, ఉన్నది ఉన్నట్లుగా ఉండిపోతారు. మాయ ఏం చేసింది అంటే, ఒకవంతు బ్రహ్మను సృష్టికి కారణంగా చూపిస్తోంది. నిర్గుణ బ్రహ్మని, సగుణ బ్రహ్మగా చూపిస్తోంది. కాబట్టి, వాడు నిజానికి నిర్గుణ బ్రహ్మే. భ్రాంతిలోనే, సగుణ బ్రహ్మ బాధించబడుతున్నాడు. భ్రాంతి రహితమైనప్పుడు సగుణ బ్రహ్మ బదులు ఎప్పటికీ బాధింపబడనటువంటి నిర్గుణ బ్రహ్మమే స్వతస్సిద్ధమై ఉంటుంది. సర్పముగా చూడబడినటువంటి రజ్జువు, భ్రాంతి నశించగానే అది సర్పము కాదని, ఎలా తెలియబడుతోందో, అలాగే ఈ కల్పిత ప్రపంచము ఆ విధముగా అదృశ్యము అవాలి. కాని అలా జరుగుటలేదు. అందుకే, ఎవరైనా, తన సాధనలో ముక్తుడు కాగానే ఈ ప్రపంచం అదృశ్యం కావడం లేదు. తన శరీరము డ్రాప్‌ అయ్యేవరకూ శరీర ప్రారబ్దం ఉన్నంత వరకూ, జీవన్ముక్తుడుగా తన ఆయుష్కాలము పూర్తి అయ్యేదాకా, జీవించి ఉంటే, మళ్ళీ ఈ ప్రపంచము గోచరిస్తూనే ఉంటుంది. అయితే అతడు సాక్షి, విలక్షణుడు, అసంగుడు.
       మాయతో సాన్నిధ్యంగా ఉన్నప్పుడు పురుషుడు అయ్యాడు. మహత్తు దగ్గరేమో, ప్రకృతిపురుషుడుగా శివశక్త్యాత్మకముగా ఉంటాడు. మహదహంకారం దగ్గరేమో, సంకల్ప బ్రహ్మగా ఉంటాడు. సత్‌ అంటే సత్యము. ఎప్పుడూ ఉండేది. అసత్‌ అంటే, ఎప్పుడూ ఉండేది కాదు అని అర్థము. అసలు లేదు అని కాదు. తాత్కాలికంగా ఉంటుందని అర్థము. సృష్టించబడుతూ, పరిణామం చెందుతూ మళ్ళీ అవ్యక్తంలోకి వెళ్ళిపోయి, మరలా సృష్టించబడుతూ, పరిణామం చెందుతూ ఉండేదానిని జగత్తు అన్నాము. ఈ జగత్తు లేకనే ఉన్నట్లు భ్రాంతిలో తోచింది. భ్రాంతి రహితమైతే ఉండనే ఉండదు. తాత్కాలికంగా ఉండుట అనేది కూడా, లేనిదానికే చెబుతున్నాము. శాశ్వతంగా ఉండేది మాత్రము ఉన్నదానినే చెబుతున్నాము. పరబ్రహ్మ సదసద్విలక్షణం. అసత్‌ నిజమనుకోవడము అజ్ఞానము. సత్‌ నిజమనుకోవడము జ్ఞానము. కాని జ్ఞానాతీతమైనది. సదసద్విలక్షణమైనది, స్వరూపమైనది పరబ్రహ్మము.

       దేనికీ బాధ్యుడు కాకుండా, దేనికీ కారణం కాకుండా, తనకు తానే స్వతఃసిద్ధంగా ఉన్నటువంటి బ్రహ్మ. అటువంటి బ్రహ్మనే అధిష్ఠానము అంటాము. ఆ స్వయంప్రకాశ, స్వయంప్రభగా ఉన్న బ్రహ్మ మాయావరణయందు కూడా తన ప్రకాశం వ్యాపించగా, మాయ కారణంగా వ్యాపించగా అక్కడ మాయలో తోచినదంతా బ్రహ్మకి ఏమీలేదు. చిల్లుల కుండలో ఉన్నటువంటి, మహాదీప ప్రకాశము స్వయం ప్రకాశం గానే ఉంది. కుండకు ఉన్న చిల్లుల ద్వారా ప్రకాశం, బయటకు ఎప్పుడైతే వచ్చిందో, ఆ కుండకు వెలుపల అంతా మాయావరణ. ఆ మాయావరణ యందు చిల్లుల యొక్క ప్రకాశమంతా కూడా వ్యాపించింది. స్వయం రూపమైన బ్రహ్మకు హాని యేమొచ్చింది? ఆయన వికారం చెందాడా? నానా ఛిద్ర ఘటోదర స్థితిగా, స్వయం ప్రభగా ఉన్నటువంటి బ్రహ్మ, ఘటముయొక్క వెలుపల, ఆ రంధ్రముల ద్వారా, ఆ ఛిద్రముల ద్వారా వెలువబడిన బాహ్య ప్రకాశము కూడా, బ్రహ్మము యొక్క ప్రకాశ లక్షణమే అయ్యింది. ఆ ప్రకాశానికి కూడా కర్తృత్వాలు, భోక్తృత్వాలు లేవు. ఆ ఘటము యొక్క వెలుపల అంతా, మాయావరణం చేత, మాయ లేనిది ఉన్నట్లు చూపించడం చేత, ఆ వెలుపల ప్రకాశంగా ఉన్నటువంటి బ్రహ్మకి సర్వకారణత్వం ఆపాదించబడింది. సర్వ సాక్షిత్వం కూడా ఆపాదించబడింది. నిరావరణ బ్రహ్మయందు, సర్వ కర్తృత్వము, సర్వ సాక్షిత్వము, సంగత్వ అసంగత్వములు ఏవీ లేవు.

       ఈ రంధ్రముల గుండా మాయావరణలోనికి వ్యాపించినటువంటి, శుద్ధ చైతన్య ప్రకాశమే బ్రహ్మము. ఆ మూలప్రకృతి అనే అవ్యక్త స్థితిలో, మాయావరణమునందు వ్యాపించిన బ్రహ్మ  ఆ అవ్యక్త స్థితిని బాధించి, ఆ అవ్యక్త స్థితిలో ఉన్నటువంటి, రూపాలను, క్రమక్రమంగా, ముందు సూక్ష్మముగా, బ్రహ్మాండముగా వ్యక్తీకరించి, తరువాత స్థూలముగా పిండాండములుగా, జీవోపాధులుగా, జీవుడిగా, ఈశ్వరుడిగా, జగత్తుగా వ్యక్తం చేసింది. కనుక మాయావరణలో, కుండ లోపల ఉన్నటువంటి, ఆ స్వయం ప్రకాశము యొక్క ప్రకాశము, లోపల, వెలుపల కూడా ఉన్నప్పుడు, లోపలిదేమో సత్యమై, స్వయం ప్రకాశమై, స్వప్రకాశమై ఉంది. కుండయొక్క వెలుపల ఉన్నటువంటి మహాదీపముయొక్క బాహ్య ప్రకాశము వ్యాపకమై, తమస్సుని, మూల ప్రకృతిని, అవ్యక్తాన్ని  వ్యక్తముగా అయ్యే విధముగా చేసింది కాబట్టి, ఆ బాహ్య ప్రకాశము జగత్తుకి, బ్రహ్మాండానికి, పిండాండానికి కారణమే.
       అయితే, మాయావరణలోనే ఆ కారణం ఉంది కనుక, మాయ అంటే ఏది లేదో దానిని చూపిస్తుంది కనుక, బ్రహ్మ  పరోక్షముయొక్క కారణత్వము మాయాకల్పితమే కనుక, నిజానికి బ్రహ్మకు కారణము లేదు. అయితే సాధకులు, మాయావరణలో ఉన్నవాళ్ళు, మాయని దాటేదాకా, ఆ సర్వకారణమైనటువంటి బ్రహ్మని, ఆ బ్రహ్మ కారణంగా ఉన్నటువంటి అసద్రూప జగత్తుని, సద్రూప బ్రహ్మని ఒకటిగా చూడాలి. అప్పుడు జగత్తు కూడా బ్రహ్మమే. చూడబడే ఈ నామరూప ప్రపంచముగా ఉన్నటువంటి, జగత్తు కూడా సర్వమూ బ్రహ్మమే. సర్వం ఖల్విదం బ్రహ్మ.

       ఈ చూడబడేదంతా బ్రహ్మమే. చిత్‌ జడములయందు, జడమును విస్మరించి, త్రిగుణాత్మక సృష్టియందు గుణములను విస్మరించి, సర్వవ్యాపక చైతన్యాన్ని మాత్రమే దర్శిస్తే, అప్పుడు సర్వం ఖల్విదం బ్రహ్మ. సర్వవ్యాపక చైతన్యమును దర్శించకుండా, గుణమయంగా, నామరూపమయంగా, అవిద్యాదోషముతో, విషయాసక్తితో చూచినప్పుడు ప్రపంచము నిజము. విషయాసక్తి లేకుండా, గుణములు విస్మరించి, నామరూపములు చూడకుండా, వాటికి ఆధారభూతమైన, కేవల బ్రహ్మచైతన్యాన్ని మాత్రమే చూడగలిగితే, అది సర్వం ఖల్విదం బ్రహ్మ. ఇలా చూడడం అనేది జ్ఞాన చక్షువుకే సాధ్యము. కాని అభ్యాసం చేస్తే, విషయవాసనలు కొంతకాలానికి క్షయమైపోయి, నామరూప ప్రపంచం తోచటమే ఉండదు,  ఇంకా తోస్తూ ఉంటే ఆ ప్రపంచాన్ని మిథ్యాభావంతో చూడాల్సిన అగత్యం ఏర్పడుతుంది. ఒకవేళ కనబడితే, దానికి అసంగంగా ఉండడం అనేటటువంటి సాధన చేయాల్సి వస్తుంది. అసంగముగా, కేవల సాక్షిగా ఉండే సాధన చేయాల్సి వస్తుంది. పరబ్రహ్మ స్వరూప నిర్ణయం అయినప్పటికి, ఈ ప్రపంచము తోస్తూనే ఉంది, పోవటం లేదు. అప్పుడు ఏమిటి గత్యంతరం? జగత్తును కూడా బ్రహ్మగా చూచేటటువంటి దృష్టి ఉంటే సర్వం ఖల్విదం బ్రహ్మ. ఆ విధంగానే ప్రపంచాన్ని చూసే దృష్టి ఏర్పడాలి. మంచివారికి ప్రపంచమంతా మంచిగా కనిపిస్తుంది. చెడ్డవారికి ప్రపంచమంతా అవినీతిమయంగా కనబడుతుంది. దైవస్వరూపుడికి ప్రపంచమంతా దైవస్వరూపముగా కనబడుతుంది. బ్రహ్మచైతన్యానుభవంలో ఉన్నవాడికి, జగత్తు అంతా బ్రహ్మచైతన్య రూపముగా కనబడుతుంది. దీనికి మనము అభ్యాసం చేయవచ్చును. అసాధ్యమేమీ కాదు.

       స్థూల శరీరానికి ఫోటో తీస్తే, నామరూపాలు, రంగులు, ఆకర్షణ ఉంటాయి. అదే సూక్ష్మ రూపానికి తీస్తే, ఒక చిన్న వెలుగు అనేటటువంటిది పడుతుంది. ఎక్స్‌రే ఫోటో తీస్తే, ఎముకలు మాత్రమే పడుతాయి. స్కానింగ్‌ తీస్తే మాంసము ముద్ద కనిపిస్తుంది. మామూలు కెమేరా అయితే, రంగురంగులుగా అందంగా, అలంకారంగా పడుతుంది. కిర్లియన్‌ ఫోటో తీస్తే, తేజోరూపం కనబడుతుంది. జ్ఞాన చక్షువు అనే కెమేరాతో చూస్తే, ఇవన్నీ కనబడకుండా, అంతటా ఆత్మే ఆత్మమయంగా కనబడుతుంది. ఇదీ జ్ఞాననేత్రంతో చూసే దృష్టి. ఆ దృష్టితో ఉన్నవాళ్ళే, సర్వం ఖల్విదం బ్రహ్మగా చూడగలుగుతారు. ఇది సాధ్యమే. మామూలు కెమేరాకి, రంగురంగులు కనపడ్డట్టుగా, కిర్లియన్‌ ఫోటోగ్రాఫ్‌కి, సూక్ష్మతేజమే కనపడినట్లుగా, ఋషులు భూత, భవిష్యత్‌, వర్తమాన కాలాలు కారణ, మహాకారణ శరీరంలో ఉండే వాసన రూపంలో ఉన్నదానిని దర్శిస్తున్నట్లుగా, జ్ఞాన చక్షువుతో ఉన్నవారు, అంతటా ఆత్మచైతన్యాన్నే దర్శిస్తారు. ఎందెందులో ఏమేమి ఉన్నాయో అవన్నీ మాత్రం కనబడవు.

       ఒకవేళ కనబడితే అవన్నీ నేనే అన్నప్పుడేమో విభూతి స్వరూపము. వాటిన్నటిలో నేను ఉన్నాను అనేది సర్వాత్మభావము. వీటన్నటిని నేను చైతన్య స్వరూపముగా చూస్తున్నాను అనంటే, సర్వం ఖల్విదం బ్రహ్మ. అనేక మిఠాయిలు ఉన్నప్పుడు, మిఠాయిని కాకుండా, అందులో ఉన్నది పంచదార మాత్రమే అని చూచినప్పుడు, సర్వం ఖల్విదం బ్రహ్మ. పంచదార చిలకలు, నెమళ్ళు, బాతులు, కుందేళ్ళు, ఏనుగులు అన్నీ పంచదారతో చేసిన బొమ్మలు ఉన్నాయి. చిన్నపిల్లవాడికి, ఆ బొమ్మల రంగులు, సైజులు, ఆకారాలు కావాలి. పెద్దవారికి అది తినేపదార్థం. తీయగ ఉంటుంది అని తెలిసినటువంటి పెద్దపిల్లవాడు బొమ్మ బాగుండక పోయినాసరే ఏనుగును తీసుకుని తింటాడు. చిన్నపిల్లవాడేమో అందంగా ఉన్నటువంటి, చిన్న చిలకను తీసుకుని తింటాడు. ఈ పెద్దవాడి దృష్టి ఏమిటి? అంతా పంచదారేగా అని. చిన్నపిల్లవాడి దృష్టికి పంచదార కనబడడం లేదు. నామరూపాలు కనబడుతున్నాయి. కాసేపు ఆడుకుని, ఆడుకుని ఎప్పుడో తింటాడు. పెద్దవాడు వెంటనే తింటాడు, చూస్తూ ఆనందించడు. అలాగే సర్వం ఖల్విదం బ్రహ్మ అనేవాడు, వెంటనే స్వానుభవంలోకి వెళ్తాడు. నామరూప జగత్తు కనబడుతున్నప్పటికీ, వాటిని చైతన్యము యొక్క వికారాలుగా చూస్తాడు. ఆ పరమాత్మ యొక్క విభూతిగా చూస్తాడు. ఇన్ని రకాలుగా కనపడింది అంతాకూడా, ఆ పరమాత్మే కదా అని చూస్తాడు. ఇదే జ్ఞాననేత్రంతో చూసే దృష్టి. ఇదే సాధకులు అవలంబించవలసినది.

       ఆ రకంగా అంతటా ఆ బ్రహ్మస్వరూపమే కనబడితే, ‘సర్వం ఖల్విదం బ్రహ్మఅని శంకరాచార్యులు పూరించారు. ఎందుకు పూరించారు? సత్‌ అసత్‌, జగత్తు, బ్రహ్మము, ప్రకాశము. ఇవన్నీ దగ్గర దగ్గర పెట్టుకుని, దేనివల్ల ఏది ఉంది? దేని కారణంగా ఏది ఉంది? అప్పుడు కారణం ఉందా? లేదా? అని మొత్తం చర్చ చేసి, వస్తు నిర్ణయం చేసిన తరువాత, సాధకులకి ఇన్ని రకాల ఉపాయాలు కూడా, అక్కడ అందించారు. కొన్ని మహావాక్యాలు వస్తు నిర్ణయం చేస్తాయి. కొన్ని మహావాక్యాలు ఉపాయంగా నిన్ను తరింపచేసేట్లుగా ఉంటాయి. నిన్ను భ్రాంతినుంచి విడుదల చేసేట్లుగా ఉంటాయి. జగత్తు కూడా బ్రహ్మమే అనేది తప్పు. జగత్తు మిథ్య, బ్రహ్మ సత్యం - అదే రైట్‌. మరి ఆ జగత్తును కూడా బ్రహ్మంగా చూడమంటున్నారేమిటి? ఇది ఉపాయము. జ్ఞాన దృష్టితో జగత్తుని, అన్ని ఆభరణాలలో బంగారమే ఉన్నదన్నట్లుగా, అన్ని పంచదార బొమ్మలలో పంచదారే ఉన్నదన్నట్లుగా, పంచభూతాత్మకమైనటువంటి, గుణమయమైనటువంటి, త్రిగుణాత్మకమైనటు వంటి, ఈ ప్రపంచంలో సర్వము, ఆ బ్రహ్మచైతన్యముతోనే, తయారైందని, దాని మూల పదార్థము, దానిలో వ్యాపకమైన పదార్థము, ఆభరణాలలో బంగారమే ఎలా ఉందో, వీటి అన్నింటిలో, ఈ బ్రహ్మమే, చైతన్యమే, బ్రహ్మ ప్రకాశమే ఉన్నది. అనే దృష్టితో చూస్తే, ‘సర్వం ఖల్విదం బ్రహ్మ’.

       వాస్తవముగా మాయ బ్రహ్మము ఈ రెండింటికి సంగతియే లేదు. సంగతి అంటే ఏమిటి? సాంగత్యము అంటే స్నేహం. ఈ రెండింటికిని స్నేహం గాని, సాంగత్యం గాని, సంబంధం కాని లేదు. ఏలయన కూటస్థ సత్యము ఎప్పుడు ఛాద్యము కాదు. ఛేదించటం అంటే రెండు ముక్కలు చేయడం. ఛాద్యము అంటే ఖండములు కాదు. అలాగే మార్పు చెందదు. మాయ సత్‌ పదార్థం కాదు. దృశ్యమును కలిగించునది మిథ్యాజ్ఞానం మాత్రమే. కొన్ని వాస్తవాలు ఆ మూలస్థితిలో బ్రహ్మనుంచి సృష్టి వచ్చిందా బ్రహ్మ బ్రహ్మగానే నిర్వికారంగా శాశ్వతంగా ఉన్నప్పుడు సృష్టికి బ్రహ్మకి సంబంధం ఉందా లేదా అనే చర్చ ఇక్కడ చెప్తున్నాడు. మాయ అంటే యాఏది, ‘మాలేదో ఉన్నది అని మాయ యొక్క నిర్వచనము. యామాసమాయ. యామాసఅంటే ఏది లేదో అది ఉన్నట్లుగా ఉన్నదో అలా ఉన్నట్లుగా ఉండటానికి కారణమైనది మాయ.

       మాయ మనం అనుకొన్నట్లుగా గారడీ అని ఇంద్రజాలమని అనుకోవచ్చు. ఇంద్రజాలంలో కూడా అదే జరుగుతుందిగా. మాయావీవ విజృంభయత్యపి. ఈ మాయ ఇంద్రజాలమువలె విజృంభిస్తూ వున్నది. ఏమిటట? దేశ కాల కలన, దేశము కాలము కలన అంటే ఉండుట ఉనికి. ఉన్నాను అనేటువంటి ఉనికి స్ఫురణ. తనగురించి తనకు కలిగినటువంటి సంకల్పం. తాను ఉన్నాను అనేటువంటి తన ఉనికి స్ఫురణ మాత్రము. ఉన్నదాన్ని కలన అంటారు. గాఢ నిద్రలో కలన లేదు. నకలన. స్వప్న అవస్థలోను, జాగ్రత అవస్థలోను కలన, సుషుప్తి అవస్థలో నకలన. ఉండుట అనేటువంటి అనుభూతి ఉంటే అది కలన. ఆ అనుభూతి లేకపోతే నకలన. బ్రహ్మము అనేటటువంటి ఉండుట కూడా అవ్యక్తం కనుక అది నకలన. లేకుండుట నకలన మళ్ళీ ఉండుట అనేటువంటి స్ఫురణ లేకుండా ఉన్నటువంటి బ్రహ్మయందు స్ఫురణమే ఎరుకఅంటే ఎరుక లేకుండుటయే నిజమైన బ్రహ్మ. ఎరుక లేకపోవడానికి బయలనిపేరు. బయలే బ్రహ్మ. అంటే కలనా అంటే ఉనికి తోచుట. ఎవరిలో? బ్రహ్మలోనే! మొదట్లో బ్రహ్మమే ఉన్నాడు. ఆ బ్రహ్మకి ఉనికి తోచలేదు. తరువాత ఉనికి తోచడమే కలన. బ్రహ్మకి తాను ఉండుట తోచింది. దానితోపాటు ఎక్కడ ఉండుట? అప్పుడు ఆవరణ తోచింది. అంతకుముందు తోచలేదు. ఇప్పుడు తోచిందిగా! తోచనప్పుడు కాలమే లేదు. తోస్తుంటే ఏమైంది? వర్తమానం వచ్చింది. ఎప్పట్నుంచి తోస్తుందీ? కొలత వచ్చింది. ఆ కొలత పేరే కాలం’. ముందు కలన’. తరువాత దేశము తరువాత కాలము.

       ముందు ఆలోచన వచ్చింది. ఆలోచన కొనసాగుతూ ఉంది. ఎంతసేపు కొనసాగిస్తూ ఉన్నదీ అనేటువంటి కాలము, ఆలోచన రావడానికి ఒకచోటు కావాలిగా? ఆలోచన ఉండటానికి ఒకచోటు కావాలిగా? ఎప్పుడైనా ఎవరికైనా ఆ ఉండుట అనేది ఎప్పుడైతే వచ్చిందో దాంతోపాటే ఆ ఉన్నదానికి చోటూ వచ్చింది. బ్రహ్మ సంకల్పంలో సర్వమూ ఉత్పత్తి అయ్యింది. సర్వమూ ఉండటానికి చోటుయే శూన్యం’. సర్వమూ లేనపుడు శూన్యం అన్నాము. సర్వమూ ఉన్నప్పుడేమో శూన్యాన్ని మరచి సర్వం అంటున్నాము. గాని సర్వం అక్కడ ఉండుటకు ఆస్కారం ఇచ్చినటువంటిది అక్కడ ముందుగా లేకపోతే సర్వం ఎక్కడ ఉంటుంది. ఈ అలమరా ఖాళీగా వుంది. అందులో నేను పుస్తకాలు పెట్టాను. ఖాళీ లేనిదే పుస్తకాలు ఎట్లా పెట్టాను? పుస్తకాలు పెట్టేసరికి ఖాళీ ఏమైంది? ఖాళీ వుంది. పుస్తకాలు ఉన్నాయి. అలాగే సర్వమూ ఉంది. శూన్యమూ ఉంది. శూన్యమే సర్వం యొక్క ఉనికికి ఆస్కారమిచ్చింది, అవకాశమిచ్చింది. కనుక సర్వానికి అవకాశం ఇచ్చింది కాబట్టి ఏదైతే అవకాశం ఇస్తుదో అది ఆకాశం అన్నారు.

       ఈ ఆకాశలు ఎన్ని ఉన్నాయి? మీరు మనసుపెట్టి ఆలోచిస్తున్నారు. మీ ఆలోచనలో సప్త సముద్రాలు దాటి ఎక్కడెక్కడో తిరిగి వచ్చారు. ఆలోచనతో తిరిగారు. కాని నిజంగా తిరగలేదుగా!  ఆలోచనలు తిరగడానికి ఉన్నటువంటి ఖాళీ ఎక్కడిది? ఖాళీ లేకుండానే తిరిగారా? మీ ఆలోచనలు లేకపోతే మీ కలలో ఎక్కడికెక్కడో తిరిగారుగా! ఎక్కడికెక్కడికో రెక్కలట్టుకు తిరిగారుగా! అంటే దేశం ఉంది. ఎక్కడికెక్కడికో తిరిగారు అంటే ఆచోటు శూన్యంగా ఉండి తరువాత ఆ తిరగడానికి అనుకూలంగా అవకాశం ఇచ్చింది. కనుక అక్కడ ఉంది. మేల్కొంటే అది నిజమేనా? లేదు. ఆలోచిస్తే ఊహిస్తే కలగంటే ఉంది. ఆ ఉండటానికి ఒక చోటుంది. ఆ చోటు పేరు ఆకాశం. అవకాశం కాబట్టి ఆకాశమనేటటువంటి పేరు వచ్చింది. మానసాకాశము అంటే మనసుయొక్క ఆలోచనలు ఉండటానికి అవకాశమిచ్చిన చోటు మానసాకాశము. భౌతికముగా కనబడే ఆకాశము కాదండీ! భౌతికంగా కనబడే ఆకాశం భూతాకాశము. సూర్యునినుండి సూర్యుని చుట్టూ ఉండే గ్రహాలన్నీ ఈ గోళాలన్నీ ఉండటానికి అవకాశం ఇచ్చిన దానిని భూతాకాశం అని అంటాము. మనసు ఆలోచిస్తున్నప్పుడు అణుమాత్రంగా ఉన్న మనసు ఎంత విశాలమైనటువంటి చోటుని ఆ కలగనేటువంటి సమయాన్ని, కాలాన్ని కలలో నామరూప వస్తువుల్ని, కొన్ని అనుభవాల్ని పొందుతుంది. వీటన్నిటికి అవకాశం ఇచ్చే ఆకాశం మానసాకాశము. చిత్తవృత్తులు రావడానికి అవకాశం ఇచ్చింది. చిత్తాకాశము, సృష్టి, స్థితి, లయ కారకులు వారి చైతన్యంతోసహ ఆ చైతన్యం యొక్క కార్యక్రమము చేయడానికి చిద్విలాసం చేయటానికి ఒకచోటు ఉంది. ఆ చోటు పేరు చిదాకాశము. ఆ ఈశ్వరునియొక్క పరమాత్మ యొక్క చిద్విలాసానికి అవకాశం ఇచ్చినటువంటిది ఏది? చిదాకాశము. మాయ, మాయ కారణంచేత నీకు అవకాశం ఇచ్చిందేది? దహరాకాశము. కేవలాత్మ అనేటటువంటి అపరోక్షానుభూతి పొందడానికి అవకాశం ఇచ్చింది ఏది? కేవలాకాశము. నామరూప జగత్‌ అంతా ఉండటానికి అనేకంగా నానాత్మకంగా కలిసిగాని, విడిగా గాని అవయవాలుగా ఉండేటటువంటిది ఏదయితే ఉందో దానికి అవ్యక్త రూపమే నిరవయవం’. ఈ బ్రహ్మాండ పిండాండాలు నానాత్వంగా అనేకత్వంగా, అనేక బేధాలతో ఉండటానికి ముందు అవ్యక్తంలో ఒక ముద్దగా, ఘనంగా, నిరవయముగా ఉన్నది. ఈ నిరవయంగా ఉన్నది అంటున్నాము కదా. ఈ ఉండుటకు అవకాశము ఇచ్చింది ఏది? నిరవయవాకాశము. ఇట్లా ఆకాశలు ఐదే చెప్తాం కాని ఎన్ని అయినా చెప్పుకోవచ్చు.

       తీరాచూస్తే ఇవన్నీ మాయా కల్పితము. ఏవి లేవో అవి ఉన్నట్లు కనబడ్డాయి. తాడుయందుపాము తోచినట్లుగా మాయ కారణంగా తాడే పాముగా మారింది. ఎప్పుడు పాము కనబడుతుందో అప్పుడు అసలైన తాడు కనబడట్లేదు. అసలైన తాడే కూటస్థం. కూటస్థం అంటే ఏమిటి? వ్యాపకత్వం లేకుండా తాను తానుగా కదలక మెదలక మనోవ్యాపారం లేకుండా చిత్తవృత్తులు లేకుండా ఆత్మ నిష్ఠలో, లేక బ్రహ్మ నిష్ఠలో ఉండటం కూటస్థం. కూటస్థం అంటే బ్రహ్మనిష్ఠ. బ్రహ్మనిష్ఠలో ఏ అనుభూతి అయితే ఉందో అది తప్ప ఇంకోటి ఏదీ లేనేలేదు. అది కూటస్థం. మాయకి బ్రహ్మకి సాంగత్యం లేదు, సంబంధ లేదు. తాడుకి, పాముకి సంబంధం లేదు అంటే అర్థం ఏమిటి? తాడు పాముని పుట్టించిందా? పుట్టించిందే అనుకో. లేని పాము ఉన్నట్లుగా చూపిస్తుంది. లేనిదాన్ని ఉన్నట్లుగా చూపిస్తే అది భ్రాంతి కదా! భ్రాంతిలో ఉన్నవన్నీ అసత్యం కదా! అసత్యం అంటే మార్పుచెంది, కాసేపు ఉండిపోయేవే కదా! పైకి ఎలా ఉన్నా ఎంత బాధిస్తున్నప్పటికి కూడా దాన్ని తాత్కాలిక సత్యం అంటారు. అయినాసరే లేనిదే ఉన్నట్లు కల్పించి బాధిస్తున్నది. బాధ కారణంగా బాధిస్తున్న కారణంగా అది తాత్కాలిక సత్యముగా ఉన్నది. బాధ కారణంగా బాధిస్తున్న సమయంలో నిజంగానే బాధిస్తున్నది. కాబట్టి అది వ్యావహారిక సత్యం. కాని పరబ్రహ్మ ఈ కల్పిత వస్తువులచేత బాధింపబడడు. పరబ్రహ్మ నిష్ఠలో ఉన్న శిష్యుడు పరబ్రహ్మమే తానై యున్నవాడు సృష్టికి పూర్వం ఉన్నటువంటి పరబ్రహ్మ మాత్రమే. దానికీ మాయకీ ఎటువంటి సంబంధము లేదు. తరువాతైనా ఉందా? తాడుకి పాముకి ఎలా సంబంధం లేదో తరువాత కూడా లేదు.

       బ్రహ్మ జ్ఞానిగా ఉన్నటువంటి తాను తానైనటువంటి స్వరూపమందు స్వరూప నిష్ఠలో నిత్య వర్తమానములో శాశ్వతంగా ఉంటుంది. మాయ కల్పించేవన్నీ కూడా దానియందు లేనేలేవు. దాని ఊహలో లేవు. దాని అనుభవంలో లేవు. ఆ మాయాకల్పిత వస్తువులచేత ఆ పరబ్రహ్మకి బాధ కూడా లేదు. ఈ తాత్కిలిక సత్యం పైన ఏదైతే చెప్పామో ఆ కేవల పరబ్రహ్మయందు పరబ్రహ్మమే ఉన్నాడు. అంతకుమించి అన్యముగా ఏమీలేదు. అందువల్ల బ్రహ్మకి మాయకి సంబంధము లేదు. అయితే మాయయే బ్రహ్మతో సంబంధం పెట్టుకొన్నట్లుగా ఏక దేశీయంగా ఒక వంతు బ్రహ్మయందు మాయచేరి ఆ బ్రహ్మను ఆశ్రయించి మాయ మాయ పనులు చేస్తూవుంటే ఆశ్రయించబడ్డ ఒకవంతు బ్రహ్మ నిర్గుణం అయినప్పటికీ, మాయయే ఆ బ్రహ్మను సగుణంగా చూపించింది. ఈ సగుణ బ్రహ్మే సర్వకారణంగా, సర్వాధారముగా మన విచారణలో తేలుతుంది. కార్యకారణంగా  ఉంటుంది. ఆలోచించినప్పుడు ఒక తర్కాన్ని బట్టి తేలుతుంది. కొన్ని రుజువుల్ని బట్టి తేలుతుంది. పెద్దల వాక్యాలబట్టి తేలుతుంది.

       కొంతమంది తపస్సు చేయడంవల్ల వారి తపస్సులో కూడా ఆ కారణ బ్రహ్మ ఎవరు? అని తపస్సు చేశారు. అప్పుడు ఆ కారణం అయినటువంటి బ్రహ్మ ఆ తపోదర్శనంగా అపౌరుషేయంగా తెలియబడింది. ఎప్పుడయితే శబ్ద ప్రమాణంగా, అపౌరుషేయంగా తెలియబడిందో, తెలియబడుట అనేదానికి వేదం అని పేరు. శబ్ద ప్రమాణంగా తెలియబడింది కాబట్టి, శ్రుతి అని పేరు. ఆ వేదాలు, శ్రుతులు, అపౌరుషయము ఎవరూ చెప్పలేదు. వేదాలలో వినబడ్డవి, కనబడ్డవి ఉన్నాయి. వినబడ్డవి, కనబడ్డవి అంటే శ్రోత్రేంద్రియములు, చక్షురింద్రియములకు కాదు. శబ్ద, స్పర్శ, రూప, రస గంధాలను అనుభవించేటువంటి పంచ జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటి చక్షురింద్రియం, శ్రోత్రేందియములు కావు. ఈ కనబడటం దర్శనస్థితి. దర్శనంగా కనబడాలి. ఈ దర్శనం అనే పేరేమిటంటే నీయొక్క నీకంటే ఉన్నతమైనటువంటి స్థితి మాయా ప్రపంచానికి సంబంధము లేకుండా ఉన్న స్థితిలో కొన్ని అనుభవాలు రావడమే దర్శనం. దర్శన పద్ధతిగా తెలుస్తుంది.

       మాయకి బ్రహ్మకి సంబంధం లేదు. ఎందుకంటే ఆ బ్రహ్మ అచలము, పరిపూర్ణము, కూటస్థుడు, కదలనివాడు, పరిపూర్ణము అంటే ఏమిటి? ఆ పరిపూర్ణత్వంలో పరిపూర్ణమైనటువంటి స్థితిలో అంతకంటే మించిన ఆనందం లేదు. అంతకంటే మించిన తృప్తి లేదు. ఆ తృప్తి నిత్యవర్తమానంగా ఎప్పుడూ ఉంటుంది. ఆ తృప్తికి పెరుగుదల, తరుగుదల లేదు. కొంత అసంతృప్తి వస్తే కదులుతాడు. కదలడానికి బ్రహ్మలో చోటు ఎక్కడ ఉంది? దేశ, కాలము, కలనాకంటే ముందు ఉన్నటువంటి బ్రహ్మకి కదలడానికి చోటు ఎక్కడ ఉంది? సృష్టిలో దేశము, కాలము వచ్చాక కాలములోను, దేశములోను కదులుతున్నాడు. కాలములో అంటే ఒకప్పుడు అవతార పురుషుడిగా శరీరం ధరించి కనబడుతారు. ఒకసారి శరీరం లేకుండా ఉంటాడు. ఒకసారి సర్వవ్యాపక శుద్ధచైతన్యంగా పరమాత్మగా ఉంటాడు. ప్రళయానంతరమూ ఆ వ్యాపకత్వమును మిరమించినటువంటి స్థితిలో ఘనమై కూటస్థమై ఉంటాడు. అవ్యాకృతుడై ఉంటాడు. ఇక్కడ కూటస్థమంటే సృష్టికిపూర్వం ఉన్న బ్రహ్మ. మాయకు సంబంధంలేని బ్రహ్మ. మాయ ఉన్నప్పటికీ మాయతో సంబంధంలేని బ్రహ్మ. మాయ మాయాకార్యం చేయటానికి ముందున్నటువంటి బ్రహ్మ. ఆ బ్రహ్మనే మనం తత్‌అంటున్నాము.

       ఆ బ్రహ్మని మాయా ఆవరణలోనే పట్టుకొని అనుభవం పొందేటటువంటిది పరమాత్మ. ఆ పరమాత్మ అనేటటువంటి సత్‌ చిత్‌ ఆనందంఅనేటుటవంటి ఏ అనుభవమయితే మనం పొందామో అది త్వంఅంటున్నాము. మాయ ఆవరణలో పరమాత్మ ఆనుభవం, నిరావరణయందు పరబ్రహ్మ ఒక్కటే అని వాక్యం చెప్తుంది. అయితే వాచ్యార్థం విడచిపెట్టి లక్ష్యార్థం పట్టుకోవాలి. మాయావరణలో కల్పించినవన్నీ వాచ్యార్థంగా విడచిపెట్టి మాయావరణలో ఏ శుద్ధ చైతన్యమైతే ఉన్నదో అదే నిరావరణమందు వ్యాపకత్వం లేకుండా ఘనమై యున్నది. నిజంగా ఆ పరబ్రహ్మ ఎప్పుడూ ఘనమయ్యే ఉన్నాడు. కనుక రెండూ సమానమే. రెంటికీ భేదం లేదు. కూటస్థ సత్యవస్తువు నిర్వికల్పమే. మార్పు చెందదు. నిర్వికారమే, వికారం చెందదు.

       వేదాంతం యొక్క సిద్ధాంతమునందు ఏకమేవా అద్వయం బ్రహ్మకు మాయ లేనిది. రెండోది ఉన్నది అంటే దోషం వస్తుంది. అందువలన మాయ సత్‌ పదార్థం కాదు అన్నప్పుడు అది లేని మాయ. లేని మాయ కాబట్టి దాన్ని రెండు అనటానికి వీల్లేదు అప్పుడు సత్యం ఒక్కటే అయ్యుంటుంది. ఆ సత్యం పరబ్రహ్మమే. అది గుర్తు చేయడానికి మాయ సత్‌ పదార్థం కాదు అని మళ్ళీ చెప్తున్నాడు. మాయతో సంబంధం ఉంది. అంటే రెండు సత్‌ పదార్థాలు ఉండాలి. అది తప్పు. ఎందుకంటే ఏకం సత్‌ అన్నారు. ఒకదానికొకటి సంబంధపడిలేవు. ఆ సత్‌ పదార్థం ఒక్కటీ బ్రహ్మ. అలానే అసత్‌ పదార్థం అంటలేదు. లేనిమాయ అంటున్నాము. లేని మాయ కాబట్టి ఉన్న బ్రహ్మతో సంబంధం లేదు. ఉన్న బ్రహ్మకు లేని మాయతో సంబంధం లేదు గాని, లేని మాయకు ఉన్న బ్రహ్మతో సంబంధం ఉంది. లేని మాయ బ్రహ్మమును పట్టుకుంది గాని లేనిది ఎలా పట్టుకొంటుంది? మాయ అంటే ఏమిటి? ఏది లేదో అది ఉన్నట్లుగా ఉన్నది. కనుక లేని మాయ ఉన్నట్లుగా ఉన్నదే పట్టుకొంటోంది. ఇక్కడే ఇలా ఆలోచిస్తే బ్రహ్మకి మాయకి సంబంధం లేదని తేల్చేసుకొంటే అప్పుడు జగత్‌ ఏమిటీ? ‘బ్రహ్మ సత్యం జగత్‌ మిథ్యమూలం దగ్గర విచారణచేసి దీన్ని గట్టిగా అవగాహన చేసుకోవాలి. మాయ సత్‌ పదార్థం కాదు. కనుక దృశ్యము కలిగించునది. మిథ్యా జ్ఞానము మాత్రమే. చివరికి ఒక ఖచ్చితమైన నిర్ణయాన్ని ప్రకటిస్తున్నాడు. కేవల దృక్‌గా ఉన్న, కేవల ఆత్మగా ఉన్న, కూటస్థంగా ఉన్న నిర్వికల్పంగా ఉన్న బ్రహ్మకి మాయకి సంబంధం లేకుండా ఉన్నది.

       పరబ్రహ్మమొక్కటే, పరబ్రహ్మ కన్నా అన్యము లేదు అన్నప్పుడు ఆ బ్రహ్మ విషయం కాదు అని ముందే చెప్పారు. బ్రహ్మని విషయీకరించి ఎవరూపట్టుకోలేరు అన్నాడు. అమానసగోచరం, అనిర్వచనీయము. అట్టి స్థితిలో అచలమై పరిపూర్ణమై, కూటస్థమై, నిర్వికల్పమై తాను తప్ప అన్యము లేక అద్వయమై ఉన్నటువంటి పరబ్రహ్మయందు మాయ అనేటటువంటిది రెండోది ఉంటుందా? ఉండదు. కనుక ఆ బ్రహ్మ కేవల దృక్‌. దృశ్యం లేని దృక్‌. మళ్ళీ ఆ దృక్‌ అనే దానిని ఎలా నిర్ణయించాలి?

       రూపము కన్నుకి దృశ్యము. కన్ను దృక్‌. కన్ను మనసుకి దృశ్యము. మనసు దృక్‌. మనసు నేనుకు దృశ్యము. నేను దృక్‌. నేను కూటస్థ ఆత్మకి దృశ్యము. కూటస్థ ఆత్మ దృక్‌. కూటస్థ ఆత్మ అనేది అంతఃకరణ ప్రతిబింబముగా ఉన్నది కనుక అది దృశ్యము. బింబమైనటువంటి పరమాత్మ దృక్‌. బింబమైన పరమాత్మకి మాయా ఆవరణ అనేటువంటి దోషం వచ్చేసరికి అది దృశ్యం. నిరావరణ బ్రహ్మకు మాయ ఆవరణ అనేటువంటి దృశ్యము. నిరావరణ బ్రహ్మమేమో దృశ్యంతో సంబంధం లేకుండా తనకు తానే స్వతస్సిద్ధమైనటువంటి బ్రహ్మ దగ్గర బ్రహ్మం కంటే అన్యము లేదు. అద్వైతంగా సిద్ధించినది. సిద్ధ వస్తువుగా అద్వైతంగా శాశ్వతంగా తనకంటే అన్యము లేకుండా ఉన్నటువంటి బ్రహ్మయందు అటువంటి బ్రహ్మ నిష్ఠలో అపరోక్షంగా ఉంటుంది తప్ప తనకు అన్యము తోచదు. అన్యము తోస్తేనే దృశ్యము కనుక అట్టి బ్రహ్మ నిష్ఠలో అన్యము లేదు. అన్యము అనేదంతా దృశ్యము లేదు కనుక బ్రహ్మ తనకుతాను కూడా దృశ్యము కాదు. అందుకని దృశ్యము కలిగించినదంతా మిథ్యాజ్ఞానము మాత్రమే. పాము కనబడ్డానికి మిథ్యా జ్ఞానమే కారణం కాని తాడు కారణం కాదు. ఈ దృశ్యము ఏర్పడటానికి మిథ్యాజ్ఞానానికి మూల కారణం అయిన మాయ కారణం. కనుక పరబ్రహ్మ కారణం కాదు.

       అదేమిటి? అన్నిటికి సర్వకారణం బ్రహ్మ అని చెప్పాం కదా? ఇక్కడ విడగొట్టుకుంటున్నాము సగుణానికి, నిర్గుణానికి ఏ పరిస్థితులలో సగుణమన్నాము? సగుణంగా ఉన్నప్పటికీ వాడు నిర్గుణుడే కదా! సగుణం నిర్గుణం రెండు ఉన్నా నిర్గుణమే సత్యము. సగుణం మాయ. అందుకని దృశ్యాన్ని మొత్తాన్ని విడగొట్టుకొని అంటే దేశము కాలము కలన కూడా దృశ్యమే. నకలనగా దేశ కాలానికి అతీతంగా తాను తానైన ఒక అవ్యక్తరూపం ఏదైతే ఉన్నదో, వ్యక్తం అయిన అనుభవాలు దానియందు ఏవీ లేవో, ఏ దృశ్యంచేత అది బాధింపబదో, ఏ దృశ్యానికి కారణంగా లేదో, వికారం పొందక వికారాలను చేయించక కూటస్థంగానే ఉంటాదో అదే పరబ్రహ్మ.

       సాధనలో కూడా అట్టి స్థితి సంపాదిస్తే మనమే ఆ పరబ్రహ్మ. ఈ మిథ్యా జ్ఞానము మాయా కల్పితమైనా ఆ సంగతి తెలిసిన ఈశ్వరుడు మాయకి వశుడు కాదు. అవిద్యా దోషం ఉన్నటువంటి జీవుడికి మాత్రమే ఈ మిథ్యా జ్ఞానం సత్యం అని అనిపిస్తుంది. ఇది మిథ్యా జ్ఞానం కదా అనేటువంటి ఆలోచన జీవుడికి రాదు. ఎందుకని? అవిద్యా దోషంతో మాయకు వశుడై ఉన్నాడు కనుక. అవిద్యా దోషం పోతే మాయకి వశం కాని స్థితిలో ఇది మిథ్యకదా! ఇది మాయ కదా! ఇది లేనిది కదా! అని కనబడుతున్నప్పటికిని లేనిదనే భావంతో దాన్ని అంటక ముట్టక, దాని గురించి ఆలోచించక ఊహించక, దానిచేత బాధింపబడినప్పటికీ అది బాధ కానేకాదు అనేటువంటి దాంట్లో నిర్ణయమై ఆ నిర్ణయంగానున్నవాడు వీటన్నిటినుంచి విడుదలపొంది, విడుదలై, తాను తానైనటువంటి స్థితిని సముపార్జించి, ఆ స్థితిలో కూటస్థమై నిలుస్తాడు.

       ఎప్పుడు అయితే కూటస్థమై అచలమై పరిపూర్ణమై నిలుస్తాడో ఈ బాధించేది కూడా పోతుంది. ఈ మిథ్యా జ్ఞానం వల్ల తయారయినటువంటి పాము వగైరాలు కూడా తనను బాధించవు. కనుక ఇది మిథ్యా జ్ఞానము మాత్రమే అని ఎవరికి చెప్తున్నాడు? అవిద్యా దోషం ఉన్నవాడికి చెబుతున్నాడు. అవిద్యా దోషం ఉన్న జీవుడికి, సత్యం గురించిన జ్ఞానం కలగగానే దృశ్యము ఉండదు. దేశ కాలాలు ఉండవు. సత్‌ చిత్‌ ఆనంద రూపంలో ఒక అనుభవంలో శాశ్వతంగా ఉండిపోయే ఆనందం అనేది ఉంటుంది. ఇదియే కలన. చివరకు ఈ కలన కూడా ఉండదు. మాయాకల్పిత ప్రపంచము మాయ ద్వారానే వ్యక్తం అయ్యింది. మాయ కల్పిత ప్రపంచము మాయ ఆవరణయందే ప్రకటించబడింది. ప్రకటితమైనవన్నీ మిథ్యా జ్ఞానము అని అవిద్యా దోషంతో ఉన్నంతకాలము అనుకొన్నవాడు. అవిద్యాదోషం నుంచి బయటపడ్డవాడు మాయకి వశుడు కాడు కాబట్టి ఇవి అన్నీ లేనివి కదా అంటే అన్నీ లేకపోగా ఏది మిగిలి ఉన్నది? ఏది శేషించి ఉన్నది? అని చూస్తే తాను తానై ఉన్నటువంటి పరబ్రహ్మమే శాశ్వతముగా ఉన్నది.

       ముందు వస్తు నిర్ణయం చెయ్యండి. తాను తానైనటువంటి పరబ్రహ్మగా ఉంటూనే ఎక్కడ ఉన్నాము? మాయా ఆవరణయందే ఉంటున్నాము. కనుక ఇది లేనిది అని అనుకొన్నప్పటికీ ఆ లేనిది అనే దాంట్లోనే మనం ఉంటున్నాము. అవిద్యా దోషం లేనివాడేమో ఇది కనబడుతున్నప్పటికీ లేనిదే అంటున్నాడు. అదీ తేడా. కనుక లేనిది లేకుండా మాత్రం పోలేదు. లేనిదే ఉంటోంది. లేనిది అనే నిర్ణయంలో చూస్తున్నాడు అవిద్యా దోషం లేనివాడు. అవిద్యాదోషం ఉంటే వాడిపేరు జీవుడు’. మిథ్యా భావంతో గట్టి నిర్ణయంతో ఆరూఢమైనట్టివాడు ఈశ్వరుడు’. జీవుడు కాదిక. ఎందుకని? ఈ్వరునికి ఇంకా ఈ కల్పిత ప్రపంచం ఉన్నది?  మరి ఈశ్వరుడు ఎప్పుడు బ్రహ్మమౌతాడు? మళ్ళీ ఈశ్వరుణ్ణి కూడా విచారించాలి. అంతా మాయా కల్పితమయినప్పుడు సృష్టి, స్థితి, లయలుగా కనబడేటటువంటి పిండ బ్రహ్మాండాలన్నీ కూడా చరాచర జగత్‌ అంతా కూడా ఇంకా చెప్పాలంటే జీవుడు, జగత్‌, ఈశ్వరుడైన తాను కూడా మాయా కల్పితుడే అని ఈశ్వరుడు తెలుసుకోవాలి. ఇదే సూత్రం. తాను తప్ప అన్యం లేదు అనే సూత్రము.

       మిథ్యా సృష్టికి సృష్టికర్త యేమిటి? మిథ్యా సృష్టిని పోషించటమేమిటి? మిథ్యా సృష్టిని లయించటమేమిటీ? పిల్లలాటలాగ చిన్న చిన్న బొమ్మలు తీసుకొచ్చి పెళ్ళి కూతురిని, పెళ్ళి కొడుకుని పెట్టి, పెళ్ళి చెయ్యటం, వంటలు చెయ్యడం, విందులు చెయ్యటం, అప్పగింతలు బెట్టటం, ఇవన్నీ యేమిటి? పెద్దలకి ఎలా ఉంటుంది ఇది అంతా? పిల్లలాటల పోలికాయెను. ఈ పిల్లలకి అది నిజమే, పెద్దలకు మాత్రం నిజం కాదు. ఉత్తిత్తి పెళ్ళి కాని ఏమీ లేదు. ఇల్లు బయలయి తెల్లనాయెను. ఇల్లు అంటే ఒక పరమితత్వం. పరిమితత్వం అంటే ఎరుక. ఎరుకే నిన్ను పరిమితుడ్ని చేసింది. నీవు అనంతుడివి. అనంతంగా ఉన్నటువుంటి బ్రహ్మను ఎరుక పరిమితము చేసింది. జీవుడు, ఈశ్వరుడు కూడా పరిమితులే. శుద్ధ చైతన్య పరమాత్మ సర్వవ్యాపకంగా ఉన్నది మాత్రమే అపరిమితము. దాన్ని అఖండ ఎరుక అన్నాము. అఖండ ఎరుక అనంతమే కాని దాంట్లో ఎరుక మళ్ళీ వ్యాపించటానికి వీలు ఉన్నది. అఖండ ఎరుకను నిర్బీజముచేస్తే అఖండ ఎరుక అనే పేరుపోయి బయలు అనిపేరు వచ్చింది.

       అందుకని ఇల్లు బయలయి అంటున్నాము. ఎరుక పోతే బయలే ఉన్నది అని అర్థం. పిల్లలాటల పోలికాయెను ఇల్లు బయలయి తెల్లవాయెను. తెల్లదనాయెను అంటే తెలిసిపోయిందని, తెలిసిపోయిందేమిటి? తెలిసింది అని ఆపకుండా, తెలిసి పోయింది అంటున్నాము. తెలుసుకొంటే ఇంకా ఎరు ఉంటుంది. బయలు ఉన్నదనే ఎరుకే బయలయినదని తెలిసి, ఆ తెలిసిన తెలివి పోయింది. ఆ ఎరిగిన ఎరుక పోయింది. ఎరిగే ఎరుకగా ఉన్న ప్రజ్ఞానం పోయింది. ఆ ప్రజ్ఞానం పోవడమే బయలు. తెలిసిందే అని ఆపకూడదూ, తెలిసిపోయింది అనాలి!

       సత్యమును గురించిన జ్ఞానం కలగగానే తాడుయందు పాము ఉన్నదీ అని, తాడు సాక్షాత్కారం కాగానే పాము మిథ్యగా ఉన్నది. ఇదీ జ్ఞానము. తాడు సాక్షాత్కారమైనప్పుడు ఆ సాక్షాత్కార అపరోక్ష అనుభూతితో తాను తానైనటువంటి స్థితిలో కొనసాగుతుండగా అన్యస్థితి తోచదు కాబట్టి అప్పుడు పాము తోచదు. ఇది విజ్ఞానము. తాడును, పాముని చూడటము కాదు నీవే ఆ తాడై యున్నావు. నీవు అదయి ఉన్నావు. నీవు అదయి ఉన్నటువంటి అపరోక్షానుభూతి నీకు కలిగినప్పుడు ఆ అపరోక్షానుభూతిలో నువ్వు నువ్వైనటువంటి  స్వతస్సిద్ధమైనటువంటి సచ్చిదానంద ఘనమైనటువంటిది, నిత్య వర్తమానంగా అద్వయంగా కొనసాగుతూ ఉంటే, ఆ నిశ్చల స్థితిలో రెండోది తోచదు కదా! ఈ పాము కూడా తోచదు కదా! అప్పుడు పాము అనేది పోవడమే కాదు, ఒకప్పుడు పాము ఉన్నదీ అనేటుటవంటి జ్ఞాపకముగా గుర్తు, వాసన కూడా ఉండదు. ఒకప్పుడు పాము అనేది ఒకటి ఉంది అనేటువంటి వార్త కూడా ఉండదు. వేదాంతంలో దాన్ని వార్త అంటారు. వార్త అంటే ఒకప్పుడు ఉన్నది అంటే జ్ఞాపకంలో ఉంటుంది. వాసనలో ఉంటుంది. వాసనలో ఉంటే రజోగుణం ఉన్నవాడికి ఆ వాసన క్రియారూపంలోకి వచ్చి ఆ కార్యంలో ఆ కార్యక్రమములో అనుభవానికి వస్తుంది. ఇంత చేస్తే ఏమి లాభం? మళ్ళీ ప్రపంచం అనుభవంలోకి వస్తే మాయలో పడ్డట్లే. అందుకని వార్త కూడా లేదు. పోడిమి ఏమీ లేదు. అంటే అది ఒకటి ఉందని దానియొక్క జాడ ఉండదు. కందార్థాల్లో పోడిమి అంటే జాడ, ఇవన్నీ వస్తాయి. దాని జాడే లేదు. దాని పోడిమే లేదు. దాని వార్తే లేదు. దాని వాసనే లేదు. దాని జ్ఞాపకమే లేదు. దాని గురుతేమీ లేదు. ఎందుంటున్నాము ఇవన్నీ? ఎరుక సంబంధమే కాబట్టి. అందులో ఏమన్నాసరే అది ఎరుకకి సంబంధించినదే. పరిపూర్ణ బోధగా తెలుసుకుంటే పోతుంది.

       సమూలంగా పోవాలి. అందుకే అంటారు పైసా అంత ఎరుకని ఉంచారా, అదే రూపాయంత చేసుకొంటుంది. ఎరుక నిశ్శేషముగా పోవలెను అంటారు. అవిద్య ఉన్నంతకాలమూ జీవుడు ఉంటాడు. ఎందుకంటే జీవుడే అవిద్యా కల్పితుడు. అంతఃకరణ ప్రతిబింబుడే, చిదాభాసుడే, నేను నేను అనేవాడే జీవుడు.

       కూటస్థుడు అనే పదం జీవుడు దగ్గర చెబుతున్నాము. 24 తత్వాలనుంచి వేరుచేస్తే అలా వేరుచేసి ప్రత్యేకంగా చెప్పినప్పుడు ఆ 25వవాడు కూటస్థ ఆత్మ, కూటస్తుడు అంటున్నాము. ఆ కూటస్థ స్థితి శాశ్వతంగా నిలబడితే, వాడు పరబ్రహ్మమే. పిండాండ పంచీకరణలో కూటస్థుడు, కూటస్థ ఆత్మ. బ్రహ్మాండ పంచీకరణలో ఉన్నటువంటి జ్ఞాతని అక్కడున్న ఇరవయి నాలుగు తత్వాలుగా ఉన్న అధిష్ఠాన దేవతలనుండి వేరుపడ్డటువంటి 25వవాడు కూటస్థ బ్రహ్మ. ఈ కూటస్థం అనేది సాధనలో లభించింది. ఈ కూటస్థుడికి ఇది సహజం అవ్వాలి. ఎప్పుడయితే ఈ కూటస్థ స్థితి సహజం అయ్యి తిరిగి ఇతర తత్వాలతో సంబంధము పెట్టుకోకుండా ఉంటాడో వాడు పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మమైనటువంటి వాడు ఏ కారణము చేతను మాయావరణలోకి జారిపోకుండా ఉంటే అది తిరిగిరాని ముక్తి’. సాధన విషయంలో శిష్యుని విషయంలో అది తిరిగిరాని ముక్తి’. వస్తు నిర్ణయంలో అది ఎప్పుడూ ఉన్నది ఉన్నట్లుగా ఉన్నది. అది నీవయి వున్నావు. కనుక ఉన్నదున్నట్లుగా ఏదైతే ఉన్నదో అదే నీవై వున్నావు. కనుక అనేక రకాలుగా ఉన్నటువంటి నీవు జీవభావము, కూటస్థ ఆత్మ, కూటస్థ బ్రహ్మ, వీటన్నింటికి అతీతమైనటువంటి కూటస్థము అచలము ఒక్కటే. ఆ పదాన్ని క్రింద వాడటములేదు. కూటస్థ అనే వాడుతున్నాము. పైకి వెళ్ళేసరికి ఈ కూటస్థ అనే పదానికి అచలంఅని పేరు పెట్టాము. అచలం అంటే యేమిటి? ఎప్పటికీ చలించనిది. నిశ్చలం అంటే ఏమిటి? చలించబడుతున్న దాన్ని చలించకుండా ఆపితే నిశ్చలం. అచలం అంటే అది ఎప్పటికీ చలించనది ఏనాడు చలించలేదు. అందుకని దానికి అచలం అని పేరు. జీవుడెక్కడున్నాడు? చలిస్తున్నాడు. చలించకుండా నిశ్చలం చేసుకుంటే కూటస్థ ఆత్మ అయ్యాడు. అప్పుడు ఈశ్వరీయ జ్ఞానం వచ్చింది. మళ్ళీ బ్రహ్మాండ పంచీకరణలో చలిస్తున్నాడు. బ్రహ్మాండ పంచీకరణలో దానిలోని చలనాలు నిశ్చలం కాగానే అక్కడ మళ్ళీ కూటస్థుడయ్యాడు. కూటస్థ బ్రహ్మము అన్నారు. మాయాశబలిత బ్రహ్మము, ఎప్పటికీ ఎప్పటికీ కదలని బ్రహ్మము. ఈ రెండింటి మధ్యా విచారణ చేసుకున్నాడు. విచారణ చేసుకొని ఎప్పటికీ కదలనివాడిగా నిశ్చలమయ్యాడు. ఈ నిశ్చల బ్రహ్మమే అచల బ్రహ్మము. తిరిగి రాకపోతే అచలము. తిరిగి వస్తే కొంత కాలము నిశ్చల బ్రహ్మమే. కాని మళ్ళీ చంచల బ్రహ్మమౌతాడు. కనుక చంచల బ్రహ్మ జ్ఞానాన్ని ఎరుక బ్రహ్మ జ్ఞానాన్ని మాయాశబలిత బ్రహ్మ జ్ఞానాన్ని ఫైనల్‌ అనుకోకుండా అదే లక్ష్యం అనుకోకుండా, అదే గమ్యం అనకుండా మత పద్ధతిగా కాకుండా అచల సిద్ధాంత పద్ధతిగా పరిపూర్ణ బోధని తెలుసుకొని చలాచలములు లేకుండా అనగా కాసేపు అచలంగా ఉండి, కాసేపు చంచలం కాకుండా వ్యక్తం, అవ్యక్తం కాకుండా, బాధ్యా, అబాధ్యములు కాకుండా బేధా, అబేధములు లేకుండా ఉన్నది ఉన్నట్లు ఉన్నటువంటి ఒక శాశ్వత స్థితియే పరమపదము.

       శిష్యుడితో పోలిస్తే సహజస్థితి. శిష్యుడు లేకపోతే సహజం అనే మాట వాడక్కరలేదు. అదే మిగిలింది. అన్నీపోతే అదే మిగిలింది అదే శేషించింది. ఇది కాదు ఇది కాదు ఇది కాదు అంటూపోతే చివరికి అదే మిగిలింది. ఇది కాదు ఇది కాదు ఇది కాదు అనగానే రకరకాల ఎరుకలన్నీ పోయాయి. ఆఖరి ఎరుకకు ఇది కాదనగానే అసలు ఎరుకే లేకుండా పోయింది. ఏ రకమైనా ఎరుక లేదు. ఏ రకమైన ఎరుక ఉన్నాకూడా అది అచలం కాదు. ఎరుక అంతా పోయాక ఇది కాదు అన్నవాడే లేడు. ప్రశ్నే ఎగిరిపోయింది. అనుభవాలే ఎగిరిపోయాయి. అనుభూతులు పోయాయి. పరోక్షం పోయింది. అపరోక్షం కూడా పోయింది. వ్యక్తం పోయింది, అవ్యక్తం పోయింది. ఎమయ్యావు? బయలై తిరిగి ఎరుకలోకి రానటువంటి బయట్టబయలయ్యావు. నేతి నేతి వాక్యం యొక్క గమ్యం అది. అటువంటి జ్ఞానం కలిగించేది పరిపూర్ణ బోధ. పరిపూర్ణ బోధ ఎప్పుడూ కూడా అవ్యక్త బ్రహ్మ తిరిగి వ్యక్తం అయ్యేటువంటి ఆస్కారం లేకుండా ఎప్పటికీ వ్యక్తం కాకుండా ఉండే అచల బ్రహ్మమును నిర్ణయం చేస్తుంది.

       మనము ఎట్లు చూస్తామో అది అట్లే ఉండును. ఈ మాయ ఏం చేస్తోందంటే యద్భావం తద్భవతిమనం ఎట్లా చూస్తే అట్లాగే ఉంటుంది. వెంటనే ఉండదు కానీ చూసి జ్ఞాపకం పెట్టుకొన్న వాసన తిరిగి పక్వమై మళ్ళీ దర్శనం అయ్యేటప్పుడు యత్‌ వాసనా తత్‌ దర్శనంవాసన ప్రకారమే దర్శనం అయ్యింది. వాసన నువ్వు నిర్ణయించిన నీ భావాల్ని బట్టి ఉంటుంది. ఈ ప్రపంచం చాలా బావుంది అనే బంధం ఉందనే అభిప్రాయంతోనే ఉంటావు నువ్వు. ఈ ప్రపంచం పుచ్చిపోయింది, కుళ్ళిపోయింది, పనికిరానిదయ్యింది, దీన్ని ఎవరూ రక్షించలేరు, ఏ అవతార పురుషుడో వచ్చి మళ్ళీ సమూలంగా మార్చాలనే భావంతో ఉన్నావనుకో. అది వాసనై పునర్జన్మలో మళ్ళీ అదే భావంతో పుడతావు.

       మంచి చెడుల కలయికతోనే ఈ సృష్టి అంతా ఉంది. ధర్మ రాజైతే ఈ లోకాన్నంతా కూడా అంతా ధర్మంగానే నడుస్తున్నట్లుగా చూసివచ్చాడు. దుర్యోధనుడు అయితే లోకమంతా అధర్మంగా ఉంది. వీళ్ళకి కఠినమైనటువంటి చట్టాలు చేసి, శిక్షలు వేస్తే తప్ప ధర్మం జరగదు అని అనిపించింది. ఇద్దరు చూసిందీ ఒక లోకమే. మరి మనం ఎట్లు చూతుమో అది అట్లే ఉండును. దుర్యోధనుడు ఎట్లా చూచాడో అతనికి అలాగే వుంది. ధర్మరాజు ఎట్లా చూచాడో  అతనికి అలాగే ఉంది. జిల్లెళ్ళమూడి అమ్మ అంటుంది. అంతా మంచి చూచేవాడు మంచివాడయ్యే ఉంటాడు. అంతా చెడ్డ చూచూవాడు చెడ్డవాడయ్యే ఉంటాడు. ఎందుకంటే నీ స్వభావంలో ఏముంటే దాన్ని పరిశీలించి చూస్తావు. నువ్వు చూసిన దాన్నిబట్టి చెప్పవచ్చు. నీ స్వభావం ఏమిటో అంతా మంచినే చూస్తున్నప్పుడు నీ స్వభావం కూడా మంచి అని చెప్తాం. అంతా దైవాన్ని చూడగలిగినవాడు వాడే దైవం అని కూడా చెప్తుంది అమ్మ. నువ్వు చూసే దృష్టినిబట్టే ఈ కనబడే దృశ్యము. ఎవరు ఎట్లా చూస్తే అట్లా వాళ్ళకి మాత్రమే అలా వున్నది. అలా చూచిన వాళ్ళకేమో కొందరికి బావుంది. అలా చూచిన వాళ్ళకి కొందరికేమో బాగాలేదు. ఒకే వస్తువు కొందరికి బావుంది, కొందరికి బాగాలేదు చూసే దృష్టినిబట్టి.

       ఒక ఆవుని చూచి ఆవు జ్ఞానం ఉంది కనుక ఇది ఆవు అని ఊరుకున్నాడొకడు. ఇంకొకడు పాల వ్యాపారం చేసేవాడు. ఆవు అనగానే ఈ ఆవు జ్ఞానంతోపాటు కాస్త విమర్శ మొదలైంది. ఇది ఎన్ని పాలిస్తుంది? దీనివలన మనకెంత లాభం? ఎంత ప్రయోజనం? అని. ఇంకొక హిందువు ఆవును చూచాడు. తోకవైపు తిరిగి దండంబెట్టి వెళ్ళిపోతున్నాడు. ఇది ఆవు అని ఊరుకోలేదు. పవిత్ర భావన కలిగి నోట్లో అరటిపండు పెట్టాడు. తోకకి పసుపు, కుంకుమ పెట్టాడు. దండం బెట్టాడు, పోయాడు. ఇంకో గొడ్డు మాంసం అమ్ముకునేవాడు ఏం చేశాడు? ఈ ఆవు బలిష్టంగా ఉంది దీన్ని ఎట్లయినా కాజేయ్యాలి, లేకపోతే చచ్చిపోతే కొనుక్కోవాలి, తక్కువ రేటుకి. మాంసం అమ్మితే ఎంత వస్తుంది? అని చూచాడు. ఒక చర్మకారుడు చెప్పులు కుట్టుకోవడానికి ఆవు చర్మం పనికివస్తుందా? అని చూచాడు.

       అలాగే ఒక స్త్రీని ఒక పురుషుడు చూసినప్పుడు కొందరికి చెల్లెలు అనే భావన కలిగింద. కొందరికి తల్లి అనే భావన కలిగింది. కొందరికి భార్య అనే భావన కలిగింది. కొందరికి పరస్త్రీ అనే భావన కలిగింది. కొందరు ఉదాసీనంగా ఉన్నారు. కాని స్త్రీని చూచినటువంటి జ్ఞానం మాత్రం వుంది.

       మనము ఎట్లా చూస్తామో అది అలాగే ఉంటుంది. ఈ చూడటంలో నీవాసన అంతా పనిచేస్తుంది. పూర్వ జ్ఞాపకాలు, పూర్వ అనుభవాలు దానిమీద వున్న నీ ఇష్టాయిష్టాలు, లాభనష్టాలు, రాగద్వేషాలు అన్నీకూడా వాటితో కూడి కలగా పులగంగా అయినటువంటి చూపు అనే దృశ్యము నీలోనే వుంది. అప్పుడేమయ్యింది? యదార్థ వస్తువుని నీ అభిప్రాయం ప్రకారంగా నీ ఇంప్రెషన్‌బట్టి చూస్తున్నావు. ఇంప్రెషన్‌బట్టి, గుడ్‌ ఇంప్రెషన్‌ అయ్యింది. లేక బ్యాడ్‌ ఇంప్రెషన్‌ అయ్యింది. అంటే సత్యాన్ని చూడకుండా, నిష్పక్షపాతంగా చూడకుండా, చెడ్డదాన్ని గుడ్‌ ఇంప్రెషన్‌తో చూడటం, మంచిదాన్ని బ్యాడ్‌ ఇంప్రెషన్‌తో చూడటం కూడా జరుగుతుంది. అంటే సత్యము ఎప్పుడూ మన అభిప్రాయాన్నిబట్టి మారుతూ ఉంటుంది. పూర్వం ఉన్న అనుభవాన్నిబట్టి చూస్తున్నాము. ఒకడు చెడ్డవాడు. ఈవేళ మారాడేమో! ఎప్పుడూ అట్లాగే వుంటాడా? కానీ అదే దృష్టితో చూస్తున్నాము. మనం ఎట్లు చూతుమో అట్లే ఉంటుంది అది.

       మళ్ళీ మనం బ్రహ్మ దగ్గరకి వెళ్తే, మాయ లేనిది ఉన్నట్లు చూపిస్తుంది అనుకుంటే నిజానికి దృశ్యమే లేదు. దానివల్ల ద్రష్టత్వం గాని దృగత్వం గాని లేదు. దృశ్యము, దర్శనము, దృగత్వము అనేటువంటి త్రిపుటేమీ లేదు. త్రిపుటికి అతీతమైన వస్తువు వున్నది. సాధకుడైనవాడు ఇప్పుడు దృశ్యాన్నిబట్టి దృక్‌ అయినాడు. దృశ్య రహితమైనటువంటి దృక్‌ స్థితికి వెళ్ళి దృగత్వాన్ని కూడా లేకుండా చేసుకున్నప్పుడు వాడే పరబ్రహ్మ. దృగత్వం కూడా పోతే ఏమీ మిగల్లేదు. దృశ్యం లేదు అనగానే ద్వాదశి వచ్చి ఉత్త బట్టబయలు ఏమీలేదు అంటుంది. దృగత్వం గురించి వచ్చేసరికి, మూలంలేని గుర్తు ఎరిగే దృక్‌ లేడంటుంది. నామరూప జగత్తుకీ జీవ ఈశ్వర తనువులకీ సంబంధించి, ఉత్త బట్టబయలు ఏమీలేదు అంది. ప్రత్యగాత్మ పరమాత్మ మిగిలాడు మూడు శరీరాలు ధరించినటువంటి ప్రత్యగాత్మ మూడు శరీరాలు ధరించినటువంటి పరమాత్మ మిగిలారు. ఈ పరమాత్మ కూడా దృశ్యంలేని దృక్‌ అయ్యాడు. తన మూడు శరీరాలకి విరాట్‌ హిరణ్యగర్భ అవ్యాకృత శరీరాలకి సాక్షీ విలక్షణమై దృశ్య రహితమై దృశ్యాన్ని ఉత్త బట్టబయలుగా ద్వాదశీ మంత్రంచేత తాను దృగ్‌మాత్ర స్వరూపంగా ఉన్నాడు.

       ఇప్పుడు వాడికేం చెబుతున్నాడు? దృక్‌ స్థితి కూడా లేదమ్మా, దృక్‌ అనేవాడు లేనేలేడు అని చెప్పేశాం. అంటే కేవల  దృక్కులో దృక్‌ స్థితిని కూడా ఎగరకొట్టేశాము దృక్‌ స్థితిలో ఉన్న కేవల ఎరుకని ఎగరకొట్టాము. దృశ్యమందు ఎరుకలేదు. దృక్‌నందు ఎరుక లేదు. ద్విపుటిలో లేదు. త్రిపుటిలో లేదు. ద్విపుటి త్రిపుటి రెండుగాని, మూడుగాని, ఎరుకలే. ద్విపుటి రహితము త్రిపుటి రహితము అయినప్పుడు ఎరుకే లేదు. అప్పుడు శేషించి ఏమి మిగిలింది? అంటే ఉత్త బట్టబయలు ఏమీ లేనిది మిగిలింది. మూలం లేని గుర్తు ఎరిగే శరీరం ఏమీలేదు అన్నవాడు కూడా ఉత్త బట్టబయలై పోయాడు. షోడశీ భావంతో వాడికి కూడా ద్వాదశీ, సిద్ధించింది. దృశ్యం పోవడానికి ద్వాదశీ మంత్రాన్ని వాడాము. దృక్‌ స్థితి పోగొట్టేటప్పుడు షోడశీ మంత్రాన్ని వాడాడు. ద్వాదశీ మంత్రంతోటి ఏమయ్యింది? అంతా ఉత్తబట్టబయలైపోయింది. మొదట్లో దృశ్యం వరకే  ఉత్తబట్టయలయ్యింది. తరువాత మూలం లేని గుర్తు ఎరిగే శరీరం లేదు అనేటువంటి షోడశీ మంత్రాన్ని పట్టుకొనేటప్పటికి ఆ దృక్‌ కూడా ఉత్తబట్టబయలై ఏమీలేదు అయ్యింది. మళ్ళీ ద్వాదశియే సిద్ధించింది. అందుకే మనం ముందు దృశ్యాన్ని కట్‌ చేసుకున్నాం. మనం అందరం కూడా ఒక దృశ్యాన్నిబట్టి దాన్ని ఆధారగా చేసుకొన్న దృక్‌గా ఉన్నాము. తరువాత దృక్‌గా కేవల దృక్‌గా అయినా ఉంటామో లేదో తెలియదు.

       భార్యని బట్టి భర్తగా ఉన్నాము. పిల్లల్ని బట్టి తల్లిగా, తండ్రిగా ఉన్నాము. బంధువుల్ని బట్టి ఉన్నాము, ధనాన్ని బట్టి ఉన్నాము, ఇల్లుబట్టి ఉన్నాము, ఆస్తిని బట్టి ఉన్నాము. సంపదని బట్టి ఉన్నాము. ఏదో ఒకదాన్ని పట్టుకొని దానిమీద ఆధారపడి వున్నాము. శరీరాలబట్టి ఉన్నాము. అది లేకపోతే ఉండలేము అని ఉన్నాము. వాటివల్ల అయినటువంటి ఉనికి అన్నీ కూడా మాయాకల్పిత ప్రపంచంలో ఉన్నటువంటి వస్తువులమీదే తప్ప, ఉపాధుల మీదే తప్ప, మూడు గుణాలమీదే తప్ప, స్వభావాలమీదే తప్ప, కేవల బ్రహ్మనిష్ఠుడైనటువంటి పరబ్రహ్మమీద ఇవి అన్నీ లేవు. ఇవి అన్నీ పోవాల్సిందే! అందువల్ల దృక్‌స్థితి పోవడం తరువాత సంగతి గాని, దృక్‌గా ఉన్నటువంటివాడు దృశ్యాన్ని రహితం చేసుకొని దృశ్యానికున్నటువంటి సంబంధాన్ని కట్‌ చేయాలి. అలా కట్‌ చేసుకున్న తరువాత దృక్‌ అనుభవం ప్రత్యేకంగా ఎలా ఉంటుంది అనేది అనిర్వచనీయము.

       మాయావరణలో మొదటి వ్యాపకమైతే మాయకి బ్రహ్మకి సాంగత్యమే లేదు. నీవే బ్రహ్మమయితే కనుక ఏమి చెయ్యాలి? మాయా కల్పిత దేశ కాల కలనా వైచిత్య్ర చిత్రీకృతమ్‌ అయినటువంటి వాటిని అన్నింటికి కూడా జీవుడు దగ్గరవున్నటువంటి సంసారంలో బంధము అనేటువంటి పేరుతో ఎన్ని అయితే ఉన్నాయో వాటినన్నింటిని కూడా కల్పితమని, తాను బ్రహ్మ అయినందుకు తనకు, మాయకు సంబంధం లేదు కనుక ఈ సంసారాన్ని, సంసార వస్తువుల్ని, సంసార రూపాన్ని, సంసారముతో ఉన్నటువంటి బంధాన్ని తెగనరికివేస్తే ఆ సంబంధాలన్నింటినీ కట్‌చేసి కేవల దృక్‌ స్థితిలో, కూటస్థ స్థితిలో ఉండేటువంటి సాధన చెయ్యాలి మనం. ఆ సాధన యొక్క పరాకాష్ఠలో నీవే ఆ పరబ్రహ్మ.

       పరబ్రహ్మ యొక్క నిర్ణయము అది ఉత్తబట్టబయలు ఏమీలేదు. పై బోధకెళ్ళి తిరిగి సాధన దగ్గరకొచ్చాము. దృశ్యము బాధిస్తున్నంతవరకు స్వతంత్రము లేదు. యత్‌ భావం తత్‌ భవతిగా కనబడుతున్నది. భావించకపోతే లేదు కనుక దృశ్య సంబంధమంతా నిజ అస్తిత్వం కాదు. తాత్కాలిక ఊహల్లో డ్యూయెట్‌ పాడుకున్నారు. నిజంగా వాళ్ళు కలిసారో లేదో ఆ కథ తరువాత చెప్తోంది. ప్రస్తుతము ఊహలన్నీ నిజం కావచ్చు, కాకపోవచ్చు. కలలన్నీ నిజం కావచ్చు. కాకపోవచ్చు. కొన్ని ఊహలు నిజం కావచ్చు కానీ, ఊహిస్తూ ఉన్నటువంటి కాలంలో అది లేదుగా, కల కంటున్నంత కాలంలో అది కలేగా. నిజమైనప్పటిమాట! ఇక్కడ సర్వమూ కలలో తోచినవి ఎలాగో అలాగే!

       మేలుకొన్నవాడికి కలలో తోచినవి ఎలా అబద్దమో దీన్ని అలా లేనివిగా చూడు. తాత్కాలికముగా ఉన్నవే అయినా అవి బాధిస్తున్నాయిగా? అందువలన లేనిదిగా చూడటం అంటే ఏమిటీ? ఒక తాగుబోతు వచ్చాడు, తిట్టాడు వాడు. ఏమీ తెలియక ఒళ్ళు మరచి తిడుతున్నాడు. మనము ఏమీ పట్టించుకోము. మంచి స్పృహలో ఉండి తిడుతున్నాడు అప్పుడేమయ్యిందీ? మనకి కోపం వచ్చింది. లేనిదే ఉన్నట్లు తోచిన విషయంలో మనం పట్టిచ్చుకోము. ఆ ఉండుట నిజం అనుకొన్నవాడు మాత్రం పట్టించుకొంటాడు. పట్టించుకోవడమే బంధము. పట్టించుకోకపోడమే మోక్షము. ఏ స్థాయిలోనైనాసరే మీరు పట్టిచుకుంటే బంధము. పట్టించుకోకుంటే మోక్షము. అయితే పట్టించుకోకుండా పనులు అవుతాయా? ఇది లేనిదికదా అని పట్టించుకోండి. కర్తవ్యాన్ని బాధ్యతనూ నిర్వర్తించండి. అక్కడున్న సంబంధాన్ని మీకు ఇతరులకు రాగద్వేష యుక్తంగా గాని, యిష్టాయిష్టముల భావంతోగాని, కర్తృత్వ, భోక్తృత్వములతోగాని, దాని గుర్తులు మీలో అట్టిపెట్టుకోకండి. ఇది యిష్టము, అది అయిష్టము అని గుర్తు వద్దు. దీనియందు రాగము, దీనియందు ద్వేషము అని గుర్తు వద్దు. ఇది లాభము, ఇది నష్టము అనే దాంట్లో పొంగుట, కృంగుట అనేదాంట్లో ప్రతిస్పందన లేకుండా ఉండు. మిథ్యా అన్నప్పుడు అదీ సంగతి. లేని డబ్బు లేకుండా పోతుంది. లేని మనుష్యులు లేకుండా పోతున్నారు. లేని జీవుడు లేకుండా పోతున్నాడు. లేని ప్రాణం లేకుండా పోతోంది. లేని శరీరాలు లేకుండా పోతున్నాయి. లేనివాళ్ళే ఉన్నట్లు కనబడి వ్యవహారాలు జరుగుతున్నాయి. ఈ విధముగా సదా నిర్ణయముతో ఉండాలి.

       ఈ వ్యవహారం నిజం అనుకున్నవాళ్ళకే రాగద్వేషాలు మొదలైన ద్వంద్వాలు. ఇది లేదనుకున్నప్పుడు ద్వంద్వాలతో నీకేం పని? లేనివాడు ప్రేమిస్తుంటే రాగం ఎందుకు? లేనివాడు తిడుతుంటే ద్వేషం ఎందుకు? నిజంగా ఉన్నవాడు తిడితే రాగం ఉండాలి. నిజంగా ఉన్నవాడు పొగడితే పొంగాలి. నిజంగా ఉన్నవాడు సహాయం చేస్తే కృతజ్ఞత ఉండాలి. లేనివాడు చేసే దానిలో కృతజ్ఞత ఏముంది? అయినా వాళ్ళు అనుకొని చేస్తున్నారా ఏమిటి? నీ ప్రారబ్దం ఎట్లా వుందో అట్లాగే జరుగుతున్నాయి. నువ్వు అనుకొన్నవి ఎట్లా ఉన్నాయో, అట్లాగే నువ్వు చేసిన కర్మ ఎట్లా ఉందో, ఆ ఫలితం కూడా అట్లాగే, ఆ కర్మ ఫలితాన్నిబట్టి నీకు సహాయం చేసేవాళ్ళు వస్తారు. ఫలితాన్ని బట్టి నీకు అపకారం చేసేవాళ్ళు వస్తారు. నీ కర్మ ఫలితంగా వచ్చారు గాని, అక్కడ కర్మ ఫలితంలో ఉపకారం ఉంటే వచ్చారు గాని, కర్మ ఫలితంలో అది లేకపోతే ఉపకారం చేసేవాళ్ళు కూడా వెనక్కి వెళ్ళిపోతారు. కర్మ ఫలితంలో నష్టబడేది ఉంది కాబట్టి అపకారం జరిగింది. కర్మ ఫలితములో లేకపోతే ఎవరైనా, ఎప్పుడైనా, ఎందుకైనా, అపకారముగాని, ఉపకారముగాని చెయ్యరు కదా! నిమిత్త కారణాన్ని పట్టుకోవద్దు. కర్మ ఫలితాన్ని ఆ రకంగా చూచినప్పుడు నిమిత్త కారణాన్ని ఎలా చూడాలి. ఇది మిథ్య కదా, లేదు కదా అని చూడటమే. దీనివల్ల కొంత బాధ ఉన్నప్పటికీ ఓర్పుతో, సహనముతో, ఆత్మ భావనతో, కర్మ నిర్ణయ పద్ధతిమీద ఏ దోషం పెట్టకుండా, రాగద్వేషాలు లేకుండా, పొంగకుండ, క్రుంగకుండ ఉండాలి. పట్టించుకోకుండా ఉండడమంటే ఇందులో ఏది వచ్చినా పట్టించుకోనట్లే లెక్క. పట్టనట్టు ఉంటే విడుదల, పట్టినట్లు ఉంటే బంధము.

       జగత్‌కి జీవుడికి కూడా బ్రహ్మమే అధిష్ఠానము. ఈ మాయావరణలో బ్రహ్మయొక్క ప్రకాశమే అధిష్ఠానము. ఆ అధిష్ఠాన ప్రకాశమే మాయలో ప్రతిబింబమైన ఈశ్వరుడు. ఆ అధిష్ఠాన ప్రకాశమే అవిద్యయందు ప్రతిఫలించిన జీవుడు. జీవుడు, ఈశ్వరుడూ కూడా ప్రతిబింబ అస్తిత్వంగా ఉన్నారు. అధిష్ఠాన ప్రకాశం లేకపోతే జీవుడు లేడు, ఈశ్వరుడు లేడు. జీవుడు శాశ్వతమా? అధిష్ఠాన ప్రకాశముండి అవిద్య అనే అద్దం ఉంటే అదిష్ఠాన ప్రకాశము ప్లస్‌ అవిద్య అనే అద్దము ప్లస్‌ అద్దంలో ప్రతిబింబ ప్రకాశము. ఈ మూడూ కలిపి జీవుడు. అవిద్య అధిష్ఠాన ప్రకాశము లేకుండా ప్రతిబింబమైన జీవుడు ఎలా ఉంటాండీ? బ్రహ్మ ప్రకాశము లేకపోతే జీవుడు ఉంటాడా? జీవుడియొక్క సత్తా ప్రతిబింబ ప్రకాశముగా ఉన్నప్పటికీ, బింబ ప్రకాశము వల్లనే వచ్చింది. అధిష్ఠాన ప్రకాశము, అధిష్ఠాన చేతనము లేకపోతే నేనుగా జీవుడిగా జీవ వ్యాపారము చేసేటటువంటి సత్తా, జీవుడికి ఎక్కడిది? అయితే బింబ ప్రతిబింబ ప్రకాశములు ఒక తీరుగా ఉండాలిగా, ఎందులేవు? అంతఃకరణ దోషముచేత లేవు. అంతఃకరణము అనే అద్దములోని దోషాలు నివారిస్తే, తుడిచేస్తే, చెరిపేస్తే, అధిష్ఠాన ప్రకాశము, ప్రతిబింబ ప్రకాశము రెండూ ఒక్కటిగానే ఉంటాయి. ఇది సారూప్యము.

       వాచ్యార్థము అవిద్యా కల్పితము, వాచ్యార్థము మిథ్యా. కనుక వాచ్యార్థమును విడిచిపెట్టేయి. లక్ష్యార్ధములో ప్రకాశ అనుభవము ఏదైతే ఉన్నదో అది ఆత్మానుభవమే. యదార్థ నేను యొక్క అనుభవము అంతఃకరణ శుద్ధియైనప్పుడు ఉన్నటువంటి నేనుకొచ్చే అనుభవము అధిష్ఠాన బ్రహ్మప్రకాశ అనుభవము రెండూ ఒక్కటే. ఇది సారూప్యముక్తి. అది ఇదీ ఒక్కటే అన్నప్పుడు సారూప్యముక్తి. ఒకటే అంటే ఎట్లా ఉన్నాయీ? ప్రకాశం అనే లక్షణంలోను (లక్షణవాక్యం చేత, లక్షణం ఏమిటీ సత్‌ చిత్‌ ఆనందంఅనేటటువంటిది) రెండూ ఒక మాదిరిగానే ఉన్నది. లక్షణంచేత ఒక్కటి అన్నాడు గానీ, స్వానుభవంచేత ఒకటి అయ్యిందా? అవిద్యను దాటాడుగా! కాని ఇంకా మాయ ఉంది. మాయని దాటాలి. అప్పుడు అధిష్టాన ప్రకాశము మాయ అనే అద్దముపై ప్రతిఫలించినవాడే ఈశ్వరుడు. ప్రతిఫలించినవాడు ఈశ్వరుడు కాడు. ప్రతిఫలించిన ప్రకాశము, అధిష్టాన ప్రకాశము, మాయ ఈ మూడు కూడి ఈశ్వరుడు. మూడూ కూడే ఈశ్వరుడు. కేవల ప్రతిబింబ ప్రకాశంగా ఈశ్వరుడు లేడు. అధిష్ఠాన ప్రకాశం సున్నా అయితే ప్రతిబింబమెక్కడిదీ? ఈశ్వరుడెక్కడా? మాయ లేకపోతే ఈశ్వరుడున్నాడా? అద్దం లేకపోతే అధిష్టాన ప్రకాశం వుంది గాని, ప్రతిబింబము లేదుగా! అప్పుడు ఈశ్వరుడు లేడుగా! ఇది అంతా ఎందుకు చెబుతున్నామంటే, ప్రతిబింబ ప్రకాశముచేత అస్తిత్వము కలిగిన జీవుడు అవిద్యా కల్పితుడు. అలాగే ప్రతిబింబ అస్తిత్వంచేత కలిగిన ఈశ్వరుడు మాయా కల్పితుడు.

       ప్రతిబింబము ఒకసారి ఉంటుంది, ఒకసారి ఉండదు. ఒక పరిస్థితిలో ఉంటుంది, ఒక పరిస్థితిలో ఉండదు. కనుక ఆ ఉండుట అనేది అసత్‌’. తాత్కాలిక సత్యము. జీవుడు, ఈశ్వరుడు ఇద్దరూ తాత్కాలిక సత్యమే. అధిష్టానమైనటువంటి బ్రహ్మ ప్రకాశమే పరమసత్యము. బ్రహ్మ సత్యం, జగత్‌ మిథ్యా అంటే అధిష్ఠాన బ్రహ్మ ప్రకాశములో మాయావరణలో ప్రతిఫలించిన ప్రకాశముగా తయారైనాడు. కొన్ని పరిస్థితులలో కొంత సహాయకారి కారణాలు ఉంటేనే వాళ్ళు అట్లా అయ్యారు. ఆ సహాయం కారణం ఉన్నంతవరకు కొంతవరకు మనం శుద్ధం చేసుకుంటే దాంతో ఆ సహాయ కారణము నశించగా అధిష్ఠాన ప్రకాశముతో సమానమైనటువంటి అనుభవాన్ని పొందుతున్నాడు. సహాయకారి కారణాలు లేనప్పుడు, ప్రతిబింబము లేనప్పుడు, జీవుడు లేడు, ఈశ్వరుడు లేడు. అందుకే మూలం లేని గుర్తు ఎరిగే జీవుడు లేడు. మూలం లేని గుర్తు ఎరిగే ఈశ్వరుడు లేడు. మూలం లేని గుర్తు ఎరిగే జీవుడు లేడు. మూలం లేని జీవుడు ఉత్త బట్టబయలు. మూలం లేని గుర్తు ఎరిగే ఈశ్వరుడు ఉత్త బట్టయలు, అప్పుడేమయిందీ! జీవుడు ఈశ్వరుడవ్వలేదు. జీవుడు లేకుండా పోయాడు. తరువాత ఈశ్వరుడు కూడా లేకుండా పోయాడు. అంటే అవిద్యా మర్మము తెలిగానే జీవుడు లేడు. మాయా మర్మమూ తెలిసాక ఈశ్వరుడు లేడు. తాత్కాలికముగా కొన్ని పరిస్థితులలో జీవేశ్వరులున్నారు. అవిద్యా దోషం మాయా దోషం రెండూ విడుదలైతే మనం ఆ బ్రహ్మతో సమానమయ్యాము.

       జీవుడిగా ప్రతిబింబము ప్రతిఫలించిన ప్రకాశముగా వాడు వచ్చాడు. కొన్ని పరిస్థితులలో వాడు ఉన్నాడు. కొన్ని పరిస్థితులలో బంధం ఉంది, కొన్ని పరిస్థితులలో మోక్షం ఉంది, పరిస్థితులు మారితే బంధం లేదు, మోక్షం లేదు. జీవుడు లేడు. అలాగే ఈశ్వరుడు కూడా కొన్ని పరిస్థితులలో మాయ అనే అద్దం మీద ప్రతిబింబ ప్రకాశముతో కూడి ఉన్నాడు. మాయ అనే అద్దం యొక్క దోషంతో ఈశ్వర వ్యవహారం ఉంది. ఈశ్వర వ్యవహారం ప్రతిబింబ చైతన్యముతో ఉంది. ప్రతిబింబ చైతన్యము, బింబ చైతన్యము కన్నా వేరు కాదు. బింబ చైతన్యము కూడా అంతర్యామిగా ఉంది. ఈశ్వరుడి యొక్క అంతర్యామిగా ఉన్నది. మాయ అనే అద్దం యొక్క దోషం పోతే ప్రతిబింబ చైతన్యము, బింబ చైతన్యము సమానమైనది. జీవుని యొక్క ప్రతిబింబ ప్రకాశములో అంతఃకరణ శుద్ధి అయితే అలాగే ఈశ్వరునియొక్క ప్రతిబింబ ప్రకాశములో మాయ మర్మం వీడితే పరమాత్మయే  నిజ అస్తిత్వముగా ఉండిపోయాడు. కాని స్వరూప జ్ఞానంలో పరమాత్మయే లేనివాడు. ఆ పరమాత్మ లేకుండా పోయాడు. లేనివాడు లేకుండా పోయాడు. అట్లా తీసుకోవాలి అదే మోక్షం. మోక్షం అంటే ఇక్కడ భ్రాంతిలోనే బంధం ఉంది. అందుకనే భ్రాంతిలోనే మోక్షం ఉంది. బంధ మోక్షాలు రెండూ భ్రాంతిలోనే ఉన్నాయి కాబట్టి నిజానికి బంధ మోక్షాలు లేవు.

       నిరపేక్ష పద్ధతిలో ఏమి కావాలి? అధిష్ఠాన ప్రకాశాన్ని పట్టుకొని అంతఃకరణాన్ని శుద్ధం చేసుకొని మాయ మర్మాన్ని తెలుసుకుని, ప్రతిబింబ ప్రకాశం యొక్క అస్తిత్వం నిజ అస్తిత్వం కాదని అవి అవిద్యా మరియు మాయాకల్పితములనేటుటవంటి అస్తిత్వాలని ఆ దోషాలను పోగొట్టుకుంటూ చివరకు వారు లేనివాళ్ళని ఈ ఉపాధి పడిపోయేదాకా ఉపాధి ఉన్నట్లుగా ఉన్నప్పటికీ కూడా, నిజానికి లేని వాళ్ళేనని, లేని వాళ్ళనే నిర్ణయంతోటి, మూలం లేని గుర్తు ఎరిగే శరీరాలు ఏమీ లేవనీ, ఈ యొక్క వ్యవహారంలో, దృశ్యరూపంలో ఏదైయితే ఉందో అది అంతా ఉత్త బట్టబయలు ఏమీ లేదని, తన ఉపాధిగా ఉన్న నామ రూపాత్మకంగా ఉన్నటువంటి పంచ భూతాత్మకంగా ఉన్నటువంటివికూడా ఉత్త బట్టబయలు ఏమీ లేవనీ, దర్శనం లేని దృక్‌ మిగిలాడనీ, అట్టి దృక్‌ కూడా ఏమీ లేడనీ దృక్‌ అనే ఎరుక, దర్శనము అనే ఎరుక, రెండూ లేకపోతే ఇక ఏ ఎరుకా లేనటువంటి స్థితిలో తాను అదై వున్నాడని అది ఎరుక లేని స్థితి, ఎరుక లేకపోతే ఎరుక పుట్టకపోతే ఎరుకతో అందుకొనబడే బయలుకాక, ఏ బయలైతే ఉన్నదో, దానిలో ఎరుక నిలిచేందుకు స్థానం లేదు. ముల్లు గ్రుచ్చ సందులేక బయలే అంతటా నిండి నిమిడీకృతమై ఉన్నదీ అనే నిర్ణయంతో చూసుకోవాలి.

       మరి ఆ నిర్ణయానికి సపోర్టు కావాలి. మరి గురువేమిటి? శిష్యుడేంటి? ఈ బోధ ఏమిటీ? ఈ సాధన ఏమిటీ? ఈ దాటటమేమిటీ? ప్రతిబింబాలమింటీ? ఏమిటి బాబూ! ఎప్పుడూ అదే కదా ఉంది అంటే సరిపోలేదా? అవునయ్యా ఎప్పుడూ అదే ఉంది! ఇవి అన్నీ లేకనే ఉన్నట్లు తోచినవి కనుక ఇవి అన్నీ లేనివేగా! ఇదంతా లేని ఎరుక. లేని ఎరుక అయితే ఇంత బాధించిందేమిటండీ? ఇన్ని లక్షల జన్మలెత్తాలా? నాకు స్వస్వరూప సాక్షాత్కారానికి ఇన్ని లక్షల జన్మలెత్తాలా? అబ్బే ఇన్ని లక్షల జన్మలున్నాయని గాని, ఇది మిథ్యా అంటే నేను నమ్మలేకపోతున్నాను. ఏదో తాత్కాలిక ముక్తి. ఇది కాదు అనంగానే పోతుంది. తాడుమీద పాము కనబడింది. కాసేపు విచారించాము. లైటు తీసుకొచ్చి చూసాం. పాము కనబడలేదు తాడే ఉన్నది. నేను తొందరగానే నమ్మాను పాము లేదని, కాని ఈ తాడే పాములా కనబడింది అని. ఇన్ని లక్షల జన్మలు బాధిస్తుంటే దీన్ని ఎలా నమ్మను? అంటున్నాడు. బోధ అంతా వంటబట్టింది కాని నమ్మకం కలగటంలేదు. అప్పుడు మూడో మంత్రం చెప్పాము. కలలో తోచిన కూటస్థుడు కలలో తోచిన జీవుడూ, కలలో తోచిన బ్రాహ్మణుడు, కలలో తోచిన సచ్చిదాత్మ కలలో తోచిన విరాట్‌ పురుషుడు, కలలో తోచిన హిరణ్యగర్భుడు, కలలో తోచిన సూత్రాత్మా, కలలో తోచిన అవ్యాకృతుడు, కలలో తోచిన క్షేత్రమూ, కలలో తోచిన క్షేత్రజ్ఞుడూ, ఇవి అన్నీ కూడా కలలో తోచిన శరీరాలేలాగో అలాగే. కనుక పంచదశీ మంత్రమే సపోర్టు.

       కనుక జగత్తుకి జీవునకు బ్రహ్మమే అధిష్టానము. జగత్‌ కూడా బ్రహ్మ యొక్క ప్రకాశంచేత గోచరమౌతుంది. జీవుడు కూడా బ్రహ్మయొక్క ప్రకాశం తోటే చిదాభాసగా, అహం స్పురణగా తోచాడు. ప్రతిబింబ ఛాయ అస్తిత్వమే గాని, నిజ అస్తిత్వం కాదు. అధిష్ఠాన బ్రహ్మమే ఉన్నాడు. బ్రహ్మము నిర్వికల్పము అనే అర్థంతో నిర్వికారము, కూటస్థము. అట్టి బ్రహ్మ మార్పు చెందుటకు ఏ కారణము లేదు. పోనీ మాయ ఏమైనా మారుస్తుందా? మాయ కూడా ఆ బ్రహ్మను ఏమీ మార్పు చెందించడము లేదు. మరి మార్పు లెక్కడ కనబడుతున్నాయి? నిజానికి మార్పులు లేవు. ఆ మార్పులున్నట్లు భ్రాంతి. ఆ భ్రాంతికి మూలము మాయ. అంతే! పాము అనే భ్రాంతి ఉన్నంతకాలము దాని మూల కారణం మాయ. భ్రాంతి రహితమైతే మూల కారణం కూడా లేదు. మాయ కూడా లేదు. లేని మాయే. అప్పుడు తాడే సాక్షాత్కారమయ్యింది. తాడే అన్ని కాలాల్లో ఉంది. కాబట్టి బ్రహ్మము మార్పు చెందనివాడే! మాయా కల్పితమైనవన్నీ కూడా మాయ కారణంగా మార్పు చెందుతున్నట్లుగా కనబడుతున్నాయి. మారేది ఒకటి, మారనిది ఒకటి అని రెండు లేవు. మారందే ఎప్పుడూ ఉంది. మార్పు చెందినట్లు కనబడటం భ్రాంతి.

       అసలు మాయ సంగతి ఎత్తేయండి. మీరు భ్రాంతిలో ఉన్నట్లుగాగుర్తించి, భ్రాంతి వదలి ఊరక ఉండండి. ఇంతే సంగతులు! మాయ అని, అవిద్య అనిఅర్థం కానివన్నీ చెప్పి అదేదో సాధన కోసం క్రింది బోధగా చెప్పాము. ఇప్పుడు మీరు ఏమి చెయ్యాలి ఇక్కడ? మీరు భ్రాంతిలో ఉన్నారు, ఈశ్వరుడుగా ఉన్నా భ్రాంతే. జగత్‌ ఉన్నదనుకొన్నా భ్రాంతే. అష్ట తనువులు ఉన్నవి అనుకున్నా భ్రాంతే. ఈ ఉపాధి సత్యం అనుకురటే భ్రాంతే. సచ్చిదానందము కూడా భ్రాంతే. భ్రాంతి రహితమయితే ఏదీ లేదు. ఎరుకంతా లేని ఎరుకే. భ్రాంతి రహితమైతే ఉన్నది బయలే. బయలే అన్ని కాలాల్లో ఉంది. బయలే శాశ్వతమై ఉన్నది. నీవు కూడా బయలే. నువ్వు అంటూ వేరే లేవు. బయలు అనేటువంటిది శాశ్వతంగా ఉన్నది. బయలు నేను నేను అనలేదు. బయలు ఈశ్వరుడవ్వలేదు, బయలు జీవుడవ్వలేదు, బయలందు ఎట్టి ఎరుక లేదు. బయలులోకి ఎరుక పుట్టలేదు. ఎరుక మళ్ళీ తిరిగి బయలులోకి లయంకాదు. అట్టి బయలే నీవయి వున్నావు. నేను నేను అనకుండా నీవయి వున్నావు. వ్యక్తం కాకుండా నీవయి ఉన్నావు. ప్రాశస్త్యం కాకుండా నీవయి వున్నావు. వస్తు నిర్ణయంగా నీవయి వున్నావు. ఆ వస్తు నిర్ణయం అనేటుటవంటి అనుభూతి కూడా నీకు లేదు. అనుభూతి వస్తే మాయలోనే రావాలి. మాయని దాటినవాడికి అనుభూతి లేదు. ఏదొచ్చినా మాయలోనే ప్రకటించబడాలి. ప్రకటించబడ్డవన్నీ పోతే మాయని దాటినట్లే. నీవు నీవుగానే ఉన్నావు. కాని నీవు నీవుగా ఉన్నటువంటి ఎరుక నీకు లేదు. బయలందు ఎరుక ఉండదు కాబట్టి నీవు నీవనే ఎరుక నీకు ఉండకూడదు. నీవు నీవైనటువంటిది బయలే అయి వున్నది. స్వస్వరూప సాక్షాత్కారం బయలే. స్వస్వరూప సాక్షాత్కారమందు అఖండ ఆత్మ జ్ఞానం లేదు. స్వరూప జ్ఞానం లేదు. స్వరూప జ్ఞానం అవ్యక్తం కూడా కాదు. అవ్యక్తము వ్యక్తం అయితే అది మోక్షం కాదు. వ్యక్తం అయ్యే ఆస్కారం లేని అవ్యక్తం అనుకో! భ్రాంతి తీరిపోయిన తరువాత, వస్తు నిర్ణయం అయిపోయిన తరువాత, ఎక్కిందీ లేదు, దిగిందీ లేదూ, వ్యక్తమూ లేదూ అవ్యక్తమూ లేదు. ఉన్నది ఉన్నట్లుగా ఉన్నది. దాని పేరే బట్టబయలు. దానియందు ఎరుక లేదు.

       ఆ బయలుకు సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ అని పేరు పెట్టుకోండి, లేకపోతే లేదు. ఆ బయలు తప్పనదు, ఒప్పనదు. బయలే బయలయినటువంటి బ్రహ్మ తాను బయలని తాను బ్రహ్మమని తనకు తానేమీ పేరు పెట్టుకోలేదు. ఎరుకే తనకు తానే తోచి బయలుకు బయలని పేరుపెట్టి, బయలే బ్రహ్మమని, బయలే మోక్షమని, బయల్లో ఐక్యతాసిద్ధి పొందాలని బయలుతో లవ్వాడలేక ఎరుకా పారిపోయిందిరా! అప్పుడు బయలే శాశ్వతంగా ఉన్నది ఉన్నట్లుగా ఉందిరా! 

       బ్రహ్మము జగద్దృశ్యమునకు అధిష్ఠానమైన పరమ సత్యం. అధిష్ఠానము, ఆధారము రెండూ ఒకటి కాదు. సాపేక్ష నిర్ణయంలో ఆధార, ఆధేయ పద్ధతిలో ఆధారము అంటాము. అధిష్ఠానము అంటే తనకు తానే స్వతహా సిద్ధమై ఉన్నది. మనకు సాధన చేతగాని, అనుష్ఠానము చేతగాని, పరోక్షముగా మొదట్లో గుర్తించబడి అది అద్వయ వస్తువు అవడంచేత నీవు కూడా అదే అవ్వడం చేత అపరోక్షానుభూతిగా స్థితమై ఉంటుంది. అంటే నిరపేక్ష పద్ధతిలో దొరుకుతుంది. నిరపేక్ష పద్ధతిలో దొరకటం ఏమిటి? అంటే అది నీవే అయి ఉంటావు. అపరోక్షము సిద్ధిస్తుంది. అద్వైతం సిద్ధిస్తుంది. ఇతరము ఉంటే అధిష్ఠానము అంటాము. కరెంటు వలన ఫ్యాను తిరుగుతోంది. లైటు వెలుగుతోంది అన్నప్పుడు కరెంటు ఆధారం. ఆధారం అన్నప్పటికీ కూడా కరెంటు యొక్క ఉనికి వల్లనే ఫ్యాను తిరుగుతోంది గాని కరెంటు స్వయంగా ఫ్యానును తిప్పుటలేదు. ఆ కరెంటుయొక్క ఇచ్ఛా ప్రయత్నం వలన ఫ్యాను తిరుగుటలేదు. సూర్యుని యొక్క ఎండవలన నీరు ఆవిరై మేఘమై వర్షించుట లేదు. సూర్యునికి ప్రకాశించటం అనేది లక్షణం. ఆ ప్రకాశ లక్షణంలో ఆ ప్రకాశంయొక్క సత్తాచేత సూర్యునికి ఎటువంటి కర్తృత్వము, భోక్తృత్వము, ఇచ్ఛా ప్రయత్నములు లేకనే  సూర్యరశ్మి ద్వారా జీవజాలము పరిణామం చెందుచున్నవి. ప్రతి వస్తువుకు ఒక రకంగా ఉండేటటువంటి ప్రవర్తించేటటువంటి ధర్మం వున్నది. తనకు తాను ఆ ధర్మాన్ని ప్రకటింపచెయ్యదు. ఆధారమైన సూర్యరశ్మి వలన ఆ ధర్మము ప్రకటింపబడుతుంది. ఆధారమైన సూర్యరశ్మి వలన ఆకులలో పత్రహరితము, మానవులలో జీవ చైతన్యము, ఎముకలలో విటమిన్‌-డి, సౌర విద్యుతైతే దానితోటి మనం ఏదైనా చేసుకోవచ్చు. సూర్యుని యొక్క ఎండ కాయడం అనేటటువంటి లక్షణంచేత, వాటియొక్క సత్తాచేత ఇవన్నీ జరుగుచున్నవి. అప్పుడు సూర్యరశ్మి ఆధారం. అలాగే బ్రహ్మ చైతన్యము ఆధారము. జగత్తు యొక్క పరిణామమంతా కూడా ఆధేయము. బ్రహ్మ ప్రభావము ఈ జడ వస్తువులలో పనిచేస్తుంది. అధిష్ఠానమని ఎప్పుడైతే అన్నామో అది పని చెయ్యడం లేదు. చిత్‌, జడము రెండు ఉన్నవి. చిత్తు అనేది ఆధారము. జడ వస్తువులకు జడ వస్తు తాదాత్మ్యత అజ్ఞానము. చిత్‌ స్వరూపమేమో స్వానుభవము.

       ఆధార, ఆధేయ పద్ధతులలోనే జ్ఞానము, అజ్ఞానము రెండూ వున్నాయి. అధిష్ఠాన పద్ధతిలోకి వచ్చేసరికి ఏమైంది? జ్ఞానం లేదు. జ్ఞానము తరువాత తోచిన అజ్ఞానము లేదు. అజ్ఞానము నుండి విడుదల కాగానే సముపార్జించబడినటువంటి జ్ఞానము ఉండదక్కడ. అధిష్ఠానము అని ఎప్పుడైతే అన్నామో జ్ఞానాజ్ఞానములకు అతీతమైనది. ముందు ఆధారంగా కనిపెట్టి దాన్ని తరువాత మహా వాక్య పద్ధతిలో ఆధారముగా కనిపెట్టి, ఆ తరువాత తత్త్వమసి వాక్యాన్ని మళ్ళీ మరియొకసారి నిరపేక్ష పద్ధతిలో గనుక మనం బోధించుకుంటే, అపుడు త్వంఅనేటుటవంటి ఎరుక తత్‌లో ఉన్న ఎరుక రెండూ ఎరుకే కాబట్టి తత్త్వమసి వాక్యంతో రెండూ సమానమైనప్పటికీ ఎరుక తనకు తానే పోతే బయలే ఉన్నది అనే అర్థంతో తత్‌ని నిరూపించాలి. అపుడు తత్‌ అనే అఖండ ఎరుక, త్వం అనే సాధకుడిలో జ్ఞానమనే ఎరుక తత్‌’, ‘త్వంరెండు కాకుండా నిరపేక్షంగా అసిపదమే బయలై యుంటుంది. అధిష్ఠాన పద్ధతిలో వెళ్ళితే తప్ప బయలు నిర్ణయం కాదు. ఆధార ఆధేయ పద్ధతులలో వెళితే తత్‌నిర్ణయం అవుతుంది. అధిష్ఠాన పద్ధతిలో పోతే అసిపదం నిర్ణయం అవుతుంది.

       బ్రహ్మము జగద్దృశ్యమునకు అధిష్ఠానమైన పరమ సత్యం. బ్రహ్మము అన్నప్పుడు ఆధార పద్దతిలో జగత్తు దృశ్యమానం అగుటకు ఆధారము, అన్నప్పుడు ఆ బ్రహ్మ సగుణం అయ్యాడు. అధిష్ఠానం అనేసరికి ఆ బ్రహ్మ నిర్గుణ బ్రహ్మ అయ్యాడు. నిర్గుణం బ్రహ్మ ఆధారమా కాదా? ఆధారంగా కనబడుతోంది. కాని కాదు. ఎందుకని కాదు?

       బీజస్వాంత రివాంకురో జగదిదం ప్రాఙ్‌ నిర్వికల్పం పునఃబీజమందు అంకురించే శక్తి ఏదైనా వుంటే అటువంటి బీజం నుండి ఆ బీజ స్థితిలో నిర్వికల్పం అయినప్పటికీ అంకుర శక్తి కారణంగా పునః అటే మళ్ళీ సృష్టి జరిగింది.

       దేశ కాల కలనా వైచ్చిత్ర చిత్రీ కృతమ్‌
       దేశము, కాలము, వస్తువులయొక్క ఉనికి అన్నీ కూడా కల్పించబడ్డవి. చిత్ర విచిత్రములుగా కల్పించబడ్డాయి. కాని అంకుర శక్తి అనేది మాయాశక్తి. బీజము అన్నది పరబ్రహ్మ. సృష్టి బీజం పరబ్రహ్మయందు ఉన్నది. ఆ పరబ్రహ్మ అనే బీజమందు అంకురశక్తి ఒకటి వున్నది. ఈ అంకురశక్తి బీజంలో ఉండేటటువంటి అవ్యక్త శక్తి. ఈ అంకుర శక్తి క్రియోన్ముఖమై శాఖోపశాఖలైనట్టి వృక్షము పూత, పిందె, కాయ, ఫలము ఏవిధంగా వస్తాయో అలాగే నిర్గుణ నిర్వికల్ప బ్రహ్మమందు అంకురశక్తి మాయాశక్తి వలన సర్వం వస్తున్నాయి. ఈ మాయే బ్రహ్మను ఆశ్రయించి బ్రహ్మము నిర్గుణమైనప్పటికి కూడా బ్రహ్మమును సర్వాధారముగాను, సగుణముగాను ఈ మాయ చూపిస్తోంది. నిజానికి మాయ లేని మాయ. మాయ వలన కనబడేవన్నీ కూడా విచారిస్తే లేనివి. కనుక బ్రహ్మము సృష్టికి ఆధారమవునా? కాదా? ఇవన్నీ లేనివి కాబట్టి బ్రహ్మము స్వతః సిద్ధంగా తనకు తానే సిద్ధ వస్తువుగా ఉన్నదున్నట్లుగా ఉన్నాడు. ఆ బ్రహ్మం నుండి సృష్టి రాలేదు. వచ్చినా ఈ సృష్టి మాయాకల్పితము. ఆ బ్రహ్మ ఈ సృష్టి విషయములో కర్త కాదు, అసంగుడు. ఇదీ విచారణ. మనకు ఎలా కనబడుతోంది? బ్రహ్మ కారణంగానే జగత్తు వచ్చినట్లు కనబడుతుంది. అప్పుడు బ్రహ్మకు ఆధారం అనేటటువంటి పేరు తీసివేసి అధిష్ఠానము అని పేరు పెట్టాలి. అధిష్ఠానం అని ఎప్పుడైతే పేరు పెట్టామో, బ్రహ్మముయొక్క పాత్ర అక్కడ ఉండదు. అతడు అచలము, పరిపూర్ణము, త్రిగుణ రహితము, నిర్వికారము. తన నుండి సృష్టి ఏదీ రాదు. సృష్టి తనలోకి లయం కాదు. అంకుర శక్తిగా ఏ శక్తి ఉన్నదో, అది మాయాశక్తి అనే పేరుతో ఉన్నది. దాని కారణంగా లేని జగత్తు ఉన్నట్లుగా తోచి బ్రహ్మ కారణంగా తోచినట్లు కనబడుతోంది. బ్రహ్మ ఆధారంగా కనబడుతోంది. ఇక్కడ ఏమి చెప్పుకున్నాము? ఆధారం అన్నమాటకు పర్యాయ పదంగా అధిష్ఠానం అనే పదం పెట్టాము. ఈ అధిష్ఠానం అనే పదంచేత బ్రహ్మ ఊరక ఉన్నాడు. బ్రహ్మ ప్రకాశిస్తున్నాడు. బ్రహ్మకు ప్రకాశం లక్షణం ఉంది. అది ఆధారం ఎప్పుడైంది? మాయాకల్పిత సృష్టి నిజమనుకొన్నప్పుడు అది ఆధారమే. మాయాకల్పిత సృష్టి అసత్యం. సృష్టి జరగనేలేదు అన్నప్పుడు అద్వయ బ్రహ్మ అద్వయంగానే తనకంటే అన్యము లేకుండా ఉన్నది ఉన్నట్లు ఉన్నాడు. అటువంటి బ్రహ్మను అధిష్ఠానం అంటున్నాము.

       అధిష్ఠాన బ్రహ్మకి ప్రకాశము ఉంది. ఉన్నది అధిష్ఠాన ప్రకాశమే. అది అద్వయం కనుక స్వప్రకాశము, స్వయంప్రభ. అందువల్ల అధిష్ఠాన ప్రకాశము మాయ కారణంగా మాయా ద్వారంగుండా మాయావరణలో కూడా ప్రకాశిస్తున్నది. మాయావరణలో ఉన్న వస్తువులు అన్ని లేకనే ఉన్నట్లు తోచినవి. కనుక మాయావరణలో ఉన్నటువంటి పరబ్రహ్మ అధిష్టాన ప్రకాశం కూడా లేకనే ఉన్నట్లు తోచినట్లుగా తీసుకోవాలి. సృష్టి లేదు కనుక, ఆధారం అనే మాట లేదు. ఆధారం కాకపోయినా అది ఉన్నది. కనుక దాన్ని అధిష్ఠానము అన్నాము. అది అవుననదు, కాదనదు. సృష్టి చెయ్యదు, సృష్టిలోకి రాదు. తనలోకి దేనినీ లయం చేసుకోదు. అలా అధిష్ఠాన ప్రకాశం ఉన్నది.

       ఆ ప్రకాశాన్ని వినియోగించుకొని ఏమైనా చేసుకుంటున్నారో ఆ అధిష్ఠానానికి ఏమీ తెలియదు. ఆధార, ఆధేయ పద్ధతులలో కూడా మాయావరణలో కూడా దానికి ఏమి తెలియదు. కాని జరిగిపోతున్నాయి. చిత్‌  జడములు రెండు కూడా కలిసి పరిణామం చెందుచున్నాయి. అధిష్ఠానం అయినప్పుడు ఏమి చేశాము? మాయావరణంలో దాని ప్రకాశం వల్ల ఆధార ఆధేయ పద్ధతిలో జరుగుచున్నది. కాని మాయావరణలో ఏ ప్రకాశం అయితే కనబడుతుందో ప్రకాశం అనేది సత్తాగా జరుగుతుంది. లక్ష్యార్థంగా తీసుకుంటే, నిరావరణ బ్రహ్మయందు కూడా అదే ప్రకాశం ఉన్నది. అందులోని సామర్థ్యం ఎప్పటికీ క్రియోన్ముఖము కాదు. త్వంలో ఉన్నటువంటి మాయావరణ ప్రకాశానికి తత్‌లో ఉన్నటువంటి స్వయంప్రభగా, స్వయంప్రకాశముగా, స్వప్రకాశముగా, అపరోక్షంలో ఉన్నటువంటి ప్రకాశానికి అసిపదంచేత భేదము లేదని చెప్పుతున్నాము. అభేదమని చెప్పుచున్నాము. ప్రకాశము ఒకటే పెట్టుకుందాం. వాచ్యార్థంలో మాయావరణలో ఉన్న దేశ కాల కలనా వస్తువులను అన్నింటిని కూడా వాచ్యార్థంగా విడిచిపెట్టి, లక్ష్యార్థమైన త్వంప్రకాశాన్ని తీసుకుంటే తత్‌లో ఉన్నటువంటి ఆధారంగా ఉన్న పరబ్రహ్మ ప్రకాశమునందు ఆధారము అనే వాచ్యార్థమును తీసివేసి అధిష్ఠానంగా ఉన్నదని క్రొత్తపదం పెట్టుకున్నది. అప్పుడు అధిష్ఠానం అంటే నిస్సంకల్పము, నిర్వికల్పము, అచలము, పరిపూర్ణము. అప్పుడు అధిష్ఠాన ప్రకాశము త్వం ప్రకాశము  రెండూ ఒకటే. రెండూ ఒకటే అనే వాక్యంచేత సచ్ఛిశిష్యుడు ఒక ప్రకాశం అనేటటువంటి లక్ష్యార్థాన్ని మాత్రమే పట్టుకొని ఆధార, ఆధేయాలనే సాపేక్ష నిర్ణయాన్ని విడిచిపెట్టి, తనకు తానే అదే ప్రకాశ రూపంలో స్వతఃసిద్ధమైతే అప్పటికే తనకు తానే స్వతఃసిద్ధంగా ఉన్న స్వయం ప్రకాశంలో ఉన్న తత్‌తో సమానమయ్యడు. శిష్యుడు సాధన కాబట్టి సమానమవ్వాలి అంటున్నాము. వస్తు నిర్ణయంగా చూస్తే స్వయం ప్రకాశ బ్రహ్మమే ఉన్నాడు. ఆ స్వయం ప్రకాశ పరబ్రహ్మ ఎప్పుడూ ఉన్నాడు. అది అధిష్ఠాన ప్రకాశము.

       జలధియందు జలచరములు ఉంటున్నప్పటికీ ఆ జలధి జలచరములను పుట్టించదు గదా! ఈ జలచరములు వాటికవే పుట్టి సంసారం చేసి పిల్లలను పుట్టించి చచ్చును గదా! కాని ఆ జలచరములు ఏమి అనుకుంటాయి అంటే, ఈ నీరు మాకు ఆధారం అని. నీటిలోనుండి బయట వేసిన  చేపలు గిలగిలా కొట్టుకొని మళ్ళీ నీటిలో వెయ్యగానే అమ్మయ్య బ్రతుకు జీవుడా అనుకుంటాయి. అప్పుడు ఆ జలరాశి జలచరములకు ఆధారమయ్యింది. ఎప్పుడైతే ఆ జలరాశిని అధిష్టానం అన్నామో అప్పుడు ఏమైంది? అధిష్ఠానమైన జలరాశి తనకు తానే స్వతఃసిద్ధమై దేనికీ ఆధారంగా గాని, కారణంగా గాని లేదు. ఈ జలచరాలు ఆధారమని అనుకున్నా, జలరాశి మాత్రము వాటికి అసంగము. అలాగే ఎరుక తనకు తానే పుట్టి అనేక వికారాలు చెంది అనేకత్వం చెంది నానా భేదాలతో ఉండి, చివరకు తనకు తానే క్షీణించి నశించుతూ మళ్ళీ పునరావృత్తి కూడా అవుతూ ఉంటుంది. బయలుకు అట్టి ఎరుకతో ఎటువంటి సంబంధము లేదు. చేపను అది పుట్టించదు, చేపను అది చంపదు. అయితే తనయందు ఈ జలచరములు పుట్టి సంసారం చేసి సంతానం ఉత్పత్తిచేసి నశించుతూ ఉంటే సర్వసాక్షిగా ఈ జలరాశి ఉన్నది. ఈ జలచరములు లేని ఎరుక అని గనుక అనుకొంటే జలరాశిని బయలు అనుకునేటట్లయితే ఈ జల రాశియందు లోపల వెలుపల ములుగ్రుచ్చ సందులేక బయలే ఉన్నది. జలరాశియే ఉన్నది. ఈ జలచరములు లేని ఎరుక గనుక, లేని ఎరుకలోనే ఈ పద్ధతి అంతా నడుస్తోంది. ఎరుక అన్నా, మాయ అన్నా ఒకటే. మాయలో జరిగేవన్నీ ఎలా అయితే మాయాకల్పితమో ఇంద్రజాలంవలె కల్పితమో, ఎరుకలో కలిగేవన్నీ కూడా ఇంద్రజాలంవలె కల్పితములే. అలా మాయాకల్పిత దేశ కాల కలనా వైచిత్య్ర చిత్రీకృతం.

       అంతా కూడా లేనిదిగా చూచినపుడు అధిష్ఠానమనేది బయలే. అందుకని ఇక్కడ పరబ్రహ్మ ప్రకాశాన్ని అద్వైత సిద్దాంతానికి అచల సిద్దాంతానికిని మనం సమన్వయం చేస్తున్నాము. అధిష్ఠానమైనటువంటి బ్రహ్మము పరమసత్యం. ఆధార ఆధేయ పద్దతులలో సత్‌, అసత్‌ ఉన్నది. కాని పరమ సత్యం అన్నామంటే ఏమిటి? దానికంటే అతీతమైనది. సత్యము అంటే సాపేక్షము.  పరమ సత్యం అంటే సదసత్‌ విలక్షణం నిరపేక్షము. పరివర్తనమున్ను నానాత్వమున్ను మాయవలన కల్గుచున్నది. సృష్టి బీజమైనటువంటి పరబ్రహ్మ దానియందున్న అంకుర శక్తి అనే మాయా శక్తి వలననే ఈ జగత్తు ఆవిర్భవించింది. మాయాశక్తి వలన ఆవిర్భవించినవన్నీ కల్పితమే, లేనివే. లేనివి విచారించి లేనివిగా చూస్తే, బ్రహ్మ ఒక్కటే పరబ్రహ్మ ఒక్కటే. కనుక బ్రహ్మము ఈ సృష్టికి బీజం కాదు. బీజము అనుకున్నప్పుడు ఆధార, ఆధేయ పద్ధతి ఉన్నది. బీజం కాదు అన్నప్పుడు అధిష్ఠాన పద్ధతి ఉంది. అధిష్ఠానమైనటువంటి పరమ సత్యము అన్నాడు. అధిష్టానము అంటే సాక్షిత్వం కూడా లేదు. సంగత్వం, అసంగత్వం అనేటటువంటి రెండూ కూడా లేవు. తనకు తానే స్వతస్సిద్ధమై అంతటా నిండి నిబిడీకృతమై తాను తప్ప రెండో వస్తువు లేక రెండోది. ఏదైనాసరే తనయందు యుండుటకు ముల్లు గ్రుచ్చ సందుకూడా లేక నిరంధ్రమై ఉన్నది. రంధ్రము కానిది నిరంధ్రము. నిరంధ్రము అంటే ముల్లుగ్రుచ్చ సందు లేకపోవడం. పరివర్తనం అంటే పరిణామంగాని, వికారాలు నానాత్వము గాని లేవు. ప్రపంచం అంటే కొన్ని లక్షలాది నామరూపాలుగా లక్షలాది స్వభావాలుగా, గోళములుగా కనబడుతోంది. ఇది అంతా మాయవలన కలుగుతోంది అనంగానే మాయ అంటే ఏమో తెలియనివాళ్ళకు దీనికి ఆధారం ఈ బ్రహ్మ అనుకుంటారు. మాయ అంటే తెలిసినవాళ్ళకి మాయ పద్ధతిలో ఉన్నవన్నీ ఎరుక పద్ధతులే కనుక ఎరుక లేనిఎరుక కనుక, మాయ కూడా లేని మాయ కనుక, ఈ కల్పితమంతా లేనిదే. ఈ కనబడుతున్నవన్నీ లేనివే. లేనిది లేకుండా పోగా ఉన్నది ఏదో ఉన్నది. అదే పరమ సత్యం. ఎరుగబడనప్పుడు అదిపరమసత్యము ఎరగబడితే అది మాయ. మరి సత్యం అంటే ఏమై ఉంటుంది? ఎరగబడకుండా ఉంటే  అనిర్వచనీయమైతే, అనిర్వాచ్యమైతే, ఎరుక ద్విపుటిగాను, త్రిపుటిగాను లేకపోతే అదే బయలు.

       యతోవాచో నివర్తంతే | అప్రాప్య మనసాసహా |
       తెల్సుకుందామని వెళ్ళినటువంటి వాక్కు గాని, మనస్సు గాని తెల్సుకోలేక వెనుతిరిగి వెళ్ళిపోయినా లేక అక్కడికక్కడే సత్యసాక్షాత్కారమైతే అసత్యమైన మనస్సు, వాక్కు నిరశించబడితే లేనివి లేకుండా పోతే ఈ మాటలు అన్నీ మాయ నిర్వచనము క్రిందకు వచ్చినవన్నీ లేకపోతే ఏది ఉన్నదో అదే బయలు. మాయోపాధి వలన బ్రహ్మము జగత్తునకు ఉపాదాన కారణము. మాయను ఉపాధిగా ధరించినటువంటి బ్రహ్మకి మాయ అనేది బ్రహ్మ చుట్టూ వున్న ఒక ఆవరణము అయినపుడు ఆ బ్రహ్మ యొక్క ప్రకాశం మాయావరణలోని ప్రకాశం వ్యాపించినపుడు లోపల ఉన్న బ్రహ్మ ఏమో బ్రహ్మత్వము. బయట వున్నది మాయావరణ. మాయావరణయే బ్రహ్మ చుట్టూ ఉన్నట్టి తొడుగు, కంచుకము, జాకెట్టు. నీ ఆత్మకు తొడుగు నీ శరీరం. తొడుగే శరీరం. ఈ శరీరాన్ని ఉపాధి అంటాం. కనుక బ్రహ్మకు మాయే ఉపాధి. మాయే తొడుగు. మాయే ఆవరణ. మాయే శరీరం. శరీరం అంటే నశించేది. మాయలో ఉన్నవన్నీ నశించేవేగా! మాయ కూడా పోయేదేగా! బ్రహ్మ సాక్షాత్కారమందు, అపరోక్షానుభూతియందు మాయ కూడా పోయేదే. మాయ కూడా శీర్యతే ఇతి శరీరః. మాయకూడా నశించేదే. అందుకని ఇక్కడ మాయోపాధి అన్నాము. ఈ మాయోపాధిలో తోచినవాడు ఎవరు? ఆధారము ప్రకాశముగా తోచినవాడు బ్రహ్మ. దానికి ప్రతిబింబ ప్రకాశముగా తోచినవాడు ఈశ్వరుడు. అవిద్యోపాధిలో తోచినవాడు ఎవరు? ప్రతిబింబ ప్రకాశముగా తోచినవాడు జీవుడు. మాయ ఆవరణగా ఉన్న బ్రహ్మ సర్వసాక్షి, సర్వాధారము. మాయ లేనిది కదా అని, ఆ మాయలోనే అధిష్ఠాన బ్రహ్మ ప్రకాశాన్ని కనుక గురు కృపతో అందుకోగల్గితే అది తనకు తానే ఉండి తనకు వేరే క్రొత్త ఆధారము లేక, నిరాలంబయై దానినుండి నానాత్వం గాని, బేధాలు కాని కల్పించబడకుండా ఉన్నది. నిరావరణ బ్రహ్మ ప్రకాశము స్వయం ప్రకాశముగా సిద్ధిస్తుంది. అపరోక్షానుభూతిగా సిద్ధిస్తుంది. ఆ సిద్ధించినదే పరమ సత్యం.

       తోచుచున్నది అనే పదం ఎప్పుడైతే వాడామో అది మాయాకల్పితం అని, విచారించితే లేనిదని తెల్సుకోవాలి. ఒక్కొక్క పదం ఎలా ఎందుకు ఎక్కడ తూకం వేసి వాడుచున్నారో తెల్సుకుంటే ఒక్క నాలుగు పేజీలు ఈ పుస్తం చదివితే చాలు. మీకే నిర్ణయం అయిపోతుంది. మీరు చదువుకొనడానికి మేము చెప్పడానికి తేడా ఏమీ లేదు.

       జగద్దృశ్యమునకు అధిష్ఠానమైన పరమ సత్యము అంటున్నారా బ్రహ్మని. జగత్తు దృశ్యమయింది అంటే ఎక్కడ అయింది? దృశ్యమంతా కూడా మాయావరణలోనే దృశ్యముగా ఉంటున్నది. మాయ యొక్క ఆవరణ లేకపోతే పరబ్రహ్మము కేవలంగా ఉంటాడు. దానికి ఇక దృశ్యము వుండదు. దృశ్యాలన్నీ మాయావరణములోనే ప్రకటించబడుచున్నాయి. ప్రతీతియగుచున్నది.

       యద్‌ దృశ్యం తన్నశ్యం. ఎందుకని? దృశ్యమంతా మాయలోనే ఉన్నాయి గనుక. నిరావరణ బ్రహ్మయందు దృశ్యమే లేదు గనుక. మాయను దాటిన వాడికి దృశ్యము లేదు. మాయలో ఉన్నవాడికి దృశ్యం సత్యం. అవిద్యలో ఉన్నవాడికి దృశ్యం బాధాకరం. మాయను దాటిన వాడికి దృశ్యం నశ్యం. మాయను ఎవరైతే దాటారో అధిష్ఠాన ప్రకాశమే తానై ఉంటాడు. అధిష్ఠాన ప్రకాశం అనేది అందుబాటుకోసం ఆ పదం వాడి, తత్త్వమసి వాక్యార్థలో ఆవరణయందు, నిరావరణయందు కూడా కామన్‌గా ఒకే ప్రకాశం ఉన్నదని. అది ఆవరణ ప్రకాశంలో త్వం అనే బ్రహ్మ జ్ఞానంలో ఉన్నది అని, తత్త్వమసి అనగా ఈ ప్రకాశము ఆ ప్రకాశము ఒక్కటే అయినప్పుడు, మాయావరణయందు కల్పించుకొన్నవన్నీ వాచ్యార్థముగా విడిచిపెట్టి, నిరావరణయందు అనగా మాయను దాటిన తరువాత ఏదైతే ఉన్నదో అదీ ఇదీ ఒక్కటే అని అసి పదం చెప్పుతోంది. కనుక ఇదీ అదీ ఒక్కటే అనేది పట్టుకోవడానికి పరబ్రహ్మ ప్రకాశమును అధిష్ఠానము అని పేరు పెట్టాము.

       అసంగుడైన బ్రహ్మమం దనాదిమాయ లేనిదై |
       ముసుంగు కప్పినట్లు మూలకారణాంశమై |
       పొసంగి విశ్వమందు జేరి భూతభౌతికాదులై |
       మసంగి చచ్చి పుట్టుచుండు మారులేక నంతటన్‌ ||

       మసంగి అంటే మసలడం. మసలడం అంటే పరిణామము చెందుతూ ప్రవర్తించటం. తాను పరిణామము చెందుతూ ప్రవర్తించడాన్ని కదలడము, మెదలడము అంటే తేడా ఏమిటి? అని శిష్యుడు అడిగాడు. మెదలడం కూడా కదలటమే. పరిణామ శీలంగా కదలడం, మెదలడం. ఊరికే అలా కదిలి ఊరుకోవడం కదలడం. పరిణామ శీలంగా ఒక కదలిక అనేది అనేక కదలికలకు కారణంగా ఒక గొలుసుకట్టు కదలికలను మెదలుట అంటారు. కదలినా మెదిలినా ఒకటే అంటాము. ఒక కదలికకు కదలిక అంటాము. అనేక కదలికకు పరిణామంలో పరివర్తన అంటాము. అప్పుడు అది మెదలుట అంటాము. అందుకనే మసంగి చచ్చి పుట్టుచుండు మారులేక అంతటన్‌ అంటున్నాము.

       పుట్టటము అంటే దృశ్యములోకి రావడము. చావడము అంటే దృశ్యం నశించడము. దృశ్యంలోకి రావడము దృశ్యము నశించడము. దృశ్యము నశించినపుడు అవ్యక్తంలోకి వెళ్ళుతుంది. దృశ్యం కనబడినప్పుడు అది సృష్టి అనే పేరుతో పిలువబడుతుంది. మసంగి చచ్చి పుట్టుచుండు మారు లేక అంతటన్‌. కనుక సృష్టి అంటే దృశ్యంలోకి రావడము మళ్ళీ పోవడము నిరంతరాయంగా అదే మళ్ళీ మళ్ళీ జరుగుతూ ఉంటుంది.

       క్రొత్త రూపం దృశ్యం అవుతుంది. పాత రూపం లయం అవుతుంది. అలా బాల్యం లయం అయి, యవ్వనం వచ్చింది. యవ్వనం లయం అయి, వృద్ధాప్యం వచ్చింది. వృద్ధాప్యం లయం అయింది. అవ్యక్తంలోకి వెళ్ళింది. మరణం తర్వాత మళ్ళీ పుట్టాం. అవ్యక్తం నుండి పుట్టడం ద్వారా మళ్ళీ వ్యక్తమైనది. వ్యక్తమైన ప్రతీది కూడా దృశ్యం. అందుకని జగత్‌ దృశ్యం అనే పదం వాడడానికి కారణం. దృశ్యం అనగానే మనసులో ఇది నశ్యం వెంటనే గుర్తుకు రావాలి. అధిష్ఠానం అంటే తనకు తానే ఉన్నానని గుర్తుకు రావాలి. చేపలకు ఆధారం అనుకొన్నప్పటికీ అధిష్ఠానం ఉన్నది. కాని ఆధార ఆధేయ పద్దతులలో లేదు. జలచరములకు ఆధారమే. అధిష్ఠాన పద్దతిలో తనకు తానే స్వతసిద్ధమైన జలరాశికి చేపలయొక్క ఉనికి గాని, పరిణామాలు గాని తెలియదు. అయినా ఆ జలరాశి వుంది కదా! అది అచలమై, బయలై, పరిపూర్ణమై ఉన్నది ఉన్నట్లు ఉన్నది. దేనికీ ఆధారం కాని దాన్ని అధిష్టానం అనడం ఆనవాయితీ. మాయను గనుక ఒప్పుకుంటే బ్రహ్మము ఉపాదాన కారణము. మాయ లేనిదే అని విచారణ చేత, లేకుండా చేస్తే బ్రహ్మ ఉపాదాన కారణమూ కాదు. నిమిత్త కారణమూ కాదు. మూల కారణము కాదు. మూల కారణం యొక్క అంశీభూతము కూడా కాదు. ఇవన్నీ కాదు కాదు అని చెప్పి, ఏదైతే ఉన్నదో అది అధిష్ఠానము. అందుకని అధిష్టానము అనే మాట వాడాము. బ్రహ్మమునందు మాయ వచ్చేసరికి, మాయ ఎప్పుడైతే వచ్చిందో, అచల పరిపూర్ణ బ్రహ్మమందు జగత్తు మాయ కారణంగావచ్చి దానియందేయుంటూ, దానియందే లయించుచున్నది. మాయ బదులు బ్రహ్మను గనుక తీసుకుంటే వచ్చిపోయేది యేదయ్యా అంటే మాయాశబలిత బ్రహ్మ. కనుక ఎరుక బ్రహ్మకు రాకడ పోకడలున్నాయి.

       అది అన్ని కాలాలలో ఉన్నది ఉన్నట్లుగా ఉన్నది. అందుబాటైనదే అధిష్ఠాన బ్రహ్మ. దొరకాలిగా! లేకుంటే ఎలా పట్టుకుంటారు? మాయ దాటితే అందరు పరబ్రహ్మమే. మాయలో ఆ పరబ్రహ్మను ఎలా పట్టుకోవాలి?

       పరబ్రహ్మ యొక్క ప్రకాశము తనలోనూ ఉన్నది. మాయావరణలోను ఆ ప్రకాశమే ఉన్నది. అసిపదముచేత మాయావరణలోనున్న ప్రకాశమును పట్టుకుంటే, అది నిరావరణ పరబ్రహ్మ ప్రకాశమునకు అభిన్నము. ఆ దృష్టితో పట్టుకుంటే, అద్వైతము సిద్ధించినప్పుడు ఏ ప్రకాశమూ లేక, నిష్కళయై, బయలై ఉంటుంది.

       బ్రహ్మము జగత్తునకు నిజమగు విరక్తి కారణం. తనలో తాను రమించడం అనేది రక్తి. బ్రహ్మము జగత్తునకు నిజమగు విరక్తి కారణం. బ్రహ్మకు ఆనందం కలిగితే జగత్తు వచ్చిందంటారు. బ్రహ్మకు ఆనందం రాకపోతే జగత్తు లేదు. బ్రహ్మలో ఒక ఆనందం ప్రకటించబడింది. బ్రహ్మములో ప్రకటించబడిన ఆనందం కారణంగా సృష్టి సంకల్పమై, ఆ సంకల్పంచేత సృష్టి కల్పించబడినది. అంటే ప్రపంచం కల్పించబడినది. తనలో తాను రమించకుండా తన ఆనందం ఈ సృష్టికి కారణం కాకుండా ఉన్నప్పుడు ఈ సృష్టి లేదుగా! మాయా సహకారి కారణం. బ్రహ్మయందు ఆనందం ఘనరూపంలో ఉన్నది. రక్తి అంటే అనుభవ రూపంలో ఉన్నది. అనగా సాధకుడికి అనుభవ రూపంలో ఉన్నది. అపరోక్షానుభూతి అన్నప్పుడు ద్వైతం లేదు. ద్వైతం లేనపుడు బ్రహ్మము యొక్క ఆనందమే స్వానందము. అది రక్తి. స్వానంద ఘనుడైన బ్రహ్మకు జగత్తుపై రక్తి లేదు. అనగా విరక్తుడు. జగత్సంకల్ప లేనందున విరక్తుడు.

       నిరావరణ బ్రహ్మము యొక్క తత్త్వాన్ని ఈ మాయ మాయావరణములోకి లాకొచ్చి ప్రకటించింది. ఆ ప్రకటించిన బ్రహ్మము ఆధార ఆధేయ పద్ధతిలో దొరుకుతాడు. అందుకనే మాయ మంచి పనే చేసింది. నన్ను దాటిపోతేనే అది ఉన్నది అంటే మాయను దాటడం ఎవరి వశం? మాయలో కూడా బ్రహ్మను చూపిస్తోంది. ఇదీ అదీ ఒకటేనంటూ దాన్ని పట్టుకోండి అని. మొట్టమొదట మాయలోనున్న బ్రహ్మను పట్టుకోండి. మాయ నాకు సహాయం చేస్తోంది అని, తరువాత జగత్తుమీద విరక్తితో  మాయను దాటినపుడు నిరావరణ బ్రహ్మయందు స్వరతి కలుగుతుంది. అదే అపరోక్షానుభూతి.

       నేతి నేతి వాక్యంతో నిరపేక్షమైనటువంటి బ్రహ్మ స్వప్రకాశ బ్రహ్మగా అపరోక్షానుభూతిగా మిగిలిపోతాడు. శేషిస్తాడు.  ద్రష్టత్వం లేని దృక్కు అవ్వాలి. ద్రష్టత్వం ఉంటే త్రిపుటిలోకి వెళ్ళిపోతాడు లేక ద్విపుటిలోకి వెళ్ళిపోతాడు. ద్రష్టత్వం కోల్పోయిన దృక్కు అయితే పరబ్రహ్మ అవుతాడు. జగత్తు బ్రహ్మయొక్క విలాసం. జ్ఞానాజ్ఞానాలనుండి విడుదలైన తరువాత కేవల బ్రహ్మము తానే అయినపుడు మాయను అధిగమించినపుడు ఈ స్థూల శరీరం మానవుడికి ఆయుష్షు కాలం పూర్తి అయ్యేదాకా వుంటుంది గనుక, శరీర ప్రారబ్దం నడిపిస్తుంది కనుక, దృశ్యాత్మ నుండి విడివడి దృగాత్మగా ఎవరైతే ఉన్నారో ఆ దృశ్యాత్మకి ఈ దృశ్యమాన ప్రపంచం అంతా మాయా విలాసం చిద్విలాసం. విలాసం అంటే అడ్రస్‌. మాయలోనే బ్రహ్మకు అడ్రస్‌ ఉంది. నిరావరణమందు బ్రహ్మకు అడ్రస్‌ కూడా లేదు. ఉనికి ఉంటేనే అడ్రస్‌ ఉంటుంది. కాని ఉనికి లేదుగా! ఉనికే సత్‌చిత్‌ ఆనందం. ఉనికి లేకపోవడమే సత్యం జ్ఞాన అనంతం బ్రహ్మ. జగత్తు బ్రహ్మ యొక్క విలాసం. జగత్‌లో బ్రహ్మ యొక్క అడ్రస్‌ ఉంది. ఈ జగత్తులో వెతుక్కోండి, వెతకండి. చిత్తు జడమందు జడమును ఇది కాదు, ఇది కాదు అంటే చైతన్యమే ఆ బ్రహ్మ యొక్క విలాసం. దాన్ని ఆధారంగానే తీసుకున్నాము. దాన్ని అధిష్ఠానంగా తీసుకుంటే ఏమయింది? ఈ విలాసం కూడా కోల్పోయింది. అడ్రసు కూడా పోయింది. నిరావరణ బ్రహ్మయందు విలాసం లేదు. ఈ విలాసమంతా కూడా అవ్యక్త బ్రహ్మమందు సంకల్పం యొక్క అభివ్యక్తమే! ముందుగా దృక్‌ స్థితికి వచ్చి, విశ్వ రూపంలో అవ్యక్తంగా ఉన్నదంతా వ్యక్తరూపంలోకి తెస్తూ సూక్ష్మంలో బ్రహ్మాండంగాను స్థూలంలో పిండాండంగాను, తనకు తానే అభివ్యక్తమయింది. అభివ్యక్తం అంటే ఏమిటి? అభి అంటే తనకు తానే. అభిజ్ఞ అంటే తాను తానైనటువంటి జ్ఞానం. ప్రత్యభిజ్ఞ అంటే తాను తానైన జ్ఞానమే మధ్యలో భ్రాంతిలో కోల్పోయి, భ్రాంతి రహితం కాగానే, తిరిగి తసజ్ఞానం తనకే మళ్ళీ కలగడాన్ని ప్రత్యభిజ్ఞ అంటారు. అభిజ్ఞ అంటే తాను తానైన జ్ఞానము. ప్రత్యబిజ్ఞ అంటే మళ్ళీ తాను తానైనటువంటి జ్ఞాన స్వరూపము. మళ్ళీ అనడం వలన ఏమైంది? ఈ మధ్య కాలంలో భ్రాంతి వచ్చి, తరువాత పోయి, తాను పరబ్రహ్మనే, అనే అపరోక్ష జ్ఞానము. 

       ఒక రాక్షసుడు తనయొక్క స్వరూపాన్నే నాలుగు స్వరూపాలుగా చేసి వాళ్ళకు మనసు లేని వారిగా జేసి, కీలు బొమ్మలుగా జేసి, రోబోలుగా చేసి ఆ రాక్షసుడు తన సంకల్పం చేత నలుగురిని కూడా నాలుగు దిక్కులకు పంపించి యుద్ధములు చేయిస్తూ నడిపిస్తాడు. వాళ్ళకు స్వంత మనస్సు లేకపోవడం చేత వాళ్ళకు జాలి, దయ ఏమీ ఉండవు. ఆ రాక్షసుడి పేరు శంబరాసుడు. అతని శక్తి శంబరశక్తి అంటే మాయా శక్తి. అంటే తానే మరో నలుగురిగా అభివ్యక్తమైనాడు. మనసంతా తన దగ్గర పెట్టుకుని మిగిలిన నలుగురికి మనస్సు లేకుండా పంపించాడు. ఇది యోగవాసిష్ఠ కథ.

       అలాగే బ్రహ్మ జగత్తుగా, జీవుడుగా, ఈశ్వరుడిగా, అభివ్యక్తమయ్యాడు. నిజానికి అభివ్యక్త మయ్యాడా! మాయావరణ యందు కల్పించబడ్డాడు. ఏ బ్రహ్మమైతే ఇన్ని రకాలుగా అభివ్యక్తమగుచున్నాడో ఆ బ్రహ్మము కూడా మాయాశబలిత బ్రహ్మమే. నిజం విచారిస్తే ఆ బ్రహ్మకొచ్చిన సంకల్పమే మాయ కాని, బ్రహ్మ మాయ కాదు. మాయ బ్రహ్మ కాదు. మాయాతీతమైనటువంటి పరబ్రహ్మమందు ఒక సంకల్పము మాయ కారణంగా కల్గింది. అంతేకాని బ్రహ్మకు సంకల్పం రాలేదు. బ్రహ్మలో వచ్చిన సంకల్పం మాయాకల్పితం. మాయ హద్దు ఎక్కడుంది? నిర్వికార బ్రహ్మమందు మాయే సంకల్ప రూపంగా నిర్గుణ బ్రహ్మను సగుణ బ్రహ్మగా, అభివ్యక్తం చేసింది. వెంటనే ఆ బ్రహ్మమందు మరో సంకల్పం వచ్చింది. నేనే నానాత్వం చెందుగాక! అని. ఆ బ్రహ్మమే నానా రూపాలుగా విశ్వ రూపాన్ని ధరించింది. తిరుగు ప్రయాణంలో ఈ విశ్వ రూపాన్నే సర్వం ఖల్విదం బ్రహ్మఅంటున్నాం. తిరుగు ప్రయాణంలో విశ్వ రూపుడు అయ్యాడు. ఆ విశ్వ రూపంతో తాదాత్మ్యయం చెందితే తానే విశ్వరూపుడు. ఆ విశ్వరూపం నుండి కూడా తాదాత్మ్యత విడివడితే తాను పరబ్రహ్మ. ఎక్కడికక్కడ దృక్కు తాదాత్మ్యత, దృశ్య తాదాత్మ్యత ఈ రెండు రకాలున్నాయి. దృక్కైనవాడు దృశ్యంతో తాదాత్మ్యత చెంది దృశ్యాకారం పొందుతున్నాడు. కాని తాదాత్మ్యత లేకుంటే, దృక్కు కూడా లేదు. అప్పుడు దృక్కు పరబ్రహ్మమే. ఆ దృక్‌ స్ఫురణ కూడా నిర్వికల్పమైతే ఆ పరబ్రహ్మయే అచల పరిపూర్ణ పరబ్రహ్మము. తాడు వస్తువు కూడా ఇంతకాలం తాడు ఆధారం అని పొరపాటు పడ్డాము. ఇప్పుడు తాడు ఆధారం కాదు, అధిష్ఠానం. అధిష్ఠానం అనే పదాన్ని ఎందుకు వాడారు? అనే దానికి దాన్ని చెప్పుకొచ్చాము ఇప్పటిదాకా!